Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయ విద్య

అధిక ఉపాధికి వ్యవ'సాయం'!
వ్యవసాయం పల్లెవాసుల వృత్తి అనేది పాతకాలపు మాట. అగ్రికల్చర్‌.. ఆధునిక టెక్నాలజీతో కార్పొరేట్‌ కల్చర్‌గా మారడం కొత్త బాట. పంట విధానం నుంచి నూతన ఉత్పత్తి రీతుల పరిశోధనల వరకు... మార్కెటింగ్‌ నుంచి ఆర్థిక సూత్రాల అన్వయం వరకు ఎన్నో విభాగాల్లో ఎంతోమంది విధులు నిర్వహిస్తున్నారు. అధిక ఉపాధి అవకాశాలను అందించే రంగంగా వ్యవసాయం విస్తరించింది. దీనికి సంబంధించిన కోర్సులు, ఉద్యోగాలన్నీ బైపీసీ/ఎంపీసీ గ్రూప్‌లతో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికి ప్రత్యేకం.
మనది వ్యవసాయాధారిత దేశం. దేశ ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగిన భాగం ఆదాయం దీని నుంచే వస్తోంది. ఉత్పత్తులు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు.. ఇలా ఎన్నో రకాలుగా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ రీతులను దాటి ఆధునిక విధానాల అనువర్తనతో వ్యవసాయం విస్తరిస్తోంది. బయాలజీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన వారు అగ్రికల్చర్‌ సెక్టార్‌లో కెరియర్‌ను నిర్మించుకోడానికి చక్కటి వేదికగా నిలుస్తోంది.

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌
వ్యవసాయంపట్ల ఆసక్తి ఉండి, సంప్రదాయ పద్ధతులను దాటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పంటలు పండించాలనుకునే వారు ఈ కోర్సులో చేరవచ్చు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలతో ఉండే నాలుగేళ్ల కోర్సు ఇది. ఇందులో భాగంగా.. ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడేవాటి డిజైనింగ్‌, రూపకల్పన, అప్పటికే ఉన్నవాటిని అభివృద్ధి చేయడం, మెషినరీ, దాని తయారీ విధానం వంటివన్నీ నేర్చుకుంటారు. ఎన్నో రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు అర్హులు. కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ, రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చు.
కోర్సు ఎక్కడ:
* ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఇంతకు ముందు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ), హైదరాబాద్‌
* ఎన్‌జీరంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, గుంటూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు కళాశాలలు
* ఐఐటీ- ఖరగ్‌పూర్‌ బీ ఆనంద్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, గుజరాత్‌
* ఇందిరా గాంధీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, చత్తీస్‌గఢ్‌
* మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్‌, పుణె
* తమిళనాడు అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, కోయంబత్తూరు తదితరాలు.
కెరియర్‌: అగ్రికల్చర్‌ ఇంజినీర్‌గా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెషినరీ కొనుగోళ్ల విభాగాల్లో ఉద్యోగం లభిస్తుంది. సంప్రదాయ పనిముట్లకు, విధానాలకు ప్రత్యామ్నాయాలను సూచించే కన్సల్టెంట్లుగానూ అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ మెషినరీ ఉత్పత్తి సంస్థలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల్లోనూ పోస్టులు ఉంటాయి.

బీఎస్‌సీ అగ్రికల్చర్‌
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన పద్ధతులను అభివృద్ధి పరచడమే కోర్సు ఉద్దేశం. అగ్రికల్చర్‌లో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరికరాలు, పద్ధతుల గురించి ఇందులో అధ్యయనం చేస్తారు. అగ్రికల్చర్‌, లాండ్‌ సర్వేయింగ్‌, సాయిల్‌ సైన్స్‌, వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, యానిమల్‌, పౌల్ట్రీ మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ మొదలైనవన్నీ కోర్సులో భాగమే. కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌ బైపీసీ గ్రూప్‌ ఉత్తీర్ణులు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ర్యాంకు, ఇతర రాష్ట్రాల ప్రవేశపరీక్షల మెరిట్‌ ఆధారంగా సీటు లభిస్తుంది.
కోర్సు ఎక్కడ:
* ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, గుంటూరు
* ఎస్‌వీ అగ్రికల్చరల్‌ కాలేజ్‌, తిరుపతి
* ఇందిరాగాంధీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, రాయ్‌పుర్‌
* జవహర్‌లాల్‌ నెహ్రూ కృషి విద్యాలయ, జబల్‌పుర్‌
* తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, కోయంబత్తూరు
కెరియర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలుంటాయి. నేషనల్‌, రూరల్‌ బ్యాంకులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, అగ్రి పరిశ్రమ, సంబంధిత సేవా సంస్థల్లోకి వీరిని తీసుకుంటారు.

