- ఏపీలో 32, తెలంగాణ‌లో 20 ఖాళీలు
- డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

ప్రభుత్వరంగ బీమా సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్‌) 696 అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణ‌లో 20 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం..

విద్యార్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (జూన్‌ 30, 2017 లోగా డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లే అర్హులు). అభ్యర్థి ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం- చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి.

వ‌యోప‌రిమితి: జూన్‌ 30, 2017 నాటికి 18 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 1, 1989 కంటే ముందు; జూన్ 30, 1999 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఎస్సీ,ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో సడ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఎంపిక విధానం: ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆబ్జెక్టివ్‌ ప్రిలిమినరీ పరీక్ష, ఆబ్జెక్టివ్‌ మెయిన్స్‌ పరీక్షల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అలాగే.. తుది ఎంపిక జరిగేముందు అభ్యర్థి ప్రాంతీయ భాషా ప్రావీణ్య పరీక్షలో (రీజనల్‌ లాంగ్వేజీ ప్రొఫిషియన్సీ టెస్ట్‌) ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. భాషా ప్రావీణ్యానికి మార్కులు ఉండ‌వు.

ప్రిలిమిన‌రీ ఇలా..
వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వ‌స్తాయి. ఇంగ్లిస్ లాంగ్వేజ్ నుంచి 30, రీజ‌నింగ్ 35, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు ఉంటాయి. ప‌రీక్ష వ్యవ‌ధి ఒక గంట‌. హాజరైన అభ్యర్థుల సంఖ్యను బట్టి ప్రిలిమినరీ క్వాలిఫయింగ్‌ మార్కులను యూఐఐసీఎల్‌ నిర్ణయిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల‌కు సంబంధించి..కేట‌గిరీల‌వారీ ఖాళీల‌కు 7 రెట్ల సంఖ్యలో అభ్యర్థుల‌ను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్స్‌...
మొత్తం 250 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 5 విభాగాల్లో (ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, రీజ‌నింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌) క‌లుపుకుని 200 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక‌టింబావు మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి త‌ప్పు స‌మాధానానికీ పావుశాతం చొప్పున మార్కులు త‌గ్గిస్తారు.

తుది నియామ‌కాలు...
ఆన్‌లైన్ మెయిన్స్ ప‌రీక్షలో సాధించిన మార్కుల మెరిట్ (ఆయా రాష్ట్రాల వారీ, విభాగాల వారీ) ప్రాతిప‌దిక‌న తుది నియామ‌కాలు చేప‌డ‌తారు. దీంతోపాటు ప్రాంతీయ భాషా ప‌రీక్షలో అర్హత సాధించ‌డం త‌ప్పనిస‌రి.

సన్నద్ధత విధానం
ప్రిలిమినరీ పరీక్షలో ఉన్న మూడు సబ్జెక్టులూ మెయిన్స్‌లో కూడా ఉన్నాయి. అందుకని మొదటి నుంచే మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నద్ధం కావడం ద్వారా మెరుగైన ప్రతిభను చూపించవచ్చు. ముందుగా రీజనింగ్‌, ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఎబిలిటీలకు విస్తృతస్థాయిలో సన్నద్ధం కావాలి. ప్రిలిమినరీ తరువాత జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టులపై దృష్టి సారిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలకు మధ్య వ్యవధి ఒక్క నెల మాత్రమే ఉంది. కాబట్టి, ముందునుంచీ మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నద్ధత కొనసాగిస్తే అభ్యర్థికి లాభం చేకూరుతుంది.

న్యూమరికల్‌ ఎబిలిటీకి సంబంధించి శాతాలు, సరాసరి, నిష్పత్తి, లాభనష్టాలు మొదలైన ప్రాథమిక అంశాలతోపాటు మెన్సురేషన్‌, పర్మ్యుటేషన్స్‌, కాంబినేషన్స్‌, ఆల్జీబ్రా లాంటి అంశాలనూ చూసుకోవాలి. రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీలకు సంబంధించి పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేయడం లాభిస్తుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజీలో గ్రామర్‌దే ముఖ్యభూమిక. దీంతోపాటు కాంప్రహెన్షన్‌ను సాధనచేస్తే మంచి మార్కులను సొంతం చేసుకోవచ్చు. జనరల్‌ అవేర్‌నెస్‌లో సమకాలీన, ఆర్థిక, సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రశ్నలు ఉంటాయి. ఎప్పటికప్పుడు తాజా అంశాలను చేర్చుకుంటూ సమకాలీన ఆర్థికాంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా ఈ విభాగంలో గరిష్ఠ మార్కులను పొందవచ్చు. బీమా రంగానికి సంబంధించిన తాజా అంశాల‌పై ఎక్కువ దృష్టి సారించాలి. అలాగే.. 50 మార్కులను కేటాయించడంతో మెయిన్స్‌లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగానికి ప్రాధాన్యం పెరిగింది. ఎంతో సులభంగా సన్నద్ధమయ్యే వీలున్న, విస్తృతమైన మెటీరియల్‌ లభ్యమయ్యే ఈ విభాగం సన్నద్ధత విషయంలో అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం: ఆగ‌స్టు 14 నుంచి
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 28
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ. వంద. మిగిలిన అంద‌రికీ రూ. 500
టైర్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ: సెప్టెంబ‌రు 22
టైర్‌-2 మెయిన్ ప‌రీక్ష తేదీ: అక్టోబ‌రు 23
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌లో: చీరాల‌, శ్రీకాకుళం, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి, కాకినాడ, చిత్తూరు, కంచిక‌చెర్ల, గుడ్లవెల్లూరు, ఏలూరు, విజ‌య‌న‌గ‌రం.
తెలంగాణ‌లో: హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వివిధ ప్రాంతాలు, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌
పే స్కేల్‌: రూ.14435- 40080. ప్రారంభంలో రూ.23,000 వేత‌నం అందుతుంది.

Notification Apply Online

Posted on 15-08-2017