Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఒకేషనల్‌ కోర్సులు

నైపుణ్యాల విద్యతో.. నేరుగా కొలువులోకి!

ఇలా చదువు పూర్తికాగానే అలా ఉద్యోగం వచ్చేస్తే ఎంత బాగుంటుంది. నిజానికి వృత్తివిద్యల రూపకల్పనలో పరమార్థం అదే. వాటి పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్నవారికీ, త్వరగా ఉపాధి కోరుకునే వారికీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌ సరిగ్గా సరిపోతుంది. వీటిల్లో ప్రాక్టికల్‌ అప్రోచ్‌కి ప్రాధాన్యం ఎక్కువ. కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి అదనపు శిక్షణ లేకుండానే సంబంధిత విభాగాల్లో చేరి సేవలు అందించవచ్ఛు ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో వృత్తివిద్యకు ఆదరణ పెరుగుతోంది. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ ఈ కోర్సుల్లో చేరవచ్ఛు.

ఏదైనా గ్రూప్‌తో లేదా ఒకేషనల్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్ఛు సాధారణంగా మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు.

మనదేశంలో 19 నుంచి 24 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగుల్లో వృత్తి విద్యానేపథ్యం ఉన్నవారు 5 శాతంమందే. అదే దక్షిణ కొరియాలో 96, జర్మనీలో 75, యూఎస్‌లో 52 శాతం మంది ఉద్యోగులు ఒకేషనల్‌ కోర్సులు చదువుకున్నవారే. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా వీటిని తీర్చిదిద్దడమే అందుకు కారణం.

వివిధ రంగాల అవసరాలను తీర్చి, స్కిల్‌ గ్యాప్‌ పూడ్చడానికి ఒకేషనల్‌ (వృత్తి విద్య) కోర్సులు ఉపయోగపడతాయి స్థానికంగా ఉన్న అవకాశాలు సొంతం చేసుకునే విధంగా అవసరాల ప్రాతిపదికన వాటిని రూపొందిస్తారు. ఇందులో 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్‌ అప్రోచ్‌ ఉంటుంది. అంటే తెలుసుకోవడం కంటే సంబంధిత పనిని చేయడం ద్వారా నేర్చుకోవడం, అనువర్తనం (అప్లికేషన్‌)కు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

విద్యార్థులు ఏ తరహా పరిశ్రమలో సేవలు అందించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని సంబంధిత కోర్సులను ఎంచుకోవాలి. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసుకునే అవకాశం వీరికి లభిస్తుంది. చాలా సంస్థలు టైలర్‌ మేడ్‌ విధానంలో కోర్సు, ట్రెయినింగ్‌ అందిస్తున్నాయి. దీంతో ఎలాంటి ప్రత్యేక శిక్షణ అవసరమూ లేకుండా చదువు పూర్తయిన తర్వాత విధుల్లో చేరిపోవచ్ఛు.

ఏపీ, తెలంగాణల్లో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌ కోర్సులు అందిస్తున్నాయి. సాధారణ గ్రాడ్యుయేట్లు పోటీ పడే అన్ని ఉద్యోగాలకూ ఒకేషనల్‌ డిగ్రీలు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఒకేషనల్‌ విద్యకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. ఎన్‌ఎస్‌డీసీ యూజీసీతో కలిసి దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు స్కిల్‌ బేస్డ్‌ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లెవెల్‌-4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్న వారికి లెవెల్‌-5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా వారికి లెవెల్‌-6, మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకుంటే లెవెల్‌-7 స్థాయికి చేరుకున్నట్లు. డిగ్రీ కళాశాల్లలో ఒకేషనల్‌లో బ్యాచిలర్‌ కోర్సులు ఎక్కువగా ఉంటాయి.

ఇవీ కోర్సులు
మూడేళ్ల ఒకేషనల్‌ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బయో మెడికల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, మోడరన్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ప్రింటింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అండ్‌ డేటా ఎనాలిసిస్‌ తదితర కోర్సుల్లో ఏదైనా ఎంచుకోవచ్ఛు డిగ్రీ కళాశాలల పరిధిలోని పరిశ్రమలు, స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల వారీగా కోర్సులు కేటాయిస్తారు.

టిస్‌ ఒకేషనల్‌ స్కూలు
ఒకేషనల్‌ చదువులకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)కు చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌వీయూ)ను దేశంలో మేటి సంస్థగా చెప్పుకోవచ్ఛు అగ్రికల్చర్‌, ఆటోమోటివ్‌, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, చైల్డ్‌ కేర్‌, డయాలసిస్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబిల్డ్‌ సర్వీసెస్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ స్కిల్స్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్మాస్యూటికల్‌, ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, ట్రావెల్‌ అండ్‌ టూరిజం కోర్సులను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలవారీ అందిస్తున్నారు. ఏడాది చదువు పూర్తిచేసుకుంటే డిప్లొమా, రెండేళ్లు చదివితే అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, మొత్తం కోర్సు పూర్తిచేసుకంటే బ్యాచిలర్‌ డిగ్రీ ప్రదానం చేస్తారు. వివరాలకు https://www.sve.tiss.edu/ చూడవచ్ఛు.