బీఎస్‌సీ హార్టికల్చర్‌
తోటలు, ఉద్యానవనాల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, ఔషధాలు, అలంకరణ పూలు మొదలైనవాటి పెంపకం ఇందులో భాగం. నర్సరీలు, గ్రీన్‌హౌజ్‌లు, ప్లాంటేషన్లు మొదలైనవాటిని నిర్వహిస్తారు. కోర్సు వ్యవధి- మూడేళ్లు. ఇంటర్‌లో బైపీసీ చదివినవారు అర్హులు. హార్టిసెట్‌ రాయడం ద్వారా ప్రవేశం పొందవచ్చు. సేంద్రియ పదార్థాల ప్రాధాన్యం పెరుగుతుండటంతో ఈ రంగంలో నిపుణుల అవసరం ఎక్కువవుతోంది.
కోర్సు ఎక్కడ:
* డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్‌
* శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర హార్టీకల్చర్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, కోయంబత్తూరు
* గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ, పంత్‌ నగర్‌
* మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్‌, పుణె
కెరియర్‌: ఈ కోర్సులో డిగ్రీ చేసినవారు ఫ్లోరికల్చరిస్ట్‌, ఒలెరికల్చరిస్ట్‌, ఇళ్లు, కార్యాలయాలకు పార్క్‌లు, గార్డెన్లు రూపొందించే లాండ్‌ స్కేపర్లు, విటి కల్చరిస్ట్‌, పోమాలజిస్ట్‌ మొదలైనవాటిల్లో స్థిరపడవచ్చు. హార్టికల్చర్‌ సైంటిస్టుగా పరిశోధనల్లో పాల్గొనవచ్చు. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు.

బీఎఫ్‌ఎస్‌సీ - ఫిషరీస్‌
చేపల పెంపకం, సేకరణ పద్ధతుల గురించి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌లో అధ్యయనం చేస్తారు. వివిధ రకాల నీరు/ మెరైన్‌ వాతావరణంలో ఎలా చేపలను పెంచ వచ్చనేది తెలుసుకుంటారు. అలాగే వాటి జీవనం, జీవన విధానాలు, వివిధ రకాల జాతుల పెంపకం వంటివీ చదువుకుంటారు. చేపల నిల్వ, రవాణా పద్ధతులూ ఇందులో భాగంగా ఉంటాయి. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఇంటర్‌లో బయాలజీ చదివినవారు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు.
కోర్సు ఎక్కడ:
* శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి
* పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* కర్ణాటక వెటర్నరీ యానిమల్‌ అండ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ యూనివర్సిటీ, బీదర్‌
* కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీస్‌, కొచ్చి
* మహారాష్ట్ర యానిమల్‌ అండ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ, నాగ్‌పుర్‌
* తమిళనాడు ఫిషరీస్‌ యూనివర్సిటీ, నాగపట్నం
* వెస్ట్‌ బంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ యానిమల్‌ అండ్‌ ఫిషరీ సైన్సెస్‌, కోల్‌కతా
కెరియర్‌: కోర్సు పూర్తిచేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, ఫిష్‌ ఫాంల్లో అవకాశాలుంటాయి. ఆక్వాకల్చర్‌ ఫార్మర్‌, షెల్‌ఫిష్‌ కల్చరిస్ట్‌, హేచరీ టెక్నీషియన్‌, బయలాజికల్‌ సైన్స్‌ టెక్నీషియన్‌, ఫిష్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ మొదలైన హోదాల్లోకి వీరిని తీసుకుంటారు.

బీటెక్‌ ఇన్‌ డెయిరీ టెక్నాలజీ
ఇది ఫుడ్‌ టెక్నాలజీ, ప్రాసెసింగ్‌ పరిశ్రమలో భాగం. పాలు, పాల సంబంధ ఉత్పత్తులకు సంబంధించింది. నాలుగేళ్ల కోర్సు. విద్యార్థులు డెయిరీ సంబంధిత పదార్థాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌ మొదలైన అంశాలను నేర్చుకుంటారు. వీటితోపాటు వివిధ ప్యాకేజింగ్‌, స్టోరేజ్‌, పంపిణీ అంశాలనూ తెలుసుకుంటారు. ఇంటర్‌లో ఎంపీసీ పూర్తిచేసినవారు అర్హులు. జేఈఈ, ఐసీఏఆర్‌ నిర్వహించే ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్‌ లభిస్తుంది.
కోర్సు ఎక్కడ:
* శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి
* పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* కాలేజ్‌ ఆఫ్‌ డెయిరీ టెక్నాలజీ, రాయ్‌పుర్‌
* సంజయ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెయిరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పట్నా
* నేషనల్‌ డెయిరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హరియాణా
* చత్తీస్‌గఢ్‌ కామధేను యూనివర్సిటీ, రాయ్‌పుర్‌
కెరియర్‌: డెయిరీ సంస్థలు అముల్‌, వెర్కా, పరాస్‌ మొదలైన సంస్థల్లో వీరికి ఉద్యోగాల ఉంటాయి. సూపర్‌ వైజర్లు, డెయిరీ ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. సొంతంగా వ్యాపారాన్నీ పెట్టుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలైన ఐఏఆర్‌ఐ వంటి వాటిలో ఖాళీలను ఈ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

బీవీఎస్‌సీ- యానిమల్‌ హజ్బెండరీ
పశువులు, కోళ్లు, బాతుల వంటి వాటి పెంపకానికి సంబంధించిన కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌. వీటి పోషణ, అభివృద్ధికి అవసరమైన షెడ్‌ మేనేజ్‌మెంట్‌, ఆహారం, పోషణ ప్రమాణాలు, ప్రొడక్ట్స్‌ రవాణా మొదలైన అంశాలను అభ్యర్థులు తెలుసుకుంటారు. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఇంటర్‌లో బయాలజీ చదివినవారు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ద్వారా కోర్సు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.
కోర్సు ఎక్కడ:
* శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి (కొత్తగా ఏర్పాటు చేసిన విజయనగరం జిల్లా గరివిడి కళాశాల, ప్రకాశం జిల్లా కందుకూరు కాలేజీలతో కలిపి మొత్తం అయిదు ఉన్నాయి)
* పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* కర్ణాటక వెటర్నరీ యానిమల్‌ అండ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ, బీదర్‌
* రాజస్థాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌, బికనీర్‌
* జునాగఢ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ
* బిర్సా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, రాంచీ
కెరియర్‌: హేచరీలు, ఫార్మా సంస్థలు, ఫీడ్‌ మిల్లర్లు, వెటర్నరీ ఆసుపత్రులు, ఫీడ్‌ అనాలిసిస్‌ లేబొరేటరీల్లో పౌల్ట్రీ ఫాం మేనేజర్‌, బ్రీడర్‌, హేచరీ అసిస్టెంట్‌, ప్రొడక్షన్‌ టెక్నాలజిస్ట్‌, ఫీడింగ్‌ టెక్నాలజిస్ట్‌, పౌల్ట్రీ హౌజ్‌ డిజైనర్‌ మొదలైన పోస్టుల్లోకి వీరిని తీసుకుంటారు.

