Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


న్యాయ విద్య

అన్ని గ్రూపులకూ న్యాయం!

న్యాయమూర్తి.. న్యాయవాది.. విలువలతో కూడిన జీవితం. గౌరవప్రదమైన సామాజిక హోదా. ఎందరికో న్యాయాన్ని అందించే ఉత్తమ స్థానం. మంచి ఆదాయం.. సంతృప్తిని సంపూర్ణంగా ఇచ్చే వృత్తి. అవును.. ఎవరినైనా ఇంతటి ఉన్నతంగా ఉంచగలిగేది న్యాయవిద్యే. అందుకే ఆ కోర్సుకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఇతర ప్రొఫెషనల్‌ చదువులకు దీటుగా ఎదుగుతోంది. ఇంటర్మీడియట్‌ పూర్తయిన వారు ఇప్పటి నుంచే ఆ దిశగా కెరియర్‌ను సాగించడంపై దృష్టిసారించవచ్చు.
దేశవ్యాప్తంగా దాదాపు 1200 న్యాయ కళాశాలల్లో లక్ష సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంప్రదాయ న్యాయ కళాశాలలతోపాటు ప్రైవేటు, న్యాయ విశ్వవిద్యాలయాలు న్యాయవిద్యను అందిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఏపీ లా సెట్‌/ టీఎస్‌ లా సెట్‌ గానీ, జాతీయ స్థాయిలో క్లాట్‌ (కామన్‌ లా ఎంట్రన్స్‌ టెస్ట్‌) గానీ రాసి న్యాయవిద్యాకోర్సుల్లో చేరవచ్చు. ప్రధానంగా మూడేళ్లు, అయిదేళ్ల కోర్సులున్నాయి.
* ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌తో పూర్తిచేసినా అయిదేళ్ల లా కోర్సులో చేరవచ్చు.
* ఏదైనా డిగ్రీ పూర్తయినవారు మూడేళ్ల లా కోర్సులో చేరవచ్చు. ఈ రంగంలో రాణించాలనుకునేవారికి అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ లా) కోర్సు అనువైనది.
డిగ్రీ అయ్యాక ‘లా’తో పోలిస్తే ఐదేళ్ల లా కోర్సులో ఏడాది మిగులుతుంది. ఈ వ్యవధిలో ఆ రంగంలో మరింత నైపుణ్యం సాధించడంతోపాటు ఉపాధినీ పొందవచ్చు. అయిదేళ్ల కోర్సులు పూర్తి చేసినవారు న్యాయవాద వృత్తిలో రాణించడానికి అవకాశాలున్నాయి. ప్రత్యేక రంగాల్లో నైపుణ్యం పొందవచ్చు. కోర్టుల్లో ప్రాక్టీస్‌ ప్రారంభించవచ్చు. ఇందులో కూడా ప్రత్యేకంగా సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు
లా కోర్సులు చేస్తే లీగల్‌ అడ్వైజర్‌, అడ్వొకేట్‌, లీగల్‌ మేనేజర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి హోదాల్లో ఉపాధి పొందవచ్చు.
* సివిల్‌, క్రిమినల్‌, వినియోగదారుల చట్టాలు, మానవ హక్కులు, పన్నులు, కంపెనీ లా, మేధో సంపత్తి చట్టాలు, రాజ్యాంగం తదితర అంశాల్లో నైపుణ్యం సాధించి ఆయా రంగాల్లో నుంచి వచ్చే కేసుల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఇక్కడ కేసులు, నైపుణ్యం ఆధారంగా ఫీజు పొందవచ్చు.
* ప్రస్తుతం జ్యుడిషియల్‌ సర్వీసులోనూ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తున్నాయి. వాటితోపాటు ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుండటంతో అక్కడా అవకాశాలున్నాయి. వీటిలో జ్యుడిషియల్‌ ఆఫీసరుగా చేరడానికి అవకాశం ఉంది. పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే జూనియర్‌ సివిల్‌ జడ్జి, మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌, చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ వంటి పోస్టులు పొందవచ్చు.
* కింది కోర్టుల నుంచి సుప్రీం కోర్టు దాకా ప్రభుత్వం తరఫున కేసులను వాదించడానికి న్యాయవాదుల అవసరం ఉంది. ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వంటి పోస్టులున్నాయి. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లలో ఉపాధి అవకాశాలున్నాయి.
* లా ఛాంబర్స్‌లో ఉద్యోగులుగా చేరి తమ సేవలను అందించవచ్చు. ఇక్కడ అవసరమైన సమాచారాన్ని సేకరించి ఇవ్వడం, పిటిషన్‌లను రూపొందించడం, నోటీసులు సిద్ధం చేయడం తదితర పనులను చేయడం ద్వారా వేతనం పొందవచ్చు.
* ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య పరస్పర వాణిజ్య కార్యకలాపాలు పెరిగినందున అంతర్జాతీయ ఒప్పందాలు, పేటెంట్‌లు తదితరాలకు సంబంధించి నిపుణుల అవసరం ఉంది. రెండు దేశాల్లోని కంపెనీల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడానికి ఆర్బిట్రేషన్‌లాంటివాటిలో అవకాశాలున్నాయి. విదేశీ కంపెనీలు కూడా భారతీయ న్యాయవాదులను నియమించుకుంటున్నాయి.
* నల్సార్‌ వంటి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో లా డిగ్రీ చేస్తుండగానే బహుళ జాతి కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉండటంతో న్యాయవిద్యను అభ్యసించడానికి పోటీ ఉంటోంది. ఇక్కడ కోర్సులకు నిర్వహించే ప్రవేశపరీక్షల నిమిత్తం 10వ తరగతి నుంచే శిక్షణ ప్రారంభిస్తున్నారంటే ఈ కోర్సుల ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది.

