Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వైద్య విద్య అనుబంధ కోర్సులు

నిర్ధారణ నుంచి నయమయ్యేదాకా!

ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తగానే డాక్టర్‌ దగ్గరకు వెళతాం. అనారోగ్యానికి కారణం కనుక్కోవడంలోనూ, పూర్తిగా నయమయ్యేలా చేయడంలో మరికొందరి సేవలు ఉపయోగపడతాయి. వీరిలో వైద్య అనుబంధ/ పారామెడికల్‌ నిపుణులది ప్రధాన పాత్ర. రోగ నిర్ధారణ పరీక్షలు, కొన్ని రకాల చికిత్సలు అందించడం వీరి విధి. ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ లాంటివి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రత్యేక పారా మెడికల్‌ కోర్సులున్నాయి. బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు ఈ కోర్సుల్లో ప్రవేశించవచ్చు!

వ్యాధులను ఓడించి, మనుషుల ప్రాణాలు రక్షించే వైద్య రంగం చాలా విస్తృతమైనది. దీనిలో పారామెడికల్‌ కోర్సులు ప్రముఖమైనవి. ప్రైవేటు, ప్రభుత్వరంగాల్లో వైద్యసేవలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలూ విస్తృతమవుతున్నాయి. పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ హెల్త్‌యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ త్వరలో ప్రకటనలు విడుదల చేస్తాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న వైద్య అనుబంధ కోర్సుల్లో చేరి, తగిన శిక్షణ పొందితే మంచి ఉపాధిని అందుకోవచ్చు.

మెడికల్‌ లెబోరేటరీ టెక్నాలజీ
వ్యాధిని గుర్తించడంలోనూ, దానికి తగిన చికిత్సను సూచించడంలోనూ క్లినికల్‌ లెబోరేటరీ టెస్ట్‌లు అవసరమవుతాయి. ఈ విధిని మెడికల్‌ లెబోరేటరీ టెక్నీషియన్లు నిర్వహిస్తారు. వీరు ల్యాబ్‌లో నిర్వహించే టెస్ట్‌లకు సంబంధించిన అంశాలన్నింటినీ నేర్చుకుంటారు. రోగితో నేరుగా సంప్రదించే అవకాశం తక్కువే అయినప్పటికీ ఆసుపత్రుల్లో వీరికీ ఎక్కువ ఆదరణ ఉంటుంది.

రెస్పిరేటరీ థెరపీ
శ్వాససంబంధ వ్యాధుల నిర్ధారణ, చికిత్స, రిహాబిలిటేషన్‌ అంశాలను అధ్యయనం చేస్తారు. రెస్పిరేటరీ థెరపిస్ట్‌ ఫిజీషియన్‌ ఆధ్వర్యంలో సంబంధిత చికిత్సను అందిస్తారు. దీర్ఘ వ్యాధులైన సీఓపీడీ, బ్రాంకైటిస్, లంగ్‌ డిసీజెస్, స్లీప్‌ ఆప్నియా, ఆస్తమా, అలర్జీ అంశాల్లో సంబంధిత నిపుణులకు సాయమందిస్తారు. వీరు ప్రధానంగా ఐసీయూలు, ల్యాబ్‌ల్లో ఎక్కువగా పనిచేస్తారు.

రేడియోథెరపీ టెక్నాలజీ
రేడియోగ్రాఫర్లు, రేడియేషన్‌ ఆంకాలజిస్టులు, మెడికల్‌ ఫిజిస్ట్‌లు, రేడియోథెరపీలో పనిచేసే నర్సులతో కలిసి వీరు పనిచేస్తారు. కోర్సులో భాగంగా హ్యూమన్‌ అనాటమీ, ఫిజియాలజీ, క్యాన్సర్లు, పేషెంట్‌ కేర్, రేడియోగ్రాఫిక్‌ టెక్నిక్‌లు, రేడియోథెరపీ చికిత్సా విధానాలు, ప్రాథమిక రేడియేషన్‌ ఫిజిక్స్, రేడియోథెరపిక్‌ ఎక్విప్‌మెంట్‌ టెక్నాలజీ అంశాలను నేర్చుకుంటారు.

మెడికల్‌ ఇమేజింగ్‌
మెడికల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఒక శాఖ. శరీరానికి వెలుపల తగిలే దెబ్బలు కంటికి కనిపిస్తాయి. కానీ లోపల తగిలే దెబ్బలు, విరిగిన ఎముకలు, వివిధ జబ్బులు, దెబ్బల తీవ్రత గురించి తెలుసుకోవడానికి టెక్నాలజీ సాయం అవసరమవుతుంది. ఎక్స్‌రే, రేడియోగ్రఫీ, ఫ్లూరోస్కోపీ, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ మొదలైనవన్నీ దీనికిందకే వస్తాయి. ఈ వివిధ రేడియోలాజికల్‌ టెక్నిక్‌ల గురించి కోర్సులో చదువుతారు.

ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ
వినడం, మాట్లాడటం.. కమ్యూనికేషన్‌లో ప్రధానాంశాలు. వీటిలో లోపాలు ఏర్పడినపుడు సంబంధిత నిపుణులు అవసరమవుతారు. ఆడియాలజీలో వినికిడి లోపాలను గుర్తించడం, అంచనావేయడం దానికి అనుగుణంగా చికిత్సను నిర్ణయిస్తారు. స్పీచ్‌ విభాగంలో.. మాట, భాష, గొంతు, స్పష్టత లోపాల గురించి తెలుసుకుంటారు. ఈ నిపుణులు వ్యక్తిలో వీటికి సంబంధించిన లోపాలను గమనించి, తగిన సాయమందిస్తారు.

పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ
వీరు వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌లు, ఇంట్రా ఆర్టిక్‌ బలూన్‌ పంప్స్‌ వంటి లైఫ్‌ సపోర్ట్‌ ఎక్విప్‌మెంట్లను నిర్వహించే నిపుణులు. గుండె సంబంధ సర్జికల్‌ టీమ్‌లో వీరూ ఒకరు. పెద్ద సర్జరీల సమయంలో పేషెంట్లకు లైఫ్‌ సేవింగ్‌ సపోర్ట్‌ను అందిస్తారు. కోర్సుల్లో భాగంగా కార్డియాట్రిక్‌ అనాటమీ, ఫిజియాలజీ, పాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫీటల్‌ అండ్‌ నియోనేటల్‌ కార్డియాక్‌ డెవలప్‌మెంట్, పర్‌ఫ్యూజన్‌ సైన్స్‌ అంశాలను నేర్చుకుంటారు.

కార్డియో వాస్కులార్‌ టెక్నాలజీ
ఆసుపత్రుల్లో కార్డియో వాస్కులర్‌ టీమ్‌లో ఈ నిపుణులదీ ప్రముఖ పాత్రే. గుండె సంబంధ క్లినికల్‌ ప్రాక్టీస్‌కు అవసరమైన థియరిటికల్‌ పరిజ్ఞానంతోపాటు ప్రస్తుత ఆధునిక పరికరాలకు సంబంధించిన అంశాలనూ కోర్సులో భాగంగా నేర్పుతారు. ఎలక్ట్రో కార్డియోగ్రఫీ, ట్రెడ్‌మిల్‌ స్ట్రెస్‌ టెస్టింగ్, 24 అవర్‌ ఆంబ్యులేటరీ ఈసీజీ మానిటరింగ్‌ మొదలైన పరికరాల గురించిన శిక్షణనిస్తారు.

డయాలసిస్‌ థెరపీ
కిడ్నీ సంబంధ వ్యాధులు, రీప్లేస్‌మెంట్‌ థెరపీ వంటి మూత్రపిండ చికిత్స అంశాలను నేర్చుకుంటారు. డయాలసిస్‌ మెషినరీని సెట్‌ చేయడం, ఉపయోగించడం, ప్రక్రియను చేపట్టాక పేషెంట్‌ పరిస్థితిని పర్యవేక్షించడం వంటివి చేస్తారు. అనాటమీ, ఫిజియాలజీ, రెంటల్‌ డిసీజెస్, బ్లడ్‌ కెమిస్ట్రీ అంశాలనూ తెలుసుకుంటారు.

ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ
ఆపరేషన్‌ గదిలో సర్జరీ నిర్వహించేది వైద్య బృందమే అయినా వారికి అవసరమైన సామగ్రిని సమయానికి అందుబాటులో ఉంచేవారు వేరు. ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ నిపుణులు ఈ పనిని చేస్తారు. అందుకే సర్జరీలో వీరిదీ ప్రముఖ పాత్రే. ఆపరేషన్‌ గదిని శస్త్రచికిత్సకు సిద్ధం చేయడం, ఆ సమయంలో వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులకు అవసరమైన టెక్నికల్‌ సాయం అందించడం వీరి విధి. సంబంధిత ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.

ఆక్యుపేషనల్‌ థెరపీ
వైద్యులు సూచించిన నివారణ పద్ధతులను ఆచరించడం, రిహాబిలిటేషన్‌ ద్వారా జబ్బులను నయం చేయడం దీనిలో ప్రధానంగా కనిపిస్తుంది. దీన్నే ఫిజికల్‌ థెరపీ అనీ పిలుస్తారు. రోగి చుట్టుపక్కల వాతావరణం, దినచర్యల్లో మార్పులు చేయడం ద్వారా శారీరక, భావోద్వేగ, మానసిక సమస్యలను అదుపు చేయడం వంటివి కోర్సులో నేర్చుకుంటారు. దీనలో పీడియాట్రిక్స్, హ్యాండ్‌ థెరపీ, అడల్డ్‌ రిహాబిలిటేషన్స్‌ వంటి స్పెషలైజేషన్లుంటాయి. వీరికి ఆసుపత్రులు, రిహాబిలిటేషన్‌ సెంటర్లు, స్పెషల్‌ స్కూళ్లు, గెరియాట్రిక్‌ హోమ్స్‌ల్లో అవకాశాలుంటాయి.

క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ
తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఐసీయూలో ఉండే పేషెంట్ల బాధ్యతను వీరు చూసుకుంటారు. నేరుగా వారికి సేవలందించడంతోపాటు వెంటిలేటర్లు, కార్డియో వాస్కులార్‌ పెరామీటర్లను మానిటర్‌ చేయడం, బ్రాంకోస్కోపీ, కార్డియో పల్మనరీ రెసస్టికేషన్‌ మొదలైవన్నీ చూసుకోవడం వీరి విధి. వివిధ ఎక్విప్‌మెంట్లు, చికిత్స విధానాల గురించి కోర్సులో భాగంగా చదువుతారు.

అనస్థీషియా టెక్నాలజీ
సర్జరీలు, ఆపరేషన్లు ఏవైనా అనస్థీషియా టెక్నీషియన్లు తప్పనిసరి. పేషెంట్‌ ప్రీ ఆపరేటివ్‌ కేర్‌కు సంబంధించిన అన్ని అంశాల్లో వీరి జోక్యం ఉంటుంది. సర్జరీ సమయంలో అనస్థీషియా నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను తీసుకుంటారు. వీరికి అనస్థీషియా టెక్నిక్‌లు, ఇన్‌స్ట్రుమెంట్లు, సప్లైస్, టెక్నాలజీ అంశాలపై పట్టు ఉంటుంది. వీరు ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూ, సర్జరీ క్లినిక్‌ల్లో పనిచేస్తారు.

ఇంకా.. న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ, ప్రొస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీఓ), ఎమర్జెన్సీ అండ్‌ ట్రామా కేర్‌ టెక్నాలజీ, ఫిజీషియన్‌ అసిస్టెంట్, న్యూరో ఎలక్ట్రోఫిజియాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్, యూరాలజీ టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్, మెడికల్‌ సోషియాలజీ, కార్డియాలజీ, హాస్పిటల్‌ ఫుడ్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్, రేడియోగ్రాఫిక్‌ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి.

