Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

లిబరల్‌ స్టడీస్‌

సైన్స్‌తో సంగీతం... తత్వంతో తర్కం!

పోటీలో నిలబడాలంటే ప్రపంచ దృక్పథంతో చదువులు సాగాలి. ఆ లక్ష్యంతోనే లిబరల్‌ స్టడీస్‌ను ప్రవేశపెట్టారు. వైవిధ్యమైన సబ్జెక్టుల కాంబినేషన్లతో నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ ఇందులో ఉంటుంది. సైన్స్‌ కోర్సులో మ్యూజిక్‌ తీసుకోవచ్ఛు తత్వశాస్త్రంతోపాటు తర్కమూ అధ్యయనం చేయవచ్ఛు మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ రకమైన కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా లిబరల్‌ స్టడీస్‌ విభాగాలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు వాటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు.

పాశ్చాత్య దేశాల్లో లిబరల్‌ స్టడీస్‌ విధానం ఎప్పటి నుంచో అమలులో ఉంది. ప్రాక్టికల్‌గా నేర్చుకోడానికి ఇందులో ప్రాధాన్యం ఎక్కువ. తర్కం, హేతుబద్ధత, అనువర్తన, విమర్శనాత్మక ఆలోచన, విశాల దృక్పథం...మొదలైనవి లిబరల్‌ స్టడీస్‌తో ఆశించవచ్ఛు వివిధ అంశాల్లో విస్తృత పరిజ్ఞానం, ఎంచుకున్న అంశంలో లోతైన అవగాహన, తెలుసుకున్నదాన్ని ఆచరణపూర్వకంగా వాస్తవ ప్రపంచంలో అనువర్తించడం సాధ్యమవుతాయి. ఇవి చదివినవారు భావనలపై పట్టు, సృజన, నాయకత్వ లక్షణాలు, సమస్యను విశ్లేషించి పరిష్కారాలు చూపించడం, ప్రభావవంతంగా వివరించగలగడం తదితరాల్లో పదునుదేరుతారు. ప్రమాణాలు, వసతులు, బోధనపరంగా ఈ కోర్సులు అందించే సంస్థలు ఉన్నతంగా ఉంటాయి. అందువల్ల ఫీజూ అదే స్థాయిలో వసూలు చేస్తారు. కొన్ని సంస్థలు విద్యార్థి నైపుణ్యాలు, ఆర్థిక నేపథ్యాన్నీ అనుసరించి ఫీజు పూర్తిగా మినహాయిస్తున్నాయి లేదా రాయితీతో ప్రోత్సహిస్తున్నాయి.
సంస్థలను బట్టి ఏడాదికి కనీసం మూడు నుంచి తొమ్మిది లక్షలను ఫీజు, వసతి, భోజనం కోసం చెల్లించాల్సి ఉంటుంది. విద్యారుణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్ఛు కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థికి కల్పించడమే లిబరల్‌ స్టడీస్‌ లక్ష్యం. కోరుకున్న అంశంలో శాస్త్రీయంగా అడుగులేయడానికి ఈ చదువులు ఉపయోగపడతాయి. సహజవాతావరణంలో పరిశీలనలతో కూడిన మేటి విద్యను అందిస్తాయి. కరిక్యులమ్‌లో మేజర్‌, మైనర్‌, ఫౌండేషన్‌ వంటి విభాగాలుంటాయి. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తారు. యూజీ స్థాయిలో ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండు సెమిస్టర్లు దాదాపు ఉమ్మడి అంశాలనే బోధిస్తారు. ఆ తర్వాత నుంచి విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టులను మేజర్‌, మైనర్లుగా ఎంచుకోవచ్ఛు మ్యూజిక్‌, ఆర్ట్స్‌, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్‌, ఫిల్మ్‌...ఇలా ఇష్టమైన కోర్సులో చేరవచ్ఛు.

ప్రవేశ విధానం

సాధారణ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌ మెరిట్‌తో సీటు లభిస్తుంది. కానీ లిబరల్‌ స్టడీస్‌ అందించే సంస్థల్లో చేరడానికి ప్రవేశ పరీక్షలో ప్రావీణ్యం తప్పనిసరి. స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎస్‌ఏటీ) లేదా అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెస్టింగ్‌ (ఏసీటీ) స్కోర్‌ ఉన్నవారు మినహాయింపు పొందవచ్ఛు ఈ స్కోర్లు లేనివాళ్లకు వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల్లో పరీక్ష నిర్వహిస్తారు. సంస్థలను బట్టి పరీక్ష విధానం, ప్రశ్నలడిగే అంశాల్లో మార్పులుంటాయి. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ), రికమెండేషన్‌ లెటర్లు, వ్యాసం దాదాపు అన్ని సంస్థలకూ తప్పనిసరి. అకడమిక్‌ ప్రతిభ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కీ ప్రాధాన్యం ఉంటుంది. మౌఖిక పరీక్ష తర్వాతే కోర్సులోకి తీసుకుంటారు. ప్రస్తుతం అన్ని సంస్థలూ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి.

క్రియాలో 150 సబ్జెక్టు కాంబినేషన్లు

ఈ క్రియా ప్రైవేటు యూనివర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా ఆనంద్‌ మహింద్రా, రఘురామ్‌ రాజన్‌, కిరణ్‌ మజుందార్‌ షా, ఎస్‌.రామదొరై, ఎన్‌.వాఘల్‌, ఆదిత్య మిట్టల్‌, సజ్జన్‌ జిందాల్‌ తదితర ప్రముఖులున్నారు. ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, కేంబ్రిడ్జ్‌, ఐఐటీ, ఐఐఎస్సీ నేపథ్యం ఉన్నవారు ఇక్కడ ఫ్యాకల్టీ సభ్యులుగా కొనసాగుతున్నారు. సొంతంగా ఆలోచించడాన్నీ, ప్రశ్నించడాన్నీ ప్రోత్సహిస్తారు. ఈ సంస్థను శ్రీసిటీలో నెలకొల్పారు. ఇక్కడ ట్యూషన్‌, వసతి, భోజనం కోసం యూజీ కోర్సులకు ఏడాదికి రూ.9 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.10 లక్షలలోపు ఉండి, మెరిట్‌ సాధించిన విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. వసతి, భోజనం అన్నీ ఉచితంగా అందిస్తారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న ప్రతిభావంతులకూ రాయితీ లభిస్తుంది. కోర్సులను రెసిడెన్షియల్‌ విధానంలోనే అందిస్తున్నారు.
బీఏలో ఆర్ట్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, లిటరేచర్‌, పాలిటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌; బీఎస్సీలో బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, సైకాలజీ కోర్సులున్నాయి. బిజినెస్‌ స్టడీస్‌, ఫిలాసఫీ అదనపు మైనర్లు. ఎలక్టివ్స్‌లో భాగంగా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌, ఫిల్మ్‌, న్యూరో సైన్స్‌, ఇమ్యునాలజీ, ఫిజిక్స్‌, జియో కెమిస్ట్రీ, స్టాటిస్టికల్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సస్టెయినబిలిటీ మొదలైనవి ఉంటాయి. నచ్చిన ప్రోగ్రాంను డిజైన్‌ చేసుకోవచ్ఛు ఇందుకోసం 150 సబ్జెక్టుల కాంబినేషన్ల నుంచి ఎంచుకునే అవకాశం ఉంది. ఈ కోర్సులను మూడేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కొనసాగించాలంటే మరో ఏడాది అదనంగా చదవాలి. మొదటి ఏడాది 6 కోర్‌ కోర్సులు, 5 స్కిల్‌ కోర్సులు ఉంటాయి. రెండు, మూడో ఏట 13 ఆప్షన్ల నుంచి మేజర్‌ కోర్సు ఎంచుకోవాలి. మైనర్‌లో 15 ఆప్షన్లు ఉంటాయి. వీటిలో నచ్చినవి తీసుకోవచ్ఛు వీటితోపాటు ఇంటర్‌ డిసిప్లినరీ కోర్‌ కోర్సులు, కో-కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి.
వెబ్‌సైట్‌: https://krea.edu.in/

ఫ్లేమ్‌లో 250 మేజర్‌.. మైనర్లు

దేశంలో పేరున్న లిబరల్‌ సంస్థల్లో ఫ్లేమ్‌ యూనివర్సిటీ ఒకటి. ఇదీ ప్రైవేటు వర్సిటీనే. మూడేళ్ల వ్యవధితో ఇక్కడ వివిధ యూజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థలో 250 మేజర్‌, మైనర్‌ కాంబినేషన్లను ఎంచుకోవచ్ఛు ఆనర్స్‌ కోర్సులకు మైనర్స్‌ ఉండవు.
బీఏ: ఎకనామిక్స్‌, సైకాలజీ, లిటరరీ అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌, ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌, జర్నలిజం, పబ్లిక్‌ పాలసీ, సోషియాలజీ.
బీఎస్సీ: అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌.
బీబీఏ: ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఆపరేషన్స్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌.
బీబీఏ (కమ్యూనికేషన్స్‌ మేనేజ్‌మెంట్‌): అడ్వర్ట్టైజింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, కమ్యూనికేషన్‌ స్టడీస్‌ వీటిలో నచ్చినవాటిలో చేరిపోవచ్ఛు.
మూడేళ్ల కోర్సు అనంతరం ఆసక్తి ఉన్నవారు నాలుగో ఏడాది ఫ్లేమ్‌ స్కాలర్స్‌ ప్రోగ్రామ్‌లో చేరవచ్ఛు డిజైన్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, థియేటర్‌ కోర్సులను మైనర్లగా అందిస్తున్నారు. యూజీ కోర్సుల్లో చేరినవారు ఏడాదికి ఫీజు, వసతి, భోజనం కోసం రూ.8.10 లక్షలు చెల్లించాలి.
వెబ్‌సైట్‌: https://www.flame.edu.in/

అశోకా వర్సిటీ

పూర్తి స్థాయిలో లిబరల్‌ స్టడీస్‌ను భారత్‌లో ప్రారంభించిన తొలి సంస్థగా దీన్ని చెప్పుకోవచ్ఛు ప్రైవేటు సంస్థ అయినా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. ఇక్కడ యూజీ స్థాయిలో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని మేజర్స్‌, ఇంటర్‌ డిసిప్లినరీ మేజర్స్‌ విధానంలో అందిస్తున్నారు. ఈ సంస్థలో చదవడానికి ట్యూషన్‌, వసతి కోసం ఏడాదికి రూ.9.4 లక్షలు చెల్లించాలి. మెరిట్‌ విద్యార్థులకు రాయితీలు ఉన్నాయి.
మేజర్స్‌: బీఎస్సీ ఆనర్స్‌ - బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌. బీఏ ఆనర్స్‌- ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, సోషియాలజీ/ ఆంత్రోపాలజీ
ఇంటర్‌ డిసిప్లినరీ మేజర్స్‌: బీఎస్సీ ఆనర్స్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూరల్‌ లీడర్‌షిప్‌, మ్యాథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌. బీఏ ఆనర్స్‌ - ఇంగ్లిష్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌, ఎకనామిక్స్‌ అండ్‌ హిస్టరీ, ఇంగ్లిష్‌ అండ్‌ మీడియా స్టడీస్‌, హిస్టరీ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, పాలిటిక్స్‌, ఫిలాసఫీ అండ్‌ ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌ అండ్‌ సొసైటీ.
వెబ్‌సైట్‌: https://www.ashoka.edu.in/

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-ఏపీ
ఆనర్స్‌ విధానంలో బీఏ, బీబీఏ, బీఎస్సీ కోర్సులను అందిస్తోంది. బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హిస్టరీ, అప్లయిడ్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, సైకాలజీ సబ్జెక్టులను చదువుకోవచ్ఛు ట్యూషన్‌ ఫీజు ఏడాదికి రూ.1.5 లక్షలు. బీబీఏ కోర్సుకు రూ.2.5 లక్షలు. వసతి, భోజనాలకు అదనంగా చెల్లించాలి.
జిందాల్‌ స్కూల్‌ బీఏ లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ కోర్సు అందిస్తోంది. ఎకనామిక్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబిలిటీ, ఎక్స్‌ప్రెసివ్‌ ఆర్ట్స్‌ (విజువల్‌ ఆర్ట్స్‌), సోషియాలజీ అండ్‌ ఆంత్రోపాలజీ, హిస్టరీ, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, లిటరరీ స్టడీస్‌, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ మేజర్స్‌గా ఈ కోర్సులు అందిస్తున్నారు. కోర్సు ఫీజు అన్నీ కలిపి ఏడాదికి రూ.9 లక్షలు.
పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ- స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ స్టడీస్‌ బీబీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ ఆనర్స్‌ కోర్సులను అందిస్తోంది.
బీఏ ఆనర్స్‌: ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌.
బీబీఏ ఆనర్స్‌: మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌.
బీకాం ఆనర్స్‌: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఆంత్రప్రన్యూర్‌షిప్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌.
బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.
సింబయాసిస్‌ స్కూల్‌ ఫర్‌ లిబరల్‌ స్టడీస్‌ వివిధ సబ్జెక్టుల్లో బీఏ, బీఎస్సీ కోర్సులను అందిస్తోంది.
అశోకా, ఫ్లేమ్‌ తదితర సంస్థల్లో చదివినవారు యూజీ అర్హతతోనే ఉద్యోగాలు పొందుతున్నారు.

Posted on 14-05-2020