ఇంటర్‌ అర్హతతో లా కోర్సులు
* బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌): బీఏ ఎల్‌ఎల్‌బీకి అదనంగా కొన్ని సబ్జెక్ట్టులు చేర్చి ఆనర్స్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో కోర్టు ప్రాక్టీసు, ప్రవర్తన, ఇతర అంశాలపై శిక్షణ ఉంటుంది.
* బీకాం ఎల్‌ఎల్‌బీ: కామర్స్‌కు చెందినవి ఉంటాయి. బీఏ, బీకాం, ఆనర్స్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులు చాలా కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి.
* బీబీఏ ఎల్‌ఎల్‌బీ: దీనిలో ఎల్‌ఎల్‌బీకి అదనంగా బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్ట్టులుంటాయి.
* బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీటెక్‌ ఎల్‌ఎల్‌బీ: ఈ కోర్సులు పరిమితంగా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు
క్లాట్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: ఏప్రిల్‌ 15, 2019;
పరీక్ష తేదీ: మే 26
https://clatconsortiumofnlu.ac.in/
టీఎస్‌ లాసెట్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: ఏప్రిల్‌ 15, 2019;
పరీక్ష తేదీ: మే 20
www.sche.ap.gov.in/lawcet
ఏపీ లాసెట్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: ఏప్రిల్‌ 24, 2019;
పరీక్ష తేదీ: మే 6
https://lawcet.tsche.ac.in


సామాజిక హోదాను అందిస్తుంది'లా'!

సమాజంలో నాగరికత పెరిగేకొద్దీ సమస్యలూ అధికమవుతున్నాయి. ఇంటి సరిహద్దు సమస్యల నుంచి దేశ సరిహద్దుల పరిష్కారం వరకూ ప్రతి సమస్యకూ న్యాయ వ్యవస్థ జోక్యం తప్పనిసరి అవుతోంది. దీనికితోడు నేరాల రూపురేఖలు మారుతున్నాయి. టెక్నాలజీ పెరగడంతో వైట్ కాలర్ నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించాలంటే సమర్థులైన, సాంకేతిక నైపుణ్యం ఉన్న న్యాయ నిపుణులు కావాల్సి వస్తున్నారు. సామాజిక భద్రతను, న్యాయవాదులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనే విద్యా సంస్థలు న్యాయ విద్యలో అనేక డిగ్రీ, పీజీ, డిప్లొమా స్థాయి కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటి వివరాలు...
సమాజంలో న్యాయవాదులకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా న్యాయవిద్యను సాధారణ కోర్సుల మాదిరి పరిగణించకూడదు. దీంట్లో సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఇండియన్ బార్ కౌన్సిల్ 1961 న్యాయవాదుల చట్టానికి అనుగుణంగా న్యాయ విద్యా తీరుతెన్నులను పర్యవేక్షిస్తోంది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

