Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

విద్యార్థి వీసాకు ప్రామాణిక పరీక్షలు అనివార్యం కాదు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...

నా పర్యాటక వీసా 2019 మార్చిలో కాలం తీరనుంది. జనవరిలో అమెరికా వెళ్దామనుకుంటున్నా. ప్రయాణానికి ముందుగా వీసాను పునరుద్ధరించుకోవాలా? - రమేష్‌ ఎమ్వీఎస్‌
వీసా చెల్లుబాటులో ఉన్నంత కాలం మీరు ఎన్ని దఫాలైనా ప్రయాణం చేయవచ్చు. గడవు తీరేంత వరకు అమెరికా వీసా చెల్లుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా మీరు వీసాను పునరుద్ధరించుకోవచ్చు.
2020 జూన్‌ వరకు చెల్లుబాటయ్యే హెచ్‌1బీ వీసా పిటిషన్‌ ఉంది. వీసా ఇంటర్వ్యూకు ఇప్పటి వరకు హాజరు కాలేదు. త్వరలో హాజరు కావాలనుకుంటున్నా. వీసా ఆమోదం పొందేందుకు ఎంత వ్యవధి పడుతుంది? - ప్రసాద్‌ మూర్తి కేఎస్‌
ఆమోదిత హెచ్‌1బీ పిటిషన్‌ మీకు ఉంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవటం మంచిది. వీసా ప్రక్రియ పూర్తి కావటానికి ఎంత వ్యవధి పడుతుందన్నది నిర్దిష్టంగా చెప్పటం సాధ్యం కాదు. అది ఒక్కో కేసుకు ఒక్కోలా ఉంటుంది.
ఇప్పటికే పలు దేశాలు పర్యటించాను. అమెరికా పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేద్దామనుకుంటున్నా. వీసా కోసం ఏయే ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది? - సత్యప్రసాద్‌ ఎం
నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల ఇంటర్వ్యూలు ధ్రువపత్రాల ఆధారంగా ఉండవు. ఇంటర్వ్యూ అధికారి ఎలాంటి ధ్రువపత్రాలను కోరరు. అనుబంధ ధ్రువపత్రాల జాబితాను పరిశీలించి వాటిల్లో తీసుకురాదగినవనుకున్న సమాచారం కోసం, వీసా ఇంటర్వ్యూ అపాయింటుమెంటు కోసం ‌www.ustrveldocs.com/in ను పరిశీలించండి.
గడిచిన విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. అమెరికాలో మాస్టర్స్‌ చేద్దామనుకుంటున్నాను. టోఫెల్‌, క్యాట్‌ లాంటి ఇతర ప్రవేశ పరీక్షలను పూర్తి చేయాలా? అవి లేకుండానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?- సరిత కావూరి
అమెరికాలో చదువుకునేందుకు ప్రామాణిక పరీక్షల్లో మార్కులు సాధించాల్సిన అవసరం లేదు. మీరు దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయం ఆయా పరీక్షల మార్కులను కోరిన పక్షంలో ఇంటర్వ్యూ అధికారి ఆయా పరీక్షల మార్కులపై ప్రశ్నిస్తారు. ఉన్నత విద్యను చదివేందుకు ఆసక్తి చూపే విద్యార్థుల సన్నద్ధతను కాన్సులర్‌ అధికారి అర్థం చేసుకునేందుకు ప్రామాణిక పరీక్షల మార్కులు ఉపకరిస్తాయి. సాధారణంగా ఎఫ్‌-1 వీసాకు అర్హత పొందాలంటే అమెరికా వెళ్తున్నది చదువు కోసమే అని నిరూపించుకోవాలి. ఆ చదువును పూర్తి చేసేందుకు, ఫీజులు చెల్లించేందుకు విశ్వసనీయ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆ విద్యాభ్యాసం పూర్తి కాగానే మాతృదేశానికి తిరిగి వస్తానని కూడా స్పష్టీకరించాల్సి ఉంటుంది.

* మీకేమైనా ప్రశ్నలుంటే 040 4625 8222, 0120 4844644 నంబర్లకు ఫోన్‌ చేయండి లేదా support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి. 
* వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై మీ సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి. 
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov నూ సంప్రదించవచ్చు. 
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

  • Published on 31-10-2018