ఇంట‌ర్వ్యూలు

ఐజీఐడీఆర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సూర్యదేవర మహేంద్రదేవ్‌ తో ఇంటర్వ్యూ

* ఆర్థికరంగంలోఅపారఅవకాశాలు
* ఆర్థిక శాస్త్రంలో ఎమ్మెస్సీ ఇన్‌ ఎకనామిక్స్‌ను అందజేస్తున్నాం.
* అఖిల భారత స్థాయిలో ప్రవేశపరీక్ష ఉంటుంది.
* దేశానికి ఆర్థిక నిపుణుల అవసరం చాలా ఉంది.

మెరికల్లాంటి ఆర్థిక నిపుణులను తయారుచేసేందుకు భారత రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన డీమ్డ్‌ విశ్వవిద్యాలయం- ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ (ఐజీఐడీఆర్‌). ఆర్థికవేత్త, తెలుగువారైన ప్రొఫెసర్‌ సూర్యదేవర మహేంద్రదేవ్‌ దీనికి డైరెక్టర్‌ (వైస్‌ ఛాన్స్‌లర్‌). తమ సంస్థ లక్ష్యాలు, ప్రవేశ విధానంతో పాటు, అర్థశాస్త్ర విద్యార్థుల భవిత, విశ్వవిద్యాలయాల్లో బోధన విధానాల గురించి ఆయన 'ఈనాడు'కి వివరించారు..

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆయన చొరవతో ఏర్పాటైందే ఐజీఐడీఆర్‌. రిజర్వు బ్యాంకు స్వర్ణోత్సవాల్ని పురస్కరించుకుని ఆర్థిక రంగ మేధావుల వేదిక ఒకటి ఉండాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఐజీఐడీఆర్‌ ఏర్పాటై పాతికేళ్లవుతోంది. ఇది రజతోత్సవ సంవత్సరం. మాది డీమ్డ్‌ యూనివర్సిటీ. ఆర్థిక శాస్త్రంలో ఎమ్మెస్సీ ఇన్‌ ఎకనామిక్స్‌ను అందజేస్తున్నాం.

విద్యార్థికో ఉపాధ్యాయుడు!
ఈ కోర్సులో సంవత్సరానికి 25 మందినే చేర్చుకుంటాం. అఖిల భారత స్థాయిలో ప్రవేశపరీక్ష ఉంటుంది. కాబట్టి పోటీ ఎక్కువే! అత్యుత్తమ ఆర్థిక నిపుణులను తయారుచేసేలా మా కోర్సు ఉంటుంది. అధ్యాపకులు 25-30 మంది ఉంటారు. అంటే ఒక్కో విద్యార్థికి ఒక అధ్యాపకుడన్న మాట. టీచర్లు కూడా క్యాంపస్‌లోనే ఉంటారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటుంది.

కేవలం తరగతి గదిలో పాఠాలు నూరిపోయడమే కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు, అధ్యయనాలతో విద్యార్థులకు ఎక్కువ విజ్ఞానం అందించే ఏర్పాట్లు ఉంటాయి. కేంబ్రిడ్జి, యేల్‌, హార్వర్డ్‌ వంటి అత్యుత్తమ విదేశీ యూనివర్సిటీలతోను మాకు అవగాహన ఉంది. ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాములు ఉంటాయి. వర్చువల్‌ టీచింగ్‌ పెట్టాం. స్కైప్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ విధానాల్లో శిక్షణ ఇస్తాం.

ఎమ్మెస్సీ పూర్తి చేసినవారిలో కొందరు మా దగ్గరే డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేస్తారు. ఉద్యోగాలకు వెళ్లాలనుకున్నవాళ్లు వెళతారు. బహుళజాతి కంపెనీలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. ప్రారంభ వేతనం ఏడాదికి రూ.15 లక్షలు కూడా ఉంటోంది.

ఆర్థిక నిపుణుల అవసరమెంతో
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సుల వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దేశానికి ఆర్థిక నిపుణుల అవసరం చాలా ఉంది. ఢిల్లీ, ముంబాయిలలో ఎకనమిక్స్‌కి ఆదరణ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అర్ధ శాస్త్రానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

చాలా కంపెనీలు, బ్యాంకులు నిపుణులైన ఆర్థికవేత్తల కోసం చూస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలపై సూక్ష్మస్థాయి పరిశీలన, విశ్లేషణ, భవిష్యత్‌ దర్శనం చేయగలిగిన ఆర్థికనిపుణుల అవసరం ఎంతో ఉంది. బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థల్లోనే కాకుండా ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల్లోను ఆర్థిక నిపుణులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటున్నాయి. అర్ధశాస్త్రంలో కూడా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉత్పాదక రంగాల్లో స్పెషలైజేషన్‌ చేసినవారికి మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. మొత్తం మీద ఆర్థికవేత్తలకు మంచి భవిష్యత్తే ఉందని చెప్పవచ్చు.

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లకు ప్రత్యామ్నాయంగా ఎకనామిక్స్‌ను గుర్తించే రోజులు వస్తున్నాయి. అర్ధశాస్త్రం చదివితే ... దేశానికీ, ప్రపంచానికీ ఆర్థిక సమస్యలు, విధానాల మీద సలహాలు ఇచ్చే అవకాశం లభిస్తుంది. ఐదేళ్లుగా చూస్తున్నాను... టీవీ ఛానళ్లలో కూడా ఎకానమిస్టుల ప్రాధాన్యం పెరుగుతోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగం కూడా నిపుణుల కోసం చూస్తోంది. ముందు ముందు డిమాండ్‌ ఇంకా పెరుగుతుందని నా ఉద్దేశం.

