న్యాయ విద్య


సమాజంలో న్యాయవాదులకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా న్యాయవిద్యను సాధారణ కోర్సుల మాదిరి పరిగణించకూడదు. దీంట్లో సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఇండియన్ బార్ కౌన్సిల్ 1961 న్యాయవాదుల చట్టానికి అనుగుణంగా న్యాయ విద్యా తీరుతెన్నులను పర్యవేక్షిస్తోంది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
న్యాయ నిపుణుల డిమాండ్ రోజురోజుకు అధికం కావడాన్ని దృష్టిలోపెట్టుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థులైన న్యాయ నిపుణులను అందించేందుకు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులను యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టింది. తర్వాత 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్) కోర్సును ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని వర్సిటీలు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులతో పాటు, ఎల్ఎల్‌బీ అయిదు సంవత్సరాల 'లా' కోర్సులు కూడా అందిస్తున్నాయి. దేశంలో లా డిగ్రీ అంటే 1985కు ముందు మూడేళ్ల కోర్సు మాత్రమే. న్యాయ విద్యను విస్తరించాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సూచనలు చేయడంతో 1985లో బెంగళూరులో 'నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా'ను ప్రారంభించారు. అప్పటినుంచి 5 ఏళ్ల లా కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఏర్పడిన మొదటి లా వర్సిటీ ఇదే కావడం విశేషం. తర్వాత లా వర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణత, మూడేళ్ల లా కోర్సుకు డిగ్రీ కనీస అర్హతలు.