న్యాయ నిపుణుల డిమాండ్ రోజురోజుకు అధికం కావడాన్ని దృష్టిలోపెట్టుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థులైన న్యాయ నిపుణులను అందించేందుకు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులను యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టింది. తర్వాత 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్) కోర్సును ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని వర్సిటీలు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులతో పాటు, ఎల్ఎల్‌బీ అయిదు సంవత్సరాల 'లా' కోర్సులు కూడా అందిస్తున్నాయి. దేశంలో లా డిగ్రీ అంటే 1985కు ముందు మూడేళ్ల కోర్సు మాత్రమే. న్యాయ విద్యను విస్తరించాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సూచనలు చేయడంతో 1985లో బెంగళూరులో 'నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా'ను ప్రారంభించారు. అప్పటినుంచి 5 ఏళ్ల లా కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఏర్పడిన మొదటి లా వర్సిటీ ఇదే కావడం విశేషం. తర్వాత లా వర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి.
* అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణత, మూడేళ్ల లా కోర్సుకు డిగ్రీ కనీస అర్హతలు.
న్యాయ విద్యలో లభిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు:
1) బీఏ ఎల్ఎల్‌బీ జనరల్,
2) బీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్,
3) బీకాం ఎల్ఎల్‌బీ జనరల్,
4) బీకాం ఎల్ఎల్‌బీ ఆనర్స్,
5) బీబీఏ ఎల్ఎల్‌బీ జనరల్,
6) బీబీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్,
7) బీఎస్సీ ఎల్ఎల్‌బీ జనరల్,
8) బీఎస్సీ ఎల్ఎల్‌బీ ఆనర్స్.
ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రాములు. కాల వ్యవధి అయిదేళ్లు. ఈ కోర్సుల్లో చేరడంవల్ల ఏడాది ఆదా కావడమే కాకుండా ఒకేసమయంలో రెండు డిగ్రీలు (ఉదా: బీబీఏ + ఎల్ఎల్‌బీ) పొందే వీలుంటోంది.
ప్రవేశ విధానం
న్యాయ విద్యలోకి ప్రవేశించేందుకు జాతీయ స్థాయిలో 'క్లాట్', ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే... 3 లేదా 5 ఏళ్ల లా డిగ్రీ చేయడానికి లాసెట్ రాయాల్సి ఉంటుంది.
లాసెట్
ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ‌ రాష్ట్రాల్లో 'లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్)' పేరుతో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, పద్మావతి, శ్రీవేంకటేశ్వర, నాగార్జున మొదలైన వర్సిటీల లా కళాశాలల్లో చేరవచ్చు. అభ్యర్థులకు లాసెట్‌లో కనీసం 35 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.
లాసెట్ ఆధారంగా చేరదగిన కోర్సులు:
1) ఎల్ఎల్‌బీ / బీఎల్ (కాలవ్యవధి 5 సంవత్సరాలు). ఈ కోర్సుకు ఇంటర్‌లో సగటున 45 శాతం మార్కులు ఉండాలి.
2) ఎల్ఎల్‌బీ / బీఎల్ (3 ఏళ్ల కోర్సు).(అర్హత: డిగ్రీలో సగటున 45 శాతం మార్కులు అవసరం.)
జాతీయ స్థాయిలో...
న్యాయ విద్యను జాతీయ స్థాయి వర్సిటీల్లో చదవాలంటే ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది...
* క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) : దేశంలోని జాతీయస్థాయి న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష- క్లాట్‌ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌). దీని ప్రకటన వెలువడింది. పట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ (సీఎన్ఎల్‌యూ) పరీక్షను ఈ ఏడాది నిర్వహిస్తోంది. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో సీటు లభిస్తుంది. క్లాట్‌ ద్వారా ప్రవేశం క‌ల్పించే సుప్రసిద్ధ విద్యాసంస్థల్లో... అత్యాధునిక కరిక్యులమ్‌, మౌలిక వసతులూ, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది ఉండటం మూలంగా నాణ్యమైన బోధన లభిస్తుంది. ప్రాంగణ నియామకాలూ ఉంటాయి. అందుకే కోర్సు పూర్తిచేసినవారికి కెరియర్‌ పరంగా ఢోకా ఉండదు. క్లాట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో... తెలంగాణలో నల్సార్‌ (హైదరాబాద్‌), ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం (విశాఖపట్నం) లో ప్ర‌వేశాలు పొంద‌వ‌చ్చు.

