Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

కోర్సులు

ఎంఈసీ... ఇదీ ప్రాముఖ్యం!
సైన్స్‌ గ్రూపుల్లో ఉండే గణితం, కామర్స్‌ గ్రూపుల్లోని ఎకనామిక్స్‌, కామర్స్‌ వంటి సబ్జెక్టుల మేలు కలయికే... ఇంటర్మీడియట్‌లోని ఎంఈసీ గ్రూపు. సీఏ, సీఎంఏ లాంటి వృత్తివిద్యా కోర్సులు లక్ష్యంగా ఉన్నవారు ఇంటర్లో ఎంఈసీ గ్రూపును ఎంచుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకని? పరిశీలిద్దాం!
బెంగళూరు, ముంబయి, కొత్తదిల్లీ లాంటి ప్రాంతాల్లో కామర్స్‌ కోర్సులకు బాగా గిరాకీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సుల ప్రాముఖ్యం గుర్తించటం ఇటీవలే మొదలైంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్లో ఎంఈసీ చదివేవారు 4,000-5000 మంది వరకే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య లక్ష పైచిలుకు దాటింది.
‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా స్టార్టప్‌ కంపెనీలకు ఎంతో ప్రాముఖ్యం లభిస్తోంది. పెరుగుతున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా కామర్స్‌, ఆర్థిక నిపుణులు, యువ పారిశ్రామిక వేత్తల ప్రాధాన్యం పెరుగుతోంది. భవిష్యత్తులో కామర్స్‌ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే పదో తరగతి తర్వాతే కామర్స్‌ గ్రూపులు ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా చదవటం ఉత్తమం. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే నిపుణులుగా ఎదగవచ్చు.
అంటే ఇంటర్లోనే ఏదో ఒక కామర్స్‌ గ్రూపు తీసుకుని చదవాలన్నమాట. ఇంటర్లో ఉన్న కామర్స్‌ గ్రూపుల్లో అత్యంత ఆదరణ ఉన్నది ఎం.ఇ.సి. అంటే మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ గ్రూపు.
పదో తరగతి సీబీఎస్‌సీ సిలబస్‌ చదివే విద్యార్థులకు ఇప్పటికే కామర్స్‌ పేపర్‌ను ఆప్షనల్‌గా పరిచయం చేశారు. భవిష్యత్తులో కామర్స్‌ కోర్సులు చదవాలనుకున్నవారు పదో తరగతిలో కామర్స్‌ను చదువుకునే అవకాశం కల్పించారన్నమాట. త్వరలో దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ మాదిరిగా ఒకే సిలబస్‌ రాబోతోంది. అలాంటి విధానం వస్తే కామర్స్‌పై ఆసక్తి ఉన్నవారు పదో తరగతిలోనే కామర్స్‌ తీసుకుని చదివే అవకాశం వస్తుంది.
ప్రత్యేకమైన గ్రూపు
గణితం అంటే ఇష్టపడేవారు ఎంపీసీ ఎంచుకుంటారు. కామర్స్‌ చదవాలనుకున్నవారు సీఈసీపై మొగ్గు చూపిస్తారు. కానీ ఎంఈసీ సంగతేమిటి? ఇదో ప్రత్యేకమైన గ్రూపుగా చెప్పవచ్చు.
* గణితం అంటే ఇష్టం ఉన్నా ఫిజిక్స్‌, కెమిస్ట్రీలంటే భయపడేవారు కొందరుంటారు. అలాగే కామర్స్‌పై ఆసక్తి ఉండి, తార్కికంగా ఉండే గణితం కూడా కావాలనుకునేవారు ఉంటారు. రేపటి రోజున వీటిలో ఏ కోర్సు చదవాలనుకున్నా అవకాశం ఉండాలని భావించేవారికి ఎంఈసీ మెరుగైన ఎంపిక.
* పోటీ తక్కువగా ఉండి భవిష్యత్తులో ఏ రంగంలోనైనా విశేష అవకాశాలు కావాలనుకునేవారు ఎంచుకునే గ్రూపుల్లో ఎంఈసీ ఒకటి.
* సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పోటీపరీక్షల్లో విజయానికి కామర్స్‌పై పట్టు ఉండటం ఉపకరిస్తుంది.
ఉదాహరణకు... ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో 103 ర్యాంకు సాధించిన జొన్నలగడ్డ స్నేహజ కామర్స్‌ గ్రూపులు చదివిన అభ్యర్థి. సీఏ పూర్తిచేసి సివిల్స్‌ ర్యాంకును సాధించారామె.
* బైపీసీ, ఎంపీసీ గ్రూపులతో ఇంటర్‌ చదివి, తదుపరి కోర్సులకు మంచి కళాశాలల్లో సీటు సాధించాలంటే కనీస మార్కులతో పాటు మంచి కాలేజీలో సీటు కోసం మంచి ర్యాంకు కూడా సాధించాలి. ఎంఈసీ చదివి, ఎలాంటి కామర్స్‌ కోర్సులు చదవాలన్నా కనీస మార్కులు సాధిస్తే చాలు... ర్యాంకులతో సంబంధం లేదు.
* ప్రత్యేకించి విద్యాభ్యాసానంతరం ఒక సంస్థను నెలకొల్పాలన్నా, మంచి వ్యాపారవేత్తగా స్థిరపడాలన్నా కామర్స్‌ పరిజ్ఞానం అత్యంత అవసరం. ఇంటర్లో ఎంఈసీ తీసుకోవడం వల్ల వ్యాపారానికి అవసరమైన ఆర్థిక వాణిజ్యరంగాల్లోని అన్ని అంశాలపై పట్టుకు ప్రాతిపదిక ఏర్పడుతుంది.
సబ్జెక్టుల వివరాలు
ఇంటర్‌ ఎంఈసీ గ్రూపులో భాషలను మినహాయిస్తే మూడు సబ్జెక్టులుంటాయి.
మ్యాథ్స్‌: ఎంపీసీలో ఉండే గణితం, ఎంఈసీలో ఉండే గణితం రెండూ ఒకటే. ఎంఈసీలో మ్యాథ్స్‌ ఉండటం వల్లనే ఎంఈసీ చదివినవారికి ఏ కోర్సు అయినా సరే, చదువుకునే వీలు కలిగింది. మ్యాథ్స్‌ సబ్జెక్టు 2 భాగాలుగా మ్యాథ్స్‌-ఏ 75 మార్కులకూ, మ్యాథ్స్‌-బి 75 మార్కులకూ నిర్వహిస్తారు.
ఎకనామిక్స్‌: చాలామంది ఈ సబ్జెక్టును సోషల్‌ అనుకుంటారు. పదో తరగతిలోని సోషల్‌కీ, ఇంటర్లోని ఎకనామిక్స్‌కూ అసలు సంబంధం లేదు. ఎకనామిక్స్‌ను విద్యార్థులు ఆసక్తిగా ఆస్వాదిస్తూ చదవొచ్చు. ఇది 100 మార్కులకు ఉంటుంది.
కామర్స్‌: వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన అనేక విషయాలను పరిచయం చేసే వేదిక కామర్స్‌. రకరకాల వ్యాపార సంబంధిత వ్యవహారాలు ఎలా నిర్వహిస్తారో విపులంగా వివరించే సబ్జెక్టు కామర్స్‌. ఈ సబ్జెక్టు 50 మార్కులకు థియరీ, మరో 50 మార్కులకు అకౌంట్స్‌... మొత్తం కలిపి 100 మార్కులకు ఉంటుంది.
జనరల్‌ కోర్సులు: ఎంఈసీ గ్రూపు తీసుకుని, బీకాం/బీబీఎం/బీఎస్‌సీ కోర్సులు చదివి తర్వాత ఎంకాం, ఎంసీఏ, ఎంఎస్‌సీ, ఎంబీఏ కోర్సులు పూర్తి చేయవచ్చు. ఎంబీఏ చదవటం కోసం చాలామంది విద్యార్థులు టెన్త్‌ తర్వాత ఏ గ్రూపు చదవాలో తెలియక అందరూ తీసుకునే గ్రూపులు తీసుకుంటున్నారు. తర్వాత ఇంజినీరింగ్‌ లాంటివి చేసి మంచి ఉద్యోగాలు సాధించటం కోసం తర్వాత ఎంబీఏ చేస్తున్నారు. దీనివల్ల బోలెడంత ధనం, శ్రమ, సమయం వృథా!
అదే ఇంటర్లో ఎంఈసీ చదివి, మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తిచేసి ఆపై ఎంబీఏ పూర్తిచేయడం వల్ల సమయం ఆదా అవుతుంది; పైగా సబ్జెక్టుపై పట్టు పెంచుకోవచ్చు.
వృత్తివిద్యా కోర్సులు: ఎంఈసీతో ఇంటర్‌ చేసినవారు తర్వాత సీఏ/సీఎంఏ/సీఎస్‌ లాంటి వృత్తివిద్యాకోర్సులు చదవవచ్చు. ప్రత్యేకించి సీఏ కోర్సుకు ప్రవేశపరీక్ష అయిన సీపీటీ చదవాలంటే ఎంఈసీ గ్రూపు ఉపయోగపడుతుంది. ఎందుకంటే సీపీటీలో ఉండే నాలుగు సబ్జెక్టుల్లో 3 ఎంఈసీలోనివే. అలాగే సీఎంఏ/సీఎస్‌ కోర్సు చదవటానికి తగిన పునాదిని ఈ గ్రూపు అందజేస్తుంది. సీఏ/సీఎంఏ/సీఎస్‌ కోర్సులను సులభంగా పూర్తిచేస్తున్న విద్యార్థుల్లో అధిక శాతం ఇంటర్‌ ఎంఈసీ గ్రూపువారే కావడం గమనార్హం.
పోటీ స్వభావముండే కోర్సులు: భవిష్యత్తులో ఎలాంటి పోటీ పరీక్షకైనా ఇంటర్లో కామర్స్‌ తప్పనిసరి. ఇంటర్లో ఎంఈసీ చదివి గ్రూప్స్‌, సివిల్స్‌, బ్యాంక్‌ పరీక్షలు, డీఎస్‌సీ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించవచ్చు.
కామర్స్‌ దిశలో భవితను తీర్చిదిద్దుకుని కామర్స్‌ నిపుణులుగా, యువ పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకునేవారు ఎంఈసీ గ్రూపు ప్రాధాన్యం గ్రహించాలి. ఎంచుకున్న రంగంలో సునాయాసంగా విజయం సాధించేలా చేయటానికి ఈ గ్రూపు సహకరిస్తుంది.

posted on 20.5.2016