Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


మేనేజ్‌మెంట్‌ విద్య

డిగ్రీతోనే ' మేనేజ్‌ ' చేయొచ్చు!
మేనేజర్‌ ఉద్యోగం... మాట వినగానే ఛాతీ కొంత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఆ హోదాకి ఉన్న ప్రభావం అలాంటిది. బ్యాంకులు, కార్పొరేట్‌ కంపెనీలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో అడ్మినిస్ట్రేటర్‌ అంటే మంచి జీతం, ఎన్నో రకాల ఇతర సౌకర్యాలు ఉంటాయి. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని అందుకోవాలని ఇంటర్మీడియట్‌ నుంచే లక్ష్యంగా పెట్టుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ విద్యకు అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు బ్యాచిలర్‌ పట్టాతో పాటు పీజీనీ అందించే ఇంటిగ్రేటెడ్‌ కోర్సులనూ నిర్వహిస్తున్నాయి.

ఏదైనా కంపెనీ/ వ్యాపారం అనగానే.. ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌.... ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ఒక సంస్థ లేదా వ్యాపారం సాగాలంటే ఈ ప్రధాన విభాగాలన్నీ సంయుక్తంగా పనిచేయాల్సిందే. మానవ, ఆర్థిక, సాంకేతిక, సహజసిద్ధ వనరులను ఉపయోగించి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే కళ- మేనేజ్‌మెంట్‌. వ్యాపారం ప్రారంభించాలన్నా, ఈ విభాగాల్లో దేనిపైనైనా పట్టు సాధించాలనుకున్నా మేనేజ్‌మెంట్‌ కోర్సులు తగిన మెలకువలను నేర్పుతాయి. వీటిని గ్రహించి కార్పొరేట్‌ ప్రపంచంలో కెరియర్‌ తీర్చిదిద్దుకోవాలనుకునేవారిని ఇవి సుశిక్షితులను చేస్తాయి. ఇంటర్‌ తరువాత మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఎంచుకోవాలనుకునేవారికి బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సంబంధిత రంగంలో వ్యాపార కార్యకలాపాలను పరిశీలిస్తూ, లాభ సాధన, వ్యాపారాభివృద్ధిపై ప్రభావం చూపే ప్రత్యక్ష, పరోక్ష అంశాలను వీటిలో భాగంగా తెలుసుకుంటారు. కామర్స్‌ చదివినవారే మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఎంచుకోవాలన్న నిబంధనేమీ లేదు. ఏ గ్రూపునకు చెందినవారైనా (సైన్స్‌, హ్యూమానిటీస్‌, కామర్స్‌) చేయగలిగేలా ఉండటం వీటిలో ఉండే ప్రత్యేకమైన లక్షణం. కొన్ని నేరుగా బ్యాచిలర్‌ డిగ్రీలను అందిస్తుండగా మరికొన్ని పీజీతోకలిపి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులనూ అందిస్తున్నాయి. పేరున్న విద్యాసంస్థల నుంచి డిగ్రీ పూర్తిచేసినవారికి అవకాశాలు అధికంగా ఉంటాయి.

నాలుగు రకాలు... ఒకే సిలబస్‌
డిగ్రీ స్థాయిలో బీబీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌), బీఎంఎస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌), బీబీఎస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్టడీస్‌), బీబీఎం (బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులున్నాయి. వీటన్నింటి సిలబస్‌ దాదాపుగా ఒకే రకం. సంస్థనుబట్టి కోర్సు పేరులో మార్పు ఉంటుంది. బోధించే అంశాల్లోనూ కొద్ది మార్పులుంటాయి. వీటి ఉమ్మడి లక్ష్యం- మేనేజ్‌మెంట్‌ విద్య గురించి ప్రాథమిక అవగాహన కల్పించడం, ఆంత్రపెన్యూర్‌షిప్‌కు అవసరమైన నైపుణ్యాలను బోధించడం. ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి ప్రాముఖ్యం ఉంటుంది. కేస్‌స్టడీలు, ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, పరిశ్రమల సందర్శన, పరిశ్రమలోని నిపుణులతో సంభాషించడం వంటివన్నీ ఇందులో భాగమే.
ప్రతి కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. రెండేళ్లు అందరికీ ఒకేరకమైన సిలబస్‌ ఉంటుంది. మూడో ఏడాదిలో స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ స్పెషలైజేషన్లు కూడా సంస్థ/ విశ్వవిద్యాలయాన్ని బట్టి మారుతుంటాయి. మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, అకౌంటింగ్‌, ఆపరేషన్స్‌ వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి.

