ఇంట‌ర్వ్యూలు

మాలక్ష్మి గ్రూప్‌ ఛైర్మన్‌ హరీష్‌ చంద్ర ప్రసాద్‌ తో ఇంటర్వ్యూ

* ప్రతిభ లేదు.. మాటతీరు రాదు
* రాష్ట్రంలోని పలువురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల పరిస్థితి ఇదీ
* పట్టాలివ్వటానికే కాలేజీలు పరిమితమయ్యాయి
* పరిశోధనలకు, శిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి
* పరిశ్రమల-విద్యాసంస్థల భాగస్వామ్యం పెరగాలి

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసుకొని ఉద్యోగాల మార్కెట్లోకి వస్తున్న వారిలో చాలామందికి అటు సాంకేతికాంశాలపైనగానీ, ఇటు భావవ్యక్తీకరణపైగానీ ఏమాత్రం పట్టు ఉండటం లేదని విద్యుత్‌రంగ నిపుణులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాలక్ష్మి గ్రూప్‌ ఛైర్మన్‌ వై.హరీష్‌ చంద్ర ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కాలేజీలు నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చి పంపుతున్నాయికానీ అన్ని రకాలుగా తీర్చిదిద్దాలనే విషయాన్ని విస్మరిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించటంపై రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీటీఈ ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హరీష్‌ చంద్ర ప్రసాద్‌ పలు పారిశ్రామిక మండళ్లలో క్రియాశీలక పాత్ర పోషించారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సిఐఐ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ విభాగాలకు ఛైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన పలు కమిటీల్లో సభ్యుడిగా వ్యవహరించారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌, ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై) తదితర సంస్థల్లో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించిన పలు అంశాలపై 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు...

» రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి ఉద్యోగాల కోసం వస్తున్న విద్యార్థుల సామర్థ్యం ఎలా ఉంటోంది? ఏమైనా లోపాలను మీరు గమనించారా?
ఎక్కువ మంది 'జాబ్‌ రెడీ' గా ఉండటం లేదు. భావ వ్యక్తీకరణ (కమ్యునికేషన్‌ స్కిల్స్‌) అధ్వాన్నంగా ఉంటోంది. సాంకేతికాంశాల మీద అసలు పట్టే ఉండటం లేదు. సబ్జెక్టుపై లోతైన అవగాహన కానీ, సమస్యను పరిష్కరించగల నైపుణ్యం ఉన్న వారుకానీ చాలా తక్కువగా ఉంటున్నారు. ఏదో కోచింగ్‌ తీసుకొని, బట్టీపట్టి చదివి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. ఇది విద్యార్థుల తప్పిదం అనుకోను. తల్లితండ్రులను, విద్యాసంస్థలను తప్పుపట్టాలి. ప్రాక్టికల్‌ శిక్షణ లేనందువల్ల వచ్చిన తిప్పలు ఇవి. నేను గుర్తించిన మరొక ముఖ్యమైన అంశం.. ఇంజనీరింగ్‌ పూర్తిచేసి వస్తున్న విద్యార్ధుల్లో శారీకర సత్తా తక్కువగా ఉంటోంది. ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు ఎంతో శ్రమతో కూడుకున్నవి. అన్ని ఉద్యోగాలు ఏసీ గదిలో కూర్చొని కంప్యూటర్‌ ముందు పనిచేసేవిగా ఉండవు. ప్రాజెక్టు నిర్వహణలో రాత్రింబవళ్లు శ్రమించాల్సి వస్తుంది. సైట్‌లో ఎన్నో గంటల పాటు నిలబడి పనిచేయాలి. దీనికి శారీరక దృఢత్వం ఎంతో అవసరం. ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొనే విద్యార్థులు కాలేజీ రోజుల్లోనే బాగా ఆటలు ఆడి, వ్యాయామాలు చేసి శారీరక ధృఢత్వాన్ని సాధించాలి.

» పరిశ్రమలు ఎలాంటి ఇంజనీర్లను కోరుకుంటున్నాయి?
మొదటి రోజే పూర్తిస్థాయిలో పనిచేయగలిగిన అభ్యర్థులను పరిశ్రమలు కోరుకుంటాయి. ఎంబీబీఎస్‌ పూర్తిచేసి వైద్యవృత్తిలోకి వచ్చిన వారిలా ఉండాలంటాను నేను. ఇంజనీరింగ్‌ విద్యకు కూడా ఎంబీబీఎస్‌ పద్ధతి అనుసరణీయం. వైద్యవిద్యను అభ్యసించే సమయంలోనే విద్యార్థులకు ఎంతో ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుంది. తర్వాత హౌస్‌ సర్జన్‌ చేస్తారు. పీజీలో స్పెషలైజేషన్‌ ఉంటుంది. జూనియర్‌ డాక్టర్లుగా పని చేస్తారు. చదువు ముగించుకొని వచ్చేసరికి పూర్తిస్థాయి వైద్యుడిగా తయారవుతారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు కూడా ఇదే విధంగా ఉండాలి. కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికే నూతన సాంకేతిక పరిజ్ఞానంలో నిష్ణాతులై ఉండాలి. పరిశోధన కార్యకలాపాల్లో భాగస్వాములు అయినప్పుడే ఇది సాధ్యపడుతుంది.

» సమర్థులైన ఇంజనీర్లు తయారుకావాలంటే మార్పులు ఎక్కడ జరగాలి?
ముందుగా మన ఆలోచనల్లో మార్పు రావాలి. పరిశోధనలకు, ప్రాక్టికల్‌ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అమెరికాలో ప్రతి విద్యార్థినీ పరిశోధన ప్రాజెక్టుల్లో భాగస్వామిని చేస్తారు. పరిశోధన పత్రాలు సమర్పించి కొన్ని పేటెంట్లు పొందే అవకాశం కూడా వారికి లభిస్తుంది. ఈ రోజు మన ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎక్కడైనా పరిశోధనలు జరుగుతున్నాయా? ఊరికే క్లాసురూముల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పి పంపుతున్నారు. గతంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఆరునెలల పాటు పారిశ్రామిక శిక్షణ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడీ సంప్రదాయం ఏవో కొన్ని కాలేజీల్లో మినహాయిస్తే పూర్తిగా కనుమరుగైంది. మరోవైపు.. నైపుణ్యం, అనుభవం ఉన్న బోధనా సిబ్బందిని తయారుచేసుకోవడంపై అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కాలేజీల యాజమాన్యాలు కానీ దృష్టి సారించటం లేదు. అలాగే పాఠ్య ప్రణాళికను ప్రస్తుత అవసరాలకు, నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా మార్చుకోవడం లేదు. వీటన్నింటిలో మార్పులు రావాలి.

» రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీలు భారీసంఖ్యలో ఉన్నాయి. ఏటా లక్షకు పైగా సీట్లు మిగిలిపోతున్నాయి. అయినప్పటికీ పెద్దసంఖ్యలో ఇంజనీర్లు కాలేజీల నుంచి బయటకొస్తున్నారు. వీరందరికీ తగ్గట్లుగా ఉద్యోగాలున్నాయా?
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు పరిమితంగానే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది ఇంజనీర్లను తయారుచేయాలనేది మనం నిర్ణయించుకోవాలి. ప్రమాణాలు మెరుగుపడకపోవటానికి కాలేజీల సంఖ్య అధికంగా ఉండటం కూడా ఒక కారణం.

» ఇంజనీరింగ్‌ విద్యను మెరుగుపరచటానికి రాష్ట్రప్రభుత్వం, విద్యాసంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
విద్యార్థులు 60% మార్కులతో ఉత్తీర్ణతపొంది, తమ కరిక్యులమ్‌లో ఛాంపియన్‌గాఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) బాధ్యత అధికమని నా అభిప్రాయం. నిబంధనల కోసం నిబంధనలని కాకుండా, ప్రయోజనాత్మకమైన నిబంధనలను అమలు చేయాలి. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సాయంత్రం వేళల్లో, వారాంతాల్లో ప్రాక్టికల్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌, కమ్యునికేషన్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాలకు సంబంధించి స్వల్పకాలిక కోర్సులు, ప్రత్యేక తరగతులు నిర్వహించటానికి ఏఐసీటీఈ అనుమతించాలి.

» పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య సహకారం ఉంటే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందన్న వాదన ఉంది. కానీ ఇది ఆచరణలో సాధ్యం కావడం లేదు. దీనికేమైనా పరిష్కారం ఉందా?
మా దృష్టిలో ఏ కోర్సైనా ఒకటే. ఆయా రంగాలకు మాత్రమే పరిమితమైన సంస్థలు సంబంధిత కోర్సులో చదివిన విద్యార్థులను తీసుకుంటాయి. మా వరకు ఎటువంటి పరిమితిలేదు. డిగ్రీ పూర్తిచేయగానే పిల్లలకు ఉద్యోగం రావాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పేమీలేదు. కానీ దానికి తగినట్లు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారా? లేదా? అన్నది చూడాలి.