'నెట్‌' సన్నద్ధత ఎలా?

ఏటా రెండుసార్లు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌), లెక్చరర్‌షిప్‌ పరీక్షకు ప్రకటన వెలువడింది. పరీక్ష విధానంలో మార్పులేమీ చేయలేదు. అయితే ఈసారి పరీక్షను నిర్వహించే బాధ్యతను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)కి యూజీసీ అప్పగించింది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో చూద్దాం!
విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, ఫెలోషిప్‌తో కూడిన పరిశోధన చేయడానికి అర్హత సాధించాలంటే యూజీసీ నెట్‌ రాయడం తప్పనిసరి. బోధనా ప్రమాణాలు పెంపొందించడం, అకడమిక్‌ పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో 95 సబ్జెక్టుల్లో ఏటా రెండుసార్లు నెట్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పీజీలో చదివిన కోర్సును నెట్‌ సబ్జెక్టుగా రాసుకోవచ్చు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉస్మానియా, ఆంధ్ర, నాగార్జున, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు సమన్వయ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. నెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఏ విశ్వవిద్యాలయంలో అయినా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. అదే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే సెట్‌ (స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)లో అర్హత సాధిస్తే ఆ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అవకాశం లభిస్తుంది.
జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) సాధిస్తే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హులవ్వడమే కాకుండా అయిదేళ్లపాటు నెలకు రూ. 16,000 ఫెలోషిప్‌ను పొందవచ్చు. ప్రతి 6 నెలలకూ అన్ని సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 3200 మందికి ఫెలోషిప్‌ను ప్రకటిస్తారు.
ఎవరు అర్హులు?
అభ్యర్థి రాయదలచుకున్న సబ్జెక్టులో 55% మార్కులతో (ఓబీసీ/ ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ లకు 50% మార్కులు) మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే. కానీ వారు నెట్‌ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి రెండేళ్లలోపు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునేవారికి వయః పరిమితి లేదు. కానీ జేఆర్‌ఎఫ్‌ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారి వయసు ప్రకటనలో పేర్కొన్న తేదీ నాటికి 28 ఏళ్లకు మించకూడదు. ఎస్‌సీ/ ఎస్‌టీ/ ఓబీసీ/పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు. దరఖాస్తును ప్రింట్‌ తీసి రాయదలచిన విశ్వవిద్యాలయ సమన్వయ కేంద్రంలో అందజేయాల్సి ఉంటుంది.

పరీక్ష స్వరూపం
ప్రతి అభ్యర్థినీ మొత్తం మూడు పేపర్లలో పరీక్షిస్తారు. మూడింటిలో కూడా ప్రశ్నలు బహుళైచ్ఛిక రూపంలో ఉంటాయి. టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ పేపర్‌-1 అన్ని సబ్జెక్టుల వారికీ ఒకటే. పేపర్‌- 2, 3లు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి.
పేపర్‌-1: మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 50 ప్రశ్నలకు జవాబు గుర్తిస్తే సరిపోతుంది. అయితే అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించినప్పటికీ మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి స్పష్టంగా జవాబు తెలిసిన 50 ప్రశ్నలకే సమాధానం ఇవ్వడం మంచిది. దీని ప్రకారం మధ్యలో తెలియని ప్రశ్నలను వదిలేయడమే శ్రేయస్కరం. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున ఉంటాయి. మొత్తం ప్రశ్నపత్రానికి 100 మార్కులు.
ప్రశ్నలడిగే విభాగాలు
ఈ పేపర్లో 10 యూనిట్లుంటాయి. 1. టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 2. రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ 3. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 4. కమ్యూనికేషన్‌ 5. రీజనింగ్‌ 6. లాజికల్‌ రీజనింగ్‌ 7. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 8. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ 9. పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ 10. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌: గవర్నెన్స్‌, పాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌
ఇటీవలి కాలంలో పేపర్‌-1లో అనువర్తిత సామర్థ్యాలను మదింపు వేసే ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. దీని ప్రకారం సన్నద్ధత కావడం ముఖ్యం.
