Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


కోర్సులు

పదిలంగా పాఠాల బాటలో..!
ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్‌ తర్వాత ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ డిగ్రీతోపాటు ఏకకాలంలో ఎడ్యుకేషన్‌లోనూ బ్యాచిలర్‌ పట్టా పొందడానికి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను రూపొందించారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ తదితర సంప్రదాయ రీతులకు భిన్నంగా కెరియర్‌ ఎంచుకోవాలనుకునే వారికి ఇదో చక్కటి మార్గం.

సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఒకటి. మంచి వేతనాలు, వృత్తిపరమైన సంతృప్తి యువతను ఈ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. బోధనను ఉపాధిగా స్వీకరించాలనుకునేవారు ఇంటర్మీడియట్‌ నుంచే తమ లక్ష్యంవైపు అడుగులు వేయవచ్చు. ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే ప్రధానంగా ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ (డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌) లేదా డిగ్రీ అనంతరం బీఎడ్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌ నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తే రెండు సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డీఎడ్‌ కోర్సులో చేరాలి. బీఎడ్‌ చేయాలంటే ముందు డిగ్రీ చేసి తర్వాత చేరాల్సి ఉంటుంది. కానీ ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ ఎంచుకుంటే డిగ్రీ కూడా ఏకకాలంలో పూర్తవుతుంది.ఏడాది సమయం ఆదా అవుతుంది. ఇలాంటి అవకాశాన్ని జాతీయస్థాయిలో పేరున్న సంస్థలు కల్పిస్తున్నాయి. వాటిలో ప్రవేశాలకు తాజాగా ప్రకటనలు వెలువడ్డాయి. ఈ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సు చదివితే బోధనలో మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే వీరికి తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఈ విధానంలో చదివిన వారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

రాష్ట్రాల వారీగా ఆర్‌ఐఈలు
సమాజానికి అత్యుత్తమ ఉపాధ్యాయులను అందించాలనే లక్ష్యంతో ప్రాంతీయ విద్యా శిక్షణ సంస్థ (ఆర్‌ఐఈ) లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంటర్‌ అర్హతతో ఈ సంస్థల్లో డిగ్రీతోపాటు బీఎడ్‌ నాలుగేళ్లలోనే పూర్తిచేయవచ్చు. అలాగే ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ (ఎమ్మెస్సీ + బీఎడ్‌) కోర్సునూ చదువుకోవచ్చు. బోధన వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నవారు ఆర్‌ఐఈల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ విధానంలో చదువుకున్నవారికి మెథడాలజీలో నైపుణ్యం మెరుగవుతుంది. వరుసగా నాలుగేళ్లపాటు చదవడం వల్ల సబ్జెక్టుపై పూర్తి పట్టు లభిస్తుంది. సెమిస్టర్‌ విధానంలో బోధన ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున 8 సెమిస్టర్లు ఉంటాయి. చివరి సంవత్సరం పాఠశాలల్లో గడపాల్సి ఉంటుంది.

అజ్మీర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూరుల్లో ఆర్‌ఐఈలు ఉన్నాయి. ఒక్కో సంస్థనూ రాష్ట్రాల వారీ విభజించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు ఆర్‌ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చెరి, లక్షద్వీప్‌లు కూడా ఈ సంస్థ కిందే ఉంటాయి. ఇందులోని సీట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీ విభజించారు.

మైసూరు ఆర్‌ఐఈకి సంబంధించి బీఎస్సీ బీఎడ్‌ (ఫిజికల్‌ సైన్స్‌), బీఎస్సీ బీఎడ్‌ (బయలాజికల్‌ సైన్స్‌), బీఏ బీఎడ్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 40 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు ఎమ్మెస్సీఎడ్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టులో 15 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ ఎడ్‌ కోసం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్లలోపు వైదొలగడమూ కుదరదు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు పూర్తిచేసినవారు మైసూరులోనే పీహెచ్‌డీ చేసుకునే అవకాశం ఉంది.

ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ ఉపకార వేతనాలు లభిస్తాయి. అలాగే మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు. ఏటా క్యాంపస్‌ నియామకాలు జరుగుతాయి. బీఎ/ బీఎస్సీ ఎడ్‌ లేదా బీఎడ్‌ కోర్సులు పూర్తి చేసినవారికి నెలకు కనీసం రూ.25 వేలకు పైగా వేతనం లభిస్తుంది. ఎమ్మెస్సీఎడ్‌, ఎంఎడ్‌ కోర్సుల వారికి కనీసం రూ.35వేలు చొప్పున వేతనాలు లభిస్తున్నాయి.

ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ ఉపకార వేతనాలు లభిస్తాయి. అలాగే మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు.

