ఇంట‌ర్వ్యూలు

భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షుడు ప్రొ|| కె.శ్రీనాథరెడ్డి తో ఇంటర్వ్యూ

* రాజధానిలో ప్రజారోగ్య వర్సిటీ
* ఏర్పాటుపై త్వరలో నిర్ణయం
* వైద్యరంగం ఖర్చుల్లో 75% ప్రభుత్వం భరించాలి

రక్తపోటు 120/80 ఉంటే మామూలుగానే ఉందని వైద్యులు చెబుతుంటారు. కానీ ఆధునిక జీవనశైలి నేపథ్యంలో- రక్తపోటు 115/75 కన్నా మించితే అధిక రక్తపోటు సూచనలు ఆరంభమైనట్టేనని భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె.శ్రీనాథరెడ్డి హెచ్చరించారు. ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం, జీవనశైలిలో మార్పుల మూలంగానే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు దాడిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో గుండెజబ్బుల విభాగానికి అధిపతిగా ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలకు చికిత్స కన్నా నివారణే ప్రధానమనే భావనతో ప్రజారోగ్య విధానాలపై దృష్టి సారించానని వివరించారు. అందులో బాగంగానే భారతీయ ప్రజారోగ్య సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత వైద్యరంగ పోకడలు, జబ్బులు, చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు, వైద్యం వ్యాపారంగా మారటం, బడ్జెట్‌ కేటాయింపులు తదితర అంశాలపై ఆయన 'న్యూస్‌టుడే'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

» ప్రజారోగ్య వ్యవస్థలపై దృష్టిపెట్టటానికి ప్రేరేపించిన అంశాలేంటి?
తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల మూలంగానే చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి సంఘటనలే నన్ను వైద్యవృత్తికి చేరువ చేశాయి. ఎయిమ్స్‌లో పనిచేసేటపుడు గుండె కవాటాలు దెబ్బతిని చాలా మంది పేదవారు వచ్చేవారు. వీరికి శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినప్పటికీ.. కవాటాలు మార్చాల్సిన సమయంలో వాటిని కొనటానికి చాలామంది అప్పులు చేసేవారు. ఆస్తులు అమ్ముకునేవారు. ఇది నన్ను బాగా కదిలించింది. మూడు దశాబ్దాల కిందట రక్తపోటు 160/90 ఉంటే అధికమని భావించేవారు. 140/90 కన్నా ఎక్కువుంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు. కానీ ప్రస్తుతం 115/75 కన్నా ఎక్కువుంటే అధిక రక్తపోటుగానే భావించాలంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. నిజానికి రక్తపోటును మందులు వాడకుండా ఆహారంలో మార్పులతో తగ్గించుకోవచ్చు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా పొటాషియం లభిస్తుంది. ఇది శరీరంలో ఉప్పు శాతాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రజలకు శుభ్రమైన తాగునీరు, ఆహారం, మెరుగైన పారిశుద్ధ్యం వంటివి కల్పిస్తే చాలావరకు జబ్బులను నివారించొచ్చు. మనదేశంలో ఇలాంటి విధానాల అమలులో వైఫల్యాన్ని సరిచేయాలనే ఉద్దేశంతోనే ప్రజారోగ్యంపై పనిచేయాలని ఉద్యమించాను.

» ప్రజారోగ్య వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరమంటారు?
ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా టీకాల కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే పొగాకు వాడకాన్ని తగ్గించడానికి ప్రత్యేక విధానాలు, పాదచారులకు, సైకిల్‌పై వెళ్లేవారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలాలు, పాఠశాలల్లో ప్రత్యేక సమయం కేటాయించకపోతే అనారోగ్యానికి దారితీస్తుంది. రోగాలు రాకుండా నిరోధించే వ్యవస్థలకూ తగు ప్రాధాన్యమివ్వాలి. ఆరోగ్య పరిరక్షణలో ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ఇటీవలి కాలంలో మూలకణ, జన్యు చికిత్స విధానాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ప్రజారోగ్య పరిరక్షణ అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో వ్యాధులు పెరిగిపోతున్నాయి. నాణ్యమైన మందులు, ఆధునిక చికిత్సా విధానాలు మెరుగైన ఆరోగ్య సమాజానికి సూచికలు కావు. చికిత్సలతోనే జబ్బులు తగ్గవు. అన్ని ప్రభుత్వ శాఖలు దీన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. వ్యవసాయరంగంలో రసాయన మందులు, ఎరువులు లేకుండా నాణ్యమైన పంటలు పండించే విధానాలను అభివృద్ధి చేయాలి. పారిశుద్ధ్యం, వసతి, రక్షిత మంచినీటి సరఫరా, కాలుష్యంలేని వాతావరణం, అందరికీ చదువు చెప్పించటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జబ్బులకు చికిత్స చేయడం కన్నా వాటి నివారణపై ప్రముఖంగా దృష్టిపెట్టాలి. లేకపోతే ప్రతి వీధిలోనూ ఒక ఆస్పత్రి అవసరమవుతుంది.

» ఆహార అలవాట్లు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయి?
మాంసాహార వినియోగం పెరగడంతో జంతువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వాటికి ప్రత్యేకంగా ఆహారాన్నీ తయారుచేస్తున్నారు. అయితే మాంసం కోసం పెంచే జంతువుల వ్యర్థాల మూలంగా వాతావరణంలో మీథేన్‌ వాయువులు 50% పెరిగాయని ప్రముఖ జర్మనీ ఆర్థికవేత్త నికలస్‌స్టర్న్‌ వెల్లడించారు. మాంసాహారం ఊబకాయానికి దారితీస్తోంది. శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి గుండెజబ్బులు, క్యాన్సర్‌ కారకాలుగా మారుతున్నాయి. స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు జంతువుల ద్వారానే వ్యాపిస్తున్నాయి. కాబట్టి జీవనశైలికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఒక వాహనంపై మోతాదుకు మించి బరువు వేస్తే ఆగిపోతుంది కదా. అలాగే మన శరీరం కూడా పని చేయలేక కొత్త జబ్బులకు దారితీస్తుంది.

» మీ సంస్థ లక్ష్యాలేంటి? ప్రజారోగ్య విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
ప్రజారోగ్యంపై కనీస స్థాయి అవగాహన లేనివారు ఆరోగ్య పథకాలు, విధానాలు రూపొందిస్తున్నారు. అందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా, అవి క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైద్యరంగంలో ఉన్నవారికి ప్రజారోగ్యంపై ప్రత్యేక శిక్షణ, ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్‌, గాంధీనగర్‌(గుజరాత్‌), భువనేశ్వర్‌లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశాం. ఈశాన్య రాష్ట్రాల కోసం షిల్లాంగ్‌లో త్వరలో మరో కేంద్రం ఏర్పాటు చేయనున్నాం. ప్రజారోగ్యం కోసం ప్రత్యేకంగా ఒక జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం నెలకొల్పాలని నిర్ణయించాం. ఇందులో ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా పీజీ కోర్సులు, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తాం. అన్ని ఆరోగ్య సమస్యలకు మూలకారణాలు అన్వేషించి, వాటి నిరోధక దిశగా పరిష్కారాలు చూపించాలనేది మా లక్ష్యం. విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో కొత్త చట్టానికి అనుగుణంగా అది పనిచేస్తుంది. అప్పటి వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనల మేరకు అవసరమైన సహకారాన్ని అందిస్తాం. ప్రజారోగ్య విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. అక్టోబరులో జరిగే కార్యవర్గ సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటాం.

» ప్రస్తుతం తీవ్రంగా మారుతున్న ఆరోగ్య సమస్యలేంటి?
పిల్లలు, గర్భవతుల్లో పౌష్టికాహార లోపం చాలా తీవ్రంగా ఉంది. గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి వాటికి తోడు ఇటీవల విపరీతమైన ఒత్తిళ్లతో ప్రతి నలుగురిలో ఒకరు మానసిక సమస్యల బారినపడుతున్నారు. 10% మందిలో ఇవి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణమవుతోంది. వీటి నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

» వైద్యవృత్తిలో విలువలు క్షీణించటానికి కారణాలేంటి?
సమాజంలో వైద్యులకు ప్రాణదాతలుగా అరుదైన గౌరవం ఉంది. దీన్ని వైద్యవృత్తిలో ఉన్న వారంతా గుర్తుంచుకోవాలి. సేవాభావాన్ని మరచి, కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వైద్యం చేయటం చాలా దారుణం. వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో నిర్దిష్టమైన విధానాలు అమలు చేసేలా నిబంధనలు; ఫీజుల విషయంలోనూ ఏకీకృత విధానాలు అవసరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరముంది.

» వైద్య విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి?
గతంతో పోలిస్తే ఆధునిక చికిత్స విధానాలు చాలానే వచ్చాయి. నైపుణ్యం పెరిగింది. అయితే ఇవి ప్రజలకు అందుబాటులో లేకుండా చాలా ఖరీదుగా మారాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులో ఉండేలా 'నాలెడ్జ్‌ టు యాక్షన్‌' అనే రీతిలో బలమైన విధానాలు రూపొందాలి. సామాజిక స్పృహను పెంపొందించే అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలి.

» ప్రభుత్వ వైద్యవిధానాల మాటేమిటి?
ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి దోహదం చేసేలా ప్రభుత్వ విధానాలు రూపొందించాలి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవడంతో పాటు అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆరోగ్యరంగంలో ఖర్చు చేస్తున్న మొత్తంలో 75% వాటాను ప్రభుత్వమే భరించాలి. బడ్జెట్‌లో కనీసం 6% నిధులు వైద్యరంగానికి కేటాయించాలి. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి? వాటికి కారణాలేంటి? అనేవి అధ్యయనం చేయటానికి ప్రత్యేక వ్యవస్థలు ఉండాలి. వైద్యసేవలను ప్రజలకు చేరువగా తీసుకువెళ్లాలి. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొదటిసారిగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో 'మీ సేవ' సర్వీసు ద్వారా తక్కువ ధరకు నీటినాణ్యత పరీక్షలు, హీమోగ్లోబిన్‌, బీపీ, మధుమేహం, ఈసీజీ లాంటి పరీక్షలు అందించే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతారు. ఈ తరహాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి.