ఇంట‌ర్వ్యూలు

ఐఈజీ సీఈవో అమర్‌నాథ్‌రెడ్డి తో ఇంటర్వ్యూ

* ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి
* కొత్తదనంపై దృష్టి సారించాలి.
* ఆంగ్లం చదవడం అలవాటు చేసుకోవాలి.

విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడంపైనే దృష్టి పెడుతున్నారు. ఎన్ని మార్కులు సంపాదించాం. ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామన్నది కాదు. కొత్తదనంపై దృష్టి సారించాలి. విభిన్నంగా ఆలోచించాలి. భారత విపణిలో విస్తృత అవకాశాలున్నాయి. ఉదాహరణకు 'సన్‌' మైక్రోసిస్టమ్స్‌... ఇది ఒరాకిల్‌ అనుబంధ సంస్థగా పరిచయమే. కానీ 'సన్‌' అంటే స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నెట్‌వర్క్‌, ఈ సంస్థ పుట్టింది స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో.. ఆ సంస్థ ఇప్పుడు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. అధ్యాపకులు విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తే కళాశాలల నుంచే నూతన ఆవిష్కరణలు వస్తాయి. తద్వారా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి వెళ్లవచ్చు అని అంటున్నారు ఐటీశాఖ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ గవర్నెన్స్‌(ఐఈజీ) సీఈవో ఆత్మకూరు అమర్‌నాథ్‌రెడ్డి. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నిర్వహిస్తున్న జవహర్‌ విజ్ఞాన కేంద్రా(జేకేసీ) బోధనలోనూ మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు.

» విద్యార్థులు ఆంగ్ల భాషలో వెనకబడుతున్నారని అంటున్నారు. లోపాలు ఎక్కడున్నాయి?
భావవ్యక్తీకరణ నైపుణ్యాలు బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏలో రెండు మూడు తరగతులు వింటే వచ్చేవి కాదు. పాఠ్యప్రణాళికలో అంతర్భాగంగా ఉండి, నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. చిన్నప్పటి నుంచి ఆంగ్లం చదవడం అలవాటు చేసుకోవాలి. ఆంగ్ల భాషతో పాటు విషయ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం, ఆత్మవిశ్వాసం అవసరం. జేకేసీల్లో 2013 నుంచి భాష, భావవ్యక్తీకరణ బోధన అంశాల్లో మార్పులు తీసుకువస్తూ, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఒరాకిల్‌ సంస్థల ప్రతినిధులతో కార్పొరేట్‌ బృందాన్ని ఏర్పాటు చేశాం.

» బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏల్లో 70 శాతానికి పైగా మార్కులు సంపాదించినవారు కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు? కారణం?
ప్రస్తుత విద్యావ్యవస్థ బట్టీ పద్ధతిలో ఉంది. విద్యార్థులు మార్కులు, పర్సంటేజీలు, ర్యాంకుల సాధనే ధ్యేయంగా చదువుతున్నారు. విషయ పరిజ్ఞానం పెంపొందించుకొనే వారి సంఖ్య తగ్గుతోంది. మార్కులు అనేది కేవలం అర్హత. మార్కులే లోకంగా చదివితే లాభం లేదు. టెస్ట్‌ పేపర్లు, ఆల్‌ఇన్‌ వన్‌లు కాదు.. పాఠ్యపుస్తకాలు చదవాలి. టెక్నాలజీలో వస్తున్న మార్పులు తెలుసుకోవాలి. సమస్యలను పరిష్కరించే సత్తాను పెంపొందించుకోవాలి.

» జేకేసీలు ఎంత వరకు లక్ష్యాన్ని సాధించాయి?
విద్యార్థులకు, ఐటీ, ఐటీయేతర పరిశ్రమలకు మధ్య వారధిగా ప్రభుత్వం జేకేసీలను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఏటా దాదాపు 5 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జేకేసీలు సాధించాల్సింది చాలా ఉంది. ప్రస్తుత బోధనలోనూ మార్పులు తీసుకురావాలి. ఈ ఏడాది నుంచి పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెంచనున్నాం. విద్యార్థులకు ఒరాకిల్‌, ఐబీఎం, శాప్‌, ఆటోక్యాడ్‌, సిస్కో సాఫ్ట్‌వేర్‌లో సర్టిఫికేషన్‌ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాం.

