Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


బైపీసీతో బ్యాచిల‌ర్ కోర్సులు

వైద్యరంగం వద్దనుకుంటే..!
బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన వారికి ఎంబీబీఎస్, బీడీఎస్‌ లాంటి మెడికల్‌ కోర్సులే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఇతర డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. అవి చేస్తే సైన్స్‌ రిసెర్చ్, నేర పరిశోధన రంగాల్లోకి ప్రవేశించవచ్చు. అడవుల పెంపకాలను ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చు. ఆహార సంస్థలు, ఫార్మా కంపెనీలు, బయోటెక్నాలజీ విభాగాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అందుకే ఇంటర్‌ తర్వాత బైపీసీతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కోర్సుల్లో కొన్నింటికి బైపీసీతో పాటు ఎంపీసీ విద్యార్థులూ అర్హులే.

జీవశాస్త్రం పట్ల మక్కువ ఉన్న విద్యార్థులకు సరైన ఎంపిక బైపీసీ గ్రూప్‌. ఇంటర్మీడియట్‌ తర్వాత వ్యయంతో కూడుకున్న మెడికల్‌ కోర్సులు చేయలేని వారికి లేదా వాటి పట్ల ఆసక్తి లేని వాళ్లకు మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు ఉన్నాయి. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లతో ముడిపడిన ఆ కోర్సులకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. విద్యార్థులు తమ అభిరుచులు, ఆసక్తుల ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

ఫోరెన్సిక్‌ సైన్స్‌
నేర పరిశోధన రంగంపై ఆసక్తి ఉండి, సవాళ్లతో కూడిన వృత్తి జీవితాన్ని ఇష్టపడేవారు ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సును ఎంచుకోవచ్చు. నేరగాళ్లకు శిక్షపడేలా చేయడంలో కోర్టులకు తగిన ఆధారాలను సమర్పించడంలో ఈ నిపుణుల పాత్ర కీలకమైంది. పరిశీలనా నైపుణ్యాలు, సహజంగా పరిశోధించే స్వభావం, ఆసక్తి ఉన్నవారు ఈ వృత్తిలో రాణిస్తారు.
కోర్సులు: డిగ్రీ స్థాయిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ కోర్సును హైదరాబాద్‌లోని రాజా బహదూర్‌ వెంకట రామ్‌రెడ్డి ఉమెన్స్‌ కళాశాల అందిస్తోంది. లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, గల్గోతియా యూనివర్సిటీ, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి. గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ, బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలలో కూడా ఫోరెన్సిక్‌ కోర్సు అందుబాటులో ఉంది. మైసూరులోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌) ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్సెస్‌లో కోర్సు అందిస్తోంది.
ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులు అర్హులు. మెరిట్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ఉద్యోగాలు: ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), రాష్ట్ర పోలీస్‌ దళాల్లో దర్యాప్తు అధికారులుగా, ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

బీఎస్సీ ఫారెస్ట్రీ
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వేతర సంస్థలూ దృష్టి సారిస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థలు కూడా మొక్కలు/ వనాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఫారెస్ట్రీ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది.
కోర్సులు: హైదరాబాద్‌లోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫారెస్ట్రీలో బీఎస్సీ, ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ కోర్సులు అందిస్తోంది. డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, రాంచీలోని బిర్సా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలు ఫారెస్ట్రీలో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి. బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఉద్యోగాలు: ఈ కోర్సులు చేసినవారు ఫారెస్టర్, డెండ్రాలజిస్ట్, ఎంతాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్, జూ క్యూరేటర్‌ లాంటి ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. కార్పోరేట్‌ సంస్థలతో పాటు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ), దాని అనుబంధ అటవీ పరిశోధనా సంస్థలైన ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - డెహ్రాడూన్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ ఫారెస్ట్రీ అండ్‌ ఎకో రిహాబిలిటేషన్‌ - అలహాబాద్‌తోపాటు డెహ్రాడూన్, కోయంబత్తూర్‌లలో ఉన్న వైల్డ్‌లైఫ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, జూలాజికల్‌ పార్కులు, వైల్డ్‌లైఫ్‌ రేంజ్‌లలో అవకాశాలు లభిస్తాయి.

