Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

డిజైనింగ్‌ కోర్సులు

కలల కొలువులకు కళాత్మక కోర్సులు!

ఒక వస్తువు ఎంతో గొప్పదని ఎంతమంది చెప్పినా.. కంటికి నచ్చకపోతే కొనాలనిపించదు. అందుకే చూడగానే ఆకర్షించే విధంగా వాటిని రూపొందించేందుకు సంస్థలు, కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. అందులో భాగంగా సృజనాత్మక నిపుణులను నియమించుకుంటాయి. వీళ్లు డిజైనింగ్‌లో శిక్షణ పొంది ఉంటారు. మొబైళ్లు, మోటారు వాహనాల మొదలు నగల వరకు అన్నింటికీ డిజైనర్లు ఉంటారు. కాస్త కళాత్మక దృష్టి, కొత్తదనంపై ఆసక్తి ఉంటే ఈ కెరియర్‌ను ఎంచుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ అర్హతతోనే పలురకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఒక వస్తువు మార్కెట్‌లోకి వస్తే అది విజయం సాధించవచ్చు లేదా విఫలం కావచ్చు. కానీ అది అక్కడి వరకు చేరడంలో ఎంతోమంది కృషి ఉంటుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిజైనర్ల కష్టం. చూడగానే ఆకర్షించే విధంగా వస్తువును తీర్చిదిద్దడంలో వీరి శ్రమ ఉంటుంది. డిజైనింగ్‌ ఇప్పుడు డిమాండ్‌ ఉన్న కెరియర్లలో ఒకటిగా మారింది. చేసే పనిలో సృజనాత్మకతను ప్రదర్శించే వారికి ఇది ఉత్తమ ఉపాధి మార్గం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో సృజనాత్మకతతోపాటు కళాత్మక దృష్టి ఉన్న సుశిక్షితులైన నిపుణుల అవసరం చాలా ఉంది. వస్తువులను క్రియేటివ్‌గా సృష్టించడంతోపాటు వినియోగానికి వీలుగా ఉండే విధంగా డిజైనర్లు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తగిన పరిజ్ఞానాన్ని డిజైనింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. పలు సంస్థలు వివిధ విభాగాల్లో వీటిని నిర్వహిస్తున్నాయి.

యాక్సెసరీ డిజైన్‌
యాక్సెసరీస్‌ అంటే సాధారణంగా షూస్‌, హ్యాండ్‌బ్యాగ్‌లు గుర్తుకువస్తాయి. కానీ దీని పరిధి పెరిగింది. జ్యూలరీ, లెదర్‌ గూడ్స్‌, ఐవేర్‌, వాచ్‌లు, గృహాలంకరణ సామగ్రి.. ఇవన్నీ దీని కిందకే వస్తాయి. సృజనాత్మకతతోపాటు ప్రయోగాల పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ విభాగాన్ని ఎంచుకోవచ్చు.
ఇందులో కోర్సు పూర్తిచేస్తే కార్పొరేట్‌ హౌజ్‌లు, షాపింగ్‌మాల్స్‌, ఫ్యాషన్‌ మార్కెటింగ్‌, డిజైన్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌, బొతిక్స్‌, డిజైన్‌ ఆధారిత సంస్థల్లో ఆక్సెసరీ డిజైనర్లు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్లు/ మర్చండైజర్లుగా ఉద్యోగావకాశాలను పొందవచ్చు. ఫ్రీలాన్సింగ్‌నూ చేయవచ్చు.

గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌
మిలినియల్స్‌ ఎక్కువ ఆసక్తి చూపుతున్న కెరియర్లలో ఇదొకటి. వయసుతో సంబంధం లేకుండా అందరినీ మొబైల్‌, కంప్యూటర్‌ తెరలకు అతుక్కుపోయే విధంగా ఈ ఆన్‌లైన్‌, వీడియో గేమ్స్‌ చేస్తున్నాయి. అందుకే ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆడటమే కాదు, రూపొందించడంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. కాన్సెప్టులతోపాటు టెక్నాలజీపైనా అవగాహన ఉండాలి.
ఈ కోర్సులు చేస్తే గేమింగ్‌, మల్టీమీడియా, కంప్యూటర్‌ అండ్‌ కన్‌సోల్‌ గేమింగ్‌, మొబైల్‌ గేమింగ్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి. గేమ్‌ టెస్టర్‌, గేమ్‌ డిజైనర్‌, డెవలపర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఫ్రీలాన్సింగ్‌కీ వీలుంది.

గ్రాఫిక్‌ డిజైన్‌
ఇది ఆర్ట్‌, విజువల్‌ కమ్యూనికేషన్‌ల కలయిక. అడ్వర్టైజ్‌మెంట్లు, సినిమాలు, ఆటలు, వస్తువుల ప్యాకేజింగ్‌, లోగోలు.. ఇవన్నీ గ్రాఫిక్‌ డిజైన్లర్లు సృష్టించేవే. పదాలు, బొమ్మలు, ఆలోచనలతో సమాచారాన్ని వినియోగదారులకు చేరవేస్తారు. ఈ నిపుణులు కమ్యూనికేషన్‌ ప్రాబ్లమ్స్‌కు విజువల్‌ సొల్యూషన్స్‌ను సూచిస్తారు. విజువల్‌, కాన్సెప్చువల్‌ ఆప్టిట్యూడ్‌ నైపుణ్యాలు ఉన్నవారికి ఇది అనుకూలం.
వీరిని అడ్వర్టైజింగ్‌, ప్రింటింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌ మొదలైన సంస్థల్లో గ్రాఫిక్‌ డిజైనర్‌, పిక్చర్‌ ఎడిటర్‌, బ్రాండ్‌ ఐడెంటిటీ డిజైనర్‌, ఫ్లాష్‌ డిజైనర్స్‌, వెబ్‌ డిజైనర్స్‌, విజువల్‌ ఇమేజ్‌ డెవలపర్‌, లోగో డిజైనర్‌ మొదలైన హోదాల్లో నియమించుకుంటారు.

ఫ్యాషన్‌ డిజైనింగ్‌
ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన, ఆదరణ ఎక్కువ ఉన్న విభాగమిది. సృజనాత్మకతతోపాటు శైలి, సహజత్వాలకు ప్రాధాన్యమిచ్చేవారికి అనుకూలం. ఇది కేవలం దుస్తులకే పరిమితం కాదు. యాక్సెసరీలు, జీవనశైలి (లైఫ్‌ స్టయిల్‌) ప్రొడక్ట్‌లూ ఇందులో భాగమే. మారుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగదారుల ఆసక్తులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండటం ప్రధానం. ఎక్కువ పోటీ ఉన్న రంగమిది.
ఎక్స్‌పోర్ట్‌ హౌజ్‌లు, గార్మెంట్‌ స్టోర్‌లు, టెక్స్‌టైల్‌ మిల్స్‌, లెదర్‌ సంస్థలు, బొతిక్‌లు, ఫ్యాషన్‌ షో నిర్వహణ సంస్థలు, మీడియా హౌజ్‌ల్లో ఈ నిపుణులను ఫ్యాషన్‌ కన్సల్టెంట్‌, ఫ్యాషన్‌ ఫోర్‌కాస్టర్‌, ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌/ అసిస్టెంట్‌ డిజైనర్‌, ప్రొడక్షన్‌ సూపర్‌వైజర్‌ హోదాల్లో నియమించుకుంటారు.

ఫర్నిచర్‌ డిజైనింగ్‌
ఇదో ప్రత్యేక విభాగం. ఫ్యాషన్‌తోపాటు ప్రయోజనం, సౌకర్యాలకు ప్రాధాన్యం ఉంటుంది. అవసరానికే కాకుండా గృహాలంకరణ, స్థలానికి అనుగుణంగా ఇమడటం వంటివీ ప్రాధమ్యాల్లో ఉంటాయి. వీటిల్లోనూ సమయానికి అనుగుణంగా కొత్త ధోరణులు పుట్టుకొస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉండేవారు వేగంగా అభివృద్ధి చెందుతారు. మంచి పరిశీలన శక్తి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, కళాత్మకత ఉన్నవారికి ఇది అనుకూలం.
ఫర్నిచర్‌ తయారీ సంస్థలు, క్రాఫ్ట్‌ మాన్యుఫాక్చరర్స్‌, హోటల్స్‌, రిసార్ట్స్‌, ఏర్‌క్రాఫ్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌, డిజైన్‌ కన్సల్టింగ్‌ లాంటి సంస్థల్లో డిజైనర్లు, కన్సల్టెంట్లు, రిసెర్చర్స్‌, మెటీరియల్‌ టెస్టర్‌, ట్రెయినర్‌, ప్రొడక్షన్‌ ప్లానర్లుగా వీరికి ఉద్యోగాలుంటాయి.

ఇంటీరియర్‌ అండ్‌ స్పేస్‌ డిజైనింగ్‌
స్థలానికి డిమాండ్‌ పెరిగిపోతోంది. దీంతో తక్కువ ప్రదేశాన్ని ఎక్కువ సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా, అందంగా తీర్చిదిద్దే విధానానికి ప్రాధాన్యం పెరిగింది. ఇళ్లు, కార్యాలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు, రిటైల్‌ సంస్థలు, పాఠశాలలు.. ఇలా ప్రతిదానిలోనూ దీని అవసరం ఉంది. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు పరిశీలనా శక్తి, రంగులపై అవగాహన, మార్కెట్‌ ధోరణులపై ఆసక్తి ఉన్నవారు ఈ విభాగాన్ని ఎంచుకోవచ్చు. వీరికి మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఆర్కిటెక్చరల్‌ సంస్థలు, బిల్డర్స్‌, టౌన్‌, సిటీ ప్లానింగ్‌ బ్యూరోలు, హోటళ్లు, రిసార్టులు, డిజైన్‌ స్టూడియోలు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో మేనేజర్‌, అసిస్టెంట్‌, డిజైనర్‌ హోదాల్లో అవకాశాలు ఉంటాయి.

ఇండస్ట్రియల్‌ డిజైన్‌
నీటిని ఆదా చేసే షవర్‌ హెడ్ల నుంచి జీపీఎస్‌తోకూడిన వాకింగ్‌ స్టిక్స్‌ లాంటి ఎన్నో ఆధునిక పరికరాలు కాలానుగుణంగా మార్కెట్లో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవన్నీ డిజైన్‌, టెక్నాలజీల కలబోత. మార్కెట్‌ అవసరాల ఆధారంగా అప్పటికే అందుబాటులో ఉన్న వస్తువును మెరుగ్గా తీర్చిదిద్దడం దీని ప్రధాన ఉద్దేశం. విశ్లేషణ నైపుణ్యాలు, డిజిటల్‌, విజువలైజేషన్‌ శక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు.
ఆర్కిటెక్చరల్‌, ఇంజినీరింగ్‌, దాని అనుబంధ సంస్థలు, మ్యానుఫాక్చరింగ్‌, ఆర్ట్‌ డిజైనింగ్‌, మ్యాగజీన్లు వంటి సంస్థల్లో ప్రొడక్ట్‌ డిజైనర్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌ రిసెర్చర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌, డెస్క్‌టాప్‌ పబ్లిషర్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీర్‌ హోదాల్లో వీరిని నియమించుకుంటారు.

ట్రాన్స్‌పోర్టేషన్‌/ ఆటోమోటివ్‌ డిజైన్‌
నిర్వహణకు వీలైన, టెక్నాలజీ పరంగా ఆధునిక స్థాయిలో ఉండే వాహనాల ఆవశ్యకత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లకు అనుగుణంగా వీటిని రూపొందించేవారికి ఆదరణ ఎక్కువవుతోంది. స్టయిల్‌తో పాటు సౌకర్యం, బ్రాండింగ్‌, భద్రత, మెరుగ్గా పనిచేయడం వంటి అంశాలు వీటి నిర్మాణంలో తప్పనిసరి అవుతున్నాయి. ఇందుకు తగిన నైపుణ్యాలు ఉన్నవారికి ఈ రంగంలో ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు వాహనాలపై ఆసక్తి, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, కల్పనాశక్తి, విశ్లేషణ సామర్థ్యం కలిగి ఉండాలి. ట్రాన్స్‌పోర్టేషన్‌ డిజైనింగ్‌, కార్లు, ఏర్‌క్రాఫ్ట్‌, వాటర్‌ క్రాఫ్ట్‌, రైళ్లు మొదలైన వాహనాల తయారీ సంస్థల్లో వీరికి అవకాశాలుంటాయి.

ఇంకా..వెబ్‌ డిజైన్‌, యానిమేషన్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌ వంటి కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, అహ్మదాబాద్‌
* నిఫ్ట్‌- హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ
* సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె
* పెరల్‌ అకాడమీ, దిల్లీ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా, జయపుర
* అపీజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, దిల్లీ
* ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌
* వరల్డ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డిజైన్‌, హరియాణ
* ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె మొదలైనవి.

అర్హత.. ప్రవేశం
సాధారణంగా డిగ్రీ స్థాయిలో బి.డిజైన్‌, బీఎస్‌సీ, బీఎఫ్‌డీ, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంచుకున్న కోర్సునుబట్టి కాలవ్యవధి మూడు నుంచి నాలుగేళ్ల వరకు ఉంటుంది. దాదాపుగా సంస్థలన్నీ ప్రత్యేకమైన ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రవేశపరీక్షతోపాటు జీడీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలనూ జరుపుతున్నాయి. చాలావరకు అన్ని కోర్సులకూ ఇంటర్మీడియట్‌ ఏదైనా బ్రాంచితో పూర్తిచేసినవారు అర్హులు. కొన్ని టెక్నాలజీ ఆధారిత కోర్సులకు మాత్రం ఎంపీసీ తప్పనిసరిగా అడుగుతున్నారు.

దరఖాస్తు చేసుకోవచ్చు
పెరల్‌ అకాడమీ
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జూన్‌ 1, 2020
ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష తేదీ: జూన్‌ 6, 2020
ఫలితాల ప్రకటన: జూన్‌ 18, 2020
వెబ్‌సైట్‌: https://pearlacademy.com/

సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 10, 2020
ప్రవేశపరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌: https://www.sid.edu.in/

ఒక ఊహ లేదా ఆలోచనకు భౌతికరూపం ఇవ్వడం డిజైనింగ్‌. వస్తువులు, దుస్తులు, వాహనాలు, మొబైల్స్‌, కంప్యూటర్లు ఇలా దాదాపు అన్ని విభాగాల్లో దీనికి ప్రాధాన్యం ఉంది. వస్తువును తీర్చిదిద్దిన తీరు బాగుంటే మొదటి చూపులోనే వినియోగదారుడికి ఇష్టం కలుగుతుంది. ఆ ఆకర్షణ కలిగించడం వెనుక డిజైనర్‌ నిపుణుల కృషి ఎంతో ఉంటుంది.

కొన్ని ప్రవేశపరీక్షలు
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఎన్‌ఐడీ-డీఏటీ)
* నిఫ్ట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌
* సింబయాసిస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (ఎస్‌ఈఈడీ)
* అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీఈఈడీ)
* స్కూల్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సాఫ్ట్‌ సెట్‌)

Posted on 22-04-2020