close

అనంతపురం జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ దిక్కున ఉండే పెద్ద జిల్లా. క్రీ.పూ. 1344-1377 మధ్య బుక్కదేవరాయలు ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన చిక్కవడియార్ అనంత సాగరం అనే పెద్ద చెరువుకు ఇరువైపులా అనంతసాగరం, బుక్కరాయసముద్రం అనే రెండు గ్రామాలను నిర్మించాడు. చిక్కవడియార్ రాజుకు అనంతరస అనే బిరుదు కారణంగా నగరానికి అనంతపురం పేరు వచ్చింది.

జిల్లా ఆవిర్భావం
అనంతపురం జిల్లా 1882లో ఆవిర్భవించింది. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి, ముదిగుబ్బ, నల్లమాడ, నంబులపూలకుంట, తలుపుల, నల్లచెరువు, ఓబుళదేవరచెరువు, తనకల్లు, ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి 1956లో బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.

రెవెన్యూ డివిజన్ల విభజన
జిల్లా విస్తీర్ణం 19,130 చ.కి.మీ. జిల్లాను అనంతపురం, ధర్మవరం, పెనుకొండ మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. జిల్లాలో మొత్తం 63 మండలాలున్నాయి. అనంతపురం డివిజన్లో 20 మండలాలు, ధర్మవరం డివిజన్లో 17 మండలాలు, పెనుకొండ డివిజన్లో 26 మండలాలు ఉన్నాయి. 964 రెవెన్యూ గ్రామాలు, 1005 గ్రామపంచాయితీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. అనంతపురం కార్పోరేషన్.

విద్య

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
అనంతపురం జిల్లా కేంద్రానికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 10 కిలోమీటర్ల దూరంలో అనంతపురం- చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉంది. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 1976లో పోస్టుగ్రాడ్యుయేషన్ సెంటర్‌గా ఉండి 1981లో యూనివర్సిటీగా ఏర్పాటు అయింది. రాయలసీమ ప్రాంతవాసుల చిరకాల స్వప్నంగా వర్సిటీ ఏర్పాటైంది. ఇషా ఉపనిషత్తు నుంచి 'విద్యయా అమృత మశ్నుతే' అనే పదాన్ని జోడించి వర్సిటీ చిహ్నం రూపొందించారు. మొత్తం 500 ఎకరాల్లో క్యాంపస్ విస్తరించింది. వర్సిటీ కళాశాలలో 28 విభాగాల్లో 37 పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. 156 అనుబంధ డిగ్రీ కళాశాలలు, 25 పీజీ కళాశాలల్లో ప్రత్యేకంగా పీజీ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. 59 బీఈడీ కళాశాలలు వర్సిటీ పరిధిలో ఉన్నాయి. రెండు లా కళాశాలలు ఉన్నాయి.

అనంత జేఎన్‌టీ విశ్వవిద్యాలయం
అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ కళాశాల 1946లో ఏర్పాటు అయింది. హైదరాబాద్ జేఎన్‌టీయూకి అనుబంధంగా ఉన్న కళాశాల ఆగస్టు 18, 2008లో అనంతపురం జేఎన్‌టీయూ వర్సిటీగా ఏర్పాటు అయింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించింది. వర్సిటీ కళాశాలలు అనంతపురం జేఎన్‌టీయూ, పులివెందుల జేఎన్‌టీయూ, అనంతపురం తైల సాంకేతిక అభివృద్ది కేంద్రం ఉంది. ఐదు జిల్లాల పరిధిలో 114 ఇంజినీరింగ్ కళాశాలలు, 35 ఫార్మసీ కళాశాలలు, 21 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, 5 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు ఉన్నాయి. యూజీలో బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ ఉన్నాయి. పీజీలో ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ ఫార్మాడీ (పి.బి.)కోర్సులు ఉన్నాయి. ఎంఎస్, పీహెచ్‌డీలో పరిశోధన చేయడానికి అవకాశం ఉంది.

నదులు - ప్రాజెక్టులు

పెన్నా
కర్ణాటక రాష్ట్రంలోని నందికొండలో పుట్టి హిందూపురం మండలం దక్షిణాన చేలూరు గ్రామం వద్ద రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. పరిగి, రొద్దం, రామగిరి, కంబదూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఉరవకొండ, వజ్రకరూరు, పామిడి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల గుండా ఈ నది ప్రవహించి, కోడూరు గ్రామానికి నైరుతీ దిశగా 3 కి.మీ. దూరంలో కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

చిత్రావతి
చిత్రావతి నది జిల్లాలో రెండో పెద్ద నది. ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లా నందిదుర్గానికి ఉత్తరంగా ఉన్న హరిహరేశ్వర్ కొండల్లో పుట్టి చిలమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామానికి 2 కి.మీ. దూరంలో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నది గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, యల్లనూరు మండలాల్లో ప్రవహిస్తుంది. కడప జిల్లాలోని గండికోట వద్ద పెన్నానది సంగమం చేస్తుంది.