ఏ అర్హతలుండాలి
బీఎస్సీ బీఎడ్‌ కోర్సులో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ / బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సుకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఏ బీఎడ్‌ కోర్సుకు సైన్స్‌ / ఆర్ట్స్‌/ కామర్స్‌ ఏదైనా స్ట్రీమ్‌తో ఇంటర్‌ చదివినఎవరైనా అర్హులే. ఏ కోర్సుకైనా ఇంటర్‌ లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం) 2017, 2018లో ఇంటర్‌ పూర్తి చేసివారు, ఈ సంవత్సరం పరీక్షలు రాసినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ వర్తిస్తుంది. పరీక్షలో భాషా నైపుణ్యాలు, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ అంశాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 30, రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకీ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ఆర్‌ఐఈ, మైసూరులో బీఎడ్‌ రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అలాగే భోపాల్‌లో మూడేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌+ఎంఎడ్‌ కోర్సు ఉంది. దేశవ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లోనూ ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 12
పరీక్ష తేదీ: జూన్‌ 9
వెబ్‌సైట్‌: http://cee.ncert.gov.in/, http://www.riemysore.ac.in

సెంట్రల్‌ యూనివర్సిటీల్లోనూ..
ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌ కోర్సు జమ్మూ, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ (మ్యాథ్స్‌) సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ప్రవేశాలు సీయూసెట్‌తో లభిస్తాయి. ప్రకటన వెలువడింది. ఏప్రిల్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.పరీక్షలు మే 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: https://cucetexam.in

అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ రెసిడెన్షియల్‌ విధానంలో బీఎస్సీ బీఎడ్‌ డ్యుయల్‌ డిగ్రీ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. బయలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ మూడు సైన్స్‌ విభాగాల్లోనూ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. స్కాలర్‌ షిప్పులు కూడా ఇస్తారు.

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 18, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ 18 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. నెగెటివ్‌ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఎస్సే/ డేటా ఎనాలసిస్‌/ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ల్లో రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి ఒక గంట.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ప్రాంగణ నియామకాలకూ ఈ సంస్థ ప్రాచుర్యం పొందింది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30
పరీక్ష తేదీ: మే 11
వెబ్‌సైట్‌: http://azimpremjiuniversity.edu.in

గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌
గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, గాంధీగ్రామ్‌ (దిండిగల్‌) తమిళనాడు కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన డీమ్డ్‌ యూనివర్సిటీ. ఈ సంస్థ ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు బీఎస్సీ బీఎడ్‌ కోర్సు అందిస్తోంది. ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఇంటర్‌లో సాధించిన మార్కులు/ గ్రేడ్‌తో సీట్లు భర్తీచేస్తారు.
వెబ్‌సైట్‌: http://www.ruraluniv.ac.in

ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ ఎడ్‌ అందించే మరికొన్ని సంస్థలు: తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, జీడీ గొయాంకా యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, సావిత్రీభాయ్‌ ఫూలే పుణే యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో ఎడ్యుకేషన్‌లో డిగ్రీని అందిస్తున్నాయి.


గ్రూపు ఏదైనా సరే!
ఇంటర్‌లో ఏ గ్రూపు చదివితే సాధారణంగా ఆ మార్గంలోనే కెరియర్‌ ప్రయాణం సాగుతుంది. కానీ చదివిన గ్రూప్‌తో సంబంధం లేకుండా, ఏ గ్రూపు చదివినవారైనా చేరటానికి వీలైన కొన్ని కోర్సులున్నాయి. ప్రతి విద్యార్థికీ ఇవి అనువుగా ఉంటాయి. సీఏ, సీఎంఏ, కంపెనీ సెక్రటరీ లాంటి కామర్స్‌ కోర్సులు అందరికీ తెలిసినవే. వీటితో పాటు న్యాయవిద్య, ఉపాధ్యాయవిద్య, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, లిబరల్‌ స్టడీస్‌, ఫ్యాషన్‌, డిజైన్‌... ఒకటేమిటి- వైవిధ్య భరితమైన చదువులెన్నో ఇంటర్‌ విద్యార్థుల ముందున్నాయి. తమకు బాగా ఆసక్తి ఉన్నవాటిని ఎంచుకుని, కృషి చేస్తే వీటిలో అద్భుతంగా రాణించే అవకాశముంది!

బోధన
తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్‌ ఉన్న కొలువుల్లో ఉపాధ్యాయ వృత్తి ముందుంటుంది. ఆచార్యులుగా అడుగుపెట్టడానికి ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) కోర్సులో ముందుగా చేరాలి. ఇందుకోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. యాభై శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు కళాశాలలు డీఎడ్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే ప్రభుత్వం నిర్వహించే సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాల పరీక్షకు హాజరవడానికి అర్హత పొందుతారు. ఇందులో ప్రతిభను ప్రదర్శిస్తే ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించవచ్చు. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మైసూర్‌, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలు ఇంటర్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ బీఏఎడ్‌, బీఎస్సీ ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. ప్రాధాన్యం ఇవ్వదగ్గ కోర్సులివి. డీఎడ్‌ అనంతరం డిగ్రీ, పీజీలు చదువుకోవచ్చు. బీఎడ్‌, ఎంఎడ్‌ కోర్సుల దిశగా అడుగులేయవచ్చు. ఆర్‌ఐఈ మైసూర్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సులు సైతం ఉన్నాయి. ఇంటర్‌ విద్యార్హతతో వీటిని ఆరేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు.

న్యాయ విద్య
న్యాయవిద్య లక్ష్యంగా ఉన్నవారు ఇంటర్‌ నుంచే తమ కలను సాకారం చేసుకోవచ్చు. రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికి లాసెట్‌, జాతీయ స్థాయిలో ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశానికి క్లాట్‌, ప్రైవేటు సంస్థల్లో అడ్మిషన్లకు ఎల్‌శాట్‌ మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిలో తగిన ర్యాంకు సంపాదిస్తే ఇంటర్‌ విద్యార్థులు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం -ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరవచ్చు. క్లాట్‌ ద్వారా జాతీయ స్థాయి అత్యున్నత విద్యా సంస్థల్లో అవకాశం పొందవచ్చు. ఎల్‌ఎల్‌బీ తర్వాత నచ్చిన స్పెషలైజేషన్‌తో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరవచ్చు. క్లాట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో నల్సార్‌ (హైదరాబాద్‌), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం)లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్‌లో 45% మార్కులతో ఉత్తీర్ణులైనవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలతోపాటు వాటి అనుబంధ కళాశాలల్లో లా చదువులు అందుబాటులో ఉన్నాయి.

లిబరల్‌ స్టడీస్‌
ఇటీవలి కాలంలో లిబరల్‌ స్టడీస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ విధానంలో వైవిధ్యమైన ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ప్రధాన సబ్జెక్టులతోపాటు నచ్చినవాటిని మైనర్లగా తీసుకోవచ్చు. ఫ్లేమ్‌, అశోకా..తదితర సంస్థలతో పాటు కొత్తగా ఆవిర్భవించిన క్రియా యూనివర్సిటీ ఈ విద్యలో పేరొందిన సంస్థలు. ఇంటర్‌ అన్ని గ్రూప్‌లవారికీ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.

ఫుట్‌వేర్‌
పాదరక్షల సంబంధ కోర్సుల కోసం దేశంలో రెండు ప్రముఖ సంస్థలు వెలిశాయి. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌,. సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థల్లో ఇంటర్‌ అర్హతతో వివిధ కోర్సులున్నాయి. ఎఫ్‌డీడీఐకి హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 12 కేంద్రాలున్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై ఇంటర్‌ అర్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ఫుట్‌వేర్‌ మ్యానుఫ్యాక్చర్‌ అండ్‌ డిజైన్‌, ఏడాది వ్యవధితో సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను అందిస్తోంది.

విదేశీ భాషలు
ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. ఈ కోర్సులకు దేశంలోనే ఉత్తమ వేదిక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- హైదరాబాద్‌. ఇంగ్లిష్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ విభాగాల్లో బీఏ (ఆనర్స్‌) కోర్సులు ఇఫ్లూలో ఉన్నాయి. ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఉస్మానియాతో సహా పలు వర్సిటీలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి.

ఫైన్‌ఆర్ట్స్‌
ఇంటర్‌ తర్వాత కళల పట్ల ఆసక్తి ఉన్నవారు ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు చేయవచ్చు. పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌, స్కల్ప్‌చర్‌ మొదలైన కోర్సులెన్నో ఉన్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ వర్సిటీలో బీఎఫ్‌ఏ కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా పలు యూనివర్సిటీల్లో యూజీ కోర్సులున్నాయి.

డిజైన్‌
ఇంటర్‌ తర్వాత ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలోనూ పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. దీనికి హైదరాబాద్‌తో సహా పలు చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. దీనికి అహ్మదాబాద్‌తోపాటు విజయవాడ, కురుక్షేత్రల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు యూసీడ్‌ ద్వారా ఐఐటీ బాంబే, గువాహటి, పలుసంస్థల్లో డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
ఈ సంస్థలన్నీ ఇంటర్‌ విద్యార్హతతో డిజైన్‌లో బ్యాచిలర్‌ కోర్సులు అందిస్తున్నాయి. కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. డిజైన్‌లో బ్యాచిలర్స్‌ స్థాయిలో పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి.

బీబీఏ, బీబీఎం, బీసీఏ
ఇంటర్‌ అన్ని గ్రూప్‌లవారూ బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో చేరవచ్చు. భవిష్యత్తులో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేయాలనుకున్నవారు బీబీఏ, బీబీఎంలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. పలు ప్రైవేటు సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌
ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవారికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు సరైన ఎంపిక. అభిరుచి మేరకు ఇందులోని విభాగాలను స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం)లు ఆతిథ్య రంగంలో ఉత్తమ విద్యాబోధనకు పేరుపొందిన సంస్థలు. ఇవి కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పడ్డాయి. మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును వివిధ సంస్థలు అందిస్తున్నాయి. జాతీయస్థాయి ఉమ్మడి పరీక్ష ద్వారా పలు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో రెండు సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌. రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు బీఎస్సీ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు అందిస్తున్నాయి. వీటిలో దాదాపు అన్నింట్లోనూ నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా అర్హులే.

స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌
స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరడానికి ఏ గ్రూప్‌తోనైనా ఇంటర్‌ పాసైనవారు అర్హులు. బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి. వీటి కాలవ్యవధి మూడేళ్లు.
సంస్థలవారీగా కోర్సులు: నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌,ముంబయి: బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌) స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌; మౌలానా అబ్దుల్‌ కలామ్‌ ఆజాద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, పశ్చిమ్‌ బంగ: బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌; జార్జ్‌ కాలేజ్‌, కోల్‌కతా: బీఏ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌; ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి: బ్యాచిలర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌.


ఎదురులేని ఎంపీసీ!
ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ పూర్తయితే ఏం చేయాలి? ఇటు ఇంటర్‌ ఉత్తీర్ణులకీ, అటు టెన్త్‌ పాసై ఎంపీసీ తీసుకోవాలనుకునే వారికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఇది. ఇంజినీరింగ్‌ తప్ప ఇంకేమీ వెంటనే తోచదు. కానీ ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రఖ్యాత సంస్థలు అందిస్తున్న ఆ కోర్సుల్లోకి ఎంపీసీ గ్రూప్‌ వాళ్లు ఎంటరైపోవచ్చు. పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులకు; మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల పట్ల అభిరుచితో వాటిలోనే కెరియర్‌ వెతుక్కోవాలనుకునే వారికి; ఎర్త్‌ సైన్స్‌, హెల్త్‌ సైకాలజీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఓషనోగ్రఫీ వంటి భిన్నమైన చదువుల్లో చేరాలనుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇంజినీరింగ్‌ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లోనూ ఎంపీసీకీ ఎదురులేదని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరుతుంటారు. దక్షిణ భారత రాష్ట్రాలన్నీ దాదాపు ఇదే ట్రెండ్‌ అనుసరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలు మారుతున్నాయి. పోటీ ఎక్కువగా ఉంటున్న ఇంజినీరింగ్‌ కాకుండా ఇంకో మార్గంలో కెరియర్‌ కొనసాగించాలని భావిస్తున్నారు. అది పిల్లల ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని కోరుకుంటున్నారు. వాస్తవానికి అలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో ఎన్నో రకాల డిగ్రీలు, పీజీలను దేశవ్యాప్తంగా పలు ప్రఖ్యాత సంస్థలు అందిస్తున్నాయి. అవన్నీ ఎంపీసీ విద్యార్థులకు ప్రత్యేకం. తమ గ్రూప్‌ కాకుండా వేరే సబ్జెక్టులైన ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీలకు సంబంధించిన ఇతర కోర్సుల దిశగానూ అడుగులేయవచ్చు. అటు సైన్స్‌, ఇటు ఆర్ట్స్‌ అన్ని గ్రూపుల్లోనూ చేరే అవకాశం ఎంపీసీ విద్యార్థులకు ఉంది. చేయాల్సిందల్లా ఆసక్తి, అభిరుచి, నైపుణ్యాలకు అనుగుణంగా అడుగులేయడమే.
ఇంజినీరింగ్‌
ఎంపీసీతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేయగానే మొదట కనిపించే దారి ఇంజినీరింగ్‌. దీని కోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో వివిధ ప్రవేశపరీక్షలున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశం జేఈఈ ద్వారా లభిస్తుంది. ఏపీ, తెలంగాణల్లోని రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు. అలాగే పలు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేఎల్‌యూ, గీతం, విజ్ఞాన్‌ ఈ తరహాలో ప్రవేశాలు కల్పిస్తాయి. బిట్స్‌, విట్‌, ఎస్‌ఆర్‌ఎం ఇలా ఎన్నో విద్యాసంస్థలు ఇదే పద్ధతి అనుసరిస్తున్నాయి. విద్యార్థులు తమ ప్రతిభకు అనుగుణంగా వీటిలో కొన్నింటిని ఎంచుకుని, వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఇంజినీరింగ్‌ సీటు ఖాయమైనట్లే. సంబంధిత పరీక్షలు రాసి ఆర్మీ, నేవీల్లో చేరి బీటెక్‌ కోర్సు చదువుకోవడానికి ఎంపీసీ విద్యార్థులకు అవకాశం ఉంది.
ఐఐఎస్‌ఈఆర్‌ల్లో సైన్స్‌ కోర్సులు
ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను పరిశోధనల దిశగా నడిపించడానికి ఏర్పాటుచేసినవే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏడు చోట్ల వీటిని నిర్వహిస్తున్నారు. తిరుపతి, బరంపూర్‌, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంలో వీటిని ఏర్పాటు చేశారు. బీఎస్‌-ఎంఎస్‌ పేరుతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ఇక్కడ అందిస్తున్నారు. వీటిలో మూడు మార్గాల ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు సాధించినవాళ్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కు ఎంపికైనవారు ప్రవేశానికి పరీక్ష రాయకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండూ లేనివారికి ప్రవేశపరీక్ష ద్వారా అవకాశం కల్పిస్తారు. అలాగే జేఈఈ ర్యాంకర్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కు ఎంపికైనవాళ్లు సైతం ఐఐఎస్‌ఈఆర్‌ నిర్వహించే పరీక్షను రాసుకోవచ్చు. సగం సీట్లు జేఈఈ ర్యాంకులు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగతా సగం సీట్లను ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపిన వారికి కేటాయిస్తారు. ఏడు సంస్థల్లోనూ కలిపి 1300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో చేరిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతినెలా రూ.అయిదు వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.
బీఎస్‌ - ఎంఎస్‌ కోర్సులు: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్వైరాన్మెంటల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ (ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌లో ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి).
దరఖాస్తులు: మే 21 నుంచి జూన్‌ 8 మధ్యాహ్నం 12 గంటల వరకు పంపవచ్చు.
సైన్స్‌ రిసెర్చ్‌
పరిశోధనల దిశగా అడుగులేయాలని ఆశించే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మరో మంచి వేదిక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌. జేఈఈ, నీట్‌ ర్యాంకులు, కేవీపీవై స్కాలర్‌షిప్‌ల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థ నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సులు నిర్వహిస్తోంది. కోర్సులో చేరినవాళ్లు ఏదైనా సైన్స్‌ సబ్జెక్టును ప్రత్యేకంగా చదవడంతోపాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అంశాలు అదనంగా నేర్చుకోవడం తప్పనిసరి. అత్యంత నిష్ణాతులైన బోధనా సిబ్బంది, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వసతులు ఐఐఎస్సీలో ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదివి పీజీ పట్టా అందుకోవచ్చు. అనంతరం పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, మెటీరియల్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్వైరాన్మెంటల్‌ సైన్స్‌ల్లో ఒకదానిని స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు తీసుకున్న మేజర్‌ డిసిప్లిన్‌ పేరుతో డిగ్రీలను ప్రదానం చేస్తారు.
ఉపాధికి భరోసా ఆర్కిటెక్చర్‌
ఎంపీసీ విద్యార్థులు చేయదగ్గ మరో కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌). నిర్మాణ రంగంలో ఇంజినీరింగ్‌ సేవలు అందించాలనుకునేవారు ఈ కోర్సులో చేరవచ్చు. అయితే కోర్సు వ్యవధి అయిదేళ్లు. పలు ఐఐటీలు, ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈలో అదనంగా మరో పేపర్‌ రాయాల్సి ఉంటుంది. డ్రాయింగ్‌ నైపుణ్యం ఉన్నవారికి ఆర్కిటెక్చర్‌ అదనపు ఆకర్షణ. ప్రస్తుతం ఈ కోర్సుకు అన్నిచోట్లా డిమాండ్‌ ఉంది. కాబట్టి ఇష్టంతోచేరి కష్టపడి చదువుకున్నవారికి ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదు. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ ఈ కోర్సులకు ప్రసిద్ధ సంస్థ.
మ్యాథ్స్‌లో బీఎస్సీ ఆనర్స్‌
చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ గణితంలో యూజీ కోర్సులకు దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. బీఎస్సీ (ఆనర్స్‌)- మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; బీఎస్సీ (ఆనర్స్‌)-మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ మూడేళ్ల కోర్సులు ఇక్కడ చేయవచ్చు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ చదువుకున్నవారికి స్టైపెండ్‌ చెల్లిస్తారు.
స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ల్లో డిగ్రీ
స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ కోర్సులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దృష్టిసారించాల్సిన సంస్థల్లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) ప్రధానమైంది. నాణ్యమైన బోధన, ఉన్నత ప్రమాణాలు, వసతులతోపాటు ప్రతినెలాస్టైపెండ్‌Â అందించడం ఐఎస్‌ఐ ప్రత్యేకత. ఇక్కడ బీ-స్టాట్‌, బీ-మ్యాథ్స్‌ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ. 3 వేలు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (బీ-స్టాట్‌) కోర్సు నిర్వహిస్తున్నారు. బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌ (బీ-మ్యాథ్స్‌) కోర్సు అందిస్తున్నారు. కోర్సుల వ్యవధి మూడేళ్లు.
ఫ్యాషన్‌ టెక్నాలజీ
ఫ్యాషన్‌ కోర్సులకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)లు దేశంలో పేరుపొందిన సంస్థలు. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 16 చోట్ల వీటిని నెలకొల్పారు. వీటిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌ టెక్‌ - అపారెల్‌ ప్రొడక్షన్‌) కోర్సులో ఉమ్మడి పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంపీసీ విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. అలాగే ఇక్కడ పలు ఇతర డిజైన్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలోనూ చేరవచ్చు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ కూడా పలు కోర్సులు అందిస్తోంది. మరికొన్ని సంస్థలూ బీటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి.
పరిశోధనల మార్గంలో!
పరిశోధనా రంగంలో రాణించాలనుకునే ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌) మంచి అవకాశం. ఈ పరీక్ష ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ సంస్థల్లో ప్రవేశం లభించినవారు ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ కింద అయిదేళ్ల పాటు నెలకు రూ.5000 చొప్పున ఉపకార వేతనం పొందవచ్చు. అలాగే వేసవి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూల్లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. నైసర్‌లో 202, సీఈసీఎస్‌లో 47 సీట్లు ఉన్నాయి. శాస్త్రవేత్తలతో బోధన ఇక్కడి ప్రత్యేకత. ఆఖరి సంవత్సరంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. బేసిక్‌ సైన్సెస్‌, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
బీఎస్సీ
ఇంటర్‌ తర్వాత నచ్చిన గ్రూప్‌ కాంబినేషన్లతో బీఎస్సీ కోర్సులో చేరిపోవచ్చు. ఇంటర్‌లో సాధించిన మార్కుల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. అందుబాటులో ఉన్న కొన్ని కాంబినేషన్లు: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌; మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ; మ్యాథ్స్‌, ఎలక్ట్రానిక్స్‌, జియాలజీ; జియాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ..ఇలా పలు కాంబినేషన్లతో చదువుకోవచ్చు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ బీఎస్సీ (ఫిజిక్స్‌) కోర్సు అందిస్తోంది. బీఎస్సీ అనంతరం ఎంపీసీ విద్యార్థులు ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జామ్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది.
మరెన్నో!
ఇతర కోర్సుల గురించి పరిశీలిస్తే పలు సంస్థలు యానిమేషన్‌లో బీఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఆసక్తి ఉంటే బీఫార్మసీ చేయవచ్చు. ఇంకా లా, సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్‌, డీఎడ్‌ తదితర కోర్సుల్లోనూ చేరవచ్చు. మరికొన్ని సంస్థలు, కళాశాలలు ఫిజికల్‌ ఓషనోగ్రఫీ, జియలాజికల్‌ ఓషనోగ్రఫీ, మెరైన్‌ కెమిస్ట్రీ మొదలైన కోర్సులను డిగ్రీ స్థాయిలో అందిస్తున్నాయి. ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీలో ఇంటర్‌ ఎంపీసీతో బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఐఎస్‌ఎం ధన్‌బాద్‌, రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ, పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ వంటి సంస్థలు బీటెక్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌ కోర్సు అందిస్తున్నాయి. వైవిధ్యం కోరుకునేవారు వీటికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇందులోనూ పలు స్పెషలైజేషన్లు బీటెక్‌ స్థాయిలో ఉన్నాయి
బీఎడ్‌, ఎమ్మెస్సీ ఎడ్‌
ఒకవైపు ఇంటర్‌ గ్రూప్‌లతోనే డిగ్రీని కొనసాగిస్తూ, మరోవైపు బీఎడ్‌, ఎంఎడ్‌ కోర్సులు పూర్తి చేసుకునే సౌలభ్యాన్ని మైసూర్‌లోని ఆర్‌ఐఈ కల్పిస్తోంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ ఆరేళ్ల కోర్సును మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అందిస్తున్నారు. దీంతోపాటు నాలుగేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ (ఎంపీసీ) ఎడ్‌ కోర్సుల్లోనూ చేరవచ్చు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ఎడ్‌ కోర్సు అందిస్తోంది.
బీటెక్‌ వద్దనుకుంటే!
ఎంపీసీ తర్వాత ఇంజినీరింగ్‌ వద్దనుకునే వారికి, అందరూ బీటెక్‌లే చేస్తున్నారు కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దాం అనుకునే వారికి బేసిక్‌ సైన్సెస్‌, ఇతర కోర్సులు చక్కటి మార్గాలు.వీటిలో కొన్నింటిని అన్ని గ్రూప్‌ల వాళ్లు చేయవచ్చు.
బేసిక్‌ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. జాతీయ స్థాయిలో పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు బేసిక్‌ సైన్స్‌ల్లో ఇంటర్‌ తర్వాత పీజీ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, నైసర్‌, పుదుచ్చేరి, హైదరాబాద్‌ల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. అలాగే పలు సంస్థలు సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ కోర్సులు అందిస్తున్నాయి. ఐఎస్‌ఐ కోల్‌కతా, సీఎంఐ-చెన్నై, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ఇంకొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ-ఎడ్‌, బీఎస్సీ-ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఇవేవీ కాదనుకుంటే రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఎంపీసీ సబ్జెక్టుల నుంచి మారాలనుకుంటే లా, డీఎడ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్‌ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. డిగ్రీలో సైన్స్‌ సబ్జెక్టులే కాకుండా ఎకనామిక్స్‌, పాలిటీ, హిస్టరీ, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, టూరిజం స్టడీస్‌ మొదలైన వాటిలో చేరవచ్చు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్సీ
ఇంటిగ్రేటెడ్‌ విధానంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పీజీ కోర్సులను అందిస్తోంది. వీటి వ్యవధి అయిదేళ్లు మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, హెల్త్‌ సైకాలజీ కోర్సుల్లో ఎంపీసీ విద్యార్థులు చేరవచ్చు. వీటితోపాటు కావాలనుకుంటే ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సోషియాలజీ కోర్సుల్లోనూ చేరడానికి అవకాశం ఉంది. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎమ్మెస్సీ - అప్లైడ్‌ జియాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, హిస్టరీ, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌ కోర్సులు అందిస్తోంది.
ఇటీవల ఏర్పడిన పది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్వైరాన్మెంటల్‌ సైన్స్‌, జాగ్రఫీ, జియాలజీ, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, బీఎస్సీ-ఎడ్‌ కోర్సులు కూడా ఉన్నాయి. సీయూ సెట్‌లో చూపిన ప్రతిభ ద్వారా వీటిలోకి ప్రవేశం లభిస్తుంది.
ఐఐటీల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ప్రవేశం జేఈఈ ద్వారా లభిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా, ఉస్మానియాలే కాకుండా దాదాపు అన్ని యూనివర్సిటీలూ కనీసం ఒక సబ్జెక్టులో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. సంబంధిత యూనివర్సిటీ సెట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు.

