ఇంట‌ర్వ్యూలు

ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌ తో ఇంటర్వ్యూ

* రెండేళ్లలో పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు
* ఐదు భారీ, 100 చిన్న తరహా ఫుడ్‌ పార్క్‌ల ఏర్పాటు
* యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

రాష్ట్రంలోని వ్యవసాయ దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ద్వారా పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌ తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఐదు భారీ, 100 చిన్న తరహా ఫుడ్‌పార్క్‌ల ద్వారా పది లక్షల మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సాధారణ విద్యార్హతలున్న వారు సైతం ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందుతారని తెలిపారు. రైతు కుటుంబాలూ లబ్ధి పొందుతాయన్నారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి ద్వారా అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేదని ఆయన అన్నారు. గతంలోని ప్రతిబంధకాలను విశ్లేషించి, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఆహారశుద్ధి పరిశ్రమల ప్రగతి, ఉపాధి అవకాశాలపై బుధవారం ఆయన 'ఈనాడు'కు పలు విషయాలు తెలిపారు.

రైతులకు అవగాహన: పంట ఉత్పత్తులను శుద్ధి చేస్తే వ్యవసాయదారులకు రెట్టింపు ధరలు వస్తాయి. గిట్టుబాటు ధరల సమస్యే ఉండదు. స్థానిక, దేశీయ మార్కెట్‌ల్లో మంచి ధరలతో క్రయవిక్రయాలకు తోడు విదేశాలకు ఎగుమతులు చేయవచ్చు. రైతులకు అవగాహన కల్పించి, ఆహారశుద్ధి ప్రక్రియను రాష్ట్రమంతటికీ విస్తరిస్తాం. రైతులందరికీ అందుబాటులో ఉండేలా రాష్ట్రమంతటా పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం.

ఫుడ్‌పార్క్‌లు: అయిదు జిల్లాల్లో మెగాఫుడ్‌ పార్క్‌లకు ప్రణాళిక సిద్ధమయింది. పశ్చిమగోదావరి జిల్లాల్లో రొయ్యలు, నిజామాబాద్‌ జిల్లాలో పసుపు ఉత్పత్తులపై మెగా పుడ్‌పార్క్‌లు మంజూరయ్యాయి. ఒక్కో ఫుడ్‌పార్క్‌కు రూ.వంద కోట్ల పెట్టుబడులుంటాయి. అందులో రూ. 50 కోట్లను కేంద్రం సబ్సిడీగా ఇస్తోంది. మరో మూడు జిల్లాల్లోనూ త్వరలోనే ఫుడ్‌పార్క్‌లకు ఆమోదం లభిస్తుంది. ఇవిగాక ఆహార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన 100 ప్రాంతాలను గుర్తించి, అక్కడ మినీ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పార్క్‌లో రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడే ఉంటుంది. ఇవిగాక పెట్టుబడులతో ముందుకొచ్చే వారిని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆహారశుద్ధి సబ్సిడీల కోసం రూ. 600 కోట్లను వెచ్చిస్తోంది. అందులో రాష్ట్రం వాటా ఇప్పటి వరకు తక్కువగా ఉంది. ఇకపై పెద్దఎత్తున సబ్సిడీలు పొందేందుకు కృషి చేస్తాం. మౌలిక వసతులకు రూ.2 కోట్ల పరిమితితో 25 శాతం మేరకు ఆర్థికసాయం ప్రభుత్వం అందిస్తుంది. వ్యాట్‌, విద్యుత్‌ రాయితీ ఉన్నాయి.

ఉపాధి ఇలా: శుద్ధియంత్రాలు, శీతల గిడ్డంగులు, ప్యాకింగు, రవాణా తదితరాల ద్వారా ఉపాధి కలుగుతుంది. ఒక్కో మెగాపార్క్‌లో లక్షన్నర మందికి, మినీ పార్క్‌ ద్వారా రెండువేల మందికి ఉపాధి లభిస్తుంది. సాధారణ అర్హతలున్న వారికి స్వల్పకాలిక శిక్షణల ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చు. రైతులు, వ్యవసాయ కుటుంబాల వారికి ఇందులో అవకాశాలున్నాయి. పరిశ్రమల్లోనూ వారిని తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికే నిర్వహిస్తున్న కోర్సులకు తోడు కొత్త కోర్సులను వివిధ కళాశాలల్లో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించనుంది. కోర్సుల నిర్వహణకు ఆర్థికసాయం కూడా అందిస్తుంది.