ఇతర సంస్థలు
* సావిత్రీ భాయి ఫూలే పుణె యూనివర్సిటీ: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌లో జ్యూయలరీ డిజైన్‌ అండ్‌ జెమాలజీ కోర్సు అందిస్తోంది. ఈ కోర్సులో చేరినవారు క్యాడ్‌, క్యామ్‌ టెక్నాలజీతో బంగారు ఆభరణాలు డిజైన్‌ చేయడం, సహజ, సింథటిక్‌ జెమ్స్‌ గుర్తించడం మొదలైనవాటిని తెలుసుకుంటారు. ఇవి పూర్తిచేస్తే జెమాలజిస్ట్‌, జ్యూలరీ డిజైనర్‌, ఆస్ట్రిజన్‌, జెమ్‌ కట్టర్‌, డైమండ్‌ కట్టర్‌, డైమండ్‌ గ్రేడర్‌ తదితర ఉద్యోగాలు దక్కుతాయి.
* బెనారస్‌ హిందూ యూనివర్సిటీ: ఒకేషనల్‌ విధానంలో వివిధ కోర్సులను అందిస్తోంది. చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకేషనల్‌ కోర్సుల్లో చేరే అవకాశం సీయూ సెట్‌తో లభిస్తుంది.
* తేజ్‌పూర్‌ యూనివర్సిటీ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌
* లక్నో యూనివర్సిటీ: రెన్యూవబుల్‌ ఎనర్జీ టెక్నాలజీ
* అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ: ప్రొడక్షన్‌ టెక్నాలజీ, పాలిమర్‌ అండ్‌ కోటింగ్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ అండ్‌ గార్మెంట్‌ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో..!
ఏపీ, తెలంగాణల్లో ఒకేషనల్‌ విద్య అందిస్తున్న కొన్ని సంస్థలు, కోర్సుల వివరాలు...
* సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌, హైదరాబాద్‌: రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంటర్‌ అన్ని గ్రూపుల వారికీ అందుబాటులో ఉంది. సైన్స్‌ విద్యార్థుల కోసం ఇండస్ట్రియల్‌ మైక్రో బయాలజీ కోర్సును ఒకేషనల్‌ విధానంలో నిర్వహిస్తున్నారు.
* హిందీ మహా విద్యాలయ, హైదరాబాద్‌ (ఓయూ రోడ్‌): హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం అడ్మినిస్ట్రేషన్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ల్లో యూజీ, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు ఉన్నాయి.
* సెయింట్‌ థెరిసా అటానమస్‌ విమెన్‌ కాలేజీ, ఏలూరు: క్లినికల్‌ అండ్‌ ఆక్వా ల్యాబ్‌ టెక్నాలజీ, వెబ్‌ టెక్నాలజీ అండ్‌ మల్టీ మీడియా.
* పిఠాపురం రాజా గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌, కాకినాడ: ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, కమర్షియల్‌ ఆక్వా కల్చర్‌
* ఎస్వీ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ, శ్రీకాళహస్తి: డ్రెస్‌ డిజైనింగ్‌ అండ్‌ టైలరింగ్‌లో డిప్లొమా
* వైఎన్‌ అటానమస్‌ కాలేజ్‌, నర్సాపూర్‌: హెల్త్‌కేర్‌ అండ్‌ నర్సింగ్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అపారెల్‌ డిజైనింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ మల్టీ మీడియా (డిప్లొమా)
* వీఎస్‌ఎం కాలేజ్‌, రామచంద్రాపురం: ఆక్వా కల్చర్‌.
* పీవీఆర్‌ ట్రస్ట్‌ డిగ్రీ కాలేజీ, కాకినాడ: బీవోక్‌లో హార్టికల్చర్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌, క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌, మెడికల్‌ ఇమేజ్‌ టెక్నాలజీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటీరియర్‌ డిజైన్‌.
* గవర్నమెంట్‌ అటానమస్‌ కాలేజీ, రాజమండ్రి: బీవోక్‌లో రెన్యూవబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌.
* ఐడియల్‌ కాలేజీ, కాకినాడ: సస్ట్టెయినబుల్‌ అగ్రికల్చర్‌, ఇండస్ట్రియల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో బీవోక్‌ కోర్సు నిర్వహిస్తున్నారు.
* కాకరపర్తి భావనారాయణ కాలేజీ, విజయవాడ: బీవోక్‌లో వెబ్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌.
* వీఆర్‌ మెమోరియల్‌ కాలేజీ, గుంటూరు: మల్టీమీడియా అండ్‌ వెబ్‌ డిజైన్‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ల్లో డిప్లొమాలు. కమర్షియల్‌ ఆక్వా కల్చర్‌లో బీవోక్‌.
* శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి: బీవోక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ అపారెల్‌ డిజైనింగ్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ సైన్స్‌.

Posted on 26-05-2020