ఫుడ్‌ టెక్నాలజీ
ఆహార ఉత్పత్తులను సురక్షితంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవసరమైన కొత్త పద్ధతులు, వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి తోడ్పడేదే ఫుడ్‌ టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా ఆహార పరిశ్రమల భవిష్యత్తు ఫుడ్‌ టెక్నాలజీ నిపుణులపైనే ఆధారపడి ఉంది. కొన్ని కోర్సులు చేయడం ద్వారా ఈ రంగంలో ఉద్యోగాలు పొందవచ్చు.
కోర్సులు: గుంటూరులోని ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఫుడ్‌ టెక్నాలజీలో బీటెక్‌ కోర్సు అందుబాటులో ఉంది. గుంటూరులోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ, అనంతపురం జేఎన్‌టీయూ, బాపట్ల, పులివెందులలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల్లో ఈ కోర్సులు లభిస్తున్నాయి.మైసూర్‌లోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఈ విభాగంలో డిగ్రీ చేయవచ్చు.
ఇంటర్‌ బైపీసీ లేదా ఎంపీసీతో ఉత్తీర్ణులైన వారు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ఆధారంగా, కొన్ని ఇతర రాష్ట్రాల్లో జేఈఈతో అడ్మిషన్లు ఇస్తున్నారు.
ఉద్యోగాలు: ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, హోటళ్లు, శీతలపానీయాల ఉత్పత్తి సంస్థల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థల్లో కొలువులుంటాయి. ప్రైవేట్‌ రంగంలో అమూల్, క్యాడ్‌బరీ, బ్రిటానియా, హిందుస్థాన్‌ లీవర్, కెలాగ్స్, నెస్లే లాంటి సంస్థల్లో క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్, ల్యాబొరేటరీ సూపర్‌వైజర్, ప్రొడక్షన్‌ మేనేజర్, ఫుడ్‌ ప్యాకేజింగ్‌ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలు పొందొచ్చు.

న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌
మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. జీవితకాల నాణ్యతను పెంచడానికి సలహాలు ఇచ్చే న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ నిపుణులకు ప్రస్తుతం గిరాకీ ఎక్కువైంది. దీంతో ఈ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది.
కోర్సులు: బీఎస్సీ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు (కొన్నిచోట్ల నాలుగేళ్లు). ఆంధ్రా యూనివర్సిటీ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో బీఎస్‌సీ కోర్సును అందిస్తుస్తోంది. న్యూదిల్లీలోని దిల్లీ యూనివర్సిటీ (లేడీ ఇర్విన్‌ కాలేజీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోం ఎకనామిక్స్‌; కోల్‌కతాలోని జేడీ బిర్లా యూనివర్సిటీ, లూథియానాలోని పంజాబ్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లోనూ ఈ కోర్సులు ఉన్నాయి.ఇంటర్‌లో బైపీసీ లేదా ఎంపీసీ చేసినవారు అర్హులు.
ఉద్యోగాలు: వీరికి హాస్పిటళ్లు, ఆహార ఉత్పత్తి సంస్థల్లోని పరిశోధనా విభాగాలు, స్టార్‌ హోటళ్లు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లు, రిక్రియేషన్‌ క్లబ్బులు, క్రీడాకారుల శిక్షణ కేంద్రాలు మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయంలో స్పృహ పెరిగిన నేపథ్యంలో పోషకాహార నిపుణులు ప్రముఖ ఆస్పత్రుల్లోని ప్రత్యేక విభాగాల్లో సేవలు అందిస్తున్నారు.

బయో టెక్నాలజీ
మన దేశంలో 1986లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద బయోటెక్నాలజీ ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌ను www.dbtindia.nic.in ఏర్పాటు చేశారు. ఇది దేశంలో ఆధునిక జీవశాస్త్ర, బయోటెక్నాలజీ రంగంలో అభివృద్ధికి కొత్త ప్రేరణ ఇచ్చింది. ఉపాధి కల్పించడంలో వేగంగా వృద్ధి చెందుతున్న రంగంగా పేరుగాంచింది.
కోర్సులు: తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాశాలలు బయోటెక్నాలజీలో బీఎస్సీ డిగ్రీని అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌లో బైపీసీ లేదా ఎంపీసీ చదివిన వారు ఈ కోర్సులు ఎంచుకోవచ్చు.
ఉద్యోగాలు: ఔషధ సంస్థలు, రసాయన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో బయోటెక్నాలజిస్టులకు కెరియర్‌ అవకాశాలుంటాయి. రిసెర్చ్‌ సైంటిస్ట్‌లు, సైన్స్‌ రైటర్లు, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్లు, ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జ్‌లుగా పని చేయవచ్చు.

బీఎస్సీ జెనెటిక్స్‌
ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలో బీఎస్సీ జెనెటిక్స్ కోర్సును బోట‌నీ, జువాల‌జీ స‌బ్జెక్టుల‌తో కలిసి అందిస్తున్నారు. కోర్సు వ్య‌వ‌ధి మూడేళ్లు.
గార్డెన్ సిటీ యూనివ‌ర్సిటీ, బెంగ‌ళూరు; ద‌యానంద్ సాగ‌ర్ ఇన్‌స్టిట్యూట్‌, బెంగ‌ళూరు; గురునాన‌క్ దేవ్ యూనివ‌ర్సిటీ, అమృత్‌స‌ర్‌...త‌దిత‌ర సంస్థ‌లు బీఎస్సీ జెనిటిక్స్ కోర్సు అందిస్తున్నాయి.


బైపీసీ తర్వాత ఎంబీబీఎస్‌ సీటు రాకపోతే అంతా వృథా అనే అపోహలో చాలామంది ఉంటారు. ఆ గ్రూప్‌లో చేరి పొరపాటు చేశామని బాధపడుతుంటారు. అవన్నీ అనవసరమైన భయాలే. బైపీసీ పూర్తయితే డాక్టర్‌ చదువులే కాదు ఇంకా బంగారంలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. వాటిలో చేరితే వేగంగా ఉద్యోగంలో స్థిరపడటంతోపాటు, సమాజంలో గౌరవాన్నీ అందుకోవచ్చు.
      మనదేశంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మినహాయిస్తే ప్రైవేటు వర్సిటీలూ, కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూపును ఎంచుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంబీబీఎస్‌ను మాత్రమే చేరదగిన కోర్సుగా పరిగణిస్తారు. దాంట్లో సీటు రాకపోతే గ్రూపులో చేరి, పొరపాటు చేశామని నిరాశపడుతుంటారు. కానీ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీఏఎంఎస్‌ మాత్రమే కాకుండా బైపీసీ పూర్తిచేసినవారికి ఇతర కోర్సుల్లో విస్తృతమైన విద్య, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఖర్చు పరంగా కూడా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి త్వరగా జీవితంలో స్థిరపడేందుకు ఇవి సాయపడతాయి.
బీఎస్‌సీ అగ్రికల్చర్‌
వైద్యేతర కోర్సుల తరువాత మంచి డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో బీఎస్‌సీ- అగ్రికల్చర్‌ ముందుస్థానంలో ఉంటుంది. వ్యవసాయ ప్రధాన దేశం కావడం వల్ల ఈ కోర్సు చేసేటప్పుడు విద్యార్థులు దానికి తేలిగ్గా అనుసంధానం అయిపోతుంటారు. ఇందులో పరిశోధనలకు ఎంతో అవకాశం, ఆదరణ ఉన్నాయి. ఎంసెట్‌ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్‌లో చేరవచ్చు. ఈ డిగ్రీ పొందినవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, అగ్రిక్రెడిట్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, సాయిల్‌ అసిస్టెంట్‌, క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌లో క్వాలిటీ చెక్‌ ఆఫీసర్‌, విత్తన అభివృద్ధి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి వ్యవసాయ, వ్యవసాయాధారిత ఉద్యోగాలు లభిస్తాయి.
బీఎస్‌సీ హార్టికల్చర్‌
మొక్కల పెంపకం, మొక్కలపై రిసెర్చ్‌, గార్డెనింగ్‌ సైన్స్‌, విత్తన రిసెర్చ్‌ల సమాహారమే హార్టికల్చర్‌ కోర్సు. ఇది బయాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ వంటి పరస్పరాధారిత కోర్సుల మేలు కలయిక. ఈ డిగ్రీ పూర్తిచేసి ఉన్నత చదువుల్లో పరిశోధన వైపు మొగ్గు చూపితే మెరుగైన అవకాశాలున్నాయి. ఎంసెట్‌ ద్వారా కోర్సులోకి ప్రవేశాన్ని పొందొచ్చు. ప్రభుత్వంలోని వ్యవసాయ, అటవీశాఖల్లో ఉద్యోగాలు వస్తాయి. క్రమంగా భారత ప్రభుత్వ సంస్థలైన స్పైస్‌ బోర్డు, కాయిర్‌ బోర్డు, రబ్బర్‌ బోర్డుల వారు వెలువరించే ఉద్యోగ ప్రకటనల ద్వారా కూడా ఉద్యోగాలు సాధించుకోవచ్చు.
ఫార్మసీ కోర్సులు
ఔషధ రంగంలో రిసెర్చ్‌, స్వయం ఉపాధి, కార్పొరేట్‌ ఉద్యోగాలను కోరుకునేవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఎంసెట్‌ ద్వారా ఇందులోకి అడుగు పెట్టవచ్చు.
బీ ఫార్మసీ: ఈ కోర్సు పూర్తిచేసినవారు ఫార్మసిస్ట్‌, డ్రగిస్ట్‌, పేషెంట్‌ కౌన్సెలింగ్‌ లేదా ఫార్మా సంస్థలో ప్రొడక్షన్‌, క్వాలిటీ విభాగాల్లో ఉద్యోగావకాశాలను పొందొచ్చు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫార్మసిస్ట్‌ వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. మెడికల్‌ కోడింగ్‌లో వీరికి డిమాండ్‌ ఉంది. బహుళజాతి సంస్థలు వీరికి మంచి వేతనాలను అందిస్తున్నాయి.
ఫార్మా-డీ: ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందుతున్న సమకాలీన కోర్సుల్లో ఫార్మా-డీ ప్రముఖమైంది. ఔషధ వినియోగం, వ్యాధి నిర్ధారణ-చికిత్స, ఔషధ ప్రతికూల ప్రభావాల సేకరణ, పర్యవేక్షణకు సంబంధించిన విజ్ఞానశాస్త్రమే ఫార్మా-డీ. ఈ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వారు ఈ కోర్సుకు గుర్తింపు ఇచ్చారు. దీన్ని పూర్తిచేసినవారికి మెడికో మార్కెటింగ్‌, ఫార్మకో విజిలెన్స్‌, ఔషధ నియంత్రణ పట్టాల డెవలప్‌మెంట్‌, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, డ్రగ్‌ ఎక్స్‌పర్ట్‌, కమ్యూనిటీ ప్రాక్టిషనర్‌ వంటి వివిధ ఉద్యోగావకాశాలున్నాయి.
బయోటెక్నాలజీ
జీవ కణాలకు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బయోటెక్నాలజీగా పిలుస్తాం. సూక్ష్మజీవుల పాత్ర మనిషి జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది. వాటి సూక్ష్మ అధ్యయనానికి ఈ కోర్సు దోహదపడుతుంది. ఇది ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సు కావడంతో వ్యవసాయ, ఔషధ, పర్యావరణ రంగాల్లో నిపుణులను తయారు చేయడంతోపాటు ఆయా రంగాల్లో విద్యకు, ఉద్యోగాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. బీఎస్‌సీ బయోటెక్నాలజీ, బీటెక్‌ బయోటెక్నాలజీ కోర్సులను బైపీసీ తరువాత ఎంచుకోవచ్చు. అనేక ప్రముఖ సంస్థల్లోని బయోటెక్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష (కంబైన్డ్‌ బయోటెక్నాలజీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌)ను న్యూదిల్లీలోని జేఎన్‌యూ నిర్వహిస్తోంది. బయోటెక్నాలజీ డిగ్రీ, పీజీ పట్టభద్రులకు మన దేశంతోపాటు విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో బెంగళూరు, లఖ్‌నవూ, గుడ్‌గావ్‌ల్లో స్థాపించిన బయోటెక్‌ పార్కులు, హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ, ఐసీఐసీఐ నాలెడ్జ్‌ పార్క్‌ వంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఉద్యోగాలు ఉంటాయి.
ఫోరెన్సిక్‌ సైన్స్‌
నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి నేరస్థులను కోర్టుకు అప్పగించడంలో ఈ కోర్సు ఉపయోగపడుతుంది. బైపీసీ పూర్తిచేసినవారు దీన్ని ఎంచుకోవచ్చు. ప్రైవేటు డిటెక్టివ్‌, సీబీఐ, సీఐడీ సంస్థల్లో న్యాయ, చట్ట సంబంధమైన సంస్థల్లో ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
బీఎస్‌సీ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌
జీవరాశి మనుగడ కోసం దానికి కావాల్సిన ఆహారాన్ని అందించడమే న్యూట్రిషన్‌ ముఖ్య ఉద్దేశం. ఈ కోర్సు మనిషి శరీరం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది. ఈ కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు. కొన్ని యూనివర్సిటీల్లో నాలుగేళ్లు కూడా ఉంది. ఈ కోర్సులో తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ, కాలేజీ ఆఫ్‌ హోంసైన్స్‌ బీఎస్సీ ఆనర్స్‌ అందిస్తోంది. వీటిలో ఎమ్మెస్సీతో పాటు పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. ఇంకా న్యూదిల్లీలోని దిల్లీ యూనివర్సిటీ (లేడీ ఇర్విన కాలేజీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోం ఎకనామిక్స్‌, కోల్‌కతాలోని జేడీ బిర్లా యూనివర్సిటీ, లూథియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ఈ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.
ఫుడ్‌ టెక్నాలజీ
ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్‌, క్వాలిటీ, సంరక్షణ, నిల్వ వంటి అంశాల కలయికే ఆహార సాంకేతిక పరిజ్ఞానం. పోషక విలువల పెంపు, ఆహారాభివృద్ధి కోసం మెరుగైన పద్ధతులను కనిపెట్టడం వంటి వివిధ ప్రక్రియలకు సాంకేతికతను జోడించడమే ఈ కోర్సు ప్రత్యేకత. బీఎస్‌సీ, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుల్లోకి ప్రవేశాన్ని ఎంసెట్‌ ఆధారంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అందిస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పుర్‌లోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది.
ఇతర కోర్సులు
బైపీసీ పూర్తిచేసినవారికి ఇతర సంప్రదాయ, సంప్రదాయేతర కోర్సులైన బీఎస్‌సీ-నర్సింగ్‌, బీఎస్‌సీ-హోంసైన్స్‌, బీఎస్‌సీ-కెమిస్ట్రీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌, బీఎస్సీ (బీటీసీఎఫ్‌ఎస్‌), బీపీటీ (బ్యాచిలర్‌ ఇన్‌ ఫిజియోథెరపీ), బీఎస్‌సీ- జువాలజీ, బోటనీ కోర్సులు, ఆర్ట్స్‌ కోర్సులైనటువంటి బీకాం, బీఏ, బీబీఎం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా బీఎస్‌సీ స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
బైపీసీ తరువాత డాక్టర్‌ విద్య మాత్రమే కాకుండా ఎన్నో మెరుగైన అవకాశాలున్నాయి. వాటిని ఎంచుకుని కూడా మెరుగైన భవితను సాధించవచ్చు. ఆయా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
బైపీసీ తర్వాతసైన్స్‌ కోర్సుల్లో పీజీ చేసిన నిపుణులకు ఎంతో డిమాండ్‌ ఉంది. భవిష్యత్తులో వీరి అవసరం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.