Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 205 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు పీవో స్థాయిలో ఉండి, మంచి జీతభత్యాలు అందించే ఈ పోస్టులు... బ్యాంకు పరీక్షార్థులకు ఓ మంచి అవకాశం!
అడ్మినిస్ట్రేటివ్‌ అధికారుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. 1. ప్రిలిమినరీ పరీక్ష 2. మెయిన్స్‌ 3. ఇంటర్వ్యూ. ప్రిలిమినరీలో కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు మెయిన్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. పోస్టుల సంఖ్యకు దాదాపు 15 రెట్లు ఎక్కువ సంఖ్యలో.. సుమారు మూడు వేలమంది అభ్యర్థులు మెయిన్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు.
మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారు మూడో దశలోని మౌఖిక పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్స్‌, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

పరీక్షా విధానం
ప్రిలిమినరీ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. అవి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (35 ప్రశ్నలు, 35 మార్కులు), రీజనింగ్‌ (35 ప్రశ్నలు, 35 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (30 ప్రశ్నలు, 30 మార్కులు). వీటిని సాధించడానికి ఒక గంట సమయం ఉంటుంది. అభ్యర్థులు ప్రతి విభాగంలోనూ కనీస మార్కులతో విడివిడిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
మెయిన్స్‌ పరీక్షలో ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షలుంటాయి. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ఒక్కోదానిలో 40 ప్రశ్నల చొప్పున అంతే సంఖ్యలో మార్కులతో మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులతో అయిదు విభాగాలుంటాయి. అవి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌. అభ్యర్థులు అన్ని విభాగాల్లో కనీస మార్కులతో విడివిడిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
ఆబ్జెక్టివ్‌ పరీక్ష తర్వాత 30 నిమిషాల వ్యవధిలో డిస్క్రిప్టివ్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్‌ భాషా పరీక్ష. దీనిలో ఎస్సే, ప్రెస్సీ, కాంప్రహెన్షన్‌లపై మూడు ప్రశ్నలు 30 మార్కులతో ఉంటాయి. దీన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలోనే రాయాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం అర్హత పరీక్ష. కానీ, అభ్యర్థులు దీనిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలోనూ రుణాత్మక మార్కులు (నెగెటివ్‌ మార్కులు) ఉంటాయి. గుర్తించే ప్రతి తప్పు సమాధానానికీ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగోవంతు కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గుర్తించడం మంచిది.

సన్నద్ధత
మెయిన్స్‌ పరీక్షలో ఉన్న అయిదు విభాగాల్లో మూడు ప్రిలిమినరీ పరీక్షలో ఉన్నాయి. కాబట్టి మెయిన్స్‌ పరీక్షకు సన్నద్ధమైతే సహజంగానే ప్రిలిమినరీ సన్నద్ధత పూర్తవుతుంది. ఈ తయారీ మెయిన్స్‌ పరీక్ష దృష్ట్యా సాగితే ఫలితముంటుంది. ప్రిలిమినరీ సమయం నాటికి మెయిన్స్‌ పరీక్ష తయారీ పూర్తయ్యేలా (కనీసం ప్రిలిమినరీలో ఉన్న మూడు విభాగాలకు) చూసుకోవాలి.
ప్రిలిమినరీకి దాదాపు రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు నెలల సమయం ఉంది. మొదటిసారి పరీక్ష రాస్తున్నవారు నెలరోజుల్లో అన్ని విభాగాల్లోని అంశాలను బాగా నేర్చుకుని సాధన చేయాలి. ముఖ్యంగా ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ల్లో వివిధ రకాల ప్రశ్నలను సాధన చేయాలి. ఆ తరువాత పరీక్షకు మిగిలివున్న సమయాన్ని వివిధ రకాల ప్రశ్నలు, మాదిరి ప్రశ్నపత్రాలను సాధించేలా చూసుకోవాలి. మాదిరి ప్రశ్నపత్రాలను సమయాన్ని నిర్దేశించుకుని సాధించాలి. వీటిని బాగా సాధించగలుగుతుంటే, అప్పుడు వీలైనన్ని ఆన్‌లైన్‌ పరీక్షలు సాధన చేయాలి. పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి, దానికి అలవాటుపడటం చాలా ముఖ్యం.
ప్రిలిమినరీలోని మూడు సబ్జెక్టులు కూడా ఎక్కువ సమయం తీసుకునేవే. కేవలం 60 నిమిషాల్లో 100 ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది. అందువల్ల వేగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రుణాత్మక మార్కులు కూడా ఉంటాయి. కాబట్టి కచ్చితత్వం అవసరం. అందువల్ల బాగా సాధన చేయాలి.
సంస్థలోని అంతర్గత పాలనకు సంబంధించిన ఈ ఉద్యోగాల పట్ల అభ్యర్థుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. మెట్రోపాలిటన్‌ నగరాల్లో 50 వేల రూపాయలకుపైగా నెలసరి ఆదాయం, పదోన్నతులకు మంచి అవకాశముండే ఈ ఉద్యోగం పొందాలంటే పరీక్షకు ఉండే రెండు నెలల సమయాన్ని ప్రణాళికబద్ధంగా విభజించుకుని సన్నద్ధమవ్వాలి.

