Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వాణిజ్య విద్య

వాణిజ్యయమ్ము నిశ్చయమ్ముగా!
దేశం అంటే ఆర్థిక వ్యవస్థ.. మిగతావన్నీ ఆ తర్వాతే. అంత అత్యంత ముఖ్యమైన ఆ వ్యవస్థను భుజాలకెత్తుకునే నిపుణులందరినీ కామర్స్‌ విభాగమే అందిస్తుంది. దేశాల స్థితిగతులను శాసించగలిగిన శక్తి ఈ ఆర్థికవేత్తల అదుపులో ఉంటుంది. అందుకే ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సులకు దీటుగా వాణిజ్యశాస్త్రం ఎదిగింది. జీఎస్‌టీ వంటి ఆధునిక అనువర్తనలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. కామర్స్‌ సబ్జెక్టుగా ఉన్న సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌లతోపాటు ఇతర గ్రూప్‌లతో ఇంటర్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు వాణిజ్య విద్య వరంలాంటిది. కాలంతోపాటు పరుగులుపెట్టే కామర్స్‌ను కొలువుల కామధేనువుగా చెప్పుకోవచ్చు.
ఇంటర్మీడియట్‌లో కామర్స్‌ను మ్యాథ్స్‌తో పాటు (ఎంఈసీ) చదివినవారు బీసీఏ, బీఎస్సీ చేయవచ్చు. వీటితో పాటు వివిధ డిప్లొమాలు, సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తే కామర్స్‌లో ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.
బ్యాంకింగ్‌, మేనేజ్‌మెంట్‌, అకౌంటింగ్‌, టాక్సేషన్‌లలో, ఆర్థిక సంస్థల్లో విధులు నిర్వహించాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది సరైన గమ్యం.
ఇంటర్‌ను ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ... తదితర ఏ గ్రూపు సబ్జెక్టులతో చదివినవారైనా కామర్స్‌ స్ట్రీమ్‌లోని ప్రొఫెనల్‌ కోర్సుల్లోకి ప్రవేశించవచ్చు.
కామర్స్‌ విద్యార్థులు ఫారిన్‌ ట్రేడ్‌, ఫైనాన్స్‌ అనలిస్ట్‌, మార్కెటింగ్‌, లా, జర్నలిజం-మాస్‌ కమ్యూనికేషన్‌, ఎడ్యుకేషన్‌, ఫారిన్‌ లాంగ్వేజెస్‌ మొదలైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో కూడా ప్రవేశించి రాణించవచ్చు.
ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లు కాకుండా మూడో ప్రత్యామ్నాయ మార్గంగా కామర్స్‌ (వాణిజ్యశాస్త్రం) ప్రాచుర్యం పొందింది. సామాన్య గుమాస్తాల దగ్గర్నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ఆర్థిక నిపుణుల వరకు అందరూ ఈ రంగం నుంచే వస్తున్నారు. తార్కిక, విశ్లేషణ నైపుణ్యాలున్నవారు కామర్స్‌లో రాణించే అవకాశం ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీల అమలు తర్వాత ఈ వృత్తినిపుణుల అవసరం ఎంతో పెరిగింది. అకౌంటెన్సీ లాంటివి మాత్రమే కాకుండా బీపీఓలు, ఇన్సూరెన్స్‌, బిజినెస్‌ కన్సల్టెన్సీ లాంటి ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కామర్స్‌ కోర్సులు మార్గం సుగమం చేస్తున్నాయి! గణిత నేపథ్యం, నిర్వహణ- మార్కెటింగ్‌ నైపుణ్యాలతో కలిసివుండే ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. వీటిలో థియరీ, ప్రాక్టికల్స్‌ ఉంటాయి.
ఇంటర్మీడియట్‌లో కామర్స్‌ సబ్జెక్టుగా ఉన్న సీఈసీ, ఎంఈసీ తదితర గ్రూప్‌ల అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో కామర్స్‌ కోర్సులు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివిన వారైనా తర్వాత స్థాయిలో వాణిజ్య విద్యలోకి ప్రవేశించవచ్చు. ఈ కోర్సుల్లో ప్రధానంగా బీకామ్‌, సీఏ, సీఎంఏ, సీఎస్‌ ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని డిప్లొమాలు, ఇతర కోర్సులు, కొన్ని రకాల ఉద్యోగాలు చేసుకోవచ్చు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకామ్‌)
ఇంటర్లో కామర్స్‌ గ్రూపులైన సీఈసీ, ఎంఈసీ చదివినవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకామ్‌) కోర్సు చదవొచ్చు. దీనిలో అకౌంట్స్‌, మర్కంటైన్‌ లా, అర్థశాస్త్రం, గణాంక శాస్త్రం, కాస్టింగ్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌, కంప్యూటర్‌ లాంటివి ప్రధాన సబ్జెక్టులు. మూడేళ్ల ఈ కోర్సులో విద్యార్థులు ఆసక్తి ఉన్న ఒక విభాగాన్ని ఎంచుకోవచ్చు.
విభాగాలు: జనరల్‌ బీకామ్‌, బీకామ్‌ (ఆనర్స్‌), బీకామ్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌), బీకామ్‌ (బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌), బీకామ్‌ (ఫైనాన్షియల్‌ మార్కెటింగ్‌).
* చాలా కళాశాలల్లో బీకామ్‌ను సెమిస్టర్‌ విధానంలో అందిస్తున్నారు.
* బీకామ్‌ కోర్సులను పూర్తిచేసినవారు ఎం.కామ్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్‌ లాంటి కోర్సులు చదవొచ్చు.
* బీకామ్‌ తర్వాత బ్యాంకు పరీక్షలు, సివిల్స్‌, గ్రూప్స్‌ ..ఇలా అన్ని పోటీ పరీక్షలకూ సన్నద్ధం కావొచ్చు.
* బోధనపై ఆసక్తి ఉన్నవారు డిగ్రీ తర్వాత బీఎడ్‌ చేయవచ్చు.

వృత్తివిద్యా కోర్సులు
ఇంటర్‌ తర్వాత కామర్స్‌ వృత్తివిద్యా కోర్సులైన సి.ఎ.; సి.ఎం.ఎ.; సి.ఎస్‌. కోర్సులు చేయవచ్చు. ఇవి పూర్తిచేయాలంటే సుదీర్ఘ కాలం పడుతుందనేది ఒకప్పటి మాట. తక్కువ వ్యవధిలోనే, తక్కువ ఖర్చుతోనే వీటిని విజయవంతంగా పూర్తిచేయవచ్చు. అంతే కాదు; ఈ కోర్సులు చదివే విద్యార్థులు బీకామ్‌ను దూరవిద్యలో అభ్యసించవచ్చు.

చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ)
కామర్స్‌ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయమైన విభాగం- ఈ చార్టర్డ్‌ అకౌంటెన్సీ. సి.ఎ. అంటే 9, 10 సంవత్సరాలు పడుతుందని చాలామంది భయపడుతుంటారు. ఇటీవలి ఫలితాలు చూస్తే 21-22 సంవత్సరాల వయసుకే చాలామంది సీఏ పూర్తి చేస్తున్నారు. ఇంటర్‌ తర్వాత ఫౌండేషన్‌ కోర్సు చేయటం ద్వారా సీఏను త్వరగా పూర్తిచేయవచ్చు.
ఎవరు చదవొచ్చు: ఒకప్పుడు డిగ్రీ తర్వాతే సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్‌ తర్వాతనే సీఏ చదవటం ఆరంభించవచ్చు. ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ..ఇలా ఏ గ్రూపువారైనా ఈ కోర్సు చదవొచ్చు. కానీ చాలామంది ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతోపాటే ఏకకాలంలో సీఏ కోర్సు అంశాలను అధ్యయనం చేయటానికి మొగ్గుచూపుతున్నారు.
ఎన్ని దశలు: దీనిలో సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్మీడియట్‌ (తర్వాత ఆర్టికల్‌ షిప్‌), సీఏ ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి.
* ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌ రాసినవారు మే, నవంబరు నెలల్లో రెండుసార్లు జరిగే ఫౌండేషన్‌ కోర్సుకు నమోదుచేసుకోవాలి.

కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (సీఎంఏ)
సీఏ తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన కోర్సు ఇది. ఇంటర్‌ ఎంఈసీతో పాటు సీఎంఏ చదివినవారు ఇంటర్‌ తర్వాత రెండేళ్లలోనూ; ఇంటర్‌ తర్వాత సీఎంఏ చదవటం ఆరంభించినవారు రెండున్నర ఏళ్లలోనూ సీఎంఏ పూర్తిచేయవచ్చు.
ఎవరు చదవొచ్చు: ఇంటర్లో ఏ గ్రూపు వారైనా అర్హులే.
ఎన్ని దశలు: సీఎంఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌ (తర్వాత ప్రాక్టికల్‌ శిక్షణ), ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి.
* ఏ గ్రూపుతోనైనా ఇంటర్‌ చదివినవారు జూన్‌, డిసెంబర్‌లలో జరిగే ఫౌండేషన్‌ కోర్సుకు నాలుగు నెలల ముందు నమోదు చేసుకోవాలి.

కంపెనీ సెక్రటరీ (సీఎస్‌)
కంపెనీల విధానాల రూపకర్తలుగా కంపెనీ సెక్రటరీలది ఉన్నత బాధ్యత. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లకు సలహాలు ఇవ్వడం, కంపెనీకి న్యాయసలహాలు ఇవ్వడం, యాజమాన్యానికీ, వాటాదారులకూ, రుణదాతలకూ అనుసంధానకర్తగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు.
ఎవరు చదవొచ్చు: ఇంటర్‌ను ఏ గ్రూపుతో చదివినవారైనా అర్హులే.
ఎన్ని దశలు: సీఎస్‌ ఫౌండేషన్‌, ఎగ్జిక్యూటివ్‌, (అప్రెంటిస్‌ ట్రెయినింగ్‌), ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అని మూడు దశలుంటాయి.
* జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండు సార్లు జరిగే సీఎస్‌ ఫౌండేషన్‌కు ఇంటర్‌ విద్యార్థులు 9 నెలల ముందు నమోదు చేసుకోవాలి.

ఎన్నిరకాల మార్గాలు?
ఇంటర్‌ తర్వాత కామర్స్‌ విద్యార్థులకున్న విద్యావకాశాలను డిగ్రీ, డిప్లొమా, ప్రొఫెషనల్‌ ప్రోగ్రాములుగా చెప్పవచ్చు.
డిగ్రీ కోర్సులు (3 నుంచి 4 ఏళ్ల వ్యవధి) :
* బీకామ్‌
* బీబీఏ
* బీబీఎం
* బీబీఏ-ఎల్‌ఎల్‌బీ
* బీఏ-ఎల్‌ఎల్‌బీ
* బీసీఏ
* బీఏ
డిప్లొమాలు (6 నెలల నుంచి 2 ఏళ్ల వ్యవధి):
* డిప్లొమా ఇన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం ‌
* డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ‌
* డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌
ప్రొఫెషనల్‌ కోర్సులు (3 ఏళ్లు, ఆపై వ్యవధి):
* చార్టర్డ్‌ అకౌంటెన్సీ
* కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (గతంలో-ఐసీడబ్ల్యుఏ)
* కంపెనీ సెక్రటరీ

- ఎం.ఎస్‌.ఎన్‌. మోహన్‌, మాస్టర్‌మైండ్స్‌

ఉపాధికి నిధి!
* భరోసా ఇస్తున్న కామర్స్‌
అంకెలతో ఆడుకునే ఆసక్తీ, తార్కికంగా విశ్లేషించే లక్షణాలూ ఎంతో కొంత మీకున్నాయా? అయితే కామర్స్‌ కోర్సులు మీకో చక్కటి అవకాశం. వాటిలో ప్రవేశించి, పరిజ్ఞానం సంపాదించి బ్యాలెన్స్‌ షీట్లూ, లాభనష్టాల నివేదికలూ, ఆర్థిక గణాంకాలను బేరీజు వేసే కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఆర్కిటెక్చర్‌ లాంటివాటికి ఎంత ప్రాచుర్యం ఉన్నా ఉపాధి అవకాశాలకు ఢోకా లేని కామర్స్‌ కోర్సులకు ఆదరణ పెరుగుతూనే ఉంది!
మార్కెట్‌ అవసరాలకు సరిపడే ఆధునిక కోర్సులను చేస్తూ కామర్స్‌ విద్యార్థులు తమ గిరాకీ పెంచుకుంటున్నారు. ఒక వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక ఆరోగ్యాన్ని సూచించే బ్యాలెన్స్‌ షీటు, ట్రేడింగ్‌ అకౌంట్‌, లాభనష్టాల నివేదికలను సిద్ధం చేసే సబ్జెక్టుల పరిజ్ఞానాన్ని కామర్స్‌ అందిస్తుంది. అకౌంటింగ్‌ సూత్రాలు, ఆర్థికాంశాలు, వాణిజ్య పెట్టుబడుల వ్యూహాలు మొదలైన అంశాలను కామర్స్‌ విద్యార్థులు అధ్యయనం చేస్తారు. బిజినెస్‌ అకౌంటింగ్‌లో కంప్యూటర్ల వాడకాన్ని కూడానేర్చుకోవాల్సివుంటుంది.
కామర్స్‌ గ్రాడ్యుయేట్ అయ్యాక చాలా ఉద్యోగావకాశాలుంటాయి. పై చదువులపై అభిరుచి ఉంటేే... పీజీ కోర్సు అయిన ఎం.కామ్‌ను మరో రెండేళ్ళు చదవచ్చు. ఒకవేళ ఈ కోర్సుపై ఆసక్తి లేకపోయినా ఇతర మార్గాల్లో ఉన్నత విద్యావకాశాలున్నాయి.
* మేనేజ్‌మెంట్‌: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌ కావాలంటే పీజీ/డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ చేయవచ్చు. కామర్స్‌ చదివినవారికి ఈ కోర్సు పరిచితంగానూ, తేలిగ్గా అవగాహన చేసుకునేలాగానూ ఉంటుంది. కామర్స్‌ విద్యార్థులు ఫైనాన్స్‌ మాత్రమే కాకుండా మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, హెచ్‌ఆర్‌, ఐటీ మొదలైన స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి కొత్త స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి.
* లా: బీకాం అర్హతతో లా డిగ్రీని చేస్తూ లీగల్‌ కెరియర్లోకి ప్రవేశించవచ్చు. యూనివర్సిటీలూ, కళాశాలలూ, లా విద్యాసంస్థల్లో మూడేళ్ళ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని ఎంచుకోవచ్చు.
* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌: కంప్యూటర్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ను అప్పటికే చదివివుంటేనే మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) చదవటానికి వీలుంటుందని చాలామంది భావిస్తుంటారు. అది వాస్తవం కాదు. కామర్స్‌ గ్రాడ్యుయేట్లు ఎం.ఇ. లేదా ఎంటెక్‌కు దరఖాస్తు చేసుకోవటానికి అర్హత ఉండదు కానీ, ఎంసీఏలో చేరటానికి మాత్రం వీలుంటుంది. కామర్స్‌లో, కంప్యూటర్స్‌లో పరిజ్ఞానం బిజినెస్‌ కంప్యూటింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లలో కెరియర్‌ను తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగపడతాయి.
* బ్యాంకింగ్‌: బ్యాంకులు ఇటీవలికాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగుల నియామకం చేసుకుంటున్నాయి. కామర్స్‌ విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌లో బ్యాంకింగ్‌ ముఖ్యమైనది. బ్యాంకు ఉద్యోగాలకు పోటీపడటంలో మిగతా డిగ్రీల వారికంటే ఇది అదనపు ప్రయోజనం. మర్చంట్‌ బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో ఉద్యోగాలు కామర్స్‌వారికి లభిస్తాయి.
* ఆడిటింగ్‌: చాలా ఆడిటింగ్‌ సంస్థలు ఆడిట్‌ వర్క్‌ కోసమో, సీనియర్‌ ఆడిటర్లకు సాయం చేయటం కోసమో కామర్స్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటాయి. కొన్ని ఆడిట్‌ సంస్థలు స్థానికంగా, ప్రాంతీయంగా ఉంటే మరికొన్ని అఖిల భారత స్థాయిలో, మరికొన్ని అంతర్జాతీయంగానూ విధులు నిర్వహిస్తుంటాయి.
* కన్సల్టింగ్‌: కామర్స్‌ నేపథ్యం ఉండి, కొంత అనుభవం ఉన్నవారు కన్సల్టింగ్‌లో చాలా అవకాశాలను పొందగలుగుతారు. ఆడిటింగ్‌, ఇన్‌కమ్‌టాక్స్‌, సర్వీస్‌ టాక్స్‌, జీఎస్‌టీ మొదలైన అంశాల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించినవారికి ఉజ్వల భవిత ఉంటుంది. సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ కోర్సు చేసినవారు ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో కన్సల్టింగ్‌ చేసుకోవచ్చు.
ఇవే కాకుండా స్టాక్‌ బ్రోకింగ్‌, చార్ట్‌ర్డ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌, కామర్స్‌ టీచింగ్‌ మొదలైన ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
ప్రొఫెషనల్‌ కోర్సులు మూడు
దేశవ్యాప్తంగా జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) అమల్లోకి రావటం వల్ల సీఏలకూ, ఇతర కామర్స్‌ ప్రొఫెషనల్స్‌కూ ఉపాధి అవకాశాలు 3 నుంచి 5 రెట్లు పెరిగాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో కామర్స్‌ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే పదో తరగతి తరువాతే కామర్స్‌ గ్రూపులు ఎంచుకుని ప్రణాళికబద్ధంగా చదవాల్సివుంటుంది.
గ్రూపులు-కెరియర్‌
ఎంఈసీ: మేథ్స్‌పై అభిమానం ఉండి, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అంటే భయపడేవారు.. మేథ్స్‌తోపాటు భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలనుకున్నా అవకాశం ఉండాలనుకునేవారికి ఎంఈసీ మంచి మార్గం. సైన్స్‌ గ్రూపుల్లో ఉండే మేథ్స్‌, కామర్స్‌ గ్రూపుల్లోని ఎకనామిక్స్‌, కామర్స్‌ వంటి సబ్జెక్టుల మేలు కలయికే ఇది. సీఏ/ సీఎంఏ/ సీఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు ఎంఈసీ మంచి పునాది. ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకుని భవిష్యత్తులో బీకాం, బీబీఎం, బీఏ, బీఎస్‌సీ వంటి కోర్సులు చదివి, ఆపై ఎంకాం, ఎంసీఏ, ఎంఎస్‌సీ, ఎంబీఏ కోర్సులు పూర్తిచేయవచ్చు.
సీఈసీ: ఇది కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ వంటి ప్రధాన సబ్జెక్టుల కలయిక. లా పూర్తి చేయడానికి, సివిల్స్‌ రావడానికి, అన్ని రకాల కాంపిటీటివ్‌ పరీక్షలు రాయడానికి సీఈసీ గ్రూప్‌లోని సబ్జెక్టులే కీలకం. కామర్స్‌ కెరియర్‌ కావాలి కానీ మేథ్స్‌ అంటే భయం అనుకునేవారు నిశ్చింతగా సీఈసీ గ్రూపుని తీసుకోవచ్చు. సీఈసీ గ్రూపు తీసుకుని సీఏ, సీఎంఏ, సీఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేయవచ్చు.
సీఏ
సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తరువాతకానీ సీఏ కోర్సులోకి ప్రవేశం ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్‌తోపాటే సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు. ఇంటర్‌ ఎంఈసీ/ ఎంపీసీ/ బైపీసీ/ సీఈసీ/ హెచ్‌ఈసీ.. ఇలా ఏ గ్రూపువారైనా సీఏ కోర్సును చదవవచ్చు. అయితే సీఏ చేయాలనుకునే చాలామంది విద్యార్థులు ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపుతోపాటే సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే సుముఖత చూపిస్తున్నారు. ఇలా ఇంటర్‌తోపాటే సీఏ కోర్సు కూడా చదవడం వల్ల ప్రాథమికాంశాలపై పట్టు సాధించడంతోపాటు చదవబోయే సీఏ కోర్సులోని మిగిలిన దశలకీ గట్టి పునాది ఏర్పడుతుంది.
దీనిలో సీఏ ఫౌండేషన్‌, సీఏ ఇంటర్మీడియట్‌, సీఏ ఫైనల్‌ దశలుంటాయి. సీఏ ఇంటర్మీడియట్‌ చేసినవారు మూడేళ్ల ఆర్టికల్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. పన్ను లెక్కింపు, అకౌంటింగ్‌, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకుపైగా కొత్త ఉద్యోగావకాశాలు రానున్నాయని అంచనా. జీఎస్‌టీ అమలు వల్ల నగదు చెలామణి లాభదాయకత, పారదర్శకత మెరుగుపడి పన్ను ఎగవేతలు తగ్గిపోతాయనీ, ఫలితంగా సంభవించే ఆర్థికాభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే అంచనా వ్యక్తమవుతోంది.
సీఎంఏ
సీఏ కోర్సు తరువాత విద్యార్థులు ఈ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌వైపు విశేషంగా ఆకర్షితులు అవుతున్నారు. పదో తరగతి తరువాత నాలుగేళ్లలో, ఇంటర్‌ ఎంఈసీతోపాటు సీఎంఏ చదివిన విద్యార్థులయితే ఇంటర్‌ తరువాత రెండేళ్లలో, ఇంటర్‌ తరువాత సీఎంఏ చదవడం మొదలుపెట్టినవారైతే రెండున్నరేళ్లలో సీఎంఏ పూర్తిచేయవచ్చు. సీఎంఏ చదవాలంటే ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు వారైనా అర్హులే. ఈ కోర్సు చదవాలంటే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇందుకు విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్‌ (10+2) లేదా తత్సమాన పరీక్ష పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ అనే దశలుంటాయి.
ఇది చదివితే మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందించే సంస్థల్లో లెక్చరర్స్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్లుగా ఉద్యోగం లభిస్తుంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వేతర సంస్థల్లోనూ సీఎంఏలు చీఫ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌, కాస్ట్‌ కంట్రోలర్‌, చీఫ్‌ అకౌంటెంట్‌, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ వంటి కీలక పదవులనూ నిర్వర్తించవచ్చు.
కంపెనీ సెక్రటరీ
ఈ సీఎస్‌ కోర్సును ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అనే 3 స్థాయుల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సీఎస్‌ కోర్సు పూర్తిచేసే క్రమంలో రాతపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అప్రెంటిస్‌షిప్‌ పేరుతో ఉండే ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. కంపెనీ సెక్రటరీలు నేర్పుతో, ఓర్పుతో వ్యాపారవేత్తలకు సలహాలు, సూచనలు ఇస్తారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కి సలహాలు ఇవ్వడం, కంపెనీ రిజిస్ట్రార్‌గా న్యాయ సలహాలు అందించటం చేస్తారు. కంపెనీల విధానాల రూపకర్తగా, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా, కంపెనీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, సంస్థ యాజమాన్యానికి, వాటాదారులకు, రుణదాతలకు అనుసంధానకర్తగా అనేక రూపాల్లో హోదాల్లో ఉద్యోగం చేయవచ్చు. చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్లుగా, బ్యాంకు మేనేజర్లుగా, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మంచి హోదాల్లో ఉపాధి పొందొచ్చు.
ఫారిన్‌ డిగ్రీలూ చేయొచ్చు..
బీకాంతోపాటు ఒక ప్రొఫెషనల్‌ కోర్సు పూర్తిచేసుకోవటం తాజా ధోరణి. ఇలా కామర్స్‌ డిగ్రీ ముగిసేలోపు సీఏ, సీఎంఏ, సీఎస్‌లలో ఏదో ఒకటి చేస్తే ఉద్యోగావకాశాలు బాగా ఉంటున్నాయి. టెన్త్‌ పూర్తిచేసినవారు ఇంటర్మీడియట్లో ఎంఈసీ లేదా సీఈసీ గ్రూపు తీసుకుంటే కామర్స్‌లోకి విజయవంతంగా ప్రవేశించవచ్చు. ఒకప్పటిలాగా కాకుండా సీఏ ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది.
ఓ కొత్త పరిణామం ఏమిటంటే... బీకాంతో పాటు విదేశీ కోర్సులను చదవటం. వీటికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉండటం వల్ల బహుళజాతి కంపెనీలు ఈ కోర్సులు చేసిన కామర్స్‌ పట్టభద్రులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.
* అమెరికాకు చెందిన ‘సర్టిఫైడ్‌ పబ్లిక్‌ ఎకౌంటెంట్స్‌ (సీపీఏ)’ దీనిలో ఒకటి. ఇది మన సీఏతో సమానం.
* బ్రిటిష్‌కు చెందిన ‘చార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ (సీఐఎంఏ)’ కోర్సు మరొకటి.
వీటిని మనదేశం నుంచే చేసే వీలుంది. రిజిస్టర్‌ చేసుకుని, సెల్ఫ్‌స్టడీ చేసుకోవటమే. చాలామంది విద్యార్థులు దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ రెండు కోర్సుల్లో ఏదో ఒకదాన్ని బీకాంతో పాటు చేస్తే రూ.2-3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
* లండన్‌కు సంబంధించిన ‘సర్టిఫైడ్‌ కోర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌’ ఇలాంటిదే. కంపెనీల ఉత్పత్తుల మార్కెట్‌ స్థితిని విశ్లేషించే ఈ అనలిటిక్స్‌ ప్రాచుర్యం పొందుతోంది.
ఒకప్పటి బీకాం కాదు
బీకాం ఒకప్పటిలాగా సాంప్రదాయిక కోర్సులా లేదు. ఆధునిక, వర్తమాన సబ్జెక్టులను జోడించటంతో ఇది ప్రొఫెషనల్‌గా మారింది. ఇంటర్‌ తర్వాత మూడేళ్ళలో ఇతర కోర్సుల సమ్మేళనంతో వీలైనంత త్వరగా జీవితంలో స్థిరపడటానికి వీలు కల్పిస్తోంది. బీకాం కరిక్యులమ్‌లో కొన్ని కీలక సబ్జెక్టులను కలపటం వల్ల ఆ పేపర్లకు ప్రొఫెషనల్‌ కోర్సుల్లో మినహాయింపు కూడా ఇస్తున్నారు. దీంతో ఆ కోర్సులను పూర్తిచేయటం సులువుగా మారుతోంది.
కామర్స్‌ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలున్నాయి. ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగాలు అందిస్తున్నాయి. బీకాం తర్వాత టాక్స్‌ కన్సల్టెంటు లాంటి స్వయంఉపాధి మార్గాలకు కూడా ఆస్కారం ఏర్పడుతోంది.

- ప్రొ. కె. శంకరయ్య, డీన్‌, ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌, ఉస్మానియా

 

భవితకు కామర్స్‌ కోర్సులు!
పదో తరగతి తర్వాత తీసుకునే ఇంటర్మీడియట్‌ గ్రూపు... విద్యార్థి కెరియర్‌ మార్గాన్ని దాదాపు నిర్ణయించేస్తుంది. ‘ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లలో ఏదో ఒకటి’ అనే మూస ఆలోచన నుంచి బయటపడి కామర్స్‌లో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనే ధోరణి పెరుగుతోంది. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఎన్ని రకాల మార్గాలున్నాయి? ఆ సంగతులేమిటి?
సామాన్య గుమాస్తాల నుంచి దేశ ఆర్థిక రంగాన్ని శాసించే ఆర్థిక నిపుణుల వరకూ కామర్స్‌ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. దీనిలో ఏ కోర్సు తీసుకుని చదివినా జీవితంలో స్థిరపడవచ్చు. దేశంలో అకౌంటెంట్ల కొరత ఏ స్థాయిలో ఉందో వ్యాపార రంగంలో ఉన్నవారికి తెలుసు. కామర్స్‌ రంగానికి ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పది తరువాత కామర్స్‌ రంగంవైపు ఎలా వెళ్లవచ్చు అనేది విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
సైన్స్‌ సబ్జెక్టు అయిన మ్యాథ్స్‌; కామర్స్‌ సబ్జెక్టులైన ఎకనామిక్స్‌, కామర్స్‌ల కలయికే ఈ గ్రూపు. ‘మ్యాథ్స్‌ అంటే మక్కువే కానీ ఫిజిక్స్‌, కెమిస్ట్రీలంటే భయం’ అనుకునేవారు నిశ్చింతగా ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకోవచ్చు. సైన్స్‌, కామర్స్‌ల మేలు కలయిక కాబట్టి దీన్ని చదవటం వల్ల కెరియర్‌ను ఎలాగైనా మలుచుకోవచ్చు.
ఇంటర్‌లో ఎంఈసీ చదివి భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్‌, లా వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు, బి.ఎస్‌.సి., బి.కాం, బి.బి.ఎం వంటి డిగ్రీలు చేసి ఎం.కాం. ఎం.బి.ఏ. ఎం.సి.ఏ వంటి కోర్సులు పూర్తి చేయవచ్చు. సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంక్‌ పరీక్షలూ, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే కూడా ఇంటర్‌లో ఎంఈసీసి గ్రూపు నేపథ్యం ఉపయోగపడుతుంది.

సీఈసీ
ఇది కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టుల కలయిక. ఈ గ్రూపు చదివినవారికి సైన్స్‌ గ్రూపువారికి మాదిరే మంచి అవకాశాలున్నాయి. ఇంటర్‌లో సి.ఇ.సి. చదివి, డిగ్రీ పూర్తిచేసి అనేక రంగాల్లో ప్రవేశించవచ్చు. లా పూర్తి చేయడానికీ; సివిల్స్‌, ఇతర పోటీ పరీక్షలు రాయడానికీ సి.ఇ.సి. గ్రూపులోని సబ్జెక్టులే కీలకం. ఎక్కువశాతం జనరల్‌ నాలెడ్జ్‌, సమాజానికి, రాజ్యాంగానికి సంబంధించి, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను అనుసంధానం చేయడం వల్ల ఈ గ్రూపునకు ప్రాధాన్యం పెరిగింది.
‘కామర్స్‌ కెరీర్‌ కావాలి కానీ మ్యాథ్స్‌ అంటే భయం’ అనుకునేవారు నిశ్చింతగా ఈ గ్రూపు తీసుకోవచ్చు. సి.ఇ.సి. గ్రూపు తీసుకొని సి.ఎ., సి.ఎం.ఎ., సి.ఎస్‌. వంటి వృత్తివిద్యాకోర్సులు పూర్తి చేయవచ్చు.
కంపెనీ సెక్రటరీ కోర్సు
ఐదు కోట్లకు పైబడి మూలధనమున్న కంపెనీలు, స్టాక్ ఎక్చెంజ్‌ల‌లోనమోదు కావాలనుకుంటున్న కంపెనీలు తప్పనిసరిగా పూర్తిస్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాల్సి వుంటుంది. నేర్పుతో, ఓర్పుతో వ్యాపారవేత్తలకు ఎప్పటికప్పుడు సమయానుగుణంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారే కంపెనీ సెక్రటరీలు.
సి.ఎస్‌. కోర్సును ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ICSI)నిర్వహిస్తుంది. ఇది పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టబద్ధమైన సంస్థ. సి.ఎస్‌. కోర్సును ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అనే మూడు స్థాయుల్లో పూర్తి చేయవలసివుంటుంది.
* సి.ఎస్‌. ఫౌండేషన్‌: సి.ఎస్‌. ఫౌండేషన్‌ పరీక్షను కూడా సి.ఎ. కోర్సులోని సి.పి.టి. పరీక్ష మాదిరిగా ప్రవేశపరీక్ష రూపంలో నిర్వహించబోతున్నారు. అంటే ఈ పరీక్షను మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలోకి మార్చారు. పరీక్ష మొత్తం 200 ప్రశ్నలు, 400 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు అన్నమాట. ఈ పరీక్షను జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు.
* సి.ఎస్‌. ఎగ్జిక్యూటివ్‌: సి.ఎస్‌. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష (రెండు మాడ్యూల్స్‌గా 7 పేపర్లు) రాయవచ్చు. ఈ పరీక్ష కూడా జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండుసార్లు జరుగుతుంది.
ఎగ్జిక్యూటివ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు 15 నెలల పాటు మేనేజ్‌మెంట్‌ శిక్షణ, మరో మూడు నెలలపాటు ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకోవల్సి ఉంటుంది.
* సి.ఎస్‌. ప్రొఫెషనల్‌: ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించినవారు/ ఉత్తీర్ణత సాధించి మేనేజ్‌మెంట్‌ శిక్షణ పూర్తిచేసుకున్నవారు ప్రొఫెషనల్‌ ప్రోగ్రాం చదవడానికి అర్హులు. ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష రాసిన సంవత్సరం తరువాత ఈ ప్రొఫెషనల్‌ పరీక్ష (మూడు మాడ్యూల్స్‌గా 9 పేపర్లు) రాయాల్సివుంటుంది. మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి 50 శాతం సగటు మార్కులను సాధిస్తే విద్యార్థి మాడ్యూల్‌/ ప్రొఫెషనల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.
* CA, CMA, CS కోర్సులే కాకుండా మిగతా కామర్స్‌ కోర్సులైన M.Com, MBA చేసినవారికి కూడా మెరుగైన అవకాశాలున్నాయి.
సీఎంఏ కోర్సు
సీఏతో పాటు సీఎంఏ (ఐసీడ‌బ్యూఏ) కోర్సుకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. ఉద్యోగావకాశాల పరంగా అనుకూలమై, సులువుగా తక్కువ సమయంలో పూర్తిచేయగలిగిన కోర్సు ఇది. సీఏ కష్టం అనుకునే విద్యార్థులు సాధారణంగా బీకాం గానీ, ఎంబీఏ గానీ చేస్తారు. కానీ అదే సమయంలో సీఎంఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సును పూర్తిచేసి, త్వరగా స్థిరపడవచ్చనే అవగాహనతో దీనివైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.
ఐసీడ‌బ్యూఏ కోర్సును ఇప్పుడు సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌)గా వ్యవహరిస్తున్నారు. ఇది చదవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్‌వారైనా అర్హులే. దీనిలో ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి.
* సీఎంఏ ఫౌండేషన్‌: ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రతి ఏడాదీ మార్చి, జూన్‌, సెప్టెంబరు, డిసెంబరులలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల రూపంలో ఒకేరోజు నిర్వహిస్తారు. దీనిలో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. అలాంటివారిని ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తారు.
* సీఎంఏ ఇంటర్‌ (సీఎంఏ ఎగ్జిక్యూటివ్‌) కోర్సు : సీఎంఏ ఫౌండేషన్‌ కోర్సు పూర్తిచేసినవారు సీఎంఏ ఇంటర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్‌ పరీక్ష రాయటానికి అర్హులు. ఇది పూర్తయినవారు ఒక ప్రొఫెషనల్‌ కాస్ట్‌ ఎకౌంటెంట్‌ దగ్గర/ గుర్తింపు పొందిన సంస్థల్లో ఆర్నెల్లపాటు ప్రాక్టికల్‌ శిక్షణ పొందాల్సివుంటుంది.
* సీఎంఏ ఫైనల్‌ కోర్సు: ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తయిన విద్యార్థి ఫైనల్‌ పరీక్షను రాయవచ్చు. ఇది పూర్తిచేసినవారిని ఇన్‌స్టిట్యూట్‌ వారి కంప్యూటర్‌ శిక్షణ పూర్తయ్యాక క్వాలిఫైడ్‌ కాస్ట్‌ ఎకౌంటెట్లుగా పరిగణిస్తారు.
సీఏ కోర్సు
ఒకప్పుడు దీన్ని డిగ్రీ తరువాత చేసేవారు. తరువాత ఇంటర్‌ పూర్తిచేశాక చదివే అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడైతే సి.ఏ. ఇనిస్టిట్యూట్‌ వారు పదో తరగతి తరువాతే ఈ కోర్సులో ప్రవేశించే అవకాశం కల్పించారు.
* ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థి సీఏ కోర్సుకు నమోదు చేసుకొని సీఏ కెరియర్‌ను ప్రారంభించవచ్చు.
* ఇంటర్‌ MEC/MPC/BiPC/CEC/HECఇలా ఏ గ్రూప్‌ వారైనా ఈ కోర్సు చదవవచ్చు. అయితే చాలామంది ఇంటర్‌లో ఎం.ఇ.సి. గ్రూపుతోపాటే సి.ఎ. కూడా ఏకకాలంలో చదవటానికే సుముఖత చూపిస్తున్నారు. దీనివల్ల వారు దాదాపు 6 నెలల సమయాన్ని ఆదాచేసుకుంటున్నారు.
* ఇంటర్‌ ఎంఈసి లేదా సీఈసీ గ్రూపు తీసుకొని ఇంటర్‌తోపాటు సీపీటి (కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్టు)ని సమాంతరంగా పూర్తి చేయవచ్చు. ఈ లక్ష్యంతోనే రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఇంటర్‌తోపాటుగా లాంగ్‌ టర్మ్‌ సీపీటీ కోచింగ్‌ను అందిస్తున్నాయి.
* ఇంటర్‌ MPC/BiPC/HECగ్రూపు వారు ఇంటర్‌ తరువాత 6 నెలలకు సీపీటీ పూర్తి చేయవచ్చు.
* తరువాత 9 నెలలకు ఐపీసీసీ, అది పాసైన రెండున్నర సంవత్సరాలకు సీఏ ఫైనల్‌ పరీక్ష రాసి, సీఏ కోర్సు పూర్తిచేయవచ్చు.
* అంటే ఇంటర్‌ తరువాత కేవలం 4 సం॥లకే సీఏ కోర్సును పూర్తిచేసి జీవితంలో స్థిరపడవచ్చు.