ఎక్కడ? ఎలా?
పారామెడికల్‌ కోర్సులను ఉద్యోగాధారిత కోర్సులుగా వ్యవహరిస్తారు. వీరు మల్టీడిసిప్లినరీ విభాగాల్లో వైద్యులతో కలిసి పనిచేస్తారు. వీటిలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా డిగ్రీ కోర్సుల కాలవ్యవధి 3 నుంచి 4 ఏళ్లు; డిప్లొమా కోర్సులకు ఒకటి నుంచి రెండేళ్ల వరకూ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులు మాత్రం
ఏపీ - http://www.appmb.co.in/
తెలంగాణ - http://www.tspmb.telangana.gov.in/
పారామెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంస్థలన్నీ ఎక్కువశాతం మెరిట్‌ ఆధారంగానే ఎంచుకుంటున్నాయి. కొన్ని మాత్రం ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

Posted on 08-06-2020


చికిత్సలో ఫిజియో టచ్‌

ఆధునిక జీవన శైలి, అధికమవుతున్న ప్రమాదాలు, వివిధ వృత్తుల తీరు ఫిజియోథెరపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. కొన్ని ప్రమాదాలు, పలు రకాల అనారోగ్యాలకు శస్త్ర చికిత్సలు తప్పనిసరి. వాటికి గురైన వాళ్లంతా త్వరగా కోలుకోవడానికి మందులతోపాటు ఫిజియో థెరపీ కీలకంగా మారింది. సమస్యను బట్టి వ్యక్తుల వారీగా ఒక్కో తరహా ఫిజియో సేవలు అవసరమవుతున్నాయి. దీంతో ఈ రంగంలో నిపుణులకు డిమాండ్‌ ఎక్కువవుతోంది. ఆ అవకాశాలను అందుకోవాలంటే ఫిజియో కోర్సులు చేయాలి. ఇంటర్మీడియట్‌ అర్హతతో వాటిలోకి ప్రవేశించవచ్ఛు.

శరీరంలో ఏదైనా అవయవం ప్రమాదానికి గురైనా, చచ్చుబడినా దాన్ని మునుపటి స్థితికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఫిజియోథెరపీ (భౌతిక చికిత్స). నిర్దేశిత పద్ధతులు, వ్యాయామాలు, ఉపకరణాల ద్వారా ఫిజియోథెరపిస్టులు సాంత్వన చేకూరుస్తారు. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, జీవనశైలి, వృత్తి నేపథ్యాల కారణంగా వస్తున్న నొప్పులు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాలు మొదలైనవాటి తీవ్రతను తగ్గించడమే ఫిజియోథెరపీ ప్రధాన కర్తవ్యం. ప్రస్తుతం తగినంత మంది నిపుణులు మన దగ్గర లేరు. అందువల్ల ఆసక్తి ఉన్న వారు ఫిజియో కోర్సులు చేస్తే అవకాశాలను సొంతం చేసుకోవచ్ఛు ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు, ఒకేషనల్‌ కోర్సులు చదువుకున్నవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)లో చేరవచ్ఛు కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి లభిస్తుంది. ఆర్థెయిటిస్‌, నడుము నొప్పులు, పనిలో ఏర్పడిన గాయాలు, ఆటలాడుతున్నప్పుడు కండరాలు పట్టేయడం, స్ట్రోక్‌, పక్షవాతం, ప్రమాదవశాత్తు ఏర్పడిన వైకల్యాలు వీటన్నింటికీ ఫిజియోథెరపీ సేవలు అవసరమే.

కోర్సు స్వరూపం
ఫిజియోథెరపీ కోర్సు పదో తరగతి తర్వాత ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యలో, డిప్లొమా స్థాయిలో అందుబాటులో ఉంది. ఈ రెండు కోర్సుల ప్రాధాన్యం, పరిధి తక్కువ. ఫిజియోథెరపిస్టుగా అవకాశాలు సొంతం చేసుకోవాలంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)లో చేరాలి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. కోర్సులో భాగంగా మానవ శరీర నిర్మాణం, వివిధ అవయవాల పనితీరు తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, మెడికల్‌, సర్జికల్‌ కండిషన్లు, బయోమెకానిక్స్‌, కైనిసియాలజీ, డిజెబిలిటీ ప్రివెన్షన్‌, రిహాబిలిటేషన్‌ మొదలైన వాటిని బోధిస్తారు. థియరీ, ప్రాక్టికల్స్‌ రెండింటికీ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో అంతర్గతంగా ఉన్న ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. కోర్సు చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్‌సైజ్‌ థెరపీ, ఎలక్ట్రో థెరపీ విభాగాలపై పట్టు సాధించాలి. కోర్సు పూర్తయిన తర్వాత విధుల్లో భాగంగా సమస్యలు ఉన్నవారికి ఉష్ణం, విద్యుత్తు, మెకానికల్‌ ప్రెషర్‌, మెకానికల్‌ ఫోర్స్‌, కొన్ని రకాల వ్యాయామాలను ఉపయోగించి ఉపశమనం కలిగించేందుకు వీరు కృషి చేస్తారు. ఇందుకోసం పలు పరికరాలను ఉపయోగిస్తారు. ఫిజియోలకు శారీరక దృఢత్వం ఉండాలి. కొన్నిసార్లు గంటలపాటు, పలు విధాలుగా, విడతలవారీ ఎక్సర్‌సైజ్‌లు చేయించాలి. దీనికి తగిన ఓపిక, శారీరక సన్నద్ధత ఉండాలి. వైద్యులతో అనుసంధానమవుతూ, వాళ్ల సూచనలు పరిగణనలోకి తీసుకుని, అవసరాలకు కావాల్సిన సేవలు అందించాలి. నొప్పి కారణంగా రోగులు ఫిజియో థెరపీకి విముఖత చూపవచ్ఛు అందువల్ల వారితో సానుకూలంగా వ్యవహరించి, థెరపీ ప్రాధాన్యాన్ని వివరించే నైపుణ్యం ఉండాలి. మాటలతోనూ కొంత మానసిక సాంత్వన కలిగించే విధంగా వ్యవహరించాలి.

తెలుగు రాష్ట్రాల్లో...
ఏపీ, తెలంగాణల్లో సుమారు 60కు పైగా కాలేజీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందుబాటులో ఉంది. ఏపీలో 37, తెలంగాణలో 21 కాలేజీలు బీపీటీ కోర్సు అందిస్తున్నాయి. ఏపీలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ల ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.నిమ్స్‌, హైదరాబాద్‌, మరికొన్ని సంస్థలు ప్రత్యేక ప్రకటన ద్వారా పరీక్ష నిర్వహించి బీపీటీ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ ప్రకటనలన్నీ సాధారణంగా జులైలో వెలువడతాయి. ఇంటర్‌ బైపీసీ లేదా ఒకేషనల్‌ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌తో పాటు బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ఏపీ/ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు వయసు డిసెంబరు 31, 2020 నాటికి 17 ఏళ్లు నిండాలి.

కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవరమెంట్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటార్‌ డిజెబిలిటీస్‌ - కోల్‌కతా, స్వామీ వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - కటక్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ - చెన్నై ఉమ్మడి పరీక్ష ద్వారా ఫిజియో థెరపీ కోర్సుల్లోకి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. జులై 10లోగా దరఖాస్తు చేసుకోవచ్ఛు పరీక్షను ఆగస్టు 2న సికింద్రాబాద్‌, విజయవాడల్లో రాసుకోవచ్ఛు.

వెబ్‌సైట్‌: http://www.svnirtar.nic.in/

మన దేశంలో సుమారు 2 శాతం మంది ఏదో ఒక వైకల్యంతో బాధ పడుతున్నారు. వీరందరికీ సేవలందించడానికి వైద్యవిభాగాల మార్గదర్శకాల ప్రకారం ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఫిజియోథెరపిస్టు ఉండాలి.

ఉద్యోగావకాశాలు
బీపీటీ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువగా కార్పొరేట్‌ హాస్పిటళ్లలో అవకాశాలు లభిస్తాయి. ఎంపీటీ విద్యార్హతతో స్పెషాలిటీ విభాగాల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్ఛు రిహాబిలిటేషన్‌ సెంటర్లు, పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్లు, స్పెషల్‌ స్కూళ్లు, ఉమెన్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, పాలీ క్లినిక్‌లు, ఓల్డేజ్‌ హోంలు, హోం కేరింగ్‌, దివ్యాంగులకు సేవలందించే కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్‌ హోంలు/ ప్రైవేటు కేర్‌ సెంటర్లు, స్పోర్ట్స్‌ క్లినిక్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో అవకాశాలు ఉంటాయి. కొంచెం అనుభవం పొందిన తర్వాత సొంత ప్రాక్టీస్‌ ద్వారా ఆదాయం పెంచుకోవచ్ఛు సేవలందిస్తున్న ప్రాంతం, థెరపీ విధానం బట్టి ఒక్కో సిట్టింగ్‌కూ రూ. 400 వరకు అందుతుంది. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ సేవల కోసమే ఆవిర్భవించాయి. నగరాలు, పట్టణాల్లో వీటిద్వారా ఉపాధి పొందవచ్ఛు విషయపరిజ్ఞానం, ఆంగ్లంలో నైపుణ్యం ఉన్న ఫిజియోలకు విదేశాల్లోనూ ఆదరణ ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ల్లో వీరికి డిమాండ్‌ ఉంది. ఈ దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలు అందుతున్నాయి.

ఉన్నత విద్య
బీపీటీ తర్వాత మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ)లో చేరవచ్ఛు కోర్సు వ్యవధి రెండేళ్లు. నచ్చిన విభాగంలో సేవలందించడానికి పీజీలో స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్ఛు మస్క్యులోస్కెలిటల్‌ సైన్సెస్‌, కార్డియో వాస్కులర్‌ అండ్‌ పల్మనరీ సైన్సెస్‌, న్యూరో సైన్సెస్‌, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్స్‌, అబ్‌స్ట్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, జెరియాట్రిక్స్‌, కమ్యూనిటీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్‌ ఫిజియో థెరపీ మొదలైనవి ఉన్నాయి. ఎంపీటీ తర్వాత ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీలో చేరవచ్ఛు మేటి అవకాశాలకు పీజీ, బోధనలో రాణించడానికి పీహెచ్‌డీ ఉపయోగపడతాయి. ఫిజియో థెరపీ కోర్సులన్నింటికీ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌ (ఐఏపీ) అపెక్స్‌ బాడీగా వ్యవహరిస్తోంది.

అందిస్తున్న కొన్ని సంస్థలు
* ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, ముంబయి.
* పండిట్‌ దీన్‌దయాళ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజెబిలిటీస్‌, న్యూదిల్లీ
* పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, చండీగఢ్‌
* క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌, వెల్లూరు
* మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, మణిపాల్‌
* అపోలో కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, హైదరాబాద్‌
* నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌), హైదరాబాద్‌
* శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌), తిరుపతి
* కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌), సికింద్రాబాద్‌
* యశోదా అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, హైదరాబాద్‌

