నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్ఈ)

లక్ష్యం:

ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకురావడం. గత ఏడాది (2011) వరకు ఈ పరీక్షను ఎనిమిది, పది తరగతుల విద్యార్థులకు నిర్వహించే వారు. ఈ ఏడాది (2012) నుంచి కేవలం పదో తరగతి వారికి మాత్రమే నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి ఎన్‌సీఈఆర్‌టీ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తుంది.

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 1000

(వీటిలో 15 శాతం స్కాలర్‌షిప్‌లను ఎస్సీ వారికి, 7.5 శాతం ఎస్టీలకు, మరో 3 శాతాన్ని శారీరక వికలాంగులకు కేటాయించారు). వీరికి నెలకు రూ.500 ఇస్తారు.

ఎప్పటిదాకా ఇస్తారు?

విద్యార్థి వరుసగా విద్యార్జన కొనసాగిస్తుంటే డాక్టొరల్ స్థాయికి వచ్చే వరకు ఈ మొత్తాన్ని ఇస్తారు. అభ్యర్థి దరఖాస్తులో సూచించిన చిరునామాకు స్కాలర్‌షిప్‌ను పంపుతారు.

పరీక్ష నిర్వహించే భాషలు:

తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, అస్సామీ, బెంగాల్, గుజరాత్, కన్నడ, మరాఠీ, మలయాళం, ఓరియా, పంజాబీ, తమిళం.

పరీక్ష సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుంది?

సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మొదట స్టేజ్ -1, తర్వాత స్టేజ్-2 ఉంటాయి.

ప్రకటనలు ఎప్పుడు వస్తాయి? పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

పరీక్షకు సంబంధించిన ప్రకటనలు సాధారణంగా జులై/ ఆగస్టు నెలల్లో వస్తాయి. స్టేజ్ -1 పరీక్ష నవంబరులో, స్టేజ్-2 పరీక్ష తదుపరి సంవత్సరం మేలో జరుగుతుంది.

పరీక్ష కేంద్రాలు:

స్టేజ్-1 పరీక్షను రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.స్టేజ్-2 పరీక్ష కేంద్రాలను ఎన్‌సీఈఆర్‌టీ నిర్దేశిస్తుంది.

ఎవరు అర్హులు?

రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లతోపాటు, కేంద్రీయ విద్యాలయాలు, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ (న్యూఢిల్లీ) అనుబంధ విద్యా సంస్థల్లో రెగ్యులర్‌గా పదో తరగతి చదువుతున్న వారు మాత్రమే దీనికి అర్హులు.