Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


గ్రూపు ఏదైనా కోర్సు మీకే!

ఇంటర్మీడియట్‌ ఒక గ్రూప్‌తో పూర్తిచేసిన తర్వాత ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా అదే సబ్జెక్టులతో సాగిపోవాలా... మరో మార్గం లేదా అనే ఆందోళన చాలామందికి ఎదురవుతుంది. అలా బాధపడాల్సిన పనిలేదు. అన్ని గ్రూప్‌ల వాళ్లు చేరగలిగిన విలువైన కోర్సులు కొన్ని ఉన్నాయి. చేయగలమా అనే భయం కూడా అవసరం లేదు. ఎవరైనా కొద్దిపాటి శ్రమతో పట్టా పుచ్చుకోవచ్చు.

ఇంటర్‌లో తెలిసో తెలియకో తీసుకున్న కోర్సుల పట్ల ఇష్టం లేకపోయినా లేదా కొత్త అభిరుచుల మేరకు మరో మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్న అభ్యర్థులకు కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌లో ఉత్తీర్ణులైనప్పటికీ ఈ కోర్సుల్లో చేరవచ్చు. సంబంధిత నోటిఫికేషన్లు వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తి
సమాజంలో మంచి గౌరవాన్ని పొందే ఉపాధ్యాయ వృత్తిపట్ల ఆసక్తి ఉంటే ఇంటర్లో ఏ గ్రూప్‌ వారైనా డీఈఈ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) సెట్‌కు హాజరు కావచ్చు. ప్లస్‌టూలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ సెట్‌ రాసుకోవడానికి అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు కళాశాలలు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే ప్రభుత్వం నిర్వహించే సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాల పరీక్షకు హాజరవడానికి అర్హత పొందుతారు. ఇందులో ప్రతిభను ప్రదర్శిస్తే ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించవచ్చు.

న్యాయవిద్యకూ మార్గం
న్యాయవిద్య లక్ష్యంగా ఉన్నవారు ఇంటర్‌ నుంచే తమ కలను సాకారం చేసుకోవచ్చు. లా కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశానికి లాసెట్‌, జాతీయ స్థాయిలో ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశానికి క్లాట్‌, ప్రైవేటు సంస్థల్లో అడ్మిషన్లకు ఎల్‌శాట్‌ మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిలో తగిన ర్యాంకు సంపాదిస్తే ఇంటర్‌ విద్యార్థులు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం -ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరవచ్చు.

క్లాట్‌: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) ఆధారంగా 19 న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు ఉంటాయి. ఈ విద్యాసంస్థల్లో అత్యాధునిక కరిక్యులమ్‌, మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉండటం వల్ల నాణ్యమైన విద్య లభిస్తుంది. ప్రాంగణ నియామకాలూ ఉంటాయి. క్లాట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో నల్సార్‌ (హైదరాబాద్‌), దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం)లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్‌లో 45% మార్కులతో ఉత్తీర్ణులైనవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

లాసెట్‌: రాష్ట్రస్థాయిలో న్యాయవిద్యలో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ / తెలంగాణ రాష్ట్రాల్లో లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (లాసెట్‌) పేరుతో పరీక్ష నిర్వహిస్తారు. దీని ద్వారా ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, పద్మావతి, శ్రీవేంకటేశ్వర, నాగార్జున మొదలైన వర్సిటీల న్యాయవిద్య కళాశాలల్లో చేరవచ్చు. ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే లాసెట్‌ రాయడానికి అర్హత లభిస్తుంది.

ఉపాధికి దారి ఫుట్‌వేర్‌
పాదరక్షల సంబంధిత కోర్సుల కోసం దేశంలో రెండు ప్రముఖ సంస్థలు వెలిశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి కాగా మరొకటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజ్‌ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఈ రెండు సంస్థల్లోనూ ఇంటర్‌ అర్హతతో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఎఫ్‌డీడీఐ: పాదరక్షల తయారీలో మానవ వనరులను అభివృద్ధి చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ)ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు ఉన్నాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, లెదర్‌ గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్‌, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చెండైజ్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు.

సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై: ఇంటర్‌ అర్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ఫుట్‌వేర్‌ మ్యానుఫ్యాక్చర్‌ అండ్‌ డిజైన్‌, ఏడాది వ్యవధితో సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది.

విదేశీ భాషలతో అవకాశాల విస్తరణ
ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవాళ్లకు ప్రాధాన్యం పెరిగింది. జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సులకు దేశంలోనే ఉత్తమ వేదిక ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)- హైదరాబాద్‌. దీనికి లఖ్‌నవూ, షిల్లాంగ్‌ల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి.

కోర్సులు, అర్హతలు: ఇంగ్లిష్‌, అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ విభాగాల్లో బీఏ (ఆనర్స్‌) కోర్సులు ఉన్నాయి. అర్హత ఇంటర్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు భరించడానికి నెలకు రూ.వెయ్యి స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఉస్మానియాతో సహా పలు యూనివర్సిటీలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి.

దర్జాగా దూరవిద్య
కాలేజీలకు వెళ్లి డిగ్రీలు చదువుకోవడానికి వీలు లేనివారు ఇంటర్‌ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి. లాయర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకున్నవారు దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సుల్లో చేరడమే శ్రేయస్కరం. డిగ్రీ అర్హతతో నిర్వహించే దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

కళాభిరుచికి ఫైన్‌ఆర్ట్స్‌
ఇంటర్‌ తర్వాత కళల పట్ల ఆసక్తి ఉన్నవారు ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు చేయవచ్చు. పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌, స్కల్ప్‌చర్‌ మొదలైన కోర్సులెన్నో ఉన్నాయి. వీటి కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఇక్కడ ఇంటర్‌ విద్యార్థుల కోసం అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా పలు యూనివర్సిటీల్లో యూజీ స్థాయిలో ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులు ఉన్నాయి.

టాటాలు... ప్రేమ్‌జీలు
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ రెసిడెన్షియల్‌ విధానంలో బీఏ కోర్సు అందిస్తోంది. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా ఈ కోర్సులో చేరవచ్చు.

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ - బీఏ సోషల్‌ సైన్సెస్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సులను అందిస్తోంది. కాలవ్యవధి మూడేళ్లు. ఈ కోర్సులను టిస్‌ ముంబయి క్యాంపస్‌తోపాటు హైదరాబాద్‌, గువాహటి, తుల్జాపూర్‌ కేంద్రాల్లో నిర్వహిస్తోంది. ఇక్కడ యూజీ కోర్సుల్లో చేరినవాళ్లు కావాలనుకుంటే పీజీ కూడా అదే క్యాంపస్‌లో పూర్తిచేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.

మరిన్ని
ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌లో చేరినప్పటికీ సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు. ఏడాదికి రెండుసార్లు అవకాశం కల్పిస్తారు. బీబీఎం, బీబీఏ తోపాటు పలు కోర్సుల్లో ఇంటర్‌ విద్యార్థులకు అవకాశం ఉంటుంది.

డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సును ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సంస్థ అందిస్తోంది. ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు కోర్సుకి అర్హులు.

ఆతిథ్య రంగంలోకి...
ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవాళ్లు, పాకశాస్త్రంపై అభిరుచి ఉన్నవారు, నిర్వహణ నైపుణ్యం కలిగినవారు, శుభ్రంగా ఉంచటాన్ని ఇష్టపడేవారు...వీరంతా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ రంగంలో సమర్థ మానవ వనరులకు గిరాకీ ఉంది.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం)లు ఆతిథ్య రంగంలో ఉత్తమ విద్యాబోధనకు పేరుపొందిన సంస్థలు. ఇవి కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఈ సంస్థలను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) పర్యవేక్షిస్తుంది. ఇవి మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును అందిస్తున్నాయి. జాతీయస్థాయి ఉమ్మడి పరీక్ష ద్వారా పలు సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో రెండు సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌. ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. రాష్ట్ర స్థాయిలో పలు సంస్థలు బీఎస్సీ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సు అందిస్తున్నాయి. వీటిలో దాదాపు అన్నింట్లోనూ నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా హోటల్‌ మేనేజ్‌ మెంట్‌ కోర్సులకు అర్హులే.

సృజనకు పట్టం డిజైన్‌
ఇంటర్‌ తర్వాత ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలోనూ పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. దీనికి హైదరాబాద్‌తో సహా పలు చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. దీనికి అహ్మదాబాద్‌తోపాటు విజయవాడ, కురుక్షేత్రల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు యూసీడ్‌ ద్వారా ఐఐటీ బాంబే, గువాహటి, పలుసంస్థల్లో డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థలన్నీ ఇంటర్‌ విద్యార్హతతో డిజైన్‌లో బ్యాచిలర్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

నిఫ్ట్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రామ్స్‌: యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ డిజైన్‌

ఎన్‌ఐడీ: ఇందులో ఇండస్ట్రియల్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులు ఉన్నాయి.

యూసీడ్‌: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ సంక్షిప్త రూపమే యూసీడ్‌. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు మరికొన్ని ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డీఈఎస్‌) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-బాంబేలో చేరినవాళ్లు కావాలనుకుంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సు చేసుకోవచ్చు. ప్రవేశం కల్పించే ముఖ్య సంస్థల్లో ఐఐటీ-బాంబే, గువాహటి; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - కోక్రాజ్హర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ - డెహ్రాడూన్‌ తదితరాలు ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు
ఇంటర్‌ తర్వాత బీఎడ్‌, ఎంఏ, ఎంబీఏ మొదలైన కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదివే అవకాశం ఉంది. ఐఐటీలు, ఐఐఎంలు సహా పలు యూనివర్సిటీల్లో ఇంటర్‌ ఉత్తీర్ణతతోనే ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో చేరవచ్చు.

ఐఐఎం, ఇండోర్‌: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సును ఐఐఎం-ఇండోర్‌ అందిస్తోంది. ఈ తరహా కోర్సును అందిస్తోన్న ఏకైక సంస్థ ఐఐఎం-ఇండోర్‌ ఒక్కటే కావడం విశేషం. కోర్సులో 120 సీట్లు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పదోతరగతి, ఇంటర్‌ల్లో కనీసం 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55) శాతం మార్కులు సాధించినవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఐటీ, మద్రాస్‌: ఐఐటీ-మద్రాస్‌ 2006లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఎంఏ-డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, ఎంఏ-ఇంగ్లిష్‌ స్టడీస్‌లను బోధిస్తున్నారు. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) ద్వారా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో కోర్సుకీ 23 మంది చొప్పున మొత్తం 46 మంది విద్యార్థులను చేర్చుకుంటారు.

ఆర్‌ఐఈ, మైసూర్‌: ఇంటర్‌ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్‌ బీఏఎడ్‌ నాలుగేళ్ల కోర్సులు చదువుకోవచ్చు. పలు సంస్థల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఆర్‌ఐఈ మైసూరులో బీఏఎడ్‌ కోర్సులో 40 సీట్లు ఉన్నాయి. రాతపరీక్షలో సాధించిన మార్కులకు 60 శాతం, అకడమిక్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మే 9 వరకు పంపవచ్చు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (హ్యుమానిటీస్‌): తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌; ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులను హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తోంది. ఈ కోర్సులకు ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు మే 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీయూ సెట్‌: ఇంటర్‌ అర్హతతోనే కొత్తగా ఏర్పడిన పది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూసెట్‌) ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌; ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ: ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌; ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీలతోపాటు బీఏ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌; బ్యాచిలర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ స్టడీస్‌: రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, బీపీఏ: మ్యూజిక్‌, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌లో డిప్లొమా, క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ కోర్సులు ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రా, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర...ఇలా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి యూనివర్సిటీ ఏదో ఒక సబ్జెక్టులో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందిస్తున్నాయి.