హార్వర్డ్‌, ఎంఐటీ, కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ వంటి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి చాలా నేర్చుకోవాలి. అక్కడ నిపుణులైన అధ్యాపకులు ఉంటారు. పరిశ్రమలు, సేవలు, వ్యవసాయ రంగాలకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షణ ఉంటుంది. మనం థియరీ దగ్గరే ఆగిపోతున్నాం. మన దగ్గర ఆధునిక బోధనారీతులు, ఫీల్డ్‌వర్క్‌ కొరవడుతున్నాయి.

మన దేశానికి వస్తే ఢిల్లీ స్కూల్‌ఆఫ్‌ ఎకనామిక్స్‌, ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌, జేఎన్‌యూ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో అర్ధశాస్త్రానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బోధన విధానం కూడా బాగుంది. స్టేట్‌ యూనివర్సిటీలే బాగా వెనుకబడి ఉన్నాయి.

అధ్యాపకులు సరిగ్గా బోధించకపోతే అర్ధశాస్త్ర విద్యార్థులకు విశ్లేషణ సామర్థ్యం అలవడదు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర యూనివర్సిటీల్లో బోధనలో నాణ్యత లేదు. సెంట్రల్‌ వర్సిటీలో పర్వాలేదు. నిపుణులైన అధ్యాపకులను నియమించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి. ఫీల్డ్‌వర్క్‌ ఆధారితంగా బోధన ఉండాలి. అప్పుడే విద్యార్థులకూ మేలు. దేశానికీ మేలు జరుగుతుంది.'

మూడు కోర్సులు
1. డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ: ఇది 1990లో ప్రారంభమైంది. కాలవ్యవధి నాలుగేళ్లు. ఆర్థిక, ఇంధన, పర్యావరణ విధానాలకు సంబంధించిన అంశాల్లో నిపుణుల్ని తయారు చేయడం ఈ ప్రోగ్రాం లక్ష్యం.

2. ఎంఫిల్‌: 1995లో ఆరంభమైంది. రెండేళ్ల కోర్సు.
ఈ రెండు కోర్సుల్లో ప్రవేశానికి ఎంఎ/ఎమ్మెస్సీ ఎకనమిక్స్‌/ ఎంస్టాట్‌/ ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌ లేదా మేథమేటిక్స్‌ లేదా ఎన్విరాన్‌మెంట్‌ సైన్సెస్‌ లేదా ఆపరేషన్స్‌ రీసెర్చ్‌)/ ఎంబీఏ/ ఎంటెక్‌/ ఎంఇ/ బీటెక్‌/ బీఈ కోర్సులు చేసినవారు అర్హులు. ఎకనమిక్స్‌ విద్యార్థులు అర్హత పరీక్షలో 55 శాతం అగ్రిగేట్‌ మార్కులు, ఇతరులు 60 శాతం అగ్రిగేట్‌ మార్కులు తెచ్చుకోవాలి. ఎంఫిల్‌, పీహెచ్‌డీ అభ్యర్థులకు సంస్థ స్త్టెపెండ్‌ ఇస్తుంది.

3. ఎమ్మెస్సీ ఇన్‌ ఎకనమిక్స్‌: ఇది 2003లో మొదలైంది. రెండేళ్ల కోర్సు. దీనిలో ప్రవేశానికి బి.ఎ., బీఎస్సీ ఎకనమిక్స్‌/బీకాం/బిస్టాట్‌/బీఎస్సీ(ఫిజిక్స్‌ లేదా మేథమెటిక్స్‌)/బీటెక్‌/బీఈ లలో ఏదో ఒక డిగ్రీ చేసినవారు అర్హులు. అర్హత కోర్సుల్లో ఎకనమిక్స్‌ సబ్జెక్టుగా ఉన్నవారు రెండో తరగతి, ఇతరులు మొదటి తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. హయ్యర్‌ సెకండరీ స్థాయిలో గణితం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేకపోతే గణితంలో ఆ మేరకు నైపుణ్యమైనా ఉండాలి.

ఈ కోర్సులో చేరే విద్యార్థులు సెమిస్టర్‌కి రూ.8000 చొప్పున ఇన్‌స్టిట్యూట్‌కి చెల్లించాలి. వీరు క్యాంపస్‌ హాస్టల్‌లోనే ఉండాలి. నెలకు రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు, నీటి బిల్లులు వాడుకున్న దాన్నిబట్టి కట్టాలి.

ప్రవేశపరీక్ష
ఈ మూడు కోర్సుల్లో ప్రవేశం రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థుల అనలిటికల్‌, వెర్బల్‌, మేథమెటికల్‌ నైపుణ్యాల్ని పరీక్షించే విధంగా రాతపరీక్ష ఉంటుంది. అహ్మదాబాద్‌, అలహాబాద్‌, చండీగఢ్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, చెన్నై, గువాహతి, హైదరాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, ముంబాయి, నాగపూర్‌, న్యూఢిల్లీ, తిరువనంతపురం కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో సఫలమైన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది.

నోటిఫికేషన్‌ జనవరి/ ఫిబ్రవరి నెలల్లో విడుదలవుతుంది. ఏప్రిల్‌ నెలాఖరులో ప్రవేశపరీక్ష ఉంటుంది.పూర్తి వివరాలకు www.igidr.ac.in వెబ్‌సైట్‌ చూడవచ్చు. దరఖాస్తులు పోస్టులో తెప్పించుకుని, పోస్టు ద్వారా పంపించవచ్చు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులూ చేయవచ్చు.