ఇంజినీరింగ్
జాతీయ స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో జరిగిన పరీక్షలకు హాజరు కాలేకపోయినా, ఆ పరీక్షల్లో సరైన ర్యాంకులు రాకపోవడంతో తమకు ఇష్టమైన ఇంజినీరింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయినా, అభ్యర్థులు ఆవేదన చెందాల్సిన అవసరంలేదు. రెగ్యులర్ ఇంజినీరింగ్‌కి సమానమైన పట్టాను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వీటితో ఉన్నత చదువులకు వెళ్లొచ్చు. ఉద్యోగాలు సంపాదించవచ్చు. పదోన్నతులు కూడా అందుకోవచ్చు.

ఇంజినీరింగ్ వృత్తిలో ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి పలు సంస్థలు విలువైన, ఉన్నతమైన ఇంజినీరింగ్ ప్రోగ్రాములను అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి...
1) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా).
2) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ)
3) ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా)
4) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్

ఇంజినీరింగ్ రంగంలో నిపుణులైన సాంకేతిక సిబ్బందిని అందించాలనే లక్ష్యంతో 1914లో భారత్‌లో మొదటిసారిగా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా - ఐ.ఎం.ఇ.ఐ.) ఏర్పడింది. రెగ్యులర్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరలేకపోయినవారికి, వివిధ సాంకేతిక వృత్తుల్లో చేరి భవిష్యత్తు కోసం ఇంజినీరింగ్ డిగ్రీ సాధించాలని తపించేవారికి ఈ సంస్థ అండగా నిలుస్తోంది. కాలక్రమేణ విద్యార్థుల ఆదరణ, డిమాండ్ పెరిగేకొద్దీ 1920లో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) ఏర్పడింది. తర్వాత కాలంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లాంటి పలు సంస్థలు ఆవిర్భవించాయి.