Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌
ఎంపికైతే సీటీసీ ఏడాదికి రూ.5.3 లక్షలు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మూడు నెల‌ల క్రిత‌మే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ప్రక‌ట‌న‌లు విడుద‌ల‌చేశాయి. ఎన్ఐఏసీఎల్ ప‌రీక్షలు కూడా పూర్తయ్యాయి. తాజాగా నేష‌న‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్‌) 362 ఏవో పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. బ్యాంకు పోస్టుల‌కు సిద్ధమ‌వుతున్నవారు ఎన్ఐసీఎల్ ఏవో పోస్టుల‌కు స‌న్నద్ధం కావ‌డం సులువే. ఈ ప‌రీక్షల‌న్నింటిలోనూ రీజ‌నింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ ఉమ్మడి అంశాల‌గా ఉండ‌డం అభ్యర్థుల‌కు క‌లిసొచ్చే అంశం. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ ప‌రీక్ష ద్వారా ఉన్నత అవ‌కాశాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.
ఎంపిక విధానం...
ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా

ఆన్‌లైన్ ప‌రీక్షలో:
జ‌న‌ర‌లిస్ట్ పోస్టుల‌కు: 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఇందులో రీజ‌నింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ఈ ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. వీటికి వ్యవ‌ధి 120 నిమిషాలు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. వీటితోపాటు ఇంగ్లిష్‌లో ఎస్సే, ప్రెసీ, కాంప్రహెన్షన్ అంశాల్లో 3 ప్రశ్నలుంటాయి. వీటికి కూడా 40 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 45 నిమిషాల్లో పూర్తిచేయాలి.

స్పెష‌లిస్ట్ పోస్టుల‌కు: 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఇందులో రీజ‌నింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలుంటాయి. అలాగే అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించిన అంశంలో 40 ప్రశ్నలొస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.ఈ ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు. వీటికి వ్యవ‌ధి 120 నిమిషాలు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. వీటితోపాటు ఇంగ్లిష్‌లో ఎస్సే, ప్రెసీ, కాంప్రహెన్షన్ అంశాల్లో 3 ప్రశ్నలుంటాయి. వీటికి కూడా 40 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 45 నిమిషాల్లో పూర్తిచేయాలి.

ఎంపికైతే:
నెల‌కు రూ.36,000 వేత‌నంగా ల‌భిస్తుంది. కాస్ట్ టు కంపెనీ (సీటీసీ) రూపంలో చూసుకుంటే ఏడాదికి రూ.5.3 ల‌క్షలను ఎన్ఐసీఎల్ ఎంపికైన ప్రతి ఒక్కరికీ వెచ్చిస్తుంది. ప్రస్తుతం బేసిక్ పే రూ.17240గా ఉంది. కొద్ది నెల‌ల్లో కొత్త వేత‌న స్కేలు అమలులోకొస్తుంది. స‌వ‌రించిన వేత‌న స్కేలుతో నెల‌కు సుమారు రూ.50,000 ఆశించ‌వ‌చ్చు.ఏడాది పాటు ప్రొబేష‌న్ ఉంటుంది. ఈ వ్యవ‌ధిలో ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించే లైసెన్షియేట్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించాలి. మ‌రో ఆరు నెల‌ల పాటు అద‌న‌పు గ‌డువు ఉంటుంది. ఈ వ్యవ‌ధిలోనూ పూర్తిచేయ‌లేకపోతే స‌ర్వీస్ నుంచి తొల‌గిస్తారు. ప్రొబేష‌న్‌తో క‌లుపుకొని మొత్తం నాలుగేళ్లు ప‌నిచేస్తామ‌ని అభ్యర్థి ఉద్యోగంలో చేరిన‌ప్పుడు ఒప్పంద ప‌త్రాన్ని స‌మ‌ర్పించాలి.

విభాగాల‌వారీ ఖాళీలిలా:
జ‌న‌ర‌లిస్ట్: 192 ఏవో పోస్టులు
విద్యార్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌
ఫైనాన్స్‌: 60
విద్యార్హత‌: బీకాం, ఎంకాం, ఎంబీఏ (ఫైనాన్స్‌) సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ. వీటిలో ఏదైనా కోర్సు పూర్తిచేసిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 30
విద్యార్హత‌: బీఈ/ బీటెక్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్
లీగ‌ల్‌: 60
విద్యార్హత‌: న్యాయ‌విద్యలో డిగ్రీ ఉత్తీర్ణత‌
ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ: 20
విద్యార్హత‌: బీఈ/ బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ

వ‌యోప‌రిమితి: న‌వంబ‌ర్ 30, 2014 నాటికి క‌నీసం 21 ఏళ్లు, గ‌రిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. (డిసెబ‌ర్ 1, 1984 కంటే ముందు న‌వంబ‌ర్ 30, 1993 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు) గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు ప‌దేళ్లు, భ‌ర్త చ‌నిపోయిన‌, విడాకులు పొంది ఒంట‌రిగా ఉంటున్న మ‌హిళ‌ల‌కు తొమ్మిదేళ్లు; ఎక్స్ స‌ర్వీస్మెన్ అభ్యర్థుల‌కు నిబంధ‌న‌ల మేర‌కు వ‌యో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు రూ.50, మిగిలిన వాళ్లకు రూ.600
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 24, 2015
ప‌రీక్ష తేదీ: ఏప్రిల్ నెల‌లో వివిధ తేదీల్లో నిర్వహిస్తారు.
హాల్ టికెట్లు: ప‌రీక్షలకు ప‌ది రోజుల ముందు నుంచి నేష‌న‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, ఒంగోలు. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, రంగారెడ్డి, వ‌రంగ‌ల్‌.

స‌న్నద్ధత ఇలా..

రీజనింగ్‌:
ప్రతి ప్రశ్ననూ నిశితంగా ప‌రిశీలించాలి. అలాగే త‌క్కువ‌ వ్యవ‌ధిలోనే దాన్ని విశ్లేషించాలి. ఇలా చేయ‌డం ద్వారా స‌మాధానం గుర్తించ‌డం తేలిక‌వుతుంది. ఇటీవ‌లి కాలంలో నిర్వహించిన వివిధ బ్యాంకు ప‌రీక్షల ప్రశ్నప‌త్రాలు బాగా అధ్యయ‌నం చేయాలి. రీజ‌నింగ్‌లోని అంశాల‌వారీ ప్రిప‌రేష‌న్ ప్రారంభించాలి. ఆ అంశంపై అధ్యయ‌నం పూర్తయిన వెంట‌నే దానినుంచి వివిధ ర‌కాల ప్రశ్నల‌ను సాధించాలి.

ఇంగ్లిష్‌:
ఇంగ్లిష్‌లో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు కాబ‌ట్టి అశ్రద్ధ చేయ‌రాదు. పారాగ్రాఫ్ ప్రశ్నలు, ప్రపోజిష‌న్స్‌, ఆర్టిక‌ల్స్‌, ఫిల్ ఇన్ ది బ్లాంక్ ప్రశ్నలకు వ్యాక‌ర‌ణ నియ‌మాలు ఉప‌యోగించి స‌మాధానం గుర్తించ‌వ‌చ్చు. కొంచెం శ్రద్ధపెడితే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా చెప్పుకోద‌గ్గ మార్కులు పొందొచ్చు. బ్యాంకు ప‌రీక్షల ఇంగ్లిష్ ప్రశ్నప‌త్రాల‌ను సాధ‌న‌చేయాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌:
ఈ విభాగంలో కొన్ని ప్రశ్నలు సులువుగానే ఉంటాయి. కానీ వాటిని సాధించ‌డానికి మాత్రం ఎక్కువ స‌మ‌యం అవ‌స‌రం. అందువ‌ల్ల షార్ట్‌కట్‌ మెథడ్స్‌ చాలా ఉపకరిస్తాయి. త‌క్కువ వ్యవ‌ధిలో కూడ‌డం, తీసివేయ‌డం, గుణించ‌డం, భాగించ‌డం చేయ‌గ‌ల‌గాలి. ఈ విభాగం నుంచి రోజుకొక అంశం చొప్పున సాధ‌న కొన‌సాగించాలి. ఆ అంశంలో అడ‌గ‌డానికి అవ‌కాశం ఉన్న అన్ని ర‌కాల ప్రశ్నల‌నూ ప్రాక్టీస్ చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌:
రోజువారీ ప‌త్రికా ప‌ఠ‌నంతో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌లో ఎక్కువ మార్కులు పొందొచ్చు. ప్రశ్నల్లో ఎక్కువ భాగం ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన ప‌రిణామాల‌పైనే ఉంటాయి. 2014లో వివిధ క్రీడ‌ల్లో విజేత‌లు, అవార్డు గ్రహీత‌లు, కీల‌క నిర్ణయాలు, ప్రముఖ ఘ‌ట్టాలపై ప్రశ్నలుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు...ఇటీవ‌ల భార‌త ర‌త్న బిరుదులు ఎవ‌రికి ప్రక‌టించారు? ఫిజిక్స్‌లో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి ఎవ‌రికొచ్చింది?...త‌ర‌హా ప్రశ్నల‌ను ఆశించ‌వ‌చ్చు. కాబ‌ట్టి ప్రతిరోజూ ఏదైనా ప‌త్రిక‌ను చ‌దివి ముఖ్యాంశాల‌ను నోట్సుగా రాసుకుంటే బాగా గుర్తుంటాయి. భీమా రంగానికి సంబంధించి ప్రశ్నల‌ను ఆశించ‌వ‌చ్చు. దిన‌ప‌త్రిక‌ల్లోని బిజినెస్ పేజీల‌ను ప‌రిశీలిస్తే ప్రయోజ‌నం ఉంటుంది. వీటితోపాటు స్టాక్ జీకేపైనా ప్రశ్నల‌డుగుతారు. దేశాల రాజ‌ధానులు, పార్లమెంట్ పేర్లు, ప‌ర్వతాలు, న‌దులు, స‌ర‌స్సులు, ఎడారులు...ఇలా అన్ని అంశాల‌నూ చ‌దివితే ఆశించిన స్థాయిలో మార్కులు పొంద‌వ‌చ్చు.

ఎస్సే, ప్రెసీ, కాంప్రహెన్షన్‌:
ఇంగ్లిష్‌లో త‌ప్పులు లేకుండా రాయ‌డాన్ని ఇప్పటి నుంచే సాధ‌న చేయాలి. కొన్ని అంశాల‌ను తీసుకుని వాటి గురించి స‌మాచారం సేక‌రించి బాగా చ‌ద‌వాలి. ఆ త‌ర్వాత ఆ అంశంపై క‌నీసం ప‌ది వాక్యాలు స్పష్టంగా రాయాలి. ఈ క‌స‌ర‌త్తు ప్రతి రోజూ చేస్తే తెలుగు మీడియం విద్యార్థులు సైతం ఎక్కువ మార్కులే స్కోర్ చేయొచ్చు. ఎస్సేతో పోల్చుకుంటే ప్రెసీ రైటింగ్ కొంచెం సులువే. ఎందుకంటే ఏదైనా అంశం గురించి ఎస్సేలో వివ‌రించాలి. అదే ప్రెసీలో ఎక్కువ స‌మాచారం ఇస్తారు. అందులో ముఖ్యాంశాల‌ను కుదించి రాయాలి. ఈ ప్రక్రియ‌లో అర్థం చెడ‌కుండా, భావం మార‌కుండా అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని తీసుకుని ఒక క్రమంలో రాయాలి. అంటే నాలుగు పేరాల స‌మాచారాన్ని ఒక పేరాలో స‌మ్మరీ రూపంలో కుదించాలి. దీనికి కూడా రోజువారీ ప్రాక్టీస్ త‌ప్పనిస‌రి. ఎస్సే, ప్రెసీల‌తో పోలిస్తే కాంప్రహెన్షన్ మ‌రికాస్త సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన స‌మ‌చారం నుంచి ప్రశ్నల‌కు జ‌వాబులు గుర్తించ‌వ‌చ్చు. ఈ విభాగంలోని ప్రశ్నల‌కు స‌మాధానం గుర్తించ‌డానికి వేగంగా చ‌ద‌వ‌గ‌లిగే నైపుణ్యం, సునిశిత ప‌రిశీల‌న అవ‌స‌రం.

పాత ప్రశ్నప‌త్రాలు, మాక్ ప‌రీక్షలు:
ఎన్ఐసీఎల్‌, ఎల్ఐసీ, ఓరియంట‌ల్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్‌, ఎన్ఐఏసీఎల్, యూఐఐసీఎల్‌...త‌దిత‌ర ప‌రీక్షల‌ పాత ప్రశ్నప‌త్రాలు సాధ‌న‌చేయ‌డం ద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. వీటితోపాటు ఐబీపీఎస్ పీవో, ఎస్‌బీఐ పీవో, ఎస్‌బీఐ అసోషియేట్స్ పీవో పాత‌ ప్రశ్నప‌త్రాలూ సాధ‌న చేయాలి. ప‌రీక్షకు నెల రోజుల ముందు నుంచి వీలైన‌న్ని ఆన్‌లైన్ మాక్ ప‌రీక్షలు రాయాలి. దీనివ‌ల్ల స‌మ‌య‌పాల‌న అల‌వ‌డ‌డంతోపాటు ఏ అంశాల్లో మెరుగు ప‌డాలి, వేటికెంత ప్రాధాన్యమివ్వాలో తెలుసుకోవ‌డం వీల‌వుతుంది.

Published on 06-01-2015