 

మార్కెట్ నిర్దేశకులు... కామర్స్ నిపుణులు
ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారాల స్థానంలోకి మల్టీ లెవెల్ మార్కెట్లు, బహుళజాతి కంపెనీలు ప్రవేశించాయి. ఫలితంగా కంపెనీల సమర్థ నిర్వహణకు వాణిజ్య నిపుణులకు డిమాండ్ పుంజుకుంది. మార్కెట్ అవసరాలకు తగిన నిపుణులను తీర్చిదిద్దడంలో అనేక యూనివర్సిటీలు విలువైన వాణిజ్య కోర్సులను అందిస్తున్నాయి. వాటి గురించిన సమాచారం తెలుసుకుందాం.
కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్ పూర్తిచేసిన తర్వాత ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఉన్నవాటిలో దేన్ని ఎంచుకోవాలి? ఏ కోర్సుతో ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ఏ కాలేజీలో చేరాలి? అందులో సీటు ఎలా సంపాదించాలి? ఎంచుకున్న కోర్సు ఎన్నేళ్లకు పూర్తవుతుంది? మొదలైన అనేక ప్రశ్నలు విద్యార్థులకు ఎదురవుతుంటాయి. అధ్యాపకులు, స్నేహితులు, తల్లిదండ్రుల సలహాలు, సోషల్ మీడియా కొంతవరకు మాత్రమే సందేహాలను నివృత్తి చేస్తాయి. అంతిమ నిర్ణయం విద్యార్థులు ఎవరికి వారే స్వయంగా తీసుకోవాలి.
కామర్స్‌కు అనుకూలం
భారతదేశం రెండంకెల ఆర్థిక వృద్ధి సాధించాలని కోరుకుంటోంది. వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యాపార అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కామర్స్, సోషల్ సైన్సెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు, దాని అనుబంధ రంగాల నుంచే వస్తోం దన్నది గమనించాల్సిన విషయం. ఇలాంటి ఆర్థిక, వ్యాపార వాతావరణంలో కామర్స్, సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు.

ఉన్నత విద్యావకాశాలు
ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో క్రమేణా నాణ్యత క్షీణించడం, ఆర్థికంగా భారంగా మారుతుండటంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తున్నారు. మారుతోన్న ఆర్థిక పరిస్థితుల్లో కామర్స్ ఆకర్షణీయమైన కెరీర్‌ను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో, సులభంగా కామర్స్ సంబంధిత కోర్సులు పూర్తి చేయవచ్చు.
* బీకాం: ఇంటర్ కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంప్రదాయ కోర్సు ఇది. వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు బీకాం డిగ్రీలో కూడా అనేక రకాల స్పెషలైజేషన్‌లను ప్రవేశపెడుతున్నాయి. అవన్నీ కూడా ప్రారిశ్రామికంగా అవసరమమ్యేవి, ఉద్యోగావకాశాలు కల్పించేవే.
* బీకాం (ఆనర్స్): ఇది పూర్తిగా వ్యాపార, ఆర్థిక అంశాలతో రూపొందించింది. అనువర్తనకు అధిక ప్రాధాన్యం ఉన్న కోర్సు.
* బీకాం (కంప్యూటర్స్): కామర్స్‌లో కంప్యూటరీకరణకు ఈ కోర్సు దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా బీకాం డిగ్రీని ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. కార్పొరేట్ అకౌంటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్, సేల్స్ ప్రమోషన్స్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
* బీకాంతోపాటు సీఏ, సీఎస్, సీడబ్ల్యూఏ కోర్సులను అనుబంధ ప్రోగ్రామ్‌లుగా చదివే కొత్త ధోరణి పెరుగుతోంది. ఇందులో విద్యార్థులు బీకాం కోర్సును పూర్తిచేయడంతోపాటు వారి అభిరుచిని బట్టి సీఏ, సీడబ్ల్యూఏ కోర్సులకు అవసరమైన శిక్షణ లభిస్తుంది. సీఏలాంటి కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఒకవేళ వీటిలో విజయం సాధించలేకపోయినా బీకాం డిగ్రీ వస్తుంది కాబట్టి విద్యార్థి సమయం వృథా కాదు.
* ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్:
బీకాం-ఎల్ఎల్‌బీ లాంటి ఇంటెగ్రేటెడ్ కోర్సులు కూడా కామర్స్ విద్యార్థులకు ఉపయుక్తమైనవే. సాధారణంగా ఇవి అయిదేళ్ల కోర్సులు. ఒకేసారి రెండు డిగ్రీలు రావడం ఈ కోర్సుల ప్రత్యేకత. అయితే ఒక కోర్సు పూర్తయ్యాక (మూడేళ్ల తర్వాత) మధ్యలో చదువు ఆపేయడం వీలుకాదు. ఆపితే ఒక్క డిగ్రీ కూడా లభించదు.
* ప్రొఫెషనల్ కోర్సులు:
సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, సీఎఫ్ఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. సాధారణ డిగ్రీలతో పోలిస్తే ఇవి కొంచెం కష్టమైన కోర్సులు. సాధారణ డిగ్రీల్లా ఇవి క్యాంపస్ ప్రోగ్రామ్‌లు కాదు. విద్యార్థి వ్యక్తిగతంగా ఎక్కువ శ్రద్ధ, బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
* ప్రొఫెషనల్ కోర్సుల్లో సీఏకు మంచి అవకాశాలు ఉన్నాయి. బాగా శ్రమిస్తేనే సీఏలో ఉత్తీర్ణులు అవుతారు. దీంతో పోలిస్తే కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులు కొంత సులభం. చాలా తక్కువ శాతం మంది మాత్రమే సీఏ కోర్సును పూర్తి చేయగలుగుతున్నారు.
కామర్స్, సంబంధిత విభాగాల్లో ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ పూర్తయ్యాక ఎన్నో రకాల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పీజీ, ఒకేషనల్ కోర్సులు, పోటీ పరీక్షలు ఇలా చాలా మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని...

