Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సైన్స్‌ విద్యార్ధులకు మెరుగైన కోర్సు!

          ఎంతో ప్రాముఖ్యం ఉన్న పశువైద్యరంగంలో ప్రవేశించాలంటే ఎంసెట్‌తో పాటు మరో అవకాశం- ఆలిండియా ప్రీ వెటర్నరీ టెస్ట్‌ (ఏఐపీవీటీ). మన రాష్ట్ర విద్యార్థులకు పెద్దగా అవగాహన లేని పరీక్ష ఇది. వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా జాతీయస్థాయిలో మే నెలలో నిర్వహించే ఈ పరీక్ష తీరుతెన్నులూ, తయారీ విధానం తెలుసుకుందాం!
మన తెలుగు రాష్ట్రాల్లో వైద్య, దంతవైద్య కోర్సుల తర్వాత ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్న కోర్సు పశువైద్యవిద్య (బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండ్రీ ( బీవీఎస్‌సీ అండ్‌ ఏహెచ్‌). ఈ ఐదేళ్ళ డిగ్రీ చేస్తే ఆరంభంలోనే గెజిటెడ్‌ అధికారి కావొచ్చు. ప్రైవేటు రంగాలైన డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా, రిసర్చ్‌, బయోటెక్నాలజీ, లాబరెటరీస్‌, ప్రభుత్వేతర సంస్థల్లోనూ ఎన్నో అవకాశాలుంటాయి. పీజీ, పీహెచ్‌డీలను విదేశాల్లోనూ చేయవచ్చు. కళాశాలల్లో అసిస్టెంటు ప్రొఫెసర్లుగా స్థిరపడే వీలుంటుంది. విదేశాల్లో పశువైద్యులకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని చెపుతుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్‌ ద్వారానే కాకుండా ఈ ఆలిండియా ప్రీ వెటర్నరీ టెస్టు ద్వారా కూడా పశువైద్యంలో మన విద్యార్థులు సీటు సంపాదించవచ్చు. ఈ పరీక్ష ద్వారా జమ్ము కాశ్మీర్‌ తప్ప మిగతా ప్రతి రాష్ట్రంలో ఉన్న పశువైద్య విశ్వవిద్యాలయాల్లో 15 శాతం కోటా సీట్లు భర్తీ అవుతాయి. ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పశువైద్యవిద్యను అభ్యసించవచ్చు.
ఈ ఏఐపీవీటీకి ఇంటర్మీడియట్‌ సిలబస్‌ క్షుణ్ణంగా చదివితే సరిపోతుంది. మెరిట్‌ ద్వారా ర్యాంకు పొందితే వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తుంది. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు శ్రీ వేంకటేశ్వర (ఆంధ్రప్రదేశ్‌), పీవీ నరసింహారావు (తెలంగాణ) పశువైద్యవిశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ఐదు కళాశాలల్లోని 55 సీట్లకు పోటీ పడవచ్చు. ఇవి- తిరుపతి (చిత్తూరు జిల్లా), గన్నవరం (కృష్ణాజిల్లా), ప్రొద్దుటూరు (కడప జిల్లా) , కోరుట్ల (కరీంనగర్‌ జిల్లా), రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌). ప్రతిభను బట్టి అభ్యర్థులు తమకు నచ్చిన ఇతర వెటర్నరీ కళాశాలల్లో కూడా చేరవచ్చు.
ఏ విభాగం ఎలా?
* ఫిజిక్స్‌: యూనిట్స్‌ ఆఫ్‌ మెజర్‌మెంట్‌, కైనెమాటిక్స్‌, వెక్టర్స్‌, స్కేలార్స్‌, న్యూటన్‌ లాస్‌ ఆఫ్‌ మోషన్‌, గ్రావిటేషన్‌, హీట్‌, ఎలక్ట్రో స్టాటిక్స్‌, ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్‌, రేడియేషన్‌ అధ్యాయాలు చదవాలి. ఇదే సిలబస్‌ ఇంటర్లో కూడా ఉంది. ఈ పరీక్షలో ఫిజిక్స్‌ విభాగం ఎంసెట్‌ కంటే కూడా సులువుగా ఉంటుందని చెప్పవచ్చు.
* కెమిస్ట్రీ: అటామిక్‌ స్ట్రక్చర్‌, పీరియాడిక్‌ టేబుల్‌, కెమికల్‌ బాండింగ్‌, రెడాక్స్‌ రియాక్షన్స్‌, ఎస్‌ అండ్‌ పీ బ్లాక్‌ ఎలిమెంట్స్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, సొల్యూషన్స్‌, అయిసోమెరిసమ్‌ మొదలైనవి చదవాల్సివుంటుంది. కెమిస్ట్రీ కూడా ఎంసెట్‌ కంటే సులభంగానే ఉంటుంది.
* బయాలజీ: మనుషులకు సంబంధించిన ఫిజియాలజీ, రీప్రొడక్షన్‌ క్షుణ్ణంగా చదవాలి. మన ఇంటర్లో కుందేళ్ళకు సంబంధించి అంశాలు పొందుపరిచారు. మిగిలినదంతా ఎంసెట్‌ సిలబసే. అంటే టాక్సానమీ, మార్ఫాలజీ, సెల్‌ స్ట్రక్చర్‌, ప్లాంట్‌ ఫిజియాలజీ, డిజీజెస్‌, ఇకాలజీ- ఎన్విరాన్‌మెంట్‌ మొదలైనవి.
బయాలజీని బాగా అవగాహన చేసుకున్నవారికి సీటు పొందే అర్హత ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే బయాలజీలో ఎక్కువ వచ్చినవారికే సీటు ముందు కేటాయిస్తారు.
ఈ ప్రవేశపరీక్ష మే 14న జరగబోతోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు పంపటానికి ఫిబ్రవరి 7 వరకూ గడువుంది. ఆ తర్వాత కూడా ఆలస్య రుసుము చెల్లించి మార్చి 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌ పద్ధతిలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి చివరి నిమిషం వరకూ ఆగకుండా ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది.
www.aipvt.vci.nic.in ను గానీ, www.vci.nic.in ను గానీ సందర్శించి పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ పరీక్ష ద్వారా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పశువైద్య డిగ్రీలో సీట్లు పొందే అవకాశాన్ని సులువుగా చేజిక్కించుకోవచ్చు!

::. ఏఐపీవీటీ ద్వారా దేశ‌వ్యాప్తంగా అడ్మిష‌న్లు నిర్వ‌హించే సంస్థలు, సీట్లు, పీజుల వివరాలు .::

Posted on 18-01-2016
INFORMATION
Apply Online
Candidate Login
Notificaton