Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

కొన్నింటికి అదనపు సమయం పడుతుంది

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...

పర్యటన కోసం బి1/బి2 వీసాకు దరఖాస్తు చేద్దామనుకుంటున్నాను. ఏయే ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను. అందుకు సంబంధించిన పత్రాలను జత చేయాలా? నా ప్రయాణాన్ని ఎవరైనా ప్రాయోజితం చేస్తే ఎలాంటి పత్రాలను అందజేయాల్సి ఉంటుంది? - కాశీవిశ్వనాథ్‌
నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా ఇంటర్వ్యూలు ధ్రువపత్రాల ఆధారంగా ఉండవు. ఇంటర్వ్యూ సమయంలో కాన్సులర్‌ అధికారి వాటిని అడగరు. దరఖాస్తుతోపాటు అనుబంధంగా ఏవైనా పత్రాలను మీరు వెంట తెచ్చుకోవాలనుకుంటే మీ ఇష్టం. ఇంటర్వ్యూ అపాయింటుమెంటును షెడ్యూల్‌ చేసుకోవాలనుకుంటే ‌www.ustraveldocs.com/in ను చూడండి.
2019 మే వరకు చెల్లుబాటు అయ్యే వీసా ఉంది. పిల్లలను చూసేందుకు 2019 మార్చిలో అమెరికా వెళ్లి ఆరు నెలలు ఉందామనుకుంటున్నాను.ప్రయాణానికి ముందుగానే వీసా పునరుద్ధరించుకోవాలా? ప్రస్తుతం ఉన్న వీసాపై ప్రయాణం చేయవచ్చా? - కొడాలి నాగేశ్వరరావు
వీసా చెల్లుబాటులో ఉన్న కాలంలో మీరు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. మీరు అమెరికాలో ఎంతకాలం ఉండాలన్నది డిపార్టుమెంటు ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఆమోదిత నిబంధనల ప్రకారం అమెరికా ప్రవేశ ప్రాంతంలోని కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ అధికారి నిర్ణయిస్తారు. ఆయా వివరాలు మీ పాస్‌పోర్టు, ఐ-94 పత్రంలో పేర్కొన్న మేరకు నిర్ణయిస్తారు.
నా వీసా గడువు పొడిగింపునకు ఇటీవలే ఆమోదం లభించింది. ఈ ఏడాది ఆగస్టులో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు భారతదేశం వచ్చాను. వీసా ఆమోదానికి సంబంధించిన సమాచారాన్ని ఒకటీ రెండు వారాల్లో తెలియజేస్తామని ఇంటర్వ్యూ అధికారి చెప్పారు. సమాచారం కోసం ఎదురుచూస్తున్నాను. అదనపు సమాచారం కావాలని కానీ, 221(జి) పత్రం కానీ ఇవ్వలేదు. సపోర్టు ఇండియాకు ఈ మెయిల్‌ ద్వారా సంప్రదిస్తే సుమారు 60 రోజులు పడుతుందని ప్రత్యుత్తరం వచ్చింది. ఎందుకని? - కృష్ణ
కొన్ని కేసుల్లో పరిపాలనాపరమైన అదనపు ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిర్ధారిత గడువు కన్నా అధిక సమయం పడుతుంది. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో నిర్ధిష్టంగా స్పందించలేం.
అమెరికాలో ఓటీపీపై పని చేస్తున్నాను. నా స్టెమ్‌ పొడిగింపు 2020 వరకు ఉంది. 2016లోనే నా వీసా కాలం తీరింది. వార్షిక ఒప్పంద ప్రాతిపదికన ఆ ఉద్యోగం ఉంటుంది. ఆగస్టు నుంచి మే నెల వరకు విశ్వవిద్యాలయంలో అకడెమిక్స్‌ ఉంటాయి. కుటుంబ సభ్యులను చూసేందుకు ఈ ఏడాది డిసెంబరులో భారతదేశం వద్దామనుకుంటున్నా. ఆ సమయంలో వీసాను పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాను. వీసా అపాయింటుమెంటుకు వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన సమాచారమేమైనా ఉందా? - నాగరాజు బి
మీ వీసా 2016లోనే కాలం చెల్లిన దృష్ట్యా అమెరికా వెలుపలే వీసాను పునరుద్ధరించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ, ఇంటర్వ్యూ అపాయింటుమెంటు సమాచారం కోసం www.ustraveldocs.com/in వెబ్‌సైట్‌ను చూడండి.

* మీకేమైనా ప్రశ్నలుంటే 040 4625 8222, 0120 4844644 నంబర్లకు ఫోన్‌ చేయండి లేదా support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి. 
* వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై మీ సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి. 
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov నూ సంప్రదించవచ్చు. 
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

  • Published on 10-10-2018