* హయ్యర్ డిగ్రీ ప్రోగ్రామ్స్:
బీకాం పూర్తయిన విద్యార్థి ఎంకాంలో చేరొచ్చు. అయితే సాధారణ ఎంకాం కంటే ఎంబీఏ, ఎంఏ (ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్), మాస్టర్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్ (ఎంఐఎఫ్ఏ) మొదలైన కోర్సులతో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ కంట్రోల్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోర్సులు చేయవచ్చు.
* పరిశోధన వైపు వెళ్లాలనుకునే వారికి ఆకర్షణీయమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అకౌంట్స్, ఫైనాన్స్ విభాగంలో డాక్టరేట్ల కొరత అధికంగా ఉంది. వీరికి టీచింగ్ ఒక మంచి కెరియర్. బోధన రంగంలో కూడా ప్రస్తుతం మంచి వేతనాలు లభిస్తున్నాయి.
* సర్టిఫికెట్ కోర్సులు:
ఎన్‌సీఎఫ్ఎం అండ్ సెబీ లాంటి సంస్థలు పలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువే. ఫైనాన్షియల్ అనాలసిస్, ఫారెన్ ట్రేడ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మొదలైనవి మరికొన్ని సర్టిఫికెట్ కోర్సులు.
* పోటీ పరీక్షలు:
డిగ్రీ తర్వాత యూపీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలైన నియామక, పోటీ పరీక్షలు రాయొచ్చు.
*సొంతగా ప్రాక్టీస్
సీఏ, సీడబ్ల్యూఏ, సీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారికి కెరియర్ పరంగా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సొంతగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల పెద్ద కంపెనీల్లో ఉద్యోగులుగా చేరితే మొదట్లోనే ఏడాదికి నాలుగు నుంచి అయిదు లక్షల వేతనం తేలిగ్గా లభిస్తుంది.
* మంచి సంస్థల్లో ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారికి ఏడాదికి కనీసం మూడు లక్షలు, బీకాం వారికి రూ.1.2 లక్షల వరకు వేతనంగా పొందే వీలుంటుంది. ఇవన్నీ సాధించాలంటే మంచి అకడమిక్ రికార్డుతోపాటు విద్యార్థి దశలో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. చాలా వరకు కాలేజీలే ఇలాంటి అదనపు సామర్థ్యాల్లో శిక్షణ అందిస్తున్నాయి. లేకపోతే మంచి శిక్షణ సంస్థలో చేరి ఈ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.
* కష్టపడే తత్వం, తెలివితేటలు ఉన్న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్‌ల కంటే కామర్స్ మంచి కెరియర్‌ను ఇస్తుంది. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఇదొక ఉత్తమమైన, తక్కువ పోటీ ఉన్న విభాగం అనడంలో సందేహం లేదు.
కొన్ని ముఖ్యమైన కామర్స్ కాలేజీలు
* శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ
* సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా
* లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ
* లయోలా కాలేజ్, చెన్నై
* హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ
* క్రిస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు
* శ్రీ నార్సిమోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ముంబయి
* మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై
* హిందూ కాలేజ్, న్యూఢిల్లీ
* స్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నై
వీటిలో ఎక్కువ విద్యాసంస్థలు 50-70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారికి ప్రవేశం కల్పిస్తున్నాయి. కొన్ని కాలేజీలు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను కోర్సులకు ఎంపిక చేస్తాయి. ఇంకొన్ని సంస్థలు మేథ్స్‌లో మార్కుల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.
కొన్ని ప్రముఖ కంపెనీలు
* ఎర్నెస్ట్ అండ్ యంగ్
* డెలాయిట్
* కేపీీఎంజీ
* బెయిన్ అండ్ కంపెనీ
* కాగ్నిజంట్-బీపీఓ
* హెచ్ఎస్‌బీసీ
* జీఈ క్యాపిటల్
* గూగుల్
* క్రిసిల్
* ఇన్ఫోసిస్ టెక్
* హిందూస్థాన్ యూనీలీవర్
* కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్
* ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్
ఉద్యోగుల ఎంపికకు చాలా సంస్థలు కొంచెం కఠినమైన నియామక ప్రక్రియలను అనుసరిస్తున్నాయి. కొన్ని క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. ఏదైనా కంపెనీకి ఉద్యోగం కోసం వెళ్లే ముందు ఆ సంస్థ అనుసరిస్తున్న ఎంపిక ప్రక్రియను, అక్కడి పని వాతావరణాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం.