Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


చ‌దువు + కొలువు

నాణ్యమైన చదువు ఒక ఇబ్బంది అయితే.. తర్వాత ఉద్యోగం దొరకడం మరో సమస్య. వీటిని దాటుకొని వెళ్లి స్థిరపడటం అంత సులువైన విషయం కాదు. కానీ ఆ రెండింటినీ ఖర్చులేకుండా అందుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. చదువుతోపాటు భోజన, వసతి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తారు. చక్కటి శిక్షణ, ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి పట్టా. ఎంచుకున్న కోర్సు పూర్తికాగానే ఉన్నతస్థాయి ఉద్యోగంలోకి అడుగుపెట్టడమే. దీనికి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉంటే చాలు. ఉత్తమ విద్యతో పాటు మంచి కొలువులను సొంతం చేసుకోవచ్చు.

రక్షణ దళాల్లో చేరాలనుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌ పూర్తికాగానే చక్కటి అవకాశాలు ఉన్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ; ఆర్మీ, నేవీల 10+2 ఎంట్రీ పరీక్షల్లో మెరిట్‌ సాధిస్తే డిగ్రీ చదువును, ఉద్యోగాన్ని ఎలాంటి ఖర్చులు లేకుండా పొందవచ్చు. ఆయా ప్రకటనలు వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా విద్యార్థికి క్రమశిక్షణాయుత జీవితంతోపాటు చక్కటి హోదా ఉన్న ఉద్యోగాలు అందుతాయి.

నేవీలో 10+2 (బీటెక్‌)
ఇండియన్‌ నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా చదువుతారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితమే. అనంతరం సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాతో నెలకు దాదాపు రూ. లక్షకు పైగా వేతనంతో నేవీలోనే ఉద్యోగిగా కొనసాగవచ్చు. ప్రతి సంవత్సరం జూన్‌, డిసెంబరుల్లో ప్రకటనలు వెలువడతాయి.
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ- మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) బెంగళూరు, భోపాల్‌, కోయంబతూర్‌, విశాఖపట్నంల్లో ఏదోఒక చోట రెండు దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజికల్‌ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తుదిదశ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ విద్యను నాలుగేళ్లపాటు అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అనంతరం సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు.
అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు.
వయసు: 16 1/2 - 19 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఇతర అర్హతలు: అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాలి. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
వెబ్‌సైట్‌: ‌www.joinindiannavy.gov.in

ఆర్మీలో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ
ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సు నిర్వహిస్తోంది. షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు జరిపి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి శిక్షణ తరగతులు ఉంటాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం ఇస్తారు.ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీకి ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు మే/ జూన్‌, నవంబరు/ డిసెంబరుల్లో వెలువడతాయి.
అర్హత: అవివాహిత పురుషులై ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్లు.
ఎత్తు: కనీసం 157.5 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఎంపికైన వారికి అయిదు రోజులుపాటు రెండు దశల్లో అలహాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, కపుర్తలాల్లో ఏదో ఒక చోట ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కు అనుమతిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన వారికి మెడికల్‌ టెస్టు ఉంటుంది. అందులోనూ విజయవంతమైతే తుది శిక్షణకు పంపుతారు.
శిక్షణ: కోర్సులో చేరినవాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ ఉంటుంది. తొలి ఏడాది ఆఫీసర్‌ ట్రెయినింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం టెక్నికల్‌ ట్రెయినింగ్‌ నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో ఫేజ్‌-1 కింద ప్రీ-కమిషన్‌ శిక్షణ మూడేళ్లపాటు ఇస్తారు. ఫేజ్‌-2లో భాగంగా ఏడాదిపాటు పోస్ట్‌ కమిషన్‌ ట్రెయింగ్‌ ఉంటుంది. ఫేజ్‌-1, ఫేజ్‌-2 శిక్షణలు సీఎంఈ, పుణె; ఎంసీటీఈ, మావ్‌; ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో నిర్వహిస్తారు. ఎంపికైనవారు ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతారు. మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం పూర్తి వేతనం అమలవుతుంది. లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి దిల్లీలోని జేఎన్‌యూ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
వెబ్‌సైట్‌: ‌www.joinindianarmy.nic.in

