ఇంట‌ర్వ్యూలు

టాలెంట్‌ స్ప్రింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జె.ఎ.చౌదరి తో ఇంటర్వ్యూ

* నైపుణ్యం లేకుంటే అవకాశాలు విదేశాలకు తరలిపోతాయి..
* సంస్థల దృక్ఫథం మారిపోతోంది..
* రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం

అంతర్జాతీయస్థాయిలో ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఇండియా (హైదరాబాద్‌) మాజీ సంచాలకులు, ఐటీ నిపుణులు, టాలెంట్‌ స్ప్రింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జె.ఎ.చౌదరి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఇంజినీరింగ్‌ స్కిల్స్‌ (సబ్జెక్టులపై విషయ పరిజ్ఞానం లేకపోవడం వంటి) లేకపోవడం, ఆర్థిక సమస్యలతో ఐటీ రంగ సంస్థలు విదేశాల్లో తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నాయని పేర్కొన్నారు. అభిరుచులకు అనుగుణంగానే విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను ఎంచుకుని తగిన ప్రావీణ్యం, విషయ పరిజ్ఞానంతో బయటకొస్తే వారికి ఎప్పుడూ ఉద్యోగావకాశాలు దగ్గరగానే ఉంటాయని పేర్కొన్నారు. ఇందుకు భిన్నంగా జరిగితే ఉద్యోగావకాశాలు సన్నగిల్లడంతోపాటు రాష్ట్ర ఐటీ రంగ భవిష్యత్తు ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంజినీరింగ్‌ విద్యా ప్రమాణాల పెంపు, ఇంజినీరింగ్‌ విద్యకు తగినట్లు విద్యార్థులు తయారుకాకుంటే భవిష్యత్తులో రాష్ట్రంలో నియామకాలు చేపట్టాలంటేనే ఐటీ రంగ సంస్థలు పునరాలోచన చేయడం ఖాయమని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ విద్యపై ఆయన 'ఈనాడు-ఈటీవీ' ప్రతినిధితో మాట్లాడారు. ప్రధాన అంశాలివి.

» నైపుణ్యం లేకుంటే మన విద్యార్థులకు జరిగే నష్టం ఏమిటి?
నైపుణ్యం కలిగిన విద్యార్థులు రాష్ట్రంలో దొరకని పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రష్యా, చెకొస్లోవికియా, ఫిలిఫిన్స్‌ వంటి దేశాలకు చెందిన విద్యార్థులు మన అవకాశాలను దక్కించుకుంటారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రం అందించే ఐటీ సేవలకన్నా మెరుగైన సేవలను తక్కువ ధరకు అందించేందుకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకు 'హెడ్‌ కౌంట్‌ బేస్డ్‌ బిల్లింగ్‌' ఐటీ రంగ సంస్థల కార్యకలాపాలు జరిగేవి. ప్రస్తుతం 'అవుట్‌కమ్‌ బేస్డ్‌ బిల్లింగ్‌' విధానంలో సంస్థల కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆర్థిక సమస్యలను భరించేందుకు సంస్థలు సిద్ధంగా లేవు. దీనివల్ల మానవ వనరులను తగ్గించి.. ఉన్న వారితోనే ఎక్కువ ఎలా పనిచేయించాలన్న దానిపై దృష్టిపెట్టాయి. ఈ విషయంలో గట్టి చర్యలను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి కూడా. ఇటీవల కాలంలో ఓ ట్రెండ్‌ మొదలైంది. క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందినవారు కొద్దికాలానికే వెనక్కు వస్తున్నారు. ఇంజినీరింగ్‌ స్కిల్స్‌ లేనందున వీరిని ఎంతోకాలం భరించేందుకు సంస్థలు సిద్ధంగా లేవు. వెనక్కు పంపించి వేస్తున్నాయి. కొందరికి ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉన్నా ఉద్యోగాల్లో చేరిన అనంతరం టెక్నికల్‌ స్కిల్స్‌ లేక వెనుకబడుతున్నారు. భావవ్యక్తీకరణ, భాషా నైపుణ్యంపైనే ఆధారపడితే సరిపోదు. ఇంజినీరింగ్‌ స్కిల్స్‌పై పూర్తి పట్టును సాధించాలి. ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించిన వారిని గమనిస్తే.. వారు చదివిన కోర్సులపై కనీస అవగాహన ఉండడంలేదు. ఇది అత్యంత దురదృష్టకరం.

» ఇంటర్‌ పూర్తిచేసిన వారికీ అవకాశాలు ఎలా ఉంటాయి?
చెన్నైలోని ఓ ప్రముఖ సంస్థ ఇంజినీర్లను కాకుండా ఇంటర్‌ విద్యను ముగించిన విద్యార్థులకే ప్రాధాన్యతనిస్తూ.. ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తూ అవసరాలకు అనుగుణంగా వారిని తయారుచేసుకుంటోంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్య బాగుపడకపోతే చెన్నై సంస్థ బాటలోనే మరికొన్ని సంస్థలు నడిచే అవకాశాలు ఉన్నాయి.. ఇప్పటికే ఆ దిశగా సంస్థల మధ్య సమాలోచనలు జరుగుతున్నాయి.

» ఐటీ సేవల రంగం పురోగతి ఎలా ఉంది?
ఇంజినీరింగ్‌లో ఏ కోర్సు చేసినా విద్యార్థులకు తగిన ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో మెండుగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌లో ఏ కోర్సులో చేరినా వారికి ఐటీ రంగ సంస్థల్లో అవకాశాలు పుష్కలంగానే ఉంటున్నాయి. రాబోయే 20 సంవత్సరాల్లో ఈ రంగం మరింత పురోగతిలో పయనిస్తోంది. ఒకప్పుడు దూరంగా ఉన్న గ్రాఫిక్స్‌, యానిమేషన్‌ వంటి రంగాలు బాగా దగ్గరయ్యాయి. దీనికి ఉదాహరణే 'ఈగ' చిత్రం. ఇది ఐటీ సేవల ద్వారానే సాధ్యమైంది. మానవుని నిత్య జీవితంలో ఐటీ రంగ సేవలు తప్పనిసరి. దీనివల్ల నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలపరంగా ఎప్పటికీ ఢోకా ఉండదు.

» వైద్య విద్యలా.. ఇంజినీరింగ్‌ విద్య సాగాలంటే ఎమి చేయాలి?
వైద్య విద్యలో చదువు, ప్రాక్టికల్స్‌ సమాంతరంగా జరుగుతున్నాయి. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా వైద్య విద్య గాడితప్పుతుంది. ఇంజినీరింగ్‌ విద్య ఇందుకు భిన్నంగా సాగుతోంది. కళాశాలలకు... పరిశ్రమలకు సంబంధం లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు-కళాశాలల మధ్య సత్ససంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో.. కళాశాలలను పరిశ్రమలు సంప్రదించాలంటే వాటిలో... అర్హులైన బోధకుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలి. పరిశోధనలపై అధ్యాపకులను ప్రోత్సహించాలి. ఇటువంటి చర్యలు తీసుకుంటే పరిశ్రమలు కళాశాలల సహకారాన్ని తప్పకుండా తీసుకుంటాయి. ఆ దిశగా అన్నివైపులా నుంచి చొరవ పెరగాలి. అలాగే ఇంజినీరింగ్‌ విద్యను ముగించిన వారికి ఉద్యోగాలను దక్కించుకునేలా తగిన నైపుణ్యాన్ని అందించే సంస్థలు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. కళాశాలల యాజమాన్యాలు సైతం కోర్సుల నిర్వహణలో భాగంగానే ఉద్యోగాలకు విద్యార్థులను తీర్చిదిద్దేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజినీరింగ్‌ విద్య ఫీజులనేవి కళాశాలల ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల నిర్వహణకు అవసరమైన ఖర్చులకు సరిపడా ఉండాలి. ఈ విషయంలో కళాశాలల యాజమాన్యాలకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలన్నది నా అభిప్రాయం.