హగరి లేదా వేదావతి
హగరి లేదా వేదావతి నది కూడా ముఖ్యమైంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో పుట్టి గుమ్మగట్ట, బ్రహ్మ సముద్రం, బెళుగుప్ప, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాల గుండా ప్రవహిస్తుంది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ప్రవేశిస్తుంది.

జయమంగళ
ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పరిగి మండలంలో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పెన్నానదిని, సంగమేశ్వరంపల్లి గ్రామం(పరిగి మండలం) వద్ద కలుస్తుంది.

చిన్ననదులు
చిలమత్తూరు మండలంలోని కుషావతి, అగళి మండలంలోని స్వర్ణముఖి, తనకల్లు మండలంలోని పాపాఘ్ని, నల్లమాడ, కదిరి, ముదిగుబ్బ మండలాల్లోని మద్దిలేరు, కనగానపల్లి, రాప్తాడు, అనంతపురం, బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లోని పండమేరు చిన్న నదులు.

నీటిపారుదల

సాగునీటి వనరులు
అనంతపురం జిల్లా రైతాంగం ప్రధానంగా తుంగభద్ర జలాశాలయాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. తుంగభద్ర నుంచి వచ్చే నీరు తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించాల్సి వస్తోంది. యేటా నీటి లభ్యత ఆధారంగా జిల్లాలోని ఆయకట్టుకు నీటిని వినియోగిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాజెక్టులు వర్షాధారం కింద ఆధారపడి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సిఉంది. ఇటీవల నెలకొన్న తీవ్ర వర్షాభావం వల్ల ఆయకట్టుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులకు ఉన్న ఆయకట్టు విస్తీర్ణంలో సగ భాగం కూడా నీరు అందడం లేదు. పేరుకు మాత్రమే ఆయకట్టు... విస్తీర్ణం అనే రీతిలో ఉన్నాయి.

తుంగభద్ర హైలెవల్ కెనాల్(హెచ్చెల్సీ)
జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టు. దీని కింద సుమారు 1.50లక్షల ఎకరాలకు సాగునీటి పారుదల సౌకర్యం ఉంది. హెచ్చెల్సీ నీరు వివిధ బ్రాంచ్‌కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యం ఉంది. జిల్లావ్యాప్తంగా 26 మండలాల్లో హెచ్చెల్సీకింద ఆయకట్టు సౌకర్యం ఉంది. ఇందుకు టీబీ డ్యాం నుంచి యేటా 32 టీఎంసీల నుంచి 35 టీఎంసీలు కేటాయిస్తున్నారు. 2010-11 యేడాదికిగాను జిల్లావాటాగా 32.5 టీఎంసీలను కేటాయించారు.

తుంగభద్ర ప్రధానకాలువ
దీని కింద 35,541 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా బొమ్మనహాల్, కణేకల్ మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈప్రాంతంలో ఎక్కువగా వరి పంటను సాగు చేయనున్నారు

మిడ్‌పెన్నార్ నార్త్‌కెనాల్
దీని కింద పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈ కెనాల్ కింద మొత్తం 13,325 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. పెద్దవడుగూరులో ఎక్కువగా పత్తి పంటను సాగు చేయనున్నారు.

మిడ్‌పెన్నార్ సౌత్
దీని కింద గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్ మండలాల్లో ఆయకట్టు ఉంది. ఈ కెనాల్ కింద మొత్తం 33176 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా గార్లదిన్నె, శింగనమల మండలాల్లో అత్యధికంగా వరిని సాగు చేయనున్నారు.

తాడిపత్రి బ్రాంచ్ కెనాల్
మిడ్‌పెన్నార్ సౌత్‌కెనాల్ నుంచి నార్పల మండల మీదుగా ప్రధాన కాలువ పుట్లూరు మండలం సుబ్బరాయసాగర్‌లోకి నీరు వస్తుంది. అక్కడినుంచి ఎ.కొండాపురం మీదుగా తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. ఈ కెనాల్ కింద తాడిపత్రి, పుట్లూరు, పెద్దపప్పూరు, యల్లనూరు మండలాల్లో 31131 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా సగభాగం నీరందిన దాఖలాలు లేవు. యేటా 5వేల ఎకరాల వరకే నీరందుతోంది

గుంతకల్లు బ్రాంచ్ కెనాల్
గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు మండలాల్లో ఆయకట్టు ఉంది. మొత్తం 15,792 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. ఈ కెనాల్ కింద వరి, మిరప పంటలను సాగు చేయనున్నారు

గుత్తి బ్రాంచ్ కెనాల్
గుత్తి బ్రాంచ్ కెనాల్ కింద గుత్తి, పామిడి మండలాల్లో ఆయకట్టు ఉంది. గత పదేళ్ల నుంచి ఆయకట్టు పరిధిలో కొంత భాగం భూసేకరణ కారణంగా ఆగిపోయింది. ఇటీవలే భూసేకరణ పూర్తి అయ్యింది. వచ్చే యేడాది నుంచి గుత్తి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఈకెనాల్ కింద 16271 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది అలాగే టీబీ డ్యాం నుంచి తుంగభద్ర జలాలు సరిహద్దులో ఉన్న కర్నూలు, కడప జిల్లాలకు కూడా వెళ్లాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్ పరిధిలో 14255 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉండగా, కడప జిల్లాలోని పులివెందల బ్రాంచ్ కెనాల్ కింద 55,579 ఎకరాలు, మైలవరం నార్త్, సౌత్ కెనాల్ కింద 69922 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంకు నీరు పారాల్సి ఉంది

చెరువులు
జిల్లాలో 1264 చెరువులు ఉన్నాయి. ప్రధానంగా బుక్కపట్నం చెరువు రాయలసీమలోనే అత్యంత పెద్దది. దీని కింద 8200 ఎకరాల ఆయకట్టు ఉంది. తరువాత స్థానంలో శింగనమల చెరువు ఉంది. దీని కింద 5వేల ఎకరాల ఆయకట్టు ఉండగా మూడో స్థానంలో ధర్మవరం చెరువు ఉంది. ఈ చెరువు కింద 2వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంది. అదేవిధంగా వంద ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 305, వంద ఎకరాలలోపు ఉన్న చెరువులు 959 ఉన్నాయి. జిల్లాలో మొత్తం 118396 ఎకారాల ఆయకట్టు చెరువుల కింద ఉంది. అయితే వర్షాలు లేకపోవడం వల్ల చాలా చెరువుల్లో ఆయకట్టు విస్తీర్ణం పూర్తిగా పడిపోయింది

ప్రధాన పంటలు

దేశంలోనే అత్యల్ప వర్షపాతం కల జిల్లా అనంతపురం. ఇక్కడి రైతులు అనునిత్యం ప్రకృతితో పోటీ పడుతుంటారు. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఖరీఫ్‌లో వేరుసెనగ పంట సాగులో అనంత రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఇటీవల కాలంలో పండ్లతోటల సాగులో కూడా మందంజలో ఉంది. తక్కువ నీటిని వినియోగించుకొని బిందు, తుంపెర పరికరాలతో పండ్లతోటలను సాగు చేస్తున్నారు. 89వేల హెక్టార్లలో ఉద్యానవనపంటలు సాగవుతున్నాయి. యేటా అనంత నుంచి 9.95 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

కొర్ర: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 636 హెక్టార్లలో కొర్ర పంటను సాగు చేశారు. నీటి వసతితో పాటు వర్షాధారం కింద కూడా కొర్రను సాగు చేశారు. ఈ పంటను మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో పాటు తదుపరి రబీలో కూడా మరోక పంట వేసేందుకు అనువుగా ఉండటంతో పాటు పశువులకు మేత కూడా అవుతుందని రైతులు కొర్ర పంటను సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో కొర్రతో కలిసి మూడు పంటలు పండించవచ్చునని వ్యవసాయశాస్త్రవేత్తలు నిరూపించారు. రెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్తలు కొర్ర సాగులో మెలకువులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.

వేరుసెనగ: రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుసెనగ పంటను సాగు చేసే జిల్లా అనంతపురం. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు అయ్యే జిల్లా అనంతపురం. వర్షాభావ పరిస్థితికి నిలదొక్కోగలిగే పంట వేరుసెనగ. అందుకే జిల్లాలో ఎక్కువ మంది రైతులు వేరుసెనగ సాగు చేస్తున్నారు. ఎర్రనేలల్లో ఎక్కువగా వేరుసెనగను సాగు చేస్తున్నారు. ప్రతి యేటా ఖరీఫ్‌లో సుమారు 7లక్షల హెక్టార్లకుపై గానే వేరుసెనగ పంటను సాగు చేస్తున్నారు. ఈ యేడాది 7.06లక్షల హెక్టార్లలో వేరుసెనగ పంటను సాగు చేస్తున్నారు.

