Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


పెట్రోలియం ఇంజినీరింగ్‌

పెట్రోలియం ఇంజినీరింగ్‌లో... ఉపాధి అవకాశాలు
''ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పెట్రోలియం నిల్వలు మరో 200 ఏళ్లకు మాత్రమే సరిపోతాయని ఓ అంచనా... ఇదే జరిగితే ప్రజా రవాణా ఆగిపోయి జనజీవనం స్తంభించిపోతుంది. ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించకపోతే పెనుప్రమాదంలో పడిపోతాం. వినడానికి ఇవి మామూలు వాక్యాలే అయినా... రోజు రోజుకూ తరిగిపోతున్న పెట్రోలు నిల్వలు, సంబంధిత కోర్సుల ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతున్నాయి.
18వ శతాబ్దం నుంచి దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు ముడిచమురు ఎగుమతులు, దిగుమతులపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో ముడిచమురు అవసరం గణనీయంగా పెరుగుతోంది. భారత్ ఏటా 80 శాతం ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది. డాలర్ మారకం రేటుకు డబ్బు చెల్లిస్తుండటంతో ఆర్థికరంగం కుంగుబాటుకు గురవుతోంది. దీనికి తోడు పైప్‌లైన్ల లీకేజీలతో ఇందనం భారీగా వృథా అవుతోంది. తక్కువ ఖర్చుతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, స్థానికంగా పెట్రోలియం, సహజవాయు నిక్షేపాలను గుర్తించడం, చమురు ఉత్పత్తి చేసేందుకు శిక్షణ పొందిన పెట్రోక్రాట్స్, జియోఫిజిస్టులను తయారు చేసుకోవడమే పరిష్కారం. ఈ అవసరాన్ని తీర్చేవే 'పెట్రోలియం ఇంజినీరింగ్ కోర్సులు.
కోర్సు వివరాలు
పెట్రోలియం ఇంజినీరింగ్ కోర్సులను ప్రాక్టికల్స్ సమ్మేళనంగా రూపొందించారు. ఈ విభాగంలో యూజీ, పీజీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు పరిశోధనలూ చేయవచ్చు. సెమిస్టర్ విధానంలో విద్యాబోధన ఉంటుంది. ఎక్కువగా పరిశోధనలు, ప్రాక్టికల్స్ ఉంటాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు
1. బీటెక్ (అప్త్లెడ్ పెట్రోలియం ఇంజినీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ గ్యాస్.)
2. బీటెక్ (అప్త్లెడ్ పెట్రోలియం ఇంజినీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ అప్‌స్ట్రీమ్.)
3. బీటెక్ (జియోఇన్ఫర్మేటిక్ ఇంజినీరింగ్.)
4. బీటెక్ (మైనింగ్ ఇంజినీరింగ్.)
5. బీబీఏ (ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెటింగ్.)
విద్యార్హతలు
యూజీ కోర్సుల్లో 10 + 2 అర్హతతో చేరొచ్చు. ప్రధాన విద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఐఐటీ-జేఈఈలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో గేట్ స్కోరు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసినవారూ అర్హులే.
ఫీజుల వివరాలు
నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేయడానికి రూ.6-8 లక్షలు ఖర్చవుతుంది. పీజీ కోర్సులకు రూ.3 లక్షలకు పైగా ఫీజులు చెల్లించాలి. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధనలు, ప్రాక్టికల్స్, ప్రయోగాలు చేయాల్సి ఉండటంతో ఫీజులు ఎక్కువగానే ఉన్నాయి.
ప్రతిభకు సహకారం
కోర్సులో చేరిన విద్యార్థులకు ప్రభుత్వంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల సంస్థలు ఉపకారవేతనాలు అందిస్తున్నాయి. కోర్సు ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏటా 100 ఉపకారవేతనాలు ప్రకటిస్తోంది. నెలకు రూ.2000 చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తోంది. పెట్రోలియం ఎనర్జీ రంగంలో పరిశోధనలు చేసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 'ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. మరో సంస్థ 'భారత్ పెట్రోలియం పరిశోధనవైపు వచ్చే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తోంది. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు నామమాత్రపు వడ్డీకే విద్యారుణాలు మంజూరు చేస్తున్నాయి.
భారీ వేతనాలు
పెట్రోలియం ఇంజినీరింగ్ కోర్సు చేసిన వారికి బోలెడన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. సంస్థలు భూభౌతిక దత్తాంశ విశ్లేషణ, డ్రిల్లింగ్, ఉత్పత్తి, సరఫరా విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. కోర్సుచేసిన వారికి విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. ప్రారంభంలో నెలకు రూ.25,000 నుంచి 30,000 వేతనాలు పొందవచ్చు. బహుళజాతి సంస్థల్లో అయితే సంవత్సరానికి రూ.6 లక్షల వరకు వేతనాలు ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలు చేసేవారిని పెట్రోలియం ఇంజినీర్లు లేదా 'పెట్రోక్రాట్స్, జియోఫిజిస్టులు అంటారు.
ఈ డొమైన్లలో ఉద్యోగాలు
పెట్రోలియం ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులకు అప్‌స్ట్రీమ్, మిడిల్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ విభాగాల్లో వివిధ సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. అవి..
రిజర్వాయర్ ఇంజినీర్
ప్రొడక్షన్ ఇంజినీర్
డ్రిల్లింగ్ ఇంజినీర్
పైప్‌లైన్ ఇంజినీర్
పీఎన్‌జీ, సీఎన్‌జీ ఆపరేషన్, డిస్ట్రిబ్యూషన్ ఇంజినీర్
పైప్‌లైన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్
సహజవాయు మోడలింగ్, సిమ్యులేషన్ ఇంజినీర్
వెల్ స్టిమ్యులేటింగ్ ఇంజినీర్
అనలిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్
ఉద్యోగాలిచ్చే సంస్థలు
పెట్రోలియం ఇంజినీరింగ్ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటితో పాటు విదేశీ కంపెనీలు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
1. అదానీ వెల్స్‌పన్ ఎక్స్‌ప్లొరేషన్ లిమిటెడ్.
2. అస్సాం పెట్రోలియం లిమిటెడ్.
3. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.
4. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.
5. గెయిల్ ఇండియా.
6. ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్.
7. ఆయిల్ ఇండియా లిమిటెడ్.
8. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
9. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ లిమిటెడ్.
10. ఓఎన్‌జీసీ లిమిటెడ్.
11. టాటా పెట్రోడైన్ లిమిటెడ్.
12. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్
13. రిలయన్స్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్.
ఐటీ సంస్థల్లోనూ....
1. ఎక్సెంచర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.
2. జీఈ ఎనర్జీ
3. ఇన్ఫోసిస్ లిమిటెడ్.
4 ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్.
5. ఎల్ అండ్ టి ఐఈఎస్
6. టీసీఎస్ లిమిటెడ్.
7. సామ్‌సంగ్ ఇంజినీరింగ్
8. విప్రో టెక్నాలజీస్
కోర్సు అందించే ప్రముఖ విద్యాసంస్థలు..
1. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ (ఐఎస్ఎం)
ధన్‌బాద్, జార్ఖండ్.
వెబ్‌సైట్: www.ismdhanbad.ac.in
2. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ)
రాయ్‌బరేలీ, ఉత్తరప్రదేశ్.
వెబ్‌సైట్: www.rgipt.ac.in
3. మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)
పుణె, మహారాష్ట్ర
వెబ్‌సైట్: www.mitpune.com
4. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం (పీడీపీయూ)
గాంధీనగర్, గుజరాత్.
వెబ్‌సైట్: www.pdpu.ac.in
5. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్.
వెబ్‌సైట్: www.upes.ac.in
6. దిబ్రూగఢ్ యూనివర్సిటీ
అస్సాం
వెబ్‌సైట్: www.dibru.ac.in
7. రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీ
కోట, రాజస్థాన్.
వెబ్‌సైట్: www.rtu.ac.in
8. జాకీర్ హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
అలీగఢ్, ఉత్తరప్రదేశ్
వెబ్‌సైట్: www.amu.ac.in/engg
వీటితో పాటు అమెరికా, ఇంగ్లండ్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థలెన్నో ఈ కోర్సును అందిస్తున్నాయి.