ఇంట‌ర్వ్యూలు

సాంఖ్యక శాస్త్రవేత్త సీఆర్‌రావుతో ఇంటర్వ్యూ

* సాంఖ్యక శాస్త్రంతో అపార అవకాశాలు
* పరిశోధనల్లో పురోగమించాలి
* హైదరాబాద్‌ను ఈ శాస్త్ర రాజధానిగా మార్చాలన్నదే లక్ష్యం
* ఏఐఎంఎస్‌సీఎస్‌ను హెచ్‌సీయూలో ఏర్పాటు చేశాం

హైదరాబాద్: రాష్ట్రంలో అత్యధిక విద్యార్థుల దృష్టి అంతా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం వైపే. వారి జీవితాశయం ఆ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించటమే. అందువల్లే రాష్ట్రంలో పరిశోధనలు చేసే వారి సంఖ్య చాలా తక్కువుగా ఉందని అంటున్నారు ప్రముఖ సాంఖ్యక శాస్త్రవేత్త సీఆర్‌రావు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సాంఖ్యక శాస్త్రం అవసరం పెరుగుతోందని, ఈ విభాగంలో పరిశోధనలు చేసే వారి కోసం అవకాశాలు ఎదురుచూస్తున్నాయని వెల్లడించారు. దేశంలో సాంఖ్యక శాస్త్రానికి మారుపేరుగా నిలిచిన సీఆర్‌రావు 19 దేశాల్లోని 37 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 93 ఏళ్ల వయస్సులోనూ ఈశాస్త్ర అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీఆర్‌రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌(ఏఐఎమ్‌ఎస్‌సీఎస్‌)ను నెలకొల్పారు. మ్యూజియం నిర్మాణం, సాంఖ్యక శాస్త్రంలో ఉద్యోగావకాశాలు, సీఆర్‌రావు సంస్థలో జరుగుతున్న పరిశోధనలు తదితర అంశాలపై ఆయన 'ఈనాడు'తో మాట్లాడారు. హైదరాబాద్‌ను సైన్స్‌ రాజధానిగా మార్చాలన్నది తన లక్ష్యమని వెల్లడించారు.

» ఐక్యరాజ్యసమితి 2013ను ప్రపంచ సాంఖ్యకశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీ సంస్థ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతోంది?
సాంఖ్యకశాస్త్రం వైపు విద్యార్థులను ఆకర్షించడానికి నాలుగేళ్లుగా మన రాష్ట్రంలో స్టాటిస్టిక్స్‌ ఒలింపియాడ్‌ను నిర్వహిస్తున్నాం. పది, 12వ తరగతి పూర్తయిన వారికి ఏప్రిల్‌-మే మధ్య విడివిడిగా పరీక్ష నిర్వహిస్తున్నాం. జూన్‌ 29న ప్రపంచ సాంఖ్యకశాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి నగదు బహుమతులతోపాటు ధ్రువపత్రాలు ఇస్తున్నాం. డిసెంబరు 28-31 తేదీల మధ్య నాలుగు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నాం. ఒలింపియాడ్‌ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని ఆలోచిస్తున్నాం.

» రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా ఐటీ వైపు వెళ్తున్నారు. సాంఖ్యకశాస్త్రం వైపు వస్తే ఉద్యోగాలు, అధిక వేతనాలు వస్తాయా?
ఎక్కువ మంది ఐటీ, సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్తున్న మాట వాస్తవమే. ప్రస్తుతం పీజీ(గణితం, సాంఖ్యకశాస్త్రం) పూర్తికాగానే ఉద్యోగాలు వస్తున్నాయి. దాంతో పీహెచ్‌డీ గురించి వారు ఆలోచించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువగా గణితం, సాంఖ్యక శాస్త్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ పరిశోధనా సంస్థలో చూసినా అత్యధికులు వారే. మా సంస్థలోనూ పీహెచ్‌డీ క్రిప్టోగ్రఫీలో ఆ రాష్ట్రం వారే అధికం. బడ్జెట్‌, జీవశాస్త్రం, వైద్యరంగం, క్రెడిట్‌కార్డులు, బ్యాంకింగ్‌ తదితర ఎన్నో రంగాల్లో సాంఖ్యకశాస్త్రం ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో అత్యధిక వేతనాలు పొందుతుంది వారే. క్రమేణా మన దేశంలోనూ ఈ పరిస్థితి మారుతోంది.

» సాంఖ్యకశాస్త్ర్తం మ్యూజియం ఆలస్యానికి కారణం?
ఇప్పటికే సాంకేతిక రాజధానిగా మారిన హైదరాబాద్‌ను సాంఖ్యక శాస్త్రరాజధానిగా మార్చాలన్నది నా ఆలోచన. ప్రస్తుతం కోల్‌కతాలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ముంబయిలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌, చైన్నె మ్యాథమేటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఐ), బెంగళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఉన్నాయి. మన రాష్ట్రంలో అలాంటి సంస్థ లేదు. అందుకే హైదరాబాద్‌లో గణితం, సాంఖ్యకశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌లకు కలిపి పరిశోధనా సంస్థ (ఏఐఎంఎస్‌సీఎస్‌)ను హెచ్‌సీయూలో ఏర్పాటు చేశాం. మరోవైపు సాంఖ్యకశాస్త్రం పట్ల అవగాహన కల్పించి, ఎక్కువ మందిని ఆకర్షించేందుకు మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటివరకు సాంఖ్యకశాస్త్రంలో జరిగిన పరిశోధనలు, మన శాస్త్రవేత్తల కృషి అందులో ప్రదర్శించి అవగాహన కల్పించాలనేది లక్ష్యం. దీనిని సాధారణ ప్రజలు కూడా సందర్శించవచ్చు. అయితే నిధులే సమస్యగా మారాయి. ఏఐఎంఎస్‌సీఎస్‌కు కూడా నిధులిస్తే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది.

» నిధుల కోసం ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేశారా?
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని డీఎస్‌టీని సంప్రదిస్తున్నాం. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాం. నిధులు మంజూరవుతాయన్న ఆశాభావంతో ఉన్నా. నిధులొస్తే రెండేళ్లలో మ్యూజియం పూర్తిచేస్తాం. ప్రజలు కూడా విరాళాలు ఇవ్వొచ్చు. ఈవిరాళాలకు ఆదాయం పన్ను రాయితీ వర్తిస్తుంది.

» క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ మోసాలు నియంత్రించడంలో సాంఖ్యకశాస్త్రం ఎంతవరకు ఉపయోగపడుతుంది?
క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కొట్టేయకుండా అవసరమైన పకడ్బందీ చర్యలు సాంఖ్యకశాస్త్రం ద్వారానే సాధ్యం. ప్రత్యేకంగా క్రిప్టోగ్రఫీలో ఇక్కడ పరిశోధన సాగుతోంది. అంటే ఇదంతా కోడింగ్‌, డీకోడింగ్‌కు సంబంధించింది. దీని కోసం ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని నేషనల్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ రూ.12.50 కోట్లు, డీఆర్‌డీఓ రూ.3 కోట్లు, డీఎస్‌టీ రూ.6.50 కోట్ల విలువైన ప్రాజెక్టులను అప్పగించాయి. సాంఖ్యక శాస్త్రంలో ప్రస్తుతం నిపుణుల కొరత ఉంది. భవిష్యత్తులో లక్షల మంది అవసరం. ఆ కొరతను తీర్చేందుకే మా సంస్థ కృషి చేస్తోంది.

» పరిశోధనల్లో దేశం పరిస్థితి ఎలా ఉంది?
పరిశోధనల్లో భారత్‌ చాలా వెనుకబడి ఉంది. పరిశోధకుల సంఖ్య ప్రతి 10 లక్షల మందిలో జపాన్‌లో 5,573 మంది, అమెరికా-4,663, ఇంగ్లాండ్‌-4,181, జర్మనీ-3,532, ఫ్రాన్స్‌-3,496, రష్యా-3,305, చైనాలో 1071 మంది ఉంటే భారత్‌లో వీరి సంఖ్య 137 మంది మాత్రమే. దక్షిణాప్రికా, అర్జంటైనా, మెక్సికో దేశాలతో పోల్చుకున్నా ఈ సంఖ్య చాలా తక్కువ. దేశంలో 17-20 వయస్సులోపు యువత 9 కోట్ల మంది ఉన్నారు. వారందరూ ఉన్నత విద్యకు చేరుకునేలా ప్రోత్సహించాలి. వారిని పరిశోధనా దిశగా నడిపిస్తే భారత్‌ సైతం శాస్త్ర విజ్ఞానంలో దూసుకుపోతుంది.