బీఎస్‌సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ
వివిధ సాంకేతిక నైపుణ్యాలు- జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్స్‌, వ్యాక్సిన్లు, టిష్యూ కల్చర్‌ వంటి వాటిని అర్థం చేసుకోవడం, మేళవించడం దీనిలో భాగం. మంచి జీన్స్‌ను గుర్తించి, వాటిని వేరే మొక్కల్లో ప్రవేశపెట్టడం లేదా వాటిలో కొన్ని మార్పులు చేసి, సత్ఫలితాలు సాధించేలా చేయడం వీరి పని. పాల ఉత్పత్తిని పెంచడం, జంతువుల రోగాలను గుర్తించడం, వ్యాధుల నిరోధం, ఆహార పదార్థాల తయారీలో సరికొత్త మార్గాలను అభివృద్ధి చేయడమూ వీరి విధులు. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఇంటర్‌లో బైపీసీ చదివినవారు అర్హులు. నేరుగా ప్రవేశాలుంటాయి. కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలు మాత్రం సొంతంగా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.
కోర్సు ఎక్కడ:
* అసోం అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, జోరాట్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, బెంగళూరు
* మరట్వాడా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, పరబానీ
* మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్‌, మహారాష్ట్ర
కెరియర్‌: ఫార్మాస్యూటికల్‌, అగ్రి ఆధారిత తయారీ సంస్థల్లో వీరికి అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా విత్తనాలు, పెస్టిసైడ్స్‌, ఇన్‌సెక్టిసైడ్స్‌ మొదలైనవాటిని పరిశీలించే ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌ హోదాలోకి వీరిని సంస్థలు ఎంచుకుంటాయి. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలూ వీరికి ప్రాధాన్యమిస్తున్నాయి.

బీఎస్‌సీ అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌
వ్యవసాయ పరిశ్రమకు ఆర్థిక సూత్రాలను అన్వయిస్తారు. మార్కెట్‌ పోకడలను అంచనా వేయడం, వాణిజ్య పద్ధతులను పరిశీలించడం, కస్టమర్ల అవసరాలు, వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులు మొదలైన అంశాలను తెలుసుకుంటారు. బైపీసీ చదివినవారు
అర్హులు. రాష్ట్రాల ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్లు ఉంటాయి.
కోర్సు ఎక్కడ:
* చంద్రశేఖర్‌ ఆజాద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ, కాన్పూర్‌
* బిర్సా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ
* హిమాచల్‌ ప్రదేశ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, పాలంపూర్‌
* ఛత్రపతి సాహుజీ మహరాజ్‌ శిక్షణ్‌ సంస్థ, ఔరంగాబాద్‌
కెరియర్‌: అగ్రికల్చర్‌ బ్యాంకులు వీరిని క్రెడిట్‌ అనలిస్టులు, అగ్రికల్చర్‌ లోన్‌ ఆఫీసర్లుగా తీసుకుంటున్నాయి. వివిధ మేగజీన్లు, ట్రేడ్‌ జర్నల్స్‌, న్యూస్‌ పేపర్లకు రైటర్లుగా ఎంపిక చేసుకుంటున్నారు. సంబంధిత సమాచారం, స్టాటిస్టిక్స్‌ను అంచనా వేయడానికీ ప్రభుత్వ సంస్థలూ వీరి సేవలను వినియోగించుకుంటున్నాయి.

బీఎస్‌సీ సెరికల్చర్‌
ముడి పట్టును ఉత్పత్తి చేసే పట్టు పురుగుల పెంపకానికి సంబంధించిన కోర్సు ఇది. రూరల్‌ ఎకానమీలో ఈ రంగానిది ప్రధాన పాత్ర. పట్టు పురుగుల పెంపకం, సిల్క్‌కు గ్రేడ్‌ ఇవ్వడం, దాన్ని పరీక్షించడం, సీడ్‌ టెక్నాలజీ, సిల్క్‌ వేవింగ్‌ టెక్నాలజీ, సిల్క్‌ డైయింగ్‌, ప్రింటింగ్‌ మొదలైన వాటన్నింటినీ అధ్యయనం చేస్తారు. కోర్సు కాలవ్యవధి నాలుగేేళ్లు. ఇంటర్‌లో బైపీసీ పూర్తిచేసినవారు అర్హులు. ప్రవేశాలు నేరుగానే నిర్వహిస్తున్నారు. చాలా కొద్ది సంస్థలు మాత్రం ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి.
కోర్సు ఎక్కడ:
* తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ
* శివాజీ యూనివర్సిటీ, కోల్హాపుర్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, బెంగళూరు
కెరియర్‌: సిల్క్‌ విభాగాలు, అగ్రికల్చర్‌ ఫైనాన్సింగ్‌ సంస్థలు, సిల్క్‌ సప్లై చెయిన్‌ ఏజెన్సీలు, ఎన్‌జీఓలు, సిల్క్‌ మార్కెటింగ్‌, ఎక్స్‌పోర్ట్‌- ఇంపోర్ట్‌ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి.

బీఎస్సీ, బీబీఏ - అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యాపార వ్యవహారాల అధ్యయనం బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)లో ఉంటాయి. కొన్ని సంస్థలు ప్రవేశ పరీక్షల ద్వారా మరికొన్ని నేరుగా అడ్మిషన్లు ఇస్తున్నాయి. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌లో బయాలజీ చదివినవారు అర్హులు.
కోర్సు ఎక్కడ:
* ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* తమిళనాడు అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, చెన్నై
* మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్‌, మహారాష్ట్ర
* జీబీ పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ, ఉత్తరాఖండ్‌
కెరియర్‌: అగ్రి వ్యాపార సంస్థలు, మార్కెటింగ్‌ ఏజెన్సీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థలు, రిటైల్‌ పరిశ్రమల్లో వీరికి అవకాశాలుంటాయి. అగ్రి మార్కెటింగ్‌ ఆఫీసర్‌, క్వాలిటీ కంట్రోలర్‌, బిజినెస్‌ ప్లానింగ్‌ మేనేజర్‌, అగ్రికల్చర్‌ అనలిస్ట్‌ వంటి హోదాల్లోకి తీసుకుంటారు.

వన్నె తరగని వ్యవసాయ విద్య!
వ్యవసాయ విద్యకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలో 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిష'న్‌ను నియమించింది. ఈ కమిషన్ అమెరికాలోని లాండ్ గ్రాంట్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. తదనుగుణంగా ప్రభుత్వం దేశంలోనే మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం- జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంత్ నగర్‌లో (ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లా) ఏర్పాటు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్, హైదరాబాద్) వ్యవసాయ విద్యను అందిస్తోంది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా) ఉద్యాన విద్యను, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (తిరుపతి) పశువైద్య విద్యను అందిస్తున్నాయి.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఉద్యాన రంగాల సర్వతోముఖాభివృద్ధికి 1964లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1996లో దీన్ని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చారు. వ్యవసాయ కోర్సుల నిర్వహణలో పేరుగాంచిన ఈ వర్సిటీ అందిస్తున్న వ్యవసాయ సంబంధిత కోర్సుల వివరాలు...
1. బీయస్సీ (అగ్రికల్చర్) - (అర్హత: ఇంటర్ బైపీసీ).
2. బీయస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్- (అర్హత: ఇంటర్ బైపీసీ/ ఎంపీసీ).
3. బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్ - (అర్హత: ఇంటర్ ఎంపీసీ).
4. బీటెక్ (ఫుడ్ సైన్స్)- (అర్హత: ఇంటర్ బైపీసీ/ఎంపీసీ).
5. బీయస్సీ (ఆనర్స్) హోమ్ సైన్స్ - (అర్హత: ఇంటర్ బైపీసీ)
6. బి.యస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ - (అర్హత: ఇంటర్ బైపీసీ)
7. బి.యస్సీ (ఆనర్స్) ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ - (అర్హత: ఇంటర్ బైపీసీ).
* ఈ కోర్సుల కాలవ్యవధి 4 సంవత్సరాలు.
ప్రవేశ విధానం: బీయస్సీ (ఆనర్స్) హోమ్‌సైన్స్, బీయస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ, బీయస్సీ (ఆనర్స్), ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులు మినహాయించి మిగిలిన బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఎంసెట్ ర్యాంకు తప్పనిసరి. హోమ్‌సైన్స్ విభాగంలోని కోర్సుల్లోకి కేవలం మహిళలను మాత్రమే తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ ప్రకటన ప్రత్యేకంగా విడుదల అవుతుంది.
వర్సిటీ పరిధిలోని కళాశాలలు
* వ్యవసాయ కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, బాపట్ల, మహానంది (కర్నూలు), అశ్వరావుపేట (ఖమ్మం), వైరా (శ్రీకాకుళం), రాజమండ్రి, జగిత్యాల.
* వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు - బాపట్ల (గుంటూరు జిల్లా), మడకశిర (అనంతపురం), సంగారెడ్డి (మెదక్).
* ఫుడ్ సైన్స్ కళాశాలలు - బాపట్ల (గుంటూరు జిల్లా), పులివెందుల (కడప).
* హోమ్‌సైన్స్ - గృహవిజ్ఞాన కళాశాల (సైఫాబాదు, హైదరాబాదు.)
ఉపాధి అవకాశాలు: వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కంపెనీలు, వ్యవసాయ అభివృద్ధి నిర్వహణ సంస్థలు వ్యవసాయ అధికారులుగా, పర్యవేక్షక నిపుణులుగా అవకాశాలు కల్పిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులుగా చేరవచ్చు. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, సహకార సంస్థల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలున్నాయి. విత్తన కంపెనీలు, పురుగు మందులు, ఎరువుల తయారీ సంస్థలు వ్యవసాయ పట్టభద్రులను తీసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు మంజూరుకు, బీమా సంస్థల్లో వ్యవసాయ విషయనిపుణులుగా మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. అగ్రి క్లినిక్స్ ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టే వీలుంటోంది.
వెబ్‌సైట్: http://www.angrau.ac.in
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం 
వ్యవసాయంతోపాటు ఉద్యాన రంగానికి కూడా ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. కూరగాయల సాగు, పండ్లతోటలు, పూలు, ఔషధ, సుగంధ మొక్కల పెంపకం, ఉద్యానవనాల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలన్నీ ఈ విభాగం కిందకే వస్తాయి. ఈ రంగాల్లో అవసరమైన నిపుణులను అందించేందుకు 2007లో డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
వర్సిటీ అందిస్తున్న కోర్సు: బీయస్సీ (ఆనర్స్) హార్టీకల్చర్ (అర్హత: ఇంటర్ బైపీసీ).
వ్యవధి: నాలుగు సంవత్సరాలు. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
చిరునామా: డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా.
వెబ్‌సెట్: www.drysrhu.edu.in
తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యాన కాలేజీలు: రాజేంద్రనగర్ (హైదరాబాద్), వెంకట రామన్నగూడెం (పశ్చిమ గోదావరి), మోజెర్ల, (కొత్తకోట, మహబూబ్‌నగర్), అనంతరాజుపేట (వై.ఎస్.ఆర్. కడప).
ఉపాధి అవకాశాలు: ఉద్యాన విద్యనభ్యసించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖలో హార్టీకల్చర్ ఆఫీసర్లుగా ఉపాధి అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని విత్తన కంపెనీలు ఉద్యానవనాలకు కన్సల్టెంట్లుగా వీరినే నియమిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో.....
దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15 శాతం సీట్లు, కర్నాల్‌లో ఉన్న నేషనల్ డెయిరీ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో 100 శాతం సీట్లను భర్తీ చేయడానికి న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనామండలి ఏటా అఖిల భారత స్థాయిలో ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. ఈ మండలి నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా చేరదగిన డిగ్రీ కోర్సులు..
బీఎస్సీ (బీటెక్ /బీఎఫ్‌సీ)
సబ్జెక్టులు: అగ్రికల్చర్, హార్టీకల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, హోమ్‌సైన్స్, సెరికల్చర్, బయోటెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
వీటిలో చేరేందుకు ఇంటర్‌లో (బైపీసీ) కనీసం 60 శాతం మార్కులు అవసరం. వయసు 17 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
చిరునామా: ఎగ్జామినేషన్ సెల్, ఎడ్యుకేషన్ డివిజన్
భారత వ్యవసాయ పరిశోధనా మండలి
కృషి అనుసంధాన్ భవన్, పూసా, న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.icar.org

ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీలు
* యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - బెంగళూర్
* యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - ధార్వాడ్
* యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ - రాయచూర్
* యూనివర్సిటీ ఆఫ్ హార్టీకల్చరల్ సైన్సెస్ - నాగనగర్, భాగల్‌కోట్
* తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ - కోయంబత్తూర్
* తమిళనాడు వెటర్నరీ యానిమల్ సైన్స్‌వర్సిటీ - చెన్నై
* డాక్టర్ బాలాసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ - రత్నగిరి, మహారాష్ట్ర
* డాక్టర్ పంజాబీరావ్ దేశ్‌ముఖ్ కృషీ విద్యాపీఠ్ - అకోలా, మహారాష్ట్ర
* మహాత్మా పూలె కృషీ విద్యాపీఠ్ - రాహౌరి, మహారాష్ట్ర
* మరట్వాడ అగ్రికల్చర్ వర్సిటీ - పర్భణి, మహారాష్ట్ర
* కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ - త్రిసూర్
* బెనారస్ హిందు యూనివర్సిటీ - వారణాసి
* కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం - ఇంఫాల్
* హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ - హిస్సార్.
* జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ - పంత్‌నగర్.

ప్రవేశం: జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించి ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీటిలో 15 శాతం సీట్లను భారత వ్యవసాయ పరిశోధనా మండలి నిర్వహించే ప్రవేశపరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా భర్తీచేస్తారు. మిగిలిన 85 శాతం సీట్లను లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు.
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం
పాడి, పౌల్ట్రీ పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం లాంటి వాటితో పశుసంవర్ధక రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తోంది. ఈ రంగం పురోగతి కోసం అవసరమైన నిపుణులను అందించేందుకు ప్రభుత్వం 2006లో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసింది. 2007-08 విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సంస్థ అందిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు...
1. బీవీఎస్సీ అండ్ ఎ.హెచ్. - (5 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ బైపీసీ).
2. బీఎఫ్ఎస్సీ- (4 ఏళ్లు, అర్హత: ఇంటర్ బైపీసీ).
3. బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)- (4 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ ఎంపీసీ).
ఎంపిక: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా.

వర్సిటీ పరిధిలోని ప్రధాన కళాశాలలు
*
పశువైద్య కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, గన్నవరం, విజయవాడ, ప్రొద్దుటూరు (కడప), కోరుట్ల (కరీంనగర్).
* మత్స్య కళాశాల - ముత్తుకూరు, (నెల్లూరు).
* డెయిరీటెక్నాలజీ-కామారెడ్డి(నిజామాబాద్), తిరుపతి.
ఉపాధి అవకాశాలు: వెటర్నరీ సైన్స్ (పశు వైద్యం) చదివిన విద్యార్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్ర పశు సంవర్థక శాఖలో పశువైద్యులుగా చేరవచ్చు. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫారాలు, పౌల్ట్రీ ఫారాలు, పశువులకు వచ్చేవ్యాధుల నివారణకు ఉపయోగించే ఔషధాలను తయారు చేసే కంపెనీలు తదితర సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.svvu.edu.in

భవిష్యత్తుకు తిరుగులేదు!
వ్యవసాయ కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఆచార్య రంగా వర్సిటీలో పాఠ్య ప్రణాళికను మారుస్తున్నారు. ముఖ్యంగా ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫైనల్ ఇయర్ చివర్లో ఆయా కళాశాలల్లో ఉన్న ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, విత్తన కంపెనీలు తదితర సంస్థల్లో ఉపాధి లభిస్తోంది.