బోధనలో ఉపయోగపడే పద్ధతులు, సాంకేతికతను ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకోగలరు? ఆలోచన ప్రక్రియలో అభ్యర్థి సామర్థ్యం ఎలా ఉంది? సామాజిక, నైతిక, పర్యావరణ విలువలపై వైఖరి ఏమిటి? దేశ రాజకీయ, విద్యా వ్యవస్థపై అవగాహన ఏమిటి? ఆంగ్ల పరిజ్ఞానం, గణితంలో ప్రావీణ్యం, పర్యావరణం, వ్యక్తులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు.
మనోవైజ్ఞానిక శాస్త్రంలోని నూతన సిద్ధాంతాలు బోధనాభ్యసన ప్రక్రియలో వివిధ మార్పులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాత్మక సిద్ధాంతం బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయ, విద్యార్థి పాత్రలను పూర్తిగా మార్చివేసిందని చెప్పవచ్చు. ఫలితంగా శిశుకేంద్రిత విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఉపాధ్యాయుని ప్రజాస్వామ్యయుత ప్రవర్తన మొదలైన నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి. వీటిపై అవగాహన ముఖ్యం. పరిశోధన పద్ధతుల ప్రశ్నలు మౌలిక భావాలను మాత్రమే పరీక్షిస్తున్నాయి. వివిధ పరిశోధన పద్ధతులు, పరిశోధన ప్రక్రియలోని సోపానాలు, పరిశోధన సంబంధిత గణాంక పద్ధతులపై పట్టు సాధిస్తే ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు కష్టమేమీ కాదు. ఆధునిక సమాచార ప్రసార సాధనాలు, కంప్యూటర్‌ నిర్మాణం, పనితీరు, అంతర్జాలం, సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లు బోధనాభ్యసన- పరిశోధన ప్రక్రియలో ఎలా ఉపయోగపడగలవో కూడా తెలుసుకోవాలి.
ఈ పేపర్‌లోని 5, 6, 7 యూనిట్లు అభ్యర్థి అరిథ్‌మెటిక్‌ రీజనింగ్‌ సామర్థ్యం మదింపునకు సంబంధించినవి. ఈ ప్రశ్నలు దాదాపు పదో తరగతి స్థాయి సామర్థ్యాలనే పరీక్షిస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విభాగాలపై పట్టు సాధిస్తే కచ్చితంగా 15 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు.
పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడమూ ముఖ్యమే. కొన్ని ప్రశ్నలు (కనీసం ఆ మోడల్‌ నుంచి) పునరావృతం అయ్యే అవకాశాలూ ఉన్నాయి.
పేపర్‌-2, 3
ఇవి అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించినవి. పేపర్‌-2 100 మార్కులకు (50 ప్రశ్నలు X 2 మార్కులు); పేపర్‌-3 150 మార్కులకు (75 ప్రశ్నలు X 2 మార్కులు) ఉంటాయి. ప్రస్తుతం మూడు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఉత్తీర్ణతను నిర్ణయిస్తున్నారు. అందుకని రెండు మూడు పేపర్లపై శ్రద్ధ పెట్టి, పేపర్‌-1ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.
పేపర్‌-2, 3లలో సిలబస్‌లోని అంశాలు పీజీ స్థాయిలో ఉంటాయి.
పేపర్‌-2తో పోలిస్తే పేపర్‌-3లోని ప్రశ్నల కఠినత్వస్థాయి ఎక్కువ. పేపర్‌-2లో కేవలం ప్రాథమిక భావనలు, వాస్తవాలు, భావనల మధ్య అంతస్సంబంధాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. పేపర్‌-3లో అభ్యర్థి అవగాహన స్థాయి, అనువర్తిత సామర్థ్యం పరీక్షిస్తారు. పేపర్‌-2, 3 సిలబస్‌లోని అంశాల్లో పెద్దగా వైరుద్ధ్యం ఏమీ ఉండదు. కానీ పేపర్‌-3లోని అంశాలు పేపర్‌-2 అంశాలను విస్తరించే స్వభావంతో ఉంటాయి. అందుకే సన్నద్ధత వ్యూహం కూడా మౌలికమైన భావనల నుంచి లోతైన విషయ అవగాహన వరకూ కొనసాగాలి.
మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా ఆంగ్ల మాధ్యమం గురించి భయపడుతుంటారు. అయితే ప్రశ్నలు చదివి అర్థం చేసుకునేంత సామర్థ్యం ఉంటే అంత ఇబ్బంది ఉండదు. సన్నద్ధత కూడా తెలుగు మాధ్యమం పీజీ స్థాయి పుస్తకాలతో కొనసాగించవచ్చు. కానీ సబ్జెక్టులోని తెలుగు పదాలకు సమానమైన ఆంగ్లపదాలను తెలుసుకోవడం ముఖ్యం. అయితే అన్ని సబ్జెక్టులకూ తెలుగు మాధ్యమం పుస్తకాలు అందుబాటులో లేవనేది గమనించాలి.
ఈ పేపర్లలో కూడా గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి పాత ప్రశ్నపత్రాల అధ్యయనం మరవకూడదు.
ఆంగ్లసాహిత్యం, తెలుగు సాహిత్యం, ఎడ్యుకేషన్‌, చరిత్ర, కంప్యూటర్‌ సైన్స్‌, మేనేజ్‌మెంట్లలో పేపర్‌-3లో ఎలక్టివ్‌ విధానం ఉంది. ఈ సబ్జెక్టుల్లోని పేపర్‌-3 ప్రశ్నపత్రంలో ఎక్కువగా ఎలక్టివ్‌ల నుంచే ప్రశ్నలు రావడం గమనించదగ్గ విషయం.
ఈ పేపర్ల మెటీరియల్‌ సేకరణకు కొద్దిపాటి కష్టం తప్పదు. మొత్తం సిలబస్‌ ఏ ఒక్క సంప్రదింపు గ్రంథంలోనో దొరకదు. విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల, సీనియర్ల సలహాలు, సూచనలు ఈ విషయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. సిలబస్‌ ప్రకారం ఆయా అంశాలకు సంబంధించి విస్తృతంగా సమాచారం లభించే పుస్తకాలను ఎంచుకోవడం ముఖ్యం. అంటే ఏ సబ్జెక్టును ఎంచుకున్నప్పటికీ కనీసం ఆరేడు ప్రామాణిక పుస్తకాలు చదవడం తప్పనిసరి.
అర్హతను నిర్ణయిస్తారిలా..
* మొదటగా మూడు పేపర్లలో నిర్దేశించిన కనీస అర్హత మార్కులను సాధించినవారితో కూడిన పట్టిక తయారు చేస్తారు.
* ఆ పట్టిక నుంచి అభ్యర్థులు మూడు పేపర్లలోనూ సాధించిన మొత్తం మార్కులను ఆధారంగా చేసుకుని సబ్జెక్టు, కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితా తయారుచేస్తారు.
* మెరిట్‌ జాబితాలోని టాప్‌ 15% (ప్రతి సబ్జెక్టు, కేటగిరి) అభ్యర్థులకు నెట్‌ లెక్చరర్‌షిప్‌కు అర్హులుగా నిర్ణయిస్తారు.
* లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించినవారి నుంచి మెరిట్‌ ఆధారంగా సబ్జెక్టు, కేటగిరీల వారీ కొంతమందిని జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: అక్టోబర్‌ 15
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: నవంబరు 15
చలానా చెల్లించడానికి చివరి తేదీ: నవంబరు 18
దరఖాస్తులను ప్రింట్‌ తీసుకోవడానికి చివరి తేదీ: నవంబరు 19
ప్రింటవుట్‌ దరఖాస్తులు సంబంధిత కేంద్రాలకు చేరడానికి చివరి తేదీ: నవంబరు 25
అర్హత పరీక్ష తేదీ: డిసెంబరు 28

::::: CLICK HERE FOR JUNE 2014 QUESTION PAPERS & KEY :::::

Ushodaya Enterprises Private Limited 2014