Posted on 02-06-2020


వైద్యానికి ముందూ... వెనకా!
ఏదైనా ఆరోగ్య సమస్యతో డాక్టర్‌ దగ్గరకు వెళితే రోగ నిర్ధారణకు టెస్ట్‌లు చేయిస్తారు. మెడిసిన్‌ ఇస్తారు. పూర్తి చికిత్స కోసం ఏం చేయాలో చెబుతారు. నయం చేయడంలో ప్రత్యక్షంగా మనకు డాక్టర్‌ మాత్రమే కనిపించినప్పటికీ రకరకాల పరీక్షలు, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు తదితరాల కోసం ఎందరో సాయం చేస్తారు. వీరందరినీ పారామెడికల్‌ సిబ్బంది అంటారు. కొన్ని ప్రత్యేకమైన కోర్సులు చేయడం ద్వారా వాళ్లు ఆ నైపుణ్యాలను పొందుతారు. ఇంటర్మీడియట్‌ తర్వాత వైద్యసంబంధ సేవల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇవి మంచి మార్గాలు. వేగంగా ఉపాధి అవకాశాలను కూడా అందిస్తాయి.
వైద్యరంగంలో టెక్నాలజీ అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వైద్య విభాగంలోని ప్రతి అంశానికి సంబంధించిన ప్రత్యేక నిపుణులు అవసరం అవుతున్నారు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని కలిగినవారిని పారామెడిక్స్‌గా పిలుస్తారు.
శరీరంలో ఉండే రోగాలను నిర్ధారణ చేయడం ద్వారా పారామెడిక్స్‌ వైద్యులకు సాయం చేస్తారు. రక్తపరీక్ష, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, అల్ట్రాసౌండ్‌ మొదలైనవన్నీ వీరి పనిలో భాగమే. వీరి నివేదికల ఆధారంగానే వైద్యులు రోగికి మెరుగైన వైద్యాన్ని అందించగలుగుతారు. సంబంధిత అంశాల్లో నైపుణ్యం సాధించాలనుకునేవారు ఎంచుకునేవే పారామెడికల్‌ కోర్సులు. ఇవి విద్యార్థులను సుశిక్షితులను చేసి నైపుణ్యమున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు, టెక్నీషియన్లుగా తీర్చిదిద్దుతాయి. వైద్యులతోపాటు వీరిదీ ప్రధాన పాత్రే. అందుకే దేశంలోనే కాదు, విదేశాల్లోనూ వీరికి గిరాకీ ఎక్కువే.
ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారికి ప్రధానంగా రెండు రకాల పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు, డిప్లొమా కోర్సులు.

బీఓటీ (ఆక్యుపేషనల్‌ థెరపీ)
దీన్నే ఫిజికల్‌ థెరపీ అని కూడా అంటారు. ఇది ప్రధానంగా వైద్యులు సూచించిన నివారణ పద్ధతులను ఆచరించడం, రిహాబిలిటేషన్‌ ద్వారా జబ్బులను నయం చేయడంపై దృష్టిసారిస్తుంది. శారీరక, భావోద్వేగ, మానసిక సమస్యలను ఎలా అదుపుచేయాలో, నివారించాలో దీనిలో నేర్చుకుంటారు. కోర్సులో భాగంగా రోగి చుట్టుపక్కల వాతావరణంలో మార్పులు చేయడం, రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో బోధించడం వంటి అంశాలను తెలుసుకుంటారు. దీనిలో పీడియాట్రిక్స్‌, హ్యాండ్‌ థెరపీ, అడల్ట్‌ రిహాబిలిటేషన్స్‌ మొదలైన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటాయి. బైపీసీ పూర్తిచేసినవారు అర్హులు. బీఎస్‌సీ కోర్సులున్నాయి. కాలవ్యవధి నాలుగేళ్లు. కొన్ని సంస్థలు మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దిల్లీ యూనివర్సిటీ, సీఎంసీ వెల్లూర్‌, మణిపాల్‌ యూనివర్సిటీ, ఏఐఐపీఎంఆర్‌ వంటి కొన్ని సంస్థలు సొంత ప్రవేశపరీక్షలను నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి.

ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ థెరపీ
వినడం, మాట్లాడటం భావప్రసరణలో భాగాలు. వీటిలో ఏవైనా లోపాలు వచ్చినపుడు ఆడియాలజీ, స్పీచ్‌ థెరపిస్ట్‌ల అవసరం ఏర్పడుతుంది. కోర్సులో భాగంగా వినడానికి, మాట్లాడటానికి తోడ్పడే పరికరాల గురించి తెలుసుకుంటారు. సంబంధిత సమస్యలున్న వారి సమస్యను గుర్తించడం, అంచనావేయడం, రిహాబిలిటేషన్‌ అందించడం ద్వారా సాయపడతారు.
బీఎస్‌సీ, బీఏ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌సీ కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు కాగా డిప్లొమా కోర్సు కాలవ్యవధి 1-2 సంవత్సరాలు. సైన్స్‌ విభాగంలో ఇంటర్‌ పూర్తి చేసినవారెవరైనా ఎంచుకోవచ్చు. చాలావరకూ అన్ని సంస్థలూ ప్రత్యేకమైన ప్రవేశపరీక్షను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ప్రవేశపరీక్షల ద్వారా తీసుకుంటున్నవాటిలో ప్రధానమైనవి.

ఫిజియోథెరపీ
ప్రమాదాలు, వృద్ధాప్యం కారణంగా కదలికల్లో ఏర్పడిన సమస్యలకు ఫిజియోథెరపిస్టులు చికిత్సను అందిస్తారు. ఎముకలు వైదొలగడం, దెబ్బలు తగలడం, విరగడం వంటి వాటికి చికిత్స అందించడం వీరి పనిలో భాగం. వివిధ భాగాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా హ్యూమన్‌ అనాటమీలోని వివిధ అంశాలనూ కోర్సులో భాగంగా చదువుతారు. వయసు పైబడటం ద్వారా వచ్చే ఎముకల సమస్యలు, వ్యాధులు, గాయాలు మొదలైన వాటన్నింటికీ వీరు చికిత్స అందిస్తారు.
ఈ విభాగంలో బీఎస్‌సీ/ బీపీటీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌సీ కాలవ్యవధి మూడేళ్లు కాగా, బీపీటీ నాలుగేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. డిప్లొమా కోర్సులు 2-3 సంవత్సరాలు. బైపీసీ చదివినవారు అర్హులు. రాష్ట్రీయ, కేంద్ర విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్షల (సీఈటీ, జీజీఎస్‌ఐపీయూ సీఈటీ మొదలైనవి)ను రాయడం ద్వారా ప్రవేశాలను పొందొచ్చు. ఎంసెట్‌ ద్వారా డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ వంటివి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ
ఆపరేషన్‌ గదిలో పేషెంట్‌, వైద్య బృందానికి అవసరమైన పరికరాలన్నింటినీ అందుబాటులో ఉంచుతారు. నిజానికి ఆపరేషన్‌ సమయంలో వీరిదీ ప్రముఖ పాత్రే. ఆపరేషన్‌ గదిని శస్త్రచికిత్సకు సిద్ధం చేయడం, ఆపరేషన్‌కు ముందు పేషెంట్‌ను గదిలోకి తీసుకెళ్లడం, పూర్తయ్యాక వేరే గదిలోకి పంపడం, సర్జరీ చేసేవారికి, అనస్థీషియా వారికి, నర్సులకు టెక్నికల్‌ సాయం అందించడం వీరి విధి.
దీనిలో బీఎస్‌సీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు కాగా, డిప్లొమా కోర్సుల వ్యవధి 1-2 సంవత్సరాలు. సైన్స్‌ విభాగంలో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలుంటాయి. నిమ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ పారామెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్‌ మహీంద్రా స్మార్ట్‌ అకాడమీ ఫర్‌ హెల్త్‌కేర్‌ వంటివి ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాలు జరుపుతున్నాయి.

డయాలసిస్‌ టెక్నాలజీ
రక్తాన్ని శుద్ధి చేయడం మూత్రపిండాల విధి. వీటి పనిలో ఏదైనా ఆటంకం ఏర్పడినపుడు సంబంధిత వ్యక్తికి డయాలసిస్‌ అవసరం ఏర్పడుతుంది. కృత్రిమంగా రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియగా చెప్పొచ్చు. దీనిలో నిపుణులైనవారు ఈ ప్రక్రియను చేపడతారు. కోర్సులో భాగంగా దానికి సంబంధించిన పరికరాలు, వాటిని ఉపయోగించే తీరు, ప్రక్రియకు ముందు, తరువాత చేపట్టాల్సిన విధులను నేర్చుకుంటారు. అలాగే అనాటమీ, ఫిజియాలజీ, రెంటల్‌ డిసీజెస్‌, బ్లడ్‌ కెమిస్ట్రీ మొదలైన అంశాలనూ తెలుసుకుంటారు.
బీఎస్‌సీ, డిప్లొమా కోర్సులున్నాయి. బీఎస్‌సీ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు, డిప్లొమా 1-2 ఏళ్లు. బైపీసీ పూర్తిచేసినవారు అర్హులు. చాలావరకూ సంస్థలు మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు జరుపుతున్నాయి.

మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ
ఏదైనా ఆరోగ్యసమస్యతో బాధపడుతుంటే.. అది రావడానికి కారణాలను పరీక్షించి వెల్లడించేవారే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లు. క్లినికల్‌ డయాగ్నొసిస్‌ లేబొరేటరీ పరీక్షలను నిర్వహించడంలో ఈ నిపుణులు ప్రధాన పాత్ర పోషిస్తారు. కోర్సులో భాగంగా వ్యాధుల నిర్ధారణ, సమాచార సేకరణ, సంబంధిత పరికరాలు, శాంపిల్‌ సేకరణ మొదలైన అంశాలను నేర్చుకుంటారు.
బీఎస్‌సీ, బీఎంఎల్‌టీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌సీ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు, డిప్లొమా 1-2 ఏళ్లు. చాలావరకూ సంస్థలు మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలను నిర్వహిస్తుండగా, కొన్ని సంస్థలు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి.

అనస్థీషియా టెక్నాలజీ
చిన్నదైనా, పెద్దదైనా సర్జరీల విషయానికొచ్చేసరికి బాధితుడికి మత్తుమందు (అనస్థీషియా) అవసరం తప్పక ఉంటుంది. దీనికీ ప్రత్యేకమైన పరికరాలు, నైపుణ్యాలు, మోతాదులు వంటివి ఉంటాయి. వీటన్నింటిపై అవగాహన, పట్టు ఉన్నవారినే వైద్యసంస్థలూ ఎంచుకుంటాయి. ఒక సర్వే ప్రకారం మనదేశంలో ప్రతి లక్ష మందికి ఒక అనస్థీటిస్ట్‌ మాత్రమే ఉన్నాడని అంచనా. కాబట్టి, ఈ నిపుణులకు మంచి అవకాశాలుంటాయి.
బీఎస్‌సీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సుకు కాలవ్యవధి మూడేళ్లు, డిప్లొమా కోర్సులు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ ఉన్నాయి. ఇంటర్‌లో బైపీసీ పూర్తిచేసినవారు అర్హులు. మెరిట్‌ ఆధారంగా కొన్ని ఎంపిక చేస్తుంటే, మరికొన్ని సంస్థలు ప్రత్యేక ప్రవేశపరీక్షను నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఆప్టోమెట్రీ
మానవ శరీరంలో అతి సున్నితమైన భాగం కళ్లు. చూపు పరంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడినపుడు అందుకు తగ్గ కళ్లజోళ్లను సూచించేవారే ఆప్టోమెట్రిస్ట్‌లు. కళ్లకు సంబంధించిన సమస్యలను కనిపెట్టడం, అందుకు వ్యాయామాలు, సరైన లెన్సులను సూచించడం, చికిత్సలను సూచించడం వంటివి వీరి విధులు.
డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. కోర్సు కాలవ్యవధి మూడు-నాలుగేళ్లు. ఇంటర్‌లో బైపీసీ చదివినవారు అర్హులు. రాష్ట్రీయ, కేంద్ర ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాలను పొందొచ్చు. కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

నర్సింగ్‌
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 10 వృత్తుల్లో నర్సింగ్‌ ఒకటిగా చెపుతారు. గాయపడిన లేదా ఆరోగ్యం దెబ్బతిన్న వ్యక్తికి బాహ్య చికిత్సతోపాటు మానసిక చేయూతా అవసరమే. దానిని అందించేవారే నర్సులు. నర్సింగ్‌ నైపుణ్యాలను కోర్సు ద్వారా అందిపుచ్చుకుంటారు. కోర్సులో భాగంగా థియరిటికల్‌ పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌నూ సొంతం చేసుకుంటారు. నర్సింగ్‌కు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానం, ప్రాథమిక చికిత్స, మిడ్‌వైఫరీ అంశాలను నేర్చుకుంటారు. బీఎస్‌సీ కోర్సు. కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌లో బయాలజీ చదివినవారు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ఇవేకాకుండా.. రేడియాలజీ, ఎక్స్‌రే టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్‌ టెక్నాలజీ, పర్‌ఫ్యూషన్‌ టెక్నాలజీ వంటి విభాగాల్లో బీఎస్‌సీ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.


వైద్య రంగం అంటే... కేవలం డాక్టర్ మాత్రమే కాదు. నర్సులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు కూడా వైద్య రంగంలోకే వస్తారు. చాలా మందికి వైద్య రంగంలోకి రావాలని ఉన్నా ఎంసెట్‌లో సరైన ర్యాంక్ రానందువల్ల వైద్య వృత్తిలోకి ప్రవేశించలేకపోవచ్చు. అలాంటి వారికి విభిన్నమైన కోర్సులను దేశంలోని వర్సిటీలు అందిస్తున్నాయి. వాటిలో చేరడం ద్వారా వైద్యులకు సేవచేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్న వారు అవుతారు.
      వైద్య రంగంలో ప్రవేశించాలనుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో అనేక యూనివర్సిటీలు వివిధ స్పెషలైజేషన్లతో బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, పారామెడికల్ డిప్లొమా తదితర కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంటే మరికొన్ని ఇంటర్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర సబ్జెక్టులు) వచ్చిన మార్కుల ఆధారంగా చేర్చుకుంటున్నాయి.
బి.పి.టి. (ఫిజియోథెరపీ)
    బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీని బి.పి.టి.గా పిలుస్తున్నారు. శారీరక నొప్పులతో ( మెడ, వెన్ను, మోకాళ్లు తదితర శారీరక భాగాలు) ఇబ్బందులు పడే వారికి క్రమపద్ధతిలో చికిత్సలు చేయాల్సి ఉంటుంది. వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను ఇందులో నేర్పుతారు. ఈ కోర్సు చేసినవారు సొంతంగా ఫిజియోథెరపిస్టులుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ఆసక్తి ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరవచ్చు.
బీఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)
    వ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌లలో ఎలాంటి పరీక్షలు నిర్వహించాలో నేర్పుతారు. కెమికల్, బ్యాక్టీరియోలాజికల్, మైక్రోస్కోపిక్, బయోలాజికల్ టెస్టులు చేయడంలో పాటించాల్సిన విషయాలు తెలియజేస్తారు. ఈ కోర్సులో చేరేందుకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ చదివి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి.
బి.యు.ఎం.ఎస్. (యునానీ)
     పురాతన వైద్య విధానాల్లో యునానీ వైద్య విధానం ప్రత్యేకమైంది. వ్యాధిగ్రస్తులకు సహజ సిద్ధంగా లభించే వివిధ ఔషధాలతో చికిత్సలు ఎలా చేయాలి? తదితర విషయాలు నేర్పిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో రెండు యునానీ కళాశాలలున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష (బి.యు.ఎం.ఎస్.సెట్)ను ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీ నిర్వహిస్తుంది. పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుంది.
కాలేజీలు..
1. నిజామియా టిబ్బి ప్రభుత్వ యునానీ కళాశాల (హైదరాబాద్).
2. డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ కళాశాల (కర్నూలు).

నర్సింగ్
ఇంటర్ సైన్స్ విద్యార్థులకు విలువైన కోర్సు - నర్సింగ్. ఉన్నతమైన, ఉదాత్తమమైన భవిష్యత్తును అందించడంలో నర్సింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కోర్సును ప్రపంచ వ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, హాస్పిటల్స్ నిర్వహిస్తున్నాయి. వైద్య అవసరాలకు తగిన సేవలు అందించేందుకు శిక్షణ ఇస్తున్నాయి.
మన దేశంలో నర్సింగ్ విద్యా వ్యవస్థ పనితీరును సరైన పంథాలో అమలు చేసేందుకు 1947లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నర్సింగ్ కళాశాలల ఏర్పాటు మొదలు, కరిక్యులమ్‌ను రూపొందించడం, ప్రవేశ ప్రక్రియ తదితర అంశాలన్నింటినీ నిర్దేశిస్తుంది. కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేపడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో...
నర్సింగ్‌కు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన కాలేజీలు నిర్వహిస్తున్నాయి. వీటిని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ప్ర‌భుత్వాలు పర్యవేక్షిస్తాయి. నర్సింగ్‌లో డిగ్రీ కోర్సుల ప్రవేశ ప్రక్రియను విజయవాడలోని డాక్టర్ ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ చేపడుతుంది.
కోర్సుల వివరాలు....
బీఎస్సీ ( బేసిక్ నర్సింగ్- 4 సంవత్సరాలు): నర్సింగ్ వృత్తిలో రాణించడానికి కావాల్సిన ప్రాథమిక సూత్రాలను నేర్పుతారు. కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. ఇందులో చేరేందుకు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలనీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు అవసరం. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 ఏళ్లు దాటకూడదు. ఇంటర్లో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జి.ఎన్.ఎం. (మూడున్నరేళ్లు): జనరల్ నర్స్ మిడ్‌వైఫ్‌గా పిలుస్తారు. దీన్లో చేరేందుకు వయసు 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులుండాలి. ఆర్ట్స్ సబ్జెక్టులు చేసినవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. లేదా ఒకేషనల్ ఎ.ఎన్.ఎం. కోర్సు పూర్తిచేసి ఉండాలి.
* ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ఎ.ఎన్.ఎం.) చేసేందుకు టెన్త్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి.
పోస్ట్ బీఎస్సీ (నర్సింగ్): ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఈ కోర్సును రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. కాల వ్యవధి రెండేళ్లు. దూరవిద్యావిధానంలో ఇగ్నో అందిస్తోంది. కాల వ్యవధి 3 ఏళ్లు. ఇంటర్‌తోపాటు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తారు.
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యూనివర్సిటీ బీఎస్సీ (నర్సింగ్), డిగ్రీ, పీజీ, డాక్టొరల్ ప్రోగ్రాములను అందిస్తోంది.
1. బీఎస్సీ (నర్సింగ్) (మహిళలకు మాత్రమే)
2.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బి.పి.టి.): వీటికి జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
3.
పీజీ డిప్లొమా ఇన్ ఎక్స్ రే- టెక్నాలజీ: ఈ కోర్సులో చేరడానికి ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
డిగ్రీ తర్వాత చేరదగిన పీజీ కోర్సుల్లో ఎంఎస్సీ నర్సింగ్, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ మొదలైన కోర్సులు ఉన్నాయి.
వెబ్‌సైట్: www.nims.ap.nic.in