కెరీర్‌ ఇలా..
ఎన్‌డీఏ, 10+2 టెక్‌ ఎంట్రీ ఏ విధానంలో ఎంపికైనప్పటికీ, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఏ విభాగాన్ని ఎంచుకున్నప్పటికీ శిక్షణ అనంతరం విధుల్లోకి చేరిన తర్వాత మూల వేతనం రూ.56,100 చెల్లిస్తారు. మిలటరీ సర్వీసెస్‌ పే కింద మరో రూ.15,500 అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్మీలో చేరినవారికి లెఫ్టినెంట్‌, నేవీలో చేరినవారికి సబ్‌-లెఫ్టినెంట్‌, ఎయిర్‌ ఫోర్స్‌లో చేరితే ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాలు కేటాయిస్తారు. త్రివిధ దళాల్లో ఆఫీసర్‌ ఉద్యోగానికి ప్రారంభ హోదాలు ఇవే. రెండేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకుంటే తర్వాతి స్థాయి ప్రమోషన్‌ పొందవచ్చు. ఆరేళ్ల తర్వాత మరొకటి, పదమూడేళ్లకు మరో ప్రమోషన్‌ అందుతుంది. అనంతరం ప్రతిభ ప్రాతిపదికన మిగిలిన హోదాలు అందుతాయి. భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాలకు అధిపతులూ కావచ్చు.

ఎన్‌డీఏ & ఎన్‌ఏ
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) ప్రవేశానికి పరీక్షను ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఏటా జనవరి, మే నెలల్లో ప్రకటనలు విడుదలవుతాయి. జనవరిలో వచ్చే నోటిఫికేషన్‌కు ఏప్రిల్‌లో, మేలో విడుదలయ్యే ప్రకటనకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్‌డీఏకు ఎంపికైనవారు మూడేళ్లపాటు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులు చదువుతారు. నేవల్‌ అకాడమీకి ఎంపికైనవారు నాలుగేళ్లపాటు కేరళలోని ఎజిమాలలో బీటెక్‌ అభ్యసిస్తారు. రెండు చోట్లా విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఉచితంగా సమకూరుస్తారు. డిగ్రీలను న్యూదిల్లీలోని ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది.
అర్హతలు: ఆర్మీ వింగ్‌ (ఎన్‌డీఏ)కు బాలురు మాత్రమే దరఖాస్తు చేయాలి. వీరు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని విభాగాలకు ఇంటర్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 16 1/2 - 19 1/2 ఏళ్లు
శారీరక ప్రమాణాలు: అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెం.మీ. ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
ఖాళీలు: పత్రి నోటిఫికేషన్‌లోనూ 400కు పైగా ఖాళీలు ఉంటాయి. వీటిలో ఆర్మీ 200 నేవీ 60, ఎయిర్‌ఫోర్స్‌ 90 సుమారుగా ఖాళీలు ఉంటాయి. నేవల్‌ అకాడమీలో 55 వరకు ఉంటాయి.
ఎంపిక: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అవి రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ తరహా), ఇంటెలిజెన్స్‌ - పర్సనాలిటీ టెస్ట్‌. రాత పరీక్షలో మొత్తం 900 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో మ్యాథ్స్‌ నుంచి 300 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-2లో 600 మార్కులకు జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనికి వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌కు 200, జనరల్‌ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికి 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్క్‌లు ఉంటాయి. స్టేజ్‌-1లో అర్హత సాధించినవారినే స్టేజ్‌-2కి అనుమతిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిభ ఆధారంగా సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.
శిక్షణ: మొదటి రెండున్నర సంవత్సరాల శిక్షణ అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. ఎన్‌డీఏలో మూడేళ్ల శిక్షణ, చదువు అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీకి; నేవల్‌ క్యాడెట్లను ఎజిమాలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీకి; ఎయిర్‌ఫోర్స్‌ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్‌ (మూల వేతనం రూ.56,100) చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి డిగ్రీలు ప్రదానం చేస్తారు. ఆర్మీని ఎంచుకున్న వారికి బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్స్‌)/ బీఏ; నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, నావెల్‌ అకాడమీ అభ్యర్థులకు బీటెక్‌ డిగ్రీని న్యూదిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అందజేస్తుంది. అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ. లక్ష వరకు వేతనం ఉంటుంది.
వెబ్‌సైట్‌: www.upsc.gov.in