» కొత్త బోధన విధానం ఎలా ఉంటుంది?
2013 జనవరి లేదా జూన్‌ నుంచి 'వెబినార్‌' టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు బిజినెస్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో సాంకేతిక అంశాలపై ఆన్‌లైన్లో పాఠాలు ఉంటాయి. పరిశ్రమ కేంద్రంగా ఈ-పాఠాలు బోధించేందుకు ఐబీఎం, ఒరాకిల్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. ఉదాహరణకు బెంగళూరు కేంద్రం నుంచి ఐబీఎం టెక్నాలజీ ప్రతినిధి ఒక టెక్నాలజీ విషయమై ఆన్‌లైన్లో పాఠాలు బోధిస్తారు. ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తయ్యాక విద్యార్థి సాధించిన పరిజ్ఞానంపై అధ్యాపకులు మూల్యాంకనం చేస్తారు. విద్యార్థి అకడమిక్‌ మార్కులు, సాఫ్ట్‌ స్కిల్స్‌, సాంకేతిక నైపుణ్యాలలో మార్కులు, ఐబీఎం, ఒరాకిల్‌, ఆటోక్యాడ్‌, శాప్‌ తదితర కోర్సుల సర్టిఫికేషన్‌ వివరాలు, జేకేసీ మదింపు పరీక్షల స్కోరుతో 'జేకేసీ' స్కోరు కార్డు ఉంటుంది. ఈ కార్డుతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశాలు మెరుగుపడుతాయి.

» ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఉద్యోగాల సంఖ్యకు తేడాలుంటున్నాయి?
ఇది నిజమే. రాష్ట్రంలో లక్షన్నర మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్యా కోర్సులు పాసవుతున్నారు. ఏటా రాష్ట్ర ఐటీ రంగంలో వస్తున్న ఉద్యోగాలు 25,000-30,000, కోర్‌ రంగంలో మరో 3-5వేలు ఉద్యోగాలు వస్తున్నాయి. 20-30 వేల మంది విదేశీ చదువులకు వెళ్తున్నారు. ఏటా 60 వేల మందిని మినహాయిస్తే.. మిగతా 90 వేల మంది పరిస్థితి ఏమిటి? వారికి ఉద్యోగాలు ఎలా? అందుకే విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ఉండకూడదు. నూతనంగా ఆలోచించి, సరికొత్త ఆవిష్కరణలతో ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలి. ఈ పరిశోధనలకు కళాశాలలు, వర్సిటీలు వేదిక కావాలి. అమెరికాలో విశ్వవిద్యాలయాలు కొత్త పరిశోధనలకు వేదికగా ఉంటాయి.

» జేకేసీల్లో బోధకుల కొరత అధికంగా ఉంది కదా? శిక్షణ ఎలా ఇస్తున్నారు?
జేకేసీల ద్వారా కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను తాత్కాలిక బోధకులుగా నియమిస్తున్నాం. ఆ వ్యక్తి కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో జేకేసీలో పనిచేసినందుకు నెలకు రూ.10,000-12,000 చెల్లిస్తున్నాం. జేకేసీలో ఇస్తున్న శిక్షణ రెగ్యులర్‌ సబ్జెక్టులతో సమానంగా లేదు. ఇంటర్వ్యూలు, పరీక్షల ముందు కూర్చుంటే నైపుణ్యాలు నేర్చుకోలేం. జేకేసీ సబ్జెక్టులను యూనివర్సిటీ పాఠ్యప్రణాళికలో చేర్చాలని ఉపకులపతులకు ఐటీశాఖ తరఫున నివేదించాం. వీటికి మార్కులు కేటాయించి, గ్రేడ్లు ప్రకటిస్తే విద్యార్థుల్లో ఆసక్తి పెరగడంతో పాటు ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.