వ్యవసాయ కోర్సులు
దేశ జనాభాలో ఇప్పటికీ సుమారు 55 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి నూతన, ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో ఈ రంగానికి అవసరమైన నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. డిమాండ్‌కు తగిన విధంగా నిపుణులను తీర్చిదిద్దడానికి విద్యా సంస్థలు ఇంటర్ తర్వాత వివిధ వ్యవసాయ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...
వ్యవసాయ విద్యకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలో 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్' కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ అమెరికాలోని లాండ్ గ్రాంట్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. |
 |
తదనుగుణంగా ప్రభుత్వం దేశంలోనే మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం- జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంత్ నగర్‌లో (ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లా) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 62 విశ్వవిద్యాలయాలు వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన, గృహవిజ్ఞాన రంగాలకు సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, 52 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 4 డీమ్డ్ వర్సిటీలు, 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలున్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు 15000 వ్యవసాయ పట్టభద్రులు, 11 వేల మంది పీజీ అభ్యర్థులు బయటకు వస్తున్నారు. |