బీబీఏలో ప్రత్యేక కోర్సులు
బీబీఏ విషయానికొచ్చేసరికి కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కోర్సులను అందిస్తున్నాయి. బీబీఏ-ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ- ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ-రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ-ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ-మీడియా మేనేజ్‌మెంట్‌, బీబీఏ- ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ-రూరల్‌ మార్కెటింగ్‌, బీబీఏ-ఆంత్రపెన్యూర్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌.. వంటివి వీటిలో కొన్ని. వీటి కాలవ్యవధీ మూడేళ్లే. ఏదైనా స్పెషలైజ్‌డ్‌ కోర్సును ఎంచుకోవాలనుకునేవారు వీటిని పరిశీలించవచ్చు.
ప్రవేశం ఎలా?: ఇంటర్‌లో ఏ గ్రూపు చదివినవారైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. కాకపోతే ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా తప్పనిసరి. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ప్రత్యేకంగా రాష్ట్ర, జాతీయ ప్రవేశపరీక్షలంటూ ఏమీ లేవు. ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నిర్వహించే ప్రవేశపరీక్ష- ఏఐఎంఏ యూజీఏటీ ద్వారా దాదాపుగా 60 సంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇంకొన్ని ప్రముఖ సంస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలను నిర్వహించి, దానిలో ఉత్తీర్ణులైనవారికే ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో కొన్ని పేపర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తుండగా, మరికొన్ని కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్నాయి. ప్రశ్నలన్నీ ఎక్కువగా క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, కేస్‌స్టడీస్‌ అంశాలపైనే ఉంటాయి. ఈ ప్రవేశపరీక్షలు మే, జూన్‌ నెలల్లో ఉంటాయి.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు- వాటి ప్రవేశపరీక్షలు
* సింబయాసిస్‌ యూనివర్సిటీ (సెట్‌), పుణె
* దిల్లీ యూనివర్సిటీ (డీయూజేఏటీ)
* షాహీద్‌ సుఖ్‌దేవ్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్టడీస్‌ (డీయూ-జేఏటీ)
* నర్సీ మాంఝీ- ముంబయి (ఎన్‌పీఏటీ)
* క్రైస్ట్‌ యూనివర్సిటీ- బెంగళూరు (సీయూఈటీ)
* మణిపాల్‌ యూనివర్సిటీ (ఎంయూ-ఎంఈటీ)
* సెయింట్‌ జేవియర్‌ - ముంబయి
* ఎంఎస్‌యూ- బరోడా
* జీజీఎస్‌-ఐపీ యూనివర్సిటీ, దిల్లీ (సీఈటీ-ఐపీ)

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు
డిగ్రీ, పీజీలను కలిపి కొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను అందిస్తున్నాయి. రోజు రోజుకీ వీటికి ఆదరణ పెరుగుతోంది. విదేశీ విద్యార్థులూ ఆసక్తి చూపుతున్నారు. కాలవ్యవధి అయిదేళ్లు. ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం), ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐ-ఎంబీఏ), ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ+ ఎంబీఏలను ప్రముఖంగా చెప్పొచ్చు. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సులను తయారు చేశారు. కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్‌, మెంటర్‌షిప్‌, ఇండస్ట్రియల్‌ విజిట్‌ వంటి అవకాశాల్ని కల్పిస్తున్నాయి.
ప్రవేశం ఇలా: ఇంటర్‌లో ఏ గ్రూపువారైనా వీటిని ఎంచుకోవచ్చు. కనీసం 70% మార్కులు సాధించి ఉండాలి. గీతం, కళింగ, ఐటీఎం, ఏటీఎం గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌, న్యూదిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అలియన్స్‌ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వంటి కొన్ని సంస్థలన్నింటికీ కలిపి యూజీఏటీ ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. వీటిలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నాయి. వివిధ సంస్థలు తమ సొంత ప్రవేశపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నాయి.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు- వాటి ప్రవేశపరీక్షలు
* ఐఐఎం - ఇండోర్‌ (ఐపీఎం-ఏటీ)
* అహ్మదాబాద్‌ యూనివర్సిటీ (పర్సనల్‌ స్టేట్‌మెంట్‌/ ఎస్‌ఓపీ+ ఇంటర్వ్యూ)
* జిందాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌ (జేఎస్‌ఏటీ)

మెరిట్‌ ఆధారంగా..:
కొన్ని సంస్థలు విద్యార్థుల ఇంటర్‌ మార్కులను ఆధారంగానూ ఎంచుకుంటున్నాయి. వాటిలో కొన్ని..
* సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌, హైదరాబాద్‌
* విజ్‌డమ్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, జయపుర
* జేడీ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కతా
* అమిటీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూల్‌, నోయిడా
* మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌, చెన్నై
* ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ కామర్స్‌, చెన్నై
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, నోయిడా

ముఖ్యాంశాలు
* మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా అందుకున్నవారికి వివిధ రంగాలు- సేల్స్‌, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌, మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ట్రేడింగ్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌.. ఇలా ఎన్నో రంగాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది.
* సొంత వ్యాపారం చేయాలనుకునేవారికీ అనుకూలం.
* మంచి నైపుణ్యాలున్నవారికి మంచి వేతనాలుంటాయి. అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది.
* నాయకత్వ లక్షణాలు, ప్రెజెంటేషన్‌ నైపుణ్యాలు, నలుగురిలో మాట్లాడేతత్వం వంటివి అలవడతాయి.

అయితే...
* ఈ రంగానికి పోటీ ఎక్కువ. స్పెషలైజేషన్‌ నుంచి మొదటి ఉద్యోగం వరకు ప్రతిచోటా తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
* డిగ్రీ తరువాత కొన్ని హోదాలను దక్కించుకోవాలంటే పీజీ తప్పనిసరి అవుతుంది.

ఆసక్తి ఉంటే అవకాశాలెన్నో!
ఇంటర్‌ తరువాత ఎంచుకోదగ్గ అవకాశాల్లో మేనేజ్‌మెంట్‌ ఒకటి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందాలనుకునేవారు, వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నవారు, సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు బ్యాచిలర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. సంప్రదాయ కోర్సులతోపాటు ఎన్నో స్పెషలైజ్‌డ్‌ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులన్నీ ఎక్కువశాతం పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారుచేసినవే ఉంటున్నాయి. కాబట్టి, కోర్సు అంశాలతోపాటు నాయకత్వ లక్షణాలు, భావప్రకటన సామర్థ్యం, బృందంతో పనిచేయగలగడం వంటి లక్షణాలూ పెంచుకుంటే ఈ రంగంలో ఉన్నత స్థానానికి చేరొచ్చు.
- డా. బి. రాజశేఖర్‌, ప్రొఫెసర్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

Posted on 03.04.2019