ఇంట‌ర్వ్యూలు

'గ్రే ఆరెంజ్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటడ్' సీఈవో సమయ్‌కోహ్లీ తో ఇంటర్వ్యూ

* వచ్చేది రోబోల శకమే!
* ఇంజినీరింగ్‌లోనే కసరత్తు మొదలెట్టాలి
* 'హ్యూమనాయిడ్ రోబో'లను అందుబాటులోకి తెచ్చే దిశగా పరిశోధనలు

ఇంజనీరింగ్‌ విద్యార్ధులు రోబోటింగ్ రంగంలో కృషి చేసి 'హ్యూమనాయిడ్ రోబో'లను అందుబాటులోకి తెచ్చే దిశగా పరిశోధనలు కొనసాగించాలని 'గ్రే ఆరెంజ్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటడ్' సీఈవో సమయ్‌కోహ్లీ సూచించారు. తొలిసారిగా భారతదేశం నుంచి హ్యూమనాయిడ్ రోబోను రూపొందించిన వ్యక్తిగా సమయ్ ఖ్యాతి గడించారు. విజయవాడ సమీపంలోని కానూరు పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 'రోబో వీర - 2012' సదస్సుకు ఆయన హాజరయ్యారు. 'న్యూస్‌టుడే'కిచ్చిన ఇంటర్వ్యూలో వివిధ విషయాలు వెల్లడించారు.

» ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో సైన్యం అన్నీ అవసరాలను తీర్చే రక్షణ సంస్థే లేదు. అత్యుత్తమ సాంకేతికతను అతి తక్కువ ఖర్చుతో తయారు చేయటం మన డీఆర్‌డీవో ప్రత్యేకత. ఉదాహరణకు పృథ్వీ క్షిపణిని రూ.350కోట్ల ఖర్చుతో తయారు చేశాం. ఈ రకమైన క్షిపణిని 1980-90ల్లో అమెరికా తయారు చేసింది. అమెరికా ఖర్చెంతో తెలుసా..800మిలియన్‌ డాలర్లు!

» ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, మెకానికల్ శాఖలు చదివిన విద్యార్థులు రోబోటిక్స్‌పై అధ్యయనం చేయడానికి వీలుంటుంది. ఈ మూడు శాఖల్లో ఏదో ఒక దానిపై పూర్తిస్థాయి పట్టు, మిగిలిన రెండిటిలో కనీస పరిజ్ఞానం ఉండాలి.

» ఇంజినీరింగ్ చదివేటప్పటి నుంచే రోబో పరిశోధనలు, వాటి పనితీరు, వాటికి ప్రోగ్రామింగ్ ఇస్తున్న అంశాలను పరిశీలించాలి. రోబోటిక్స్‌లో పట్టు రావాలంటే ప్రయోగాత్మక పరిజ్ఞానం ('ప్రాక్టికల్ నాలెడ్జ్') కీలకం.

» రోబోటిక్స్‌లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల విషయానికొస్తే... ఇంజినీరింగ్ అనంతరం రోబోటిక్స్‌లో పీజీ చేయవచ్చు. అమెరికా, జపాన్‌లతోపాటు మన దేశంలో కూడా పీజీ కోర్సులు ప్రారంభించారు. మన దేశంలో కార్లు, మోటారు పరిశ్రమల్లో రోబోటిక్ నిపుణులకు ఎక్కువగా ఉద్యోగావకాశాలున్నాయి.

» దేశంలో ప్రస్తుతం లక్షల సంఖ్యలో రోబోలను రూపొందిస్తున్నారు. వీటిని ఎక్కువగా కార్లకు, ఎత్తయిన భవనాలకు రంగులు వేయడానికి, వెల్డింగ్ పనులకూ వినియోగిస్తున్నారు. టీవీఎస్ బైకులకు, హోండా సంస్థ కార్లకూ రంగులు వేసేది రోబోలే. ఈ పద్ధతి ఎక్కువగా బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ వంటి నగరాల్లో కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అంతగా లేకపోవడం వల్ల రోబోల వినియోగం తక్కువే.

» రోబోలను ప్రస్తుతం సైన్యం, గనులు, చమురు, వైద్యరంగాల్లో వినియోగిస్తున్నారు. వాటిల్లో కొన్ని హ్యూమనాయిడ్ రోబోలు, చక్రాలున్న రోబోలూ ఉన్నాయి.

» వైద్యరంగంలో శస్త్రచికిత్సలు చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని 'డావెన్సీ రోబో'లంటారు. ఇలాంటివి మన దేశంలో 17 వరకూ ఉన్నాయి. మనిషి అంతర్భాగంలో ఉన్న అవయవాలను కూడా త్రీడీలో చూపించి, వైద్యుల ఆదేశాల మేరకు ఇవి పనిచేస్తాయి. అవి దాదాపు వెయ్యిమందికి శస్త్రచికిత్సలు చేయగా, అన్నీ విజయవంతమయ్యాయి. రోబోలు నిరంతరాయంగా 10 నుంచి 15 గంటల సేపు శస్త్రచికిత్సలు చేయగలవు.

» శస్త్రచికిత్స సమయంలో రోబోల్లో ఏదైనా లోపం తలెత్తితే? వైద్యులకు వీటిపై ఎలాంటి పరిజ్ఞానం అవసరం?అనేది చర్చనీయాంశం.

» వైద్యులు డిగ్రీ లేదా పీజీ తరువాత రోబో పరిజ్ఞానంపై ఏడాది లేదా రెండేళ్లు శిక్షణ తీసుకుంటే వాటి సమస్యలపైనా, పనితీరుపైనా అవగాహన వస్తుంది.

» అత్యాధునిక రోబోలను రూపొందించడంలో మన కన్నా జపాన్, దక్షిణ కొరియా, అమెరికాలు ముందున్నాయి. ఇప్పుడిప్పుడే మన వారూ పుంజుకొంటున్నారు. 'డిపార్టుమెంటు ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' ప్రతి ఇంజినీరింగ్ కళాశాలకు రోబోటిక్స్ పరిజ్ఞానం నిమిత్తం నిధులు మంజూరు చేస్తోంది. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఈ రంగంలో పురోగతి సాధించవచ్చు.

హ్యూమనాయిడ్ రోబో అంటే...: మానవాకారంలోఉండే రోబోను హ్యుమానాయిడ్‌రోబో అంటారు. మనిషి మాదిరిగా తల, మొండెం, కాళ్లు, చేతులు ఉన్న రోబోను ఢిల్లీకి చెందిన సమయ్ కోహ్లీ మన దేశంలో తొలిసారిగా 2007 లో రూపొందించారు. అప్పట్లో సమయ్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. దానికి మరింత మెరుగులు దిద్ది రోబో ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లారు. 2009, 2010లలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సికోలో జరిగిన ఈ ఒలింపిక్స్‌లో 150 దేశాలకు చెందిన 500 బృందాలు పోటీ పడగా, సమయ్ రూపొందించిన రోబోలు ఒక స్వర్ణం, రెండు రజత, రెండు కాంస్య పతకాలు గెలుపొందాయి. కుంగ్‌ఫూ, మెట్లు ఎక్కడం, నృత్యం, రేసింగ్ తదితర అంశాల్లో అవి సత్తా చాటాయి. రోబోటిక్స్ పరిశోధనలు, అభివృద్ధినే వృత్తిగా ఎంచుకుని సొంతంగా 'గ్రే ఆరెంజ్' సంస్థను స్థాపించారు సమయ్.