- డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

ఓరియంట‌ల్‌ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్‌) 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (ఏవో) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీటిలో 223 పోస్టులు జ‌న‌ర‌లిస్ట్ విభాగంలో ఉన్నాయి. మిగిలిన‌వి స్పెష‌లైజేష‌న్‌కు సంబంధించిన‌వి. బ్యాంకు పీవో పోస్టుల‌కు సిద్ధమ‌వుతున్నవారు ఓఐసీఎల్ ఏవో (జ‌న‌ర‌లిస్ట్‌) పోస్టుల‌కు స‌న్నద్ధం కావ‌డం సులువే. ఈ ప‌రీక్షల‌న్నింటిలోనూ రీజ‌నింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ ఉమ్మడి అంశాల‌గా ఉండ‌డం అభ్యర్థుల‌కు క‌లిసొచ్చే అంశం. డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ ప‌రీక్ష ద్వారా ఉన్నత అవ‌కాశాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఖాళీల వివ‌రాలు: అకౌంట్స్‌-20, యాక్చురీస్‌-2, ఇంజినీర్స్ (ఆటోమొబైల్‌)-15, లీగ‌ల్‌-30, మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-10, జ‌న‌ర‌లిస్ట్‌-223,

అర్హత‌: జ‌న‌ర‌లిస్ట్ పోస్టుల‌కు జులై 31, 2017 నాటికి ఏదైనా డిగ్రీలో క‌నీసం 60 శాతం మార్కులు(ఎస్సీ, ఎస్టీలైతే 50)తో ఉత్తీర్ణత సాధించాలి. మిగిలిన పోస్టుల‌కు సంబంధిత అంశాల్లో డిగ్రీ చ‌దివుండాలి.

వ‌యోప‌రిమితి: జులై 31, 2017 నాటికి క‌నిష్ఠం 21, గ‌రిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఆగ‌స్టు 1, 1987 కంటే ముందు; జులై 31, 1996 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

వేత‌న శ్రేణి: రూ. 32795-1610(14)-55335-1745(4)-62315. విధుల్లోకి చేరిన‌వాళ్లు ప్రారంభంలో నెల‌కు రూ.51,000 వేత‌న రూపంలో అందుకోవ‌చ్చు. దీంతోపాలు ప‌లు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ఉంటాయి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష (ప్రిలిమిన‌రీ, మెయిన్స్‌), ఇంట‌ర్వ్యూల ద్వారా

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఇలా...
ఆబ్జెక్టివ్ విధానంలో వంద మార్కుల‌కు ప‌రీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వ‌స్తాయి. ప‌రీక్ష వ్యవ‌ధి ఒక గంట‌. ప్రశ్నప‌త్రం ఆంగ్లం, హిందీ మాధ్యమంలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, రీజ‌నింగ్ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు వ‌స్తాయి. వీటికి సెక్షన్లవారీ క‌టాఫ్ మార్కులు ఉంటాయి. ప‌రీక్షలో నిర్దేశిత క‌టాఫ్ మార్కులు సాధించిన వారి నుంచి మొత్తం ఖాళీల‌కు 20 రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌ను మెయిన్ ప‌రీక్షల‌కు ఎంపిక‌చేస్తారు.

మెయిన్ ప‌రీక్ష ఇలా..
ఈ ప‌రీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. జ‌న‌ర‌లిస్ట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఇందులో రీజ‌నింగ్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 50 మార్కుల‌కు ప్రశ్నలుంటాయి. ఇత‌ర పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి పైన పేర్కొన్న విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 మార్కుల‌కు ప్రశ్నలుంటాయి. మిగిలిన 40 మార్కులు సంబంధిత అంశంలో ఉంటాయి. ఈ ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు. ప‌రీక్ష వ్యవ‌ధి రెండు గంట‌లు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. మెయిన్స్ లో భాగంగా ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్ ప‌రీక్ష కూడా ఉంటుంది. దీనికోసం ఇంగ్లిష్‌లో ఎస్సే, ప్రెసీ, కాంప్రహెన్షన్ అంశాల్లో 3 ప్రశ్నలుంటాయి. ఈ ప‌రీక్షకు 30 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. డిస్క్రిప్టివ్ ప‌రీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.

ప్రిలిమ్స్‌, మెయిన్స్ రెండింటిలోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు వంతు చొప్పున‌ త‌గ్గిస్తారు.

మెయిన్‌లోనూ సెక్షన్లవారీ క‌టాఫ్ మార్కులు ఉంటాయి. నిర్దేశిత క‌టాఫ్ మార్కుల‌కంటే ఎక్కువ సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ జ‌వాబు ప‌త్రాల‌ను మూల్యాంక‌నం చేస్తారు. డిస్క్రిప్టివ్ ప‌రీక్షలో అర్హత సాధించ‌డం త‌ప్పనిస‌రి. ఈ ప‌రీక్ష మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. మెయిన్ ప‌రీక్ష (ఆబ్జెక్టివ్‌)లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు.

తుది నియామ‌కాలు
మెయిన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కుల ద్వారా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు. మెయిన్, ఇంట‌ర్వ్యూల వెయిటేజీ 80:20గా నిర్ణయించారు. ఎంపికైన‌వారు ఏడాదిపాటు ప్రొబేష‌న్‌లో కొన‌సాగుతారు. ప్రొబేష‌న్‌తో క‌లుపుకుని నాలుగేళ్లు విధుల్లో కొన‌సాగ‌డం త‌ప్పనిస‌రి. ఇందుకోసం విధుల్లోకి చేర‌క‌ముందే ఒప్పంద‌ప‌త్రం రాయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం: ఆగ‌స్టు 18
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 15
రిజిస్ట్రేష‌న్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.వంద‌. మిగిలిన అంద‌రికీ రూ.600
ఆన్‌లైన్-ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: అక్టోబ‌రు 22
ఆన్‌లైన్-మెయిన్‌ ప‌రీక్ష తేది: న‌వంబ‌రు 18
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, ఒంగోలు; తెలంగాణ‌లో హైద‌రాబాద్/ ర‌ంగారెడ్డి, వ‌రంగ‌ల్‌.

Notification Apply Online

Posted on 15-08-2017