ఇంట‌ర్వ్యూలు

మనుషులపై యంత్రాలు పైచేయి సాధించలేవు

* ప్రజలకు సంబంధించిన ప్రశ్నలంటే నాకిష్టం
* సామాజిక మాధ్యమంలో మరిన్ని సేవలు
* ఫేస్‌బుక్‌ ముఖాముఖిలో జుకర్‌బర్గ్‌

ప్రపంచంలో చాలామందికి తెలిసిన అతి కొద్ది విషయాల్లో ఫేస్‌బుక్‌ ఒకటి. తన ఆలోచనతో ప్రపంచానికి కొత్త దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌. అలాంటి వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా ఎవరైనా తనతో మాట్లాడే అవకాశం కల్పిస్తే..? వినూత్నంగా ఉన్న ఈ కార్యక్రమాన్ని జుకర్‌బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా నిర్వహించారు. 'మీ ప్రశ్న.. నా జవాబు' అన్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. సాధారణ వ్యక్తుల నుంచి వివిధ రంగాల ప్రముఖుల వరకు ఎందరో అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా బదులిచ్చారు. వినియోగదారులు తమ సంస్థ నుంచి ఇంకేం సేవలు కోరుకుంటున్నారో అన్న విషయాన్ని నేరుగా తెలుసుకోవటం కోసం జుకర్‌బర్గ్‌ చేసిన ఈ ప్రయతాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. ప్రశ్నలు వేయడమే కాకుండా ఫేస్‌బుక్‌ ద్వారా తమకు కావాల్సిన సేవల్ని గురించి చాలామంది చెప్పారు. విభేదిస్తున్న మీట (డిస్‌లైక్‌ బటన్‌) ఏర్పాటు చేయాలని.. ధ్వని సందేశం (వాయిస్‌ మెసేజ్‌) చేరవేతకు వీలు కల్పించాలని.. ఆలోచనల పెట్టె (ఐడియా బాక్స్‌) ఉంచాలనీ... ఇలాంటివెన్నో ప్రస్తావించారు. ముఖాముఖి సాగిన గంటల్లో కొన్ని వేల ప్రశ్నల్ని సంధించారు.

స్టీఫెన్‌ హాకింగ్‌, ష్వార్జ్‌నెగ్గర్‌ సయితం...: ఫేస్‌బుక్‌ అధినేతను ప్రశ్నలు అడిగిన వారిలో ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌.. హాలీవుడ్‌ స్టార్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ లాంటి ఎందరో ప్రముఖులున్నారు. జుకర్‌బర్గ్‌ను అడిగిన కొన్ని ప్రశ్నలు.. వాటికి సమాధానాలు...

ష్వార్జ్‌నెగ్గర్‌: మనిషి వ్యాయామం చేయలేనంతగా పనుల్లో పడిపోతున్నాడు. మరి.. మీలాంటి వ్యక్తి రోజువారీ ప్రణాళిక ఎలా ఉంటుంది? మనుషులపై యంత్రాలు విజయం సాధిస్తాయా?
జుకర్‌బర్గ్‌: ఏ పనినైనా పూర్తి చేసేందుకు శక్తి కావాలి. ఆరోగ్యంగా ఉంటేనే శక్తిమంతంగా ఉండగలం. నేను వారంలో మూడుసార్లు అయినా వ్యాయామం చేస్తా. నా పెంపుడు కుక్కతో కలిసి నడకకు వెళతా. మనుషులపై యంత్రాలు పైచేయి సాధించలేవు.

స్టీఫెన్‌ హాకింగ్‌: సైన్స్‌కి సంబంధించి మీరు ఏ ప్రశ్నకు జవాబు కోరుకుంటున్నారు? ఎందుకు..?
ప్రజలకు సంబంధించిన ప్రశ్నలంటే ఇష్టం. ప్రపంచంలో ఉన్న వ్యాధులన్నింటినీ ఎలా నిర్మూలించగలం? మెదడు ఎలా పని చేస్తుంది? మనుషులు మరింత ప్రభావవంతంగా పని చేసేందుకు ఏం చేయాలి? లాంటి ప్రశ్నలు నా మనసులో మెదలుతుంటాయి.

» హఠాత్తుగా మీరునిద్రలేచేసరికి ఫేస్‌బుక్‌ అదృశ్యమైతే..?
తిరిగి నిర్మిస్తా.

» మీరో ఎడారి ప్రాంతంలో ఉండాల్సి వస్తే.. మీతో ఏ మూడు వస్తువులు ఉండేందుకు ఇష్టపడతారు? (అక్కడ వైఫై ఉండకూడదు)
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొనే ఇంటర్నెట్‌.ఓఆర్‌జీ సేవలను ప్రవేశపెట్టాం. మీరు పెట్టిన షరతు సమీప భవిష్యత్‌లో పెట్టినా అంతర్జాల సేవలు ఎక్కడైనా లభిస్తాయి. వైఫై ఉంటే.. నా భార్య.. పెంపుడు కుక్క.. ఇంకా నా ఫోన్‌. లేని పక్షంలో నా భార్య, పెంపుడు కుక్కతో పాటు ఓ పుస్తకం తీసుకెళ్లేందుకు ఇష్టపడతా.

» బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ నుంచి తప్పుకున్నట్లు మీరు తప్పుకుంటారా?
ఏమో చెప్పలేం. ఇప్పటికిప్పుడు అది సాధ్యంకాకపోవచ్చు.

» మీరు ఒక డాలర్‌ జీతాన్నే ఎందుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు?
నేను చాలా డబ్బు సంపాదించాను. ప్రస్తుతం నా దగ్గర ఉన్న దానితో వీలైనన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాను. ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజల దగ్గర ఉన్న శక్తిని ప్రపంచానికి అనుసంధానం చేయాలనుకుంటున్నాను. అంతేకాదు.. ఫేస్‌బుక్‌ కాకుండా చదువు, ఆరోగ్యం, సమాజ సేవపై దృష్టిపెట్టానుకుంటున్నాను.

» ఫేస్‌బుక్‌ ద్వారా భవిష్యత్‌లో ఏం జరగబోతోంది?
ప్రస్తుతం ఛాయాచిత్రాలు, సందేశాలు మాత్రమే పంపిస్తున్నారు. భవిష్యత్‌లో వీటితో పాటు వీడియోలు, భావోద్వేగానికి సంబంధించిన విషయాలు అందుబాటులోకి రానున్నాయి.

Click here for More Question & Answers

Posted on 02-07-2016