పరీక్ష విధానం
ఇది ఆన్‌లైన్‌ పరీక్ష. దీనిని 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలుంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ఇంగ్లిష్‌: 40 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌: 50 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథ్స్‌: 20 ప్రశ్నలు, లీగల్‌ అవేర్‌నెస్‌/ లీగల్‌ ఆప్టిట్యూడ్‌: 50 ప్రశ్నలు, లీగల్‌ రీజనింగ్‌: 40 ప్రశ్నలు ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు.

ఈ సంస్థల్లో ప్రవేశాలు
క్లాట్‌ ర్యాంకు ఆధారంగా... 17 న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలుంటాయి. అవి:
* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) 
* నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌ (నల్సార్‌)
* ద నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, భోపాల్‌ (ఎన్‌ఎల్‌ఐయూ) 
* ద వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జుడీషియల్‌ సైన్సెస్‌, కోల్‌కతా (డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌) 
* నేషనల్‌ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్‌ (ఎన్‌ఎల్‌యూజే) 
* హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ, రాయ్‌పూర్‌ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ) 
* గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, గాంధీనగర్‌ (జీఎన్‌ఎల్‌యూ) 
* డా.రామ్‌ మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీ, లఖ్‌నవూ (ఆర్‌ఎంఎల్‌ఎన్‌ఎల్‌యూ)
* రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, పంజాబ్‌ (ఆర్‌జీఎన్‌యూఎల్‌) 
* చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ, పట్నా (సీఎన్‌ఎల్‌యూ) 
* ద నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్‌, కొచ్చి (ఎన్‌యూఏఎల్‌ఎస్‌) 
* నేషనల్‌ లా యూనివర్సిటీ ఒడిశా, కటక్‌ (ఎన్‌ఎల్‌యూఓ) 
* నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా, రాంచీ (ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌) 
* నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జుడిషియల్‌ అకాడమీ, అసోం (ఎన్‌ఎల్‌యూజేఏఏ) 
* దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, విశాఖపట్నం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) 
* తమిళనాడు నేషనల్‌ లా స్కూల్‌, తిరుచిరాపల్లి (టీఎన్‌ఎన్‌ఎల్‌ఎస్‌) 
* మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ, ముంబయి (ఎంఎన్‌ఎల్‌యూ)

(ఈ ప‌దిహేడే కాకుండా ప‌లు ప్రైవేటు సంస్థలు క్లాట్ స్కోర్‌తో న్యాయ‌విద్యలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్నాయి)

అర్హత వివ‌రాలు
* ఎల్‌ఎల్‌బీ 5 సంవత్సరాల కోర్సు (యూజీ), ఎల్‌ఎల్‌ఎం సంవత్సరం (పీజీ) కోర్సులకు ప్రవేశం.
* 5 సంవత్సరాల కోర్సులో చేరే విద్యార్థులు 10+2 లేదా సమాన పరీక్షను 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ విద్యార్థులు 40% మార్కులతో పాస్‌ అయి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా క్లాట్‌ రాయవచ్చు.
* ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయదల్చినవారు ఎల్‌ఎల్‌బీ పరీక్షను 55% మార్కులతో; ఎస్‌సీ, ఎస్‌టీ వారు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా క్లాట్‌ రాయవచ్చు.
* అభ్యర్థులకు వయసు పరిమితి నిబంధన ఏమీ లేదు.