ఇంట‌ర్వ్యూలు

ఇన్ఫోటెక్‌ సీఎండీ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి ఇంటర్వ్యూ

* ఆధునిక బోధన కావాలి
* సబ్జెక్టుపై అవగాహన కలిగించాలి
* అప్పుడే సత్వర ఉపాధి

రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఇంజినీరింగ్‌ కాలేజీలు పుట్టుకొస్తున్నాయి. కానీ అందులో బోధనా ప్రమాణాలు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఉండట్లేదు. ఇదే విషయాన్ని పరిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ''పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు ఉండటం లేదన్నది వాస్తవం. ప్రధానలోపం బోధనలోనే ఉంది. సరైన నైపుణ్యం లేని అధ్యాపకులు సబ్జెక్టుపై విద్యార్థులకు అవగాహన కల్పించలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలలకు సరైన అధ్యాపక బృందం లభించడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే నిపుణులైన అధ్యాపకుల సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలి. ఇందుకు డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఉపయోగ పడుతుంది. అమెరికాలో ప్రారంభించిన విధానాన్ని మనం అనుసరిస్తే విద్యార్థుల నాణ్యత మెరుగుపడుతుందనడంలో సందేహమే లేదు'' అని ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి అంటున్నారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కళాశాలల తీరు, విద్యార్థుల భవితను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన పద్ధతులను మోహన్‌రెడ్డి 'న్యూస్‌టుడే' ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలు....

» ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణుల నుంచి ఏం ఆశిస్తున్నారు ?
విద్యార్థులను ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరంలోనే కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసుకుంటున్నాం. విద్యార్థికి సబ్జెక్టు, సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న అవగాహన, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, బృందంలో సభ్యుడిగా ఇమిడిపోవడం వంటివి పరిశీలిస్తాం. ఉత్తీర్ణులయ్యాక, 3-4 నెలల శిక్షణ అనంతరం ప్రాజెక్టుల్లో చోటు కల్పిస్తాం. ఉద్యోగానికి తగిన విధంగా అప్పటికైనా సన్నద్ధమవుతారని కంపెనీలు ఆశిస్తున్నాయి. అలా జరగనప్పుడు కంపెనీలకు నిరాశ తప్పడం లేదు.

» ఎక్కడ తేడా వస్తోంది?
విద్యార్థికి తాను ఎంచుకున్న రంగంలో(మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌..) సబ్జెక్టుపై అవగాహన ఉండాలి. కొత్తవి నేర్చుకోవాలనే తపన అవసరం. నాలుగేళ్లు చదివిన సబ్జెక్టుపై అవగాహన(మార్కులు కాదు) ఉంటే, మిగిలిన అంశాలపై రెండు, మూడు నెలల శిక్షణ సరిపోతుంది. ఉత్తీర్ణత సాధించాం.. చాలు అనే ధోరణి ఏర్పడితే విద్యార్థికి మంచి భవిష్యత్తు కలే. 15,000 మంది విద్యార్థులకు ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తే, 150 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం అని చెప్పేందుకు నాకే బాధగా ఉంటోంది. ఈ పరిస్థితి సత్వరం మారాలి.

» విద్యార్థి నైపుణ్యం పెంచేందుకు ఏం చేయాలి?
ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు ఉండాలి. పాత సబ్జెక్టు అయినా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి. వారికి ఎంతవరకు అవగాహన కలిగిందో ఎప్పటికప్పుడు అసైన్‌మెంట్లు నిర్వహించడంతో పాటు, బృందంగా ఏర్పడి సబ్జెక్టుపై చర్చలు సాగించేలా చూడాలి. విద్యార్థుల నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో వారికి తెలియచెప్పడంతో పాటు వారి తల్లిదండ్రులకూ అవగాహన కల్పిస్తుండాలి.

» బోధన తీరు మెరుగుపరచడం ఎలా?
పాఠశాలలు, కళాశాలల్లో బోధనా తీరు ఎంతో మారుతోంది. సివిల్‌, మెకానికల్‌.. ఇలా ప్రతి విభాగంలో అత్యుత్తమ నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రతిభను మెరుగుపరచుకునే వీరు, సరికొత్త మెథడాలజీలో చెప్పే అంశాలను వీడియో తీసి, డిజిటలైజ్‌ చేసి, అందరికీ అందుబాటులోకి తేవాలి. ఇందుకు కళాశాలలు, పరిశ్రమ చొరవ తీసుకోవాలి. కళాశాలల్లో మల్టీమీడియా పద్ధతుల్లో బోధిండంతోపాటు ల్యాప్‌టాప్‌/ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేవాలి. విద్యార్థులకు ఏ అంశాలపైన అయినా సందేహం వస్తే వివరించేందుకు స్థానిక అధ్యాపకులు సరిపోతారు. అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా వర్సిటీలో మెకానికల్‌ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ లూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి, విజయవంతం చేశారు. ఇందుకోసం IPADIA అనే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధంచేశారు. డిజిటైజేషన్‌ పద్ధతిలో అధ్యాపకుల బోధనలను విద్యార్థులు ఐప్యాడ్‌లో తిలకిస్తారు. పాఠ్యాంశాల బోధనకుహద్దుల్లేవని నిరూపించారు. ఆయనను హైదరాబాద్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. సరైన అధ్యాపకులు లేరు(ఫ్యాకల్టీ షార్ట్‌ఫాల్‌) అనే సమస్య పరిష్కారానికి ప్రస్తుతానికి ఇదే చక్కని మార్గమని భావిస్తున్నా.

» ప్రాంగణ నియామకాల్లో మీరు పాటిస్తున్న ప్రమాణాలు ఏమిటి?
విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం, వారి సహజ సామర్థ్యం తెలుసుకునేందుకు రాత పరీక్ష పెడతాం. ఇందుకు ప్రశ్నపత్రం ఏటా, ప్రతి కళాశాలకు మారుస్తుంటాం. 50% మార్కులు వస్తేనే బృందచర్చ (గ్రూప్‌ డిస్కషన్‌)కు ఆహ్వానిస్తాం. విద్యార్థుల నాయకత్వ లక్షణాలు, బృందంలో కలివిడిగా ఉండటం, భావవ్యక్తీకరణ వంటివి తెలుస్తాయి. ఏటా 16 కళాశాలలకు వెళ్తున్నాం. ఒకటి, రెండు కళాశాలల్లో మార్పులుంటాయి. మిగిలినవారికీ అవకాశం కల్పించేందుకు నేరుగా భర్తీ చేస్తుంటాం. మాదగ్గర ఐటీ ఉద్యోగాలకు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులను తీసుకుంటాం. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ప్రధానం కాబట్టి మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌ ఇంజినీర్లకు అవకాశం ఇస్తున్నాం.