జాతీయ స్థాయిలో...
నర్సింగ్ కోర్సుకు సంబంధించి డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఇతర కోర్సులను జాతీయస్థాయిలో ఎయిమ్స్, నిమ్‌హాన్స్, అహల్యాభాయ్ నర్సింగ్ కాలేజ్ మొదలైనవి నిర్వహిస్తున్నాయి.
ఎయిమ్స్
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ఆఫ్‌మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహిస్తున్న కోర్సుల్లో బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్, పారామెడికల్ ఉన్నాయి.
1) బీఎస్సీ (ఆనర్స్): ఈ కోర్సుకు ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులుండాలి. అఖిల భారత స్థాయిలో జరిగే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు.
2) బీఎస్సీ ఆనర్స్ - పారా మెడికల్ కోర్సులు (ఆఫ్తాల్మిక్ టెక్నిక్, మెడికల్ టెక్నాలజీ ఇన్ రేడియోగ్రఫీ మొదలైనవి): కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివినవారు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.aiims.edu

ఇగ్నో బీఎస్సీ (ఆనర్స్)
పారామెడికల్ విభాగంలో ఆఫ్తాల్మిక్ స్పెషలిస్టులు బహువిధాలుగా సేవలందించాలనే లక్ష్యంతో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) బీఎస్సీ (ఆనర్స్) ఆప్టొమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్ కోర్సును ప్రవేశ పెట్టింది.
ఇందులో కంటి పరీక్షలకు సంబంధించిన ప్రయోగాల ప్రక్రియలను నేర్పుతారు. శిక్షణ తర్వాత వీరు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఆప్టోమెట్రిస్ట్ అండ్ రిఫ్రాక్షనిస్ట్‌గా చేరవచ్చు. ఆప్టీషియన్, ఆప్ట్టోమెట్రిస్ట్, హెల్త్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ తదితర స్థాయుల్లో ఉపాధి పొందవచ్చు.
ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులతో కనీసం 45 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు. వయసు 17 సంవత్సరాలు నిండాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.ignou.ac.in
అహల్యాభాయ్ నర్సింగ్ కాలేజ్
న్యూఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న అహల్యాభాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ కోర్సు (4 ఏళ్లు)ను అందిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
చిరునామా: Ahalyabai Nursing College,
Near Lok Nayak Jayaprakash Narayan Hospital,
NewDelhi.

నిమ్‌హాన్స్
మానసిక వికలాంగుల సంరక్షణకు అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య నిపుణులు, సేవా సిబ్బందిని తీర్చిదిద్దడానికి బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తోంది. ప్రభుత్వ రంగ పరిధిలో స్వయం ప్రతిపత్తి సంస్థగా కొనసాగుతూ 1994 నుంచి డీమ్డ్ వర్సిటీగా గుర్తింపు పొందింది.
ఈ సంస్థ అందిస్తున్న కోర్సుల వివరాలు...
1) బీఎస్సీ నర్సింగ్: కాల వ్యవధి 4 ఏళ్లు. ఇంగ్లిష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులున్న వారు అర్హులు.
2) బీఎస్సీ (రేడియోగ్రఫీ): కాల వ్యవధి 3 సంవత్సరాలు. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
3) బీఎస్సీ (అనెస్తీషియా టెక్నాలజీ): కాలవ్యవధి 3 ఏళ్లు. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులుండాలి. ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థులను చేర్చుకుంటారు. వయసు 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వెబ్‌సైట్: www.nimhans.kar.nic.in

పారా మెడికల్ కోర్సులు
ఆస్పత్రుల్లో డాక్టర్ ఒక్కరే ఉంటే సరిపోదు. చికిత్స కోసం వచ్చిన వారికి కట్టు కట్టడంతోపాటు, వ్యాధి నిర్ధారణలో ఎక్స్‌రే, స్కానింగ్ తదితర పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విధుల్లో పాలుపంచుకునే వారే పారా మెడికల్ సిబ్బంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ కోర్సులను ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు నిర్వహిస్తోంది. ఇవి ప్రధానంగా డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు. వివరాలు..
డిప్లొమా కోర్సులు (కాల వ్యవధి 2 సంవత్సరాలు)
1) మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
2) ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్
3) ఆప్టొమెట్రీ టెక్నీషియన్
4) మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
5) ఆడియోమెట్రీ టెక్నీషియన్
6) పెర్ఫ్యూజన్ టెక్నీషియన్
7) రేడియో థెరపీ టెక్నీషియన్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
8) డయాలసిస్ టెక్నీషియన్
9) హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్
10) మెడికల్ స్టెరిలైజేషన్ టెక్నీషియన్
11) మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (పురుషులు మాత్రమే).

సర్టిఫికెట్ కోర్సులు (కాల వ్యవధి సంవత్సరం)
1) కార్డియాలజీ టెక్నీషియన్
2) క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్
3) ఈసీజీ టెక్నీషియన్
4) బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్
5) రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
6) డార్క్ రూమ్ అసిస్టెంట్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
7) అనెస్తీషియా టెక్నీషియన్

ప్రవేశ విధానం: ఇంటర్‌లో గ్రూప్ సబ్జెక్టుల్లో అభ్యర్థికి వచ్చిన సగటు మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికపై ఎంపిక చేస్తారు. వయసు 15 సంవత్సరాలు ఉండాలి.