ఆసక్తే అనుగుణంగా ఆడుగేస్తే మేలు!
* ఇంటర్ తర్వాత వివిధ కోర్సులు
ఇంటర్ పూర్తి చేసిన వారు ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులపైనే దృష్టి సారిస్తారు. వీటితోపాటు కామర్స్, లా, ఆర్ట్స్ వంటి ఇతర కోర్సులను రాష్ట్రంలోని యూనివర్సిటీలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీలు అందిస్తున్నాయి. వీటి గురించిన సమచారాన్ని తెలుసుకుందాం.
ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఈ రెండిట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు వివిధ రకాల పరిస్థితులు దోహదం చేస్తాయి. అంత త్వరగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేనివాళ్లు ఉన్నతవిద్యవైపు దృష్టి సారిస్తారు. ఉన్నతవిద్యకు ఎన్నిరకాల అవకాశాలు ఉన్నాయో తెలుసుకుంటే అభిరుచి మేరకు అడుగు ఎటువేయాలో అర్థమవుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందుకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నాం. పరిశీలించండి.
ఇంజినీరింగ్
ఎంపీసీ: గణితానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ గ్రూప్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్‌కు అర్హత సాధించేందుకు ఈ గ్రూపులో చేరతారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేసేందుకు ఎంపీసీ పునాదిగా ఉపయోగపడుతుంది. ఇక సాంకేతిక కోర్సుల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ట్రిపుల్ఐటీలు, జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష (ఐఐటీ-జేఈఈ) రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
బిట్స్‌పిలానీలో ప్రవేశానికి జరిగే 'బిట్‌శాట్' రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు. అంతరిక్షం, వైమానిక శాస్త్రాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్‌సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రవేశానికి 'ఐశాట్' జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లలో తొలిప్రయత్నంలోనే కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు.
ఎంపీసీతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థికి మన రాష్ట్రంలో ప్రాథమికంగా రెండు ఆప్షన్లు ఉంటాయి. అవి..
1. ఎంసెట్
2. బి.ఎస్‌సి.
ఎంసెట్ ...
ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు వస్తుంది. పలు ఇంజినీరింగ్ కోర్సుల్లో విద్యార్థి ర్యాంక్, అభిరుచి తదిరాల ఆధారంగా తనకు లభించిన కోర్సులో చేరవచ్చు.
బీఎస్సీ
బి.ఎస్‌సి.లో వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.
అవి..: మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్ తదితరాలు ప్రధానమైనవి.
డాక్టర్ కావాలనుకుంటున్నారా?
బీపీసీ : డాక్టర్‌గా, వెటర్నరీ డాక్టర్‌గా, వైద్య సంబంధిత ఇతర వృత్తుల్లో, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీపై మొగ్గు చూపుతారు. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బైపీసీ విద్యార్థులు నీట్ ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో చేర‌వ‌చ్చు. ఎంసెట్‌తో ఏజీబీఎస్సీ, బీఏఎంఎస్‌, బీహెచ్ఎంఎస్ త‌దిత‌ర కోర్సులు చ‌దువుకోవ‌చ్చు. బీఎస్సీ న‌ర్సింగ్‌తోపాటు ప‌లు పారామెడిక‌ల్ కోర్సుల‌ను ఎంచుకోవ‌చ్చు. వీటిలో అవ‌కాశం లేనివాళ్లు వివిధ స‌బ్జెక్టుల కాంబినేష‌న్‌తో బీఎస్సీ కోర్సులో చేర‌వ‌చ్చు. ఫార్మా ప‌రిశ్రమ, ప్రయోగ‌శాల‌లు, ఆసుప‌త్రులు, ప‌రిశోధ‌న కేంద్రాల్లో బైపీసీ నేప‌థ్యం ఉన్నవారికి ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి.
కామర్స్ కోర్సులు
ఎంఈసీ, సీఈసీ: భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం ప్రధానపాత్ర పోషిస్తోంది. దీంతో కామర్స్ గ్రాడ్యుయేట్లకు రోజురోజుకీ అవకాశాలు పెరుగుతునాన్నాయి. సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ, కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న ఎంఈసీ, సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, ఛార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు. మేథమేటిక్స్, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. ఈ రంగాలపై గత అయిదారేళ్లుగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది................. మ‌రింత స‌మాచారం కోసం క్లిక్ చేయండి..
సాంప్రదాయిక డిగ్రీ కోసం..
ఆర్ట్స్ గ్రూపులు: పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. ప్రస్తుతం ఈ గ్రూపుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో ఇవి అంతరించిపోతున్నాయి. ఇటీవలికాలంలో ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య పెరిగి, ఉపాధి అవకాశాలు తగ్గడంతో మళ్లీ ఈ గ్రూపులకు డిమాండ్ పెరుగుతోంది. యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీపరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు డిగ్రీస్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీభాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా అనేక అవకాశాలను అందుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది.
ఇంట‌ర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ ...ఇలా ఏ గ్రూప్‌లో చేరిన‌ప్పటికీ బోధ‌న దిశ‌గా అడుగులేయానున్నవారు డైట్‌సెట్ ద్వారా డీఎడ్‌లో చేర‌డం మంచిది.
ఇంట‌ర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి లాసెట్, జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్ ప‌రీక్షల‌కు అర్హులే. న్యాయ‌వాద వృత్తిలో ప్రవేశించాల‌నుకునేవాళ్లు ఈ ప‌రీక్షలు రాయ‌డం త‌ప్పనిస‌రి.
ఇంట‌ర్మీడియ‌ట్ అనంత‌రం సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ, సీఎస్ త‌దిర‌త కోర్సుల్లో చేర‌వ‌చ్చు. అలాగే ఆస‌క్తి ఉన్నవారు హోట‌ల్ మేనేజ్‌మెంట్‌, పైల‌ట్ త‌దిత‌ర కోర్సులు దిశ‌గా అడుగులేయ‌వ‌చ్చు.
దూరవిద్య: రెగ్యులర్‌గా డిగ్రీలు చేయలేనివారు ఇంటర్ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ చేసేందుకు అవకాశం ఉంది. దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి.