ఇంట‌ర్వ్యూలు

ఇన్ఫోసిస్ బిజినెస్ ఐటీ సర్వీసెస్ అధిపతి ఎం.నరసింహారావు తో ఇంటర్వ్యూ

* ఆది నుంచే పట్టు పట్టాలి
* ముందుముందు ఎన్నో ఉద్యోగావకాశాలుంటాయి
* నాలుగేళ్లలోనూ 70 శాతం మార్కులైనా సాధించాలి
* ఆంగ్లంలో ప్రావీణ్యం, సబ్జెక్టుల్లో పరిణతి పెంచుకోవాలి

విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశించినప్పటి నుంచే పాఠ్యాంశాలపై పట్టుసాధించాలి. నాలుగేళ్ల కోర్సు కదా! అని తత్సారంచేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏటా సబ్జెక్టులు మిగిలిపోతుంటే మిగిలిన పాఠ్యాంశాలపై దృష్టి పెట్టేందుకు కుదరదు. అలాగే తొలి ఏడాది నుంచే ఆంగ్లంపై పట్టుసాధించాలి. ఇది లేకపోవడం వల్లే చాలామంది వెంటనే ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో ఉద్యోగ నియామకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా విద్యార్థులు తొలి ఏడాది నుంచే సన్నద్ధమైతే తిరుగే ఉండదని అంటున్నారు ఇన్ఫోసిస్ బిజినెస్ ఐటీ సర్వీసెస్ అధిపతి ఎం.నరసింహారావు. ఈయన 'ఈనాడు' ఇంటర్వ్యూలో కొత్తగా ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశించిన విద్యార్థులకు విలువైన సూచనలు అందచేశారు. ప్రధాన అంశాలివి..

» 70 శాతం మార్కులు సాధిస్తే భేష్
ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు కంపెనీలు విద్యార్థుల అర్హత మార్కుల సగటును పెంచేస్తుంటాయి. అందువల్ల నాలుగేళ్లలోనూ కలిపి 65-70 శాతం మార్కులైనా సాధిస్తే మంచిది. కొన్ని కంపెనీలు ఇంజినీరింగ్‌తో పాటు పది, ఇంటర్ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అందువల్ల 9వ తరగతి నుంచే తమ చిన్నారుల భవితపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. 10వ తరగతి, ఇంటర్‌లోనూ 70 శాతం మార్కులు సాధిస్తే అకడమిక్ కెరీర్ బాగున్నట్లే.

» పాఠశాలల్లో మాట్లాడుతూనే ఉండాలి...
మన బడుల్లో ఎక్కువ మాట్లాడొద్దు... నోరు మూసుకుని కూర్చోండి అనే ధోరణే ఎక్కువ. ఇప్పుడు ఏ రంగంలో అయినా ఉద్యోగం పొందాలంటే ఇంటర్వ్యూలో ధైర్యంగా మాట్లాడాలి. అందుకే పాఠ్యాంశాల్లోని సందేహాలపై వెంటనే ప్రశ్నలు అడిగి, నివృత్తి చేసుకునే ధోరణిని టీచర్లు పిల్లలకు అలవాటుచేయాలి. ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధనతో పాటు ఇతర చర్చలూ ఆంగ్లంలో సాగాలి. ఆఖరి సంవత్సరంలో వీటిపై దృష్టి పెడితే సరిపోదు.. తొలి ఏడాది నుంచే తర్ఫీదు కావాలి. లేకపోతే ఉద్యోగ సాధనలో విఫలమౌతారు.

» ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం లేకుంటే విఫలమే
ఇంజినీరింగ్ 2, 3 సంవత్సరాల్లో విద్యార్థులకు ప్రాజెక్టులు ఇస్తుంటారు. ఇది తాము నేర్చుకున్న, ఆసక్తి ఉన్న అంశాల్లో పరిణతి సాధించేందుకు వచ్చిన అవకాశం. అంతేతప్ప వేరేవాళ్లవి కాపీ కొడితే భవిష్యత్తులో నష్టపోతారు. ముఖ్యంగా ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూల్లో విద్యార్థి నేర్చుకున్న అంశంపైనే ప్రశ్నలు అడుగుతారు. ఇతర అంశాలపై ప్రశ్నలే ఉండవు. అప్పుడు చెప్పలేకపోతే నష్టపోతారు.

» సబ్జెక్టులు మిగులుతూ ఉంటే భవిష్యత్తు కష్టం
మొదటి సంవత్సరాల్లో ఎన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా (బ్యాక్‌లాగ్ ఉన్నా) ఫర్వాలేదని, మొత్తంగా నాలుగేళ్లలో అవన్నీ పూర్తి చేస్తే చాలనే ధోరణిలో కొందరుంటున్నారు. తొలి ఏడాది సబ్జెక్టులు మిగిలితే, రెండో ఏడాది సబ్జెక్టులతో పాటు అవీ చదవాలి. ఇదే పద్ధతి ఆఖరి సంవత్సరం వరకు కొనసాగితే ఎంత కష్టమో ఆలోచించాలి.

» ఆంగ్లంలో నిత్యం సమీక్ష అవసరం
ఆంగ్లంలో విద్యార్థులు పట్టు సాధించడం అనివార్యం. కొందరైతే చదివిన సబ్జెక్టును ఎదుటి వారికి అర్థం అయ్యేలా వివరించడం, రాత పూర్వకంగా వెల్లడించడంలో తడబాటుకు గురవుతున్నారు. తొలి ఏడాది నుంచే ఈ విషయంలో జాగ్రత్త పడాలి. సబ్జెక్టులే అవసరంలేదు.. తాము చూసిన సినిమా, క్రికెట్ మ్యాచ్ ఎలా ఉందో సమీక్షను ఆంగ్లంలో రాయడం, స్నేహితులతో మాట్లాడటం ద్వారా కూడా ఆంగ్లంపై పట్టు వస్తుంది.

» కోర్సు కాదు- ఏమీ నేర్చుకున్నారన్నదే ముఖ్యం
ఇతర దేశాలతో పోలిస్తే రాబోయే దశాబ్ద కాలంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా (బ్రిక్) దేశాల్లోనే అధిక వృద్ధి ఉంటుందని అంచనా. ఇదీ అదీ అని లేదు... అన్ని విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, ఐటీ, మెకానికల్, సివిల్.. ఇలా అన్ని విభాగాల విద్యార్థులనూ చేర్చుకుంటున్నాయి. అన్ని రంగాల్లోనూ సాంకేతికత పెరగడమే ఇందుకు కారణం. ఉద్యోగాల ఎంపికలో ఏ కోర్సులో విద్యార్థులు చదివారన్న విషయానికి ప్రాధాన్యమే (సంబంధిత రంగాల మినహా) ఇవ్వం. (ఈయన మెకానికల్‌లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి ఎంబీఏ చేశారు)

» జనవరి-ఏప్రిల్ మధ్య ఎంపికలు ఉండే అవకాశం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంగణ (క్యాంపస్) నియామకాలు నెమ్మదించాయి. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే కంపెనీలు ఎంపిక చేసేస్తే ఆ తర్వాత విద్యార్థులు సక్రమంగా చదవడం లేదు. ఈసారి జనవరి-ఏప్రిల్ నెలల్లోనే కంపెనీలు క్యాంపస్ సెలక్షన్లకు వెళ్లే అవకాశం ఉంది. ఏ కళాశాలలో ఎక్కువమంది మెరిట్ విద్యార్థులు లభిస్తారనుకుంటే, అక్కడకే వెళ్లడం సహజం. ఫీజులను బట్టి ప్రాంగణ నియామకాలు ఉండవు. ప్రావీణ్యానికే ప్రాధాన్యత ఉంటుంది.

» ఒకటి వస్తే.. మరొక్కటి రాకపోవడం వెనుక..
సాధారణంగా కంపెనీలు ప్రాంగణ (క్యాంపస్) నియామకాలకు కొద్దిరోజులు మాత్రమే వెచ్చిస్తాయి. మంచి విద్యార్థులు ఎక్కువమంది ఎక్కడ అందుబాటులో ఉంటారో అంచనా వేసుకుని ఆ కళాశాలలకు వెళ్తుంటాయి. దీనివల్లనే ఒక కంపెనీ వస్తే మరొక కంపెనీ వెళ్లకపోవడం అనేది జరుగుతుంది. దూరప్రాంతాల్లో గ్రామీణ నేపథ్యం కలిగిన కళాశాలలకు వెళ్లడం కష్టమే. దీనికి ప్రధాన కారణం సమయాభావమే. అందుకే ఆఫ్ క్యాంపస్‌లకూ ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. అంతర్జాతీయ అవసరాలు అనుసరించి వివిధ రంగాల్లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగాలకు కొదవే ఉండదు.