ఆధునిక కోర్సులు


సముద్ర పరిశోధనలు: సముద్రాల అధ్యయనమే ఓషనోగ్రఫీ. ఐఐటీ మద్రాస్, ఐఐటీ బొంబాయి, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్నామలై యూనివర్సిటీ వంటివి ఓషనోగ్రఫీ కోర్సులు అందిస్తున్నాయి.
జెమ్మాలజీ: రత్నాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జెమ్మాలజీ. జెమ్మాలజీలో పలు సంస్థలు డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.
ఫ్యాషన్ టెక్నాలజీ: ఆధునిక ప్రపంచంలో యువతను బాగా ఆకర్షిస్తున్న రంగమిది. ఫ్యాషన్ కెరీర్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వంటి పలు సంస్థలు ఈ రంగంలో ఎన్నో కోర్సులను రూపొందించాయి.
వినోద రంగం: సినిమాలు, టీవీల్లో వినోద కార్యక్రమాలకోసం అవసరమైన నిపుణులను అందించేందుకు పలు యూనివర్సిటీలు ఎడిటింగ్, డబ్బింగ్, థియేటర్ ఆర్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తదితర అంశాల్లో కోర్సులు అందిస్తున్నాయి.
విపత్తు నిర్వహణ: ప్రకృతి వైపరీత్యాలకు ముందు, తరువాత చర్యలకోసం పలువురు నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. నిపుణులను తయారు చేసేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పేరుతో పలు విద్యాసంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.
టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్: ఈ రంగంలో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ తదితర సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.
లా కోర్సులు: సమాజంలో రోజురోజుకూ న్యాయవ్యవస్థకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో విద్యాసంస్థలు ప్రత్యేకంగా లా కోర్సులను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు లా యూనివర్సిటీలు కలిసి కామన్‌లా అడ్మిషన్ టెస్ట్ పేరుతో ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. ఏపీలా యూనివర్సిటీ, ఉస్మానియా లా కాలేజ్, నేషనల్ లా యూనివర్సిటీ, నల్సార్ లా యూనివర్సిటీ, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ, నిర్మా యూనివర్సిటీ, కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ వంటివి ప్రత్యేకంగా లా కోర్సులు అందిస్తున్నాయి. ఇందులో అయిదేళ్ల కోర్సులన్నిటికీ అర్హత ఇంటర్మీడియటే.
ఇంటిగ్రేటెడ్ కోర్సులు: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకూ ఇంటర్మీడియటే అర్హత. రాష్ట్రంలోని సాంప్రదాయిక యూనివర్సిటీలన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి.
దూరవిద్య: రెగ్యులర్‌గా డిగ్రీలు చేయలేనివారు ఇంటర్ తరువాత దూరవిద్య ద్వారా డిగ్రీ చేసేందుకు అవకాశం ఉంది. దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి.