Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇంజినీరింగ్

అరుదైన కోర్సులు మెరుగైన కొలువులు!
టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలతో పరిశ్రమల అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. ఒక విభాగంలో ఇంజినీరింగ్‌ నైపుణ్యం ఉన్నవారి సేవలు సరిపోవడం లేదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థికి ఎలక్ట్రికల్‌ పరిజ్ఞానం అవసరమవుతోంది. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానానికి సాంకేతిక సహకారాన్ని జోడించాల్సి వస్తోంది. బయాలజీ, ఇంజినీరింగ్‌లను కలిపి చదివితేనే అవకాశాలు అందుతున్నాయి. దీంతో సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ప్రత్యేక అవసరాల కోసం సరికొత్త బ్రాంచీలు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్‌ తర్వాత ఐఐటీ, ఎన్‌ఐటీలు సహా రాష్ట్రస్థాయిలో కొన్ని కళాశాలల్లో వీటిని బోధిస్తున్నారు. ఈ వైవిధ్య కోర్సులు చదివినవారికి పరిశ్రమలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
మెకట్రానిక్స్‌
మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ఈ రెండింటి మేళవింపే మెకట్రానిక్స్‌. ఇందులో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, టెలీకమ్యూనికేషన్స్‌, సిస్టమ్‌ ఇంజినీరింగ్‌, కంట్రోల్‌ ఇంజినీరింగ్‌ కూడా ఉంటాయి. మొబైల్‌ ఫోన్లు, మోటార్‌ కార్లు, ఇండస్ట్రియల్‌ రోబోట్‌లు రూపొందించడానికి మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అంశాల్లో ప్రావీణ్యం అవసరం. దీంతో తయారీరంగం చాలా వరకూ మెకట్రానిక్స్‌పై ఆధారపడుతోంది. అలాగే ఆటోమేషన్‌కూ ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా మెకట్రానిక్స్‌ చదివినవారికి అవకాశాలు విస్తరించాయి. ఫాక్స్‌కాన్‌, మారుతి లాంటి తయారీ సంస్థల్లో వీరికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మెకట్రానిక్స్‌లో రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ సైతం ఉంటాయి. ఆటోమోటివ్‌లు, డిఫెన్స్‌, స్మార్ట్‌సిటీస్‌, ఈ-కామర్స్‌ల్లో రోబోటిక్స్‌ వినియోగం పెరిగింది. ఇది మరింత విస్తృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రసిద్ధ సంస్థలు: నిట్‌ - వరంగల్‌, రవుర్కెలా; ఐఐటీ- పట్నా, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వంటివి ఈ కోర్సు అందిస్తున్నాయి.
నియామకాలు: హనీవెల్‌ ఆటోమేషన్‌, శాంసంగ్‌, ఎలక్ట్రానిక్స్‌, టెక్నాలజీ ఉత్పత్తులు తయారుచేసే సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి.
ఎనర్జీ ఇంజినీరింగ్‌
భారత్‌లో ఎనర్జీ వినియోగం 2035 నాటికి ఏడాదికి 4.2 శాతం చొప్పున పెరుగుతుందని ఒక అంచనా. పరిశ్రమలు, ఇళ్లు, కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా విద్యుత్తు వినియోగం అనివార్యం. అందుకే విద్యుత్తు ఉత్పత్తి, నిల్వ, పంపిణీల గురించి చదువుకునే ఎనర్జీ ఇంజినీర్ల అవసరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బొగ్గు, నీరు, నూనెలు, సహజవాయువుల నుంచి శక్తిని సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో సోలార్‌ ఎనర్జీ ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ మనుగడ ఎనర్జీతో ముడిపడి ఉంది. ఈ విభాగంలో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇందులో చాలామంది కీలకమైన రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. తక్కువ వ్యయంతో, పర్యావరణ హితంగా, కొత్త మార్గాల్లో శక్తిని ఉత్పత్తి చేయడంపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి పెడుతున్నారు. దీంతోపాటు ఇప్పుడు ఉపయోగిస్తున్న శక్తిని మరింత ప్రభావవంతంగా వినియోగించుకునేలా చూస్తున్నారు.
ప్రసిద్ధ సంస్థలు: దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ఐఐటీ- బాంబే, దిల్లీ, ఖరగ్‌పూర్‌; యూపీఈఎస్‌ - డెహ్రాడూన్‌, విట్‌ వంటి సంస్థలు ఈ కోర్సు అందిస్తున్నాయి.
నియామకాలు: ఓఎన్‌జీసీ, స్లంబర్గర్‌, టోటల్‌ అండ్‌ కెర్న్‌ ఎనర్జీ, ఇతర విద్యుత్తు తయారీ, పంపిణీ సంస్థలు, చమురు కంపెనీలు ఎనర్జీ ఇంజినీర్లను నియమించుకుంటాయి.
ఫుడ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌
సైన్స్‌, ఇంజినీరింగ్‌ రెండింటి కలయికే ఫుడ్‌ టెక్నాలజీ. ఆహారాన్ని శుద్ధిచేసి, భద్రంగా ప్యాకెట్‌లో ఉంచడానికి ఇటు సైన్స్‌ అటు ఇంజినీరింగ్‌ రెండు అంశాల్లోనూ ప్రావీణ్యం ఉండాలి. ప్రిజర్వేషన్‌, ప్రాసెసింగ్‌, ప్రిపరేషన్‌, ప్యాకేజింగ్‌, స్టోరేజ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఫుడ్‌ టెక్నాలజీలో కీలక దశలు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. పట్టణాలతోసహా గ్రామాల్లోనూ ప్యాకెట్‌ పుడ్‌ తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం నెలకు సగటున ఒక వ్యక్తి గ్రామాల్లో రూ.113, పట్టణాల్లో రూ.236 బెవరేజెస్‌, రిఫ్రెష్‌మెంట్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కోసం వెచ్చిస్తున్నారు. శీతల పానీయాలు, చాక్‌లెట్లు, పాల ప్యాకెట్లు, పాల ఉత్పత్తులు, బిస్కెట్లు, ఇతర తినుబండారాలు ఫుడ్‌ టెక్నాలజీ కిందకే వస్తాయి. ఆహార పదార్థాలను శుభ్రపరచి, రుచిగా తయారుచేసి సాంకేతికత జోడించి వాటిని ప్యాక్‌ల్లో భద్రపర్చడమే ఫుడ్‌ టెక్నాలజీ. భారత ఆహార మార్కెట్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వాటా 30 శాతానికి చేరుకున్నట్లు ఇండియన్‌ బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) చెబుతోంది. దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఆవిర్భవిస్తోంది. ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులు, వృద్ధి ఈ అన్ని విభాగాల్లో కలిపి చూసుకుంటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ దేశంలో అయిదో స్థానంలో ఉంది. దీంతో ఈ పరిశ్రమకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌), నాణ్యత మదింపు (క్వాలిటీ కంట్రోల్‌), న్యూట్రిషన్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్‌ కోర్సులతోనే ఈ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ- ఖరగ్‌పూర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ- ముంబయి, కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ- పర్భనీ, సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - మైసూర్‌, ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ- హైదరాబాద్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
నియామకాలు: ఐటీసీ, పార్లే, నెస్లే, అమూల్‌, బ్రిటానియా, ఇతర అగ్రోటెక్‌, ఫుడ్‌ కంపెనీలు నియమకాలు జరుపుతాయి.
బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌..
సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ తదితరాలతోపాటు రోగ నిర్ధారణ, వైద్యంలో ఉపయోగించే పలు పరికరాలను బయో మెడికల్‌ ఇంజినీర్లు తయారు చేస్తారు. వీటిని రూపొందిచడానికి ఒక్క ఇంజినీరింగ్‌ ప్రావీణ్యం సరిపోదు. మెడిసిన్‌, బయాలజీ కూడా తెలియాలి. అందుకే బయాలజీ, ఇంజినీరింగ్‌లను కలిపి బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ సృష్టించారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెటీరియల్‌ సైన్స్‌, బయాలజీ, మెడిసిన్‌ విభాగాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ సూత్రాలను బయాలజీ, మెడిసిన్‌కు అన్వయించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పరికరాలను సృష్టించడమే బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌. తక్కువ ఖరీదుతో, నాణ్యమైన, మరింత మెరుగైన పరికరాలను తయారుచేయడం బయోమెడికల్‌ ఇంజినీర్ల విధి. భారత ఆరోగ్య పరిశ్రమ 2020 నాటికి 280 బిలియన్‌ డాలర్లు చేరుతుందని అంచనా. ఇందులో వైద్యులు, ఆసుపత్రులతోపాటు బయో మెడికల్‌ ఇంజినీర్ల పాత్ర కూడా కీలకమే.
ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ - బాంబే, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, వారణాసి (బీహెచ్‌యూ); ఎంఎన్‌ఎన్‌ఐటీ - అలహాబాద్‌, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, బీవీఆర్‌ఐటీ-హైదరాబాద్‌.
నియామకాలు: సీమెన్స్‌ హెల్దీనీర్స్‌, ఎల్‌అండ్‌టీ, ఫిలిప్‌ హెల్త్‌ కేర్‌, వైద్య పరికరాల తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌
కొన్ని రంగాల్లో అభివృద్ధి కాలుష్యానికి కూడా కారణమవుతోంది. దీంతో పర్యావరణ హితమైన అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నాయి. ఆ బాధ్యత ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్లదే. పరిశ్రమల నుంచి తక్కువ వ్యర్థాలు, కాలుష్యం వెలువడేలా పలు పరిష్కారాలను వీరు చూపాలి. వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన ఉత్పత్తులను సృష్టించే దిశగా ఆలోచించాలి. కొత్తగా ఏ ప్రాజెక్టు, పరిశ్రమ మొదలుపెట్టాలన్నా పర్యావరణ అనుమతులు తప్పనిసరి. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది. దీంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్విరాన్‌మెంటల్‌ ఆడిటింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ మొదలైన ఉద్యోగాలు పబ్లిక్‌, ప్రైవేటు రంగాల్లో ఉన్నాయి. ప్రాసెస్‌ డిజైనింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్స్‌ హ్యాండ్లింగ్‌, ఆపరేషన్స్‌ మెయింటెనెన్స్‌ ఇవన్నీ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి ముఖ్యమైన దశలు.
ప్రసిద్ధ సంస్థలు: ఐఐటీ - బాంబే, మద్రాస్‌, రూర్కీ, ఖరగ్‌పూర్‌, కాన్పూర్‌; ధన్‌బాద్‌ (ఐఎస్‌ఎం), వారణాసి (బీహెచ్‌యూ), నిట్‌ - సూరత్కల్‌, తిరుచిరాపల్లి, నాగ్‌పూర్‌, వరంగల్‌, అలహాబాద్‌, దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలు ఈ కోర్సు అందిస్తున్న వాటిలో ప్రధానమైనవి.
నియామకాలు: ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాలుష్య నియంత్రణ మండళ్లు, నీటి పంపిణీ, నిర్వహణ సంఘాలు, మున్సిపాల్టీలు, కన్సల్టింగ్‌, అడ్వైజరీ సంస్థలు, పర్యావరణ అనుమతులతో ముడిపడి ఉన్న కంపెనీలు అంటే గనులు, రహదారులు, మౌలిక వసతులు కల్పించే ప్రాజెక్టులు, పర్యావరణంలో సేవలందించే ఎన్జీవోలు ఇలా పలు చోట్ల ఉద్యోగాలు ఉంటాయి.
ఇంటర్ తర్వాత ...... ఇంజినీరింగ్
ఏదైనా ఒక దేశం సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారకులు ఇంజి నీర్లు. భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో, అధునాతన భవనాల నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకం. అందుకనే ఇంజినీర్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే ఇంటర్ తర్వాత అధికశాతం విద్యార్థుల దృష్టి ఇంజినీరింగ్ మీదే ఉంటుంది. ఇంజినీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం సరైన నిర్ణయమే కావచ్చు. కాకపోతే తమ అభిరుచికి తగిన బ్రాంచిని ఎంపిక చేసుకోవాలి. బ్రాంచిని ఎలా ఎంచుకోవాలి, అసలు ఇంజినీరింగ్‌లో ప్రధానమైన, డిమాండ్ ఉన్న బ్రాంచీలు ఏవి? వంటి విషయాల గురించిన సమాచారం తెలుసుకుందాం.
ఆసక్తి... అభిరుచి ఉంటే మంచి భవిష్యత్తు!
ఇంజినీర్‌గా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు జాతీయ స్థాయిలో ఐఐటీ, నిట్, బిట్స్ తదితర సంస్థలు, రాష్ట్రంలోని జేఎన్‌టీయూ వివిధ రకాల ఇంజినీరింగ్ బ్రాంచీలను నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనవి, డిమాండ్ ఉన్నవి..
* మెకానికల్ ఇంజినీరింగ్
*
సివిల్ ఇంజినీరింగ్
* ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
* ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
* సీఎస్ఈ
ఇంజినీరింగ్ అంటే మొదటి నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. వీటినే కోర్ బ్రాంచీలని కూడా అంటున్నారు. దశాబ్దాల కిందటివైనా మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ లాంటి బ్రాంచీలకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణం, నీటివనరుల పరిశోధన, నిర్వహణ రంగాలకు సివిల్ ఇంజినీరింగ్ విస్తరించింది. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చాలా ముఖ్యమైన స్పెషలైజేషన్‌గా మారింది. ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవనాలు, రోడ్ల విస్తరణపై ప్రభుత్వాల శ్రద్ధ పెరుగుతోంది. కంప్యూటర్ ఆధారిత డిజైనింగ్ ఎక్కువగా ఆచరణలో ఉంది. అందువల్ల అభ్యర్థులు క్యాడ్, క్యామ్ లాంటి సామర్థ్యాలు నేర్చుకోవాలి. సాయిల్ మెకానిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్స్ స్పెషలైజేషన్లకు డిమాండ్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుండటం వల్ల అభ్యర్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి.
* మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్: ఆటో మొబైల్ రంగం విస్తరించడం, భారీ పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర అంశాల్లో మెకానికల్ ఇంజినీర్ల భాగస్వామ్యం తప్పనిసరి. మెకానికల్, సివిల్ బ్రాంచీలు తీసుకునే విద్యార్థులకు మ్యాథ్స్‌లో పట్టు ఉండాలి. విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించగలగాలి.
* ఎలక్ట్రానిక్స్: విద్యార్థులు బాగా ఇష్టపడే బ్రాంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ). రోజురోజుకీ విస్తృతమవుతోన్న ఎలక్ట్రానిక్ పరికరాల డిజైన్, తయారీ పరిశ్రమల్లో నిపుణుల కొరతను ఈ బ్రాంచి తీరుస్తోంది. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పట్టుంటే ఈసీఈ బ్రాంచి ఎంచుకోవచ్చు. బి.టెక్. పూర్తిచేస్తే మనదేశంలో, విదేశాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
* ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ):బ్రాంచిలో చేరాలనుకునే విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పట్టు, ఆసక్తి తప్పనిసరి. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లలో ఏ విభాగానికైనా తేలిగ్గా మారడానికి వీలున్న బ్రాంచి ఇది. మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో ఎక్కువగా ఉద్యోగాలుంటాయి.
* సీఎస్ఈ, ఐటీ: ఐటీ రంగం సేవలు ఇతర రంగాలకు కూడా విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్థులు సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. లీగల్ రిసెర్చ్, అకౌంటెన్సీ, ట్రావెల్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ లాంటి విభాగాల్లో కూడా ఇంజినీరింగ్ (సీఎస్ఈ, ఐటీ) విద్యార్థులకు అవకాశాలు లభిస్తున్నాయి. వీటితోపాటు బయోలాజికల్, ఆర్కిటెక్చరల్, బయో కెమికల్, ఏరో స్పేస్, అగ్రికల్చరల్, కన్‌స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ అండ్‌కంప్యూటర్, ఎన్విరాన్‌మెంటల్, ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్, నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఓషన్, పెట్రోలియం, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తదితర బ్రాంచీలున్నాయి.
పీజీలో సీఎస్ఈతో ఎంతో ఉపయోగం
ఆధునిక కాలంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)కి డిమాండ్ ఉన్నా, డిగ్రీలో పై 4 బ్రాంచీలను ఎంచుకుని పీజీలో సీఎస్ఈ చేస్తే భవిష్యత్తుకు మరింత బలమైన పునాది వేసుకున్నట్లు అవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రవేశ పరీక్షలు
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ‌ స్థాయిలో ఏకైక ప్రవేశ పరీక్ష 'ఎంసెట్'. ఇక జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక సంస్థలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,, ఐఐటీల్లో చేరేందుకు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) ఐశాట్, బిట్‌శాట్, వీటే మొదలైనవి ఉన్నాయి.
రాష్ట్ర స్థాయిలో... ఎంసెట్
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ‌లొని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షే ... ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్).
కోర్సులు:
1) బి.ఇ./ బి.టెక్.
2) బి.వి.ఎస్‌సి. అండ్ ఎ.హెచ్./ బి.ఎస్‌సి.(అగ్రి)/ బి.ఎస్‌సి.(హార్టికల్చర్)/బి.ఎఫ్.ఎస్‌సి./బి.టెక్. (ఎఫ్.ఎస్.అండ్ టి.)/బి.ఎస్‌సి. (సి.ఎ.అండ్ బి.ఎం.)
3) ఎం.బి.బి.ఎస్/బి.డి.ఎస్./ బి.ఎ.ఎం.ఎస్./ బి.హెచ్.ఎం.ఎస్/ బి.ఎన్.వై.ఎస్.
4) బి.ఫార్మా/ బి.టెక్(బయోటెక్నాలజీ), ఫార్మా-డి.
అర్హతలు: ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఇంటర్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇతర కోర్సుల్లో చేరేందుకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి.
వెబ్‌సైట్: www.apeamcet.org

జాతీయస్థాయిలో...
ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ కోర్సులను జాతీయ స్థాయిలో ఐ.ఐ.టి., ఎన్.ఐ.టి., ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్, బిట్స్ లాంటి సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి అఖిల భారత స్థాయిలో ప్రవేశ పరీక్షలు రాయాలి.
* ఐఐటీ - జేఈఈ: బి.ఇ., బి.టెక్., బి.ఆర్క్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో అభ్యర్థులను చేర్చుకోవడానికి ఈ పరీక్ష జాతీయస్థాయిలో జరుగుతుంది. ఈ పరీక్షకు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులుండాలి.
* బిట్‌శాట్: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో బీఆర్క్, బీ.ఫార్మ్ ఆనర్స్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్ మార్కులు ఉండాలి.
* ఐశాట్: ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సైన్సెస్‌లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి తిరువ నంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 70శాతం మార్కులను తొలి ప్రయత్నంలోనే పొందాలి. అలాగే పదోతరగతి అన్ని సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులు ఉండాలి.
యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం: డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ సంస్థ అరుదైన ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సులను నిర్వహిస్తోంది. ఎల్పీజీ, సీఎన్‌జీ, ఎల్ఎన్‌జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ సిస్టమ్స్, రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్స్, పైప్‌లైన్స్, జియో-సైన్సెస్, ఏరో స్పేస్, ఆటోమోటివ్ డిజైన్, మెకట్రానిక్స్, ఐటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొదలైన విభాగాలు బీటెక్‌లో ఉన్నాయి. వీటిలో చేరేందుకు సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులు అవసరం. టెన్త్‌లో కూడా 60 శాతం ఉండాలి. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులను చేర్చుకుంటారు.
ఆసక్తి ఆధారంగా బ్రాంచి ఎంపిక....
బ్రాంచి ఎంపికలో అభ్యర్థి ఆసక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఇంజినీరింగ్ లాంటి వృత్తివిద్యా కోర్సులో, తర్వాత కెరీర్‌లో రాణించాలంటే సంబంధిత సబ్జెక్టుపై అభ్యర్థికి ఆసక్తి, ఆ రంగంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉండాలి. అభ్యర్థుల ఆసక్తి, అభిరుచి, ప్రేరణలో తేడాలు తప్ప బ్రాంచీలకు లభించే అవకాశాల్లో గణనీయమైన వ్యత్యాసాలు ఏమీ ఉండవు.
కష్టపడితేనే ఫలితం!
ఇంటర్‌లో పడే శ్రమ ఒకరకమైంది. ఇంజినీరింగ్ చదవడం అంటే అంత సులభం కాదు. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి కష్టపడి చదవాల్సిందే. కనీసం 70 శాతం మార్కులు సాధించిన వారికే భవిష్యత్తులో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనీసం 60 శాతం మార్కులైనా సాధించకపోతే ఇంజినీరింగ్ చేసి ప్రయోజనం ఉండదు.
ప్రభుత్వ ఉద్యోగాలు
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచీలతో ఇంజినీరింగ్ చేసిన వారికి కేవలం ప్రైవేటు రంగంలోనే కాదు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్ ఎగ్జామినేషన్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, స్టీల్ ప్లాంట్, ఆర్టీసీ, గ్రూప్ 1, 2, తదితర పరీక్షలకు వీరు హాజరు కావచ్చు.