సబ్జెక్టులు- అవగాహన
ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం అయిదు విభాగాలున్నాయి. వీటిలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న అంశాలను పరిశీలిస్తే...
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌ (విలువల సుమారు), నంబర్‌ సిరీస్‌, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, అంకగణితం (అరిథ్‌మెటిక్‌) నుంచి ప్రశ్నలు ఉంటాయి. అరిథ్‌మెటిక్‌తోపాటు పర్మ్యుటేషన్‌ అండ్‌ కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీ నుంచి కూడా ప్రశ్నలుంటాయి.
రీజనింగ్‌: వీటిలో సాధారణ రీజనింగ్‌ అంశాలైన కోడింగ్‌-డీకోడింగ్‌, డైరెక్షన్స్‌, సీక్వెన్సెస్‌-సిరీస్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, సిలాజిజం, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ మొదలైన వాటితోపాటు అనలిటికల్‌/ క్రిటికల్‌ రీజనింగ్‌ అంశాలైన స్టేట్‌మెంట్స్‌- అసంప్షన్స్‌/ కన్‌క్లూజన్స్‌/ కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్స్‌/ ఇన్‌ఫరెన్సెస్‌, పజిల్‌ టెస్ట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: దీనిలో స్పాటింగ్‌ ఎర్రర్స్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, క్లోజ్‌ టెస్ట్‌, సెంటెన్స్‌ కరెక్షన్స్‌, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. ప్రాథమిక వ్యాకరణాంశాల్లో పట్టుంటే సగానికిపైగా ప్రశ్నలను తేలికగా గుర్తించవచ్చు.
జనరల్‌ అవేర్‌నెస్‌: సాధారణంగా గత 4, 5 మాసాలనాటి వర్తమానాంశాల నుంచి సాధారణంగా ప్రశ్నలుంటాయి. ఆర్థిక, బీమా రంగాల విషయాలపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. వీటితోపాటు ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు-రచయితలు, క్రీడలు మొదలైనవీ ముఖ్యమే. బడ్జెట్‌, ఆర్థిక సర్వే, కేంద్రప్రభుత్వ పథకాలు, జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మొదలైనవాటిని బాగా చూసుకోవాలి.
కంప్యూటర్‌ నాలెడ్జ్‌: వీటిలో జనరేషన్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌, ప్రాథమికాంశాలు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ (వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌), వాటి షార్ట్‌కట్‌ కీలు, ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌, డేటా బేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, నెట్‌వర్కింగ్‌, వైరస్‌, యాంటీవైరస్‌, కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన వర్తమానాంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగే విభాగమిది.

దరఖాస్తు ఎప్పుడు?
* పోస్టు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌
* పోస్టుల సంఖ్య: 205
* విద్యార్హత (20.04.2017 నాటికి): గ్రాడ్యుయేషన్‌ (60%) (ఎస్‌సీ/ ఎస్‌టీ- 50%)
* వయసు (01.03.2017 నాటికి): 21- 30 సంవత్సరాలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేదీ: 20.04.2017
* ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ (ప్రిలిమినరీ): 3/ 4 జూన్‌ 2017
* మెయిన్స్‌: 2 జులై 2017
* దరఖాస్తు ఫీజు: ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ- రూ.100
* ఇతరులు: రూ.600
* ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు

- ‘రేస్‌’ సంస్థ నిపుణులు

Published on 03-04-2017