ఇంటర్‌ అర్హతతో ఉన్నత కెరియర్‌
            
'ఇంటర్మీడియట్‌ అర్హత ఉంటే ఉన్నత కెరియర్‌కు అవకాశం ఏముంటుంది?' అని చాలామంది నిరుత్సాహపడుతుంటారు. కానీ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీలు ఈ అవకాశం కల్పిస్తున్నాయి! ఇవి నిర్వహించే నియామక పరీక్షలో నెగ్గితే ఖర్చు లేకుండా డిగ్రీ పొందటంతో పాటు ఉన్నతహోదానిచ్చే కొలువుతో కెరియర్‌ ప్రారంభించవచ్చు.
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే విశిష్టమైన పరీక్షల్లో ఎన్‌డీఏ ఒకటి. దేశసేవ చేయాలనే తపన, ధైర్యసాహసాలు ఉండే అభ్యర్థులు ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్షకు సిద్ధం కావొచ్చు. దీని ద్వారా డిగ్రీ పట్టాతోపాటు రక్షణ రంగంలో ఉన్నతస్థాయి కొలువు సొంతమవుతుంది. ఎన్‌డీఏకు ఎంపికైతే రెండున్నరేళ్లపాటు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, పుణేలో బీఏ, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. నేవల్‌ అకాడమీకి ఎంపికైతే నాలుగేళ్లపాటు కేరళలోని ఎజిమాలలో బీటెక్‌ విద్యను అభ్యసించవచ్చు. విద్యార్థులకు అన్నీ ఉచితంగానే సమకూరుతాయి.
ఎంపికైన సర్వీసును బట్టి 18 నెలలపాటు సంబంధిత కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 21,000 స్త్టెపెండ్‌గా చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. రూ.60,000కు పైగా ఆరంభవేతనంతోపాటు వసతి, ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ఎన్‌డీఏ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. మొదట ఏప్రిల్‌లో, తరువాత ఆగస్టులో నిర్వహిస్తారు. ఏప్రిల్‌ పరీక్షకు డిసెంబర్‌ చివరి వారం/ జనవరి మొదటి వారంలో, ఆగస్టు పరీక్షకు ఏప్రిల్‌ చివర్లో/ మేలో ప్రకటనలు వెలువడతాయి.
అర్హతలు ఏమిటి?
ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్మీవింగ్‌ (ఎన్‌డీఏ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
ఏర్‌ ఫోర్స్‌, నావెల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ)లకు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నావెల్‌ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి గ్రూపు ఛాయిస్‌లను (ఆర్మీ/ నేవీ/ ఏర్‌ఫోర్స్‌) కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇంటర్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: పరీక్ష రాసే సమయానికి 16- 18 సంవత్సరాల మధ్య ఉండాలి. దేహదార్డ్య ప్రమాణాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తారు. కనీస ఎత్తు 152 సెం.మీ.లు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఇలా జరుగుతుంది- 1. రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ తరహా) 2. ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌
రాత పరీక్షలో: మొత్తం 900 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు.
పేపర్‌-1లో మ్యాథ్స్‌ నుంచి ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మార్కులు 300.
పేపర్‌-2లో జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలొస్తాయి. ఈ పేపర్‌కి 600 మార్కులు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌కు 200, జనరల్‌ నాలెడ్జ్‌కు 400 మార్కులు కేటాయించారు. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో సెక్షన్‌-ఎలో ఫిజిక్స్‌, బి-లో కెమిస్ట్రీ, సి-లో జనరల్‌ సైన్స్‌, సెక్షన్‌-డిలో చరిత్ర, స్వాతంత్య్రోద్యమం.. తదితర అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. సెక్షన్‌-ఇలో భూగోళశాస్త్రం, ఎఫ్‌లో వర్తమానాంశాలపై ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌- 100, కెమిస్ట్రీ- 60, జనరల్‌ సైన్స్‌- 40, చరిత్ర, స్వాతంత్రోద్యమాలు తదితరాంశాలు- 80, భూగోళశాస్త్రం- 80, వర్తమానాంశాలు- 40 మార్కులకు ప్రశ్నలడుగుతారు.
ఇంటెలిజెన్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌: సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు స్టేజ్‌-1, స్టేజ్‌-2ల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. వివిధ పరీక్షల ద్వారా అన్ని కోణాల్లోనూ నిశితంగా పరిశీలిస్తారు. ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ టెస్టుకు కేటాయించిన మార్కులు 900.
సంసిద్ధత ఎలా?
ఇంటర్‌ ఆర్ట్స్‌ గ్రూపు విద్యార్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లోని ప్రాథమిక భావనలపై పట్టు పెంచుకోవాలి. సబ్జెక్టు భావనలపై గట్టి అవగాహన ఏర్పరచుకోవాలి. దీనికోసం 6- 10 తరగతి వరకు వివిధ సబ్జెక్టుల్లోని ముఖ్యమైన పాయింట్లపై నోట్సు తయారుచేసుకోవాలి. సిలబస్‌లో తెలిపిన అంశాలను సమగ్రంగా చదువుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. గైడ్లకు బదులు పాఠ్యపుస్తకాలనే అధ్యయనం చేయటం మేలు.
జనరల్‌ ఎబిలిటీ పేపర్లో అధిక స్కోరు కోసం జాతీయ, అంతర్జాతీయ వార్తలు చదవాలి. ముఖ్యమైన పాయింట్లతో నోట్సు తయారు చేసుకోవాలి. పత్రికల్లోని ప్రధాన వ్యాసాలను పరిశీలించాలి. చరిత్ర, భౌతిక, రసాయన, భూగోళ, రాజనీతిశాస్త్రాల కోసం ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన 11, 12 తరగతుల పుస్తకాలను చదవాలి.
ఆంగ్లానికి సంబంధించి 11, 12 తరగతుల ఇంగ్లిష్‌ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. టాటా మెక్‌గ్రాహిల్‌ వారి జనరల్‌ ఇంగ్లిష్‌ పుస్తకాన్ని సంప్రదింపు గ్రంథంగా ఉపయోగించుకోవచ్చు. పాత ప్రశ్నపత్రాల సాధన అభ్యర్థుల అవకాశాలను మెరుగుపరుస్తుంది.
పరీక్షలో సమాధానాలను వేగంగా గుర్తించటం ముఖ్యం. దీనికి వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాల సాధన తప్పనిసరి. క్లిష్టంగా అనిపించే విభాగాలపై దృష్టిసారించి, వాటికోసం అదనపు సమయం కేటాయించుకోవాలి. తగిన కృషి చేయాలి.
రాతపరీక్షలో నెగ్గితే...
రాతపరీక్షలో అర్హత పొందినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్‌సీ ఇంటెలిజన్స్‌- పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఇక్కడ ఏర్‌ఫోర్స్‌కు వెళ్లాలనుకునేవారికి పైలట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఏర్‌ఫోర్స్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తే వీరికి సైకలాజికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటెలిజెన్స్‌ టెస్టు (వెర్బల్‌- నాన్‌వెర్బల్‌)లను ఏర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డులు/ సెలక్షన్‌ సెంటర్ల వద్ద నిర్వహిస్తారు. అభ్యర్థి ప్రాథమిక ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించడమే ఈ పరీక్షల లక్ష్యం. వీటి తర్వాత గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ చర్చలు, గ్రూప్‌ ప్లానింగ్‌, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్కులు ఉంటాయి. ప్రధాన సంఘటనలు, సమస్యల పరిష్కారంలో అభ్యర్థికి ఉన్న మానసిక సామర్థ్యాన్ని తెలుసుకోవడమే ఈ పరీక్షల ఉద్దేశం.
తుది ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిభ ఆధారంగా సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఆర్మీ, నేవీ, ఏర్‌ ఫోర్స్‌ విభాగాలకు ఎంపిక చేసిన తరువాత నాలుగేళ్ళ కోర్సులో చేర్చుకుంటారు. మొదటి రెండున్నర సంవత్సరాల శిక్షణ అందరికీ ఒకటే. మిగతా ఏడాదిన్నర సంబంధిత ట్రేడ్‌లో శిక్షణ నిర్వహిస్తారు.
బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్‌)/ బీఏ డిగ్రీ సర్టిఫికెట్లను న్యూదిల్లీలోని జేఎన్‌యూ అందజేస్తుంది. నావెల్‌ అకాడమీకి ప్రాధాన్యం ఇచ్చినవారికి ఎజిమలాలోని ఇండియన్‌ నావెల్‌ అకాడమీలో 4 సంవత్సరాలపాటు శిక్షణ ఇస్తారు. 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ కింద బీటెక్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.
* ఎన్‌డీఏ శిక్షణ అనంతరం ఆర్మీ క్యాడెట్‌లను డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీకి పంపుతారు. వీరికి ఇక్కడ సంవత్సరంపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేస్తే లెఫ్టినెంట్‌ హోదాలో పర్మనెంట్‌ కమిషన్‌ కింద తీసుకుంటారు. రూ. అరవై వేల వేతనంతో కెరియర్‌ ప్రారంభమవుతుంది.
* నావెల్‌ క్యాడెట్‌లను ఎజిమలాలోని నావెల్‌ అకాడమీకి పంపుతారు. ఇక్కడ సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు. విజయవంతంగా పూర్తిచేస్తే సబ్‌-లెఫ్టినెంట్స్‌ హోదాలో నియమిస్తారు.
* ఏర్‌ ఫోర్స్‌ క్యాడెట్‌లను హైదరాబాద్‌లోని ఏర్‌ఫోర్స్‌ అకాడెమీకి పంపుతారు. ఇక్కడ వీరికి ఏడాదిన్నరపాటు ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. తర్వాత వీరిని ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ర్యాంకుతో తీసుకుంటారు. ఏర్‌ఫోర్స్‌కు ఎంపికైనవారు పైలట్‌గా విధులు నిర్వర్తిస్తారు.

posted on 12.01.2015

Back