మొక్కజొన్న: జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న సాగు లక్ష్యం, సాధారణ విస్తీర్ణం 7559 హెక్టార్లుగా వ్యవసాయశాఖ నిర్ణయించింది. అయితే ఈ యేడాది 13,689 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. కొంత వరకు నీటి వసతి ఉండే పొలాలు మొక్కజొన్నకు అనుకూలం. ప్రస్తుతం మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఉండటంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుండటం, లాభదాయకమైన పంట కావడంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు అయ్యింది.

కొర్ర: జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 636 హెక్టార్లలో కొర్ర పంటను సాగు చేశారు. నీటి వసతితో పాటు వర్షాధారం కింద కూడా కొర్రను సాగు చేశారు. ఈ పంటను మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో పాటు తదుపరి రబీలో కూడా మరోక పంట వేసేందుకు అనువుగా ఉండటంతో పాటు పశువులకు మేత కూడా అవుతుందని రైతులు కొర్ర పంటను సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలో కొర్రతో కలిసి మూడు పంటలు పండించవచ్చునని వ్యవసాయశాస్త్రవేత్తలు నిరూపించారు. రెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్తలు కొర్ర సాగులో మెలకువులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.

కంది: జిల్లాలో కంది పంటను ప్రధానంగా వేరుసెనగలో అంతర పంటగా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రనేలలో ఎక్కువగా కంది పంటను సాగు చేయనున్నారు. 45705 హెక్టార్లలో కంది పంటను సాగు చేయనున్నారు. కంది పప్పు ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సాధారణ విస్తీర్ణం కంటే 9వేల హెక్టార్లలో ఎక్కువగా రైతులు కంది పంటను సాగు చేశారు. ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా అంతర పంటగా రైతులు కందిని సాగు చేస్తున్నారు.

పెసర: పెసర పంటను కూడా జిల్లాలో ప్రధానంగా వేరుసెనగకు అంతర పంటగా సాగు చేస్తున్నారు. అలాగే ఎర్రటి నేలల్లో, ఇసుక నేలల్లో ఎక్కువగా పెసర పంటను సాగు చేస్తున్నారు.

పప్పుశనగ: ప్రధానంగా జిల్లాలో రబీలో పప్పుసెనగ పంటను సాగు చేస్తారు. ఈ పంట నల్లరేగడి పొలాల్లో సాగుకు అనుకూలమైనది. చలికాలంలో వచ్చే మంచు బిందువులతో ఎక్కువగా ఈ పంట వస్తుంది. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో పప్పుసెనగను సాగు చేయనున్నారు. ఎక్కువగా విడపనకల్లు, వజ్రకరూరు, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో పప్పుసెనగ పంట రబీలో సాగుచేస్తున్నారు.

పొద్దుతిరుగుడు: నల్లరేగడి నేలల్లో ఎక్కువగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్నారు.అయితే ఈ యేడాది తీవ్ర వర్షాభావం వల్ల ఖరీఫ్‌లో, రబీలో పొద్దుతిరుగుడు పంట సక్రమంగా పడలేదు. ఖరీఫ్‌లో 20085 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా గత ఖరీఫ్‌లో కేవలం 3570 హెకార్టలో మాత్రమే పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో బీడుగా కొంతమేరకు వదిలివేయగా, మరికొంత ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు.

మామిడి: జిల్లా వ్యాప్తంగా 7994 హెక్టార్లలో మామిడి పంటను సాగు చేయబడుతోంది. కదిరి, పెనగొండ, హిందూపురం, తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాంతాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. మిగిలన ప్రాంతాల్లో అక్కడక్కడా మామిడిని సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఇసుక రకం నేలల్లో ఈ మామిడిని సాగు చేస్తున్నారు.

అరటి: తక్కువ నీటి వినియోగం, తక్కువ శ్రమ, ఎక్కువ మంది కూలీలపై ఆధారపడాల్సి అవసరం లేని పంట అరటి. గత పదేళ్ల నుంచి టిష్యూకల్చర్ అరటి పంటను సాగు చేయడానికి ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7286 హెక్టార్లలో (18215 ఎకరాలు) అరటి పంట సాగు చేయబడుతోంది. మూడు పంటలు వచ్చే అరటి ఒక్కక్క పంటకు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. జిల్లాలో పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రి, పెద్దపప్పూరు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ పంటకు తెగుళ్లు తక్కువ... ఈదురు గాలులు వీస్తే చెట్లు నేలకొరి పంట తినే అవకాశం ఉంది.

చీనీ(బత్తాయి): పండ్లతోటలలో ప్రధానమైన వాటిలో బత్తాయి(చీనీ) పంట ముఖ్యమైనది. చీనీ మెక్క నాటిన ఐదు సంవత్సరాల నుంచి పంట చేతికొస్తుంది. జిల్లాలోగార్లదిన్నె, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బత్తాయిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 49759 హెక్టార్లలో (124397ఎకరాల్లో) బత్తాయి పంట సాగు చేయబడుతోంది. ఇటీవల కాలంలో బత్తాయి చెట్లకు వేరుకుళ్లు తెగుళ్లు ఎక్కువగా రావడంతో రైతులు నష్టపోతున్నారు. చీనీ మార్కెట్‌కు నిలకడ లేని మార్కెట్ వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు.

జామ: ఇసుక నేలలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా జామ పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో పామిడి, పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల్లో అత్యధికంగా జామను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2100 హెక్టార్లలో జామ పంట సాగు చేయబడుతోంది. జనవరి నుంచి జామ పంట చేతికొస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన జామ స్థానిక మార్కెట్‌తో పాటు బెంగళూరు, కోలార్, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాకు ఎగుమతి చేస్తారు. జ్యూస్ పరిశ్రమలకు కూడా జామను ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో జామకు ఎండు తెగులు రావడంతో చెట్లు ఎండిపోవడంతో రైతులు ఇబ్బదులు పడుతున్నారు.

సపోట: జిల్లా వ్యాప్తంగా 3951 హెక్టార్లలో సపోటా పంటను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సపోటాను సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంట చెనై, హైదరాబాద్, కవిజయవాడ, కొత్తపేట, సింగనూరు (కర్నాటక), మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతోంది.

దానిమ్మ: జిల్లా వ్యాప్తంగా 3363 హెక్టార్లలో దానిమ్మ పంట సాగు చేయబడుతోంది. ధర్మవరం, రాయదుర్గం, యల్లనూరు, పెద్దపప్పూరు, పెనుగొండ తదితర మండలాల్లో అత్యధికంగా దానిమ్మ పంటను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పండించిన దానిమ్మ పంటను చెన్నై, కల్‌కత్తా, బెంగళూరు, కోయంబత్తూరు, విజయవాడ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.

పర్యాటకం

రాష్ట్ర పురావస్తు రక్షిత కట్టడాల కింద జిల్లా 44 ఆలయాలున్నాయి. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 23 ఉన్నాయి. జిల్లా చిన్న, పెద్ద దేవాలయాలు 1000 దాకా ఉన్నాయి.

వసంత వల్లభుడు.. శ్రీఖాద్రి నృసింహుడు
800 ఏళ్లనాటి దివ్యక్షేత్రం
కదిరిలో కొలువుదీరిన నారసింహుడు నిత్యపూజలతో బ్రహ్మాండనాయకుడిగావెలుగొందుతున్నారు. ఆ పవిత్ర ఖాద్రి దివ్యక్షేత్రం పడమటి వైపు నదీతీరం ఉంది. అక్కడ భృగుమహర్షి తపస్సు చేసి.. శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారు. మహర్షి కోరిక మేరకు స్వామి స్వయంగా శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలు అందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వసంత రుతువులో శ్రీవారు అనుగ్రహించడంతో ఉత్సవ మూర్తులకు వసంత వల్లభులని పేరొచ్చింది. భృగుమహర్షి తపస్సు ఫలితంగా ఖాద్రి క్షేత్రంలో స్వయంభువుగా వెలిశారు. వసంత వల్లభుడైన శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఏటా 15 రోజుల పాటు వివిధ అవతారాల్లో కనువిందు చేస్తూ భక్తులకు దర్శనమిస్తారు. వాటినే బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు.

రెండో కాశీ క్షేత్రం బుగ్గ రామలింగేశ్వర ఆలయం
తాడిపత్రికే తలమానికమైన బుగ్గరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 25 వరకు జరగనున్నాయి. దేవాదాయ శాఖ, ఆలయ ధర్మకర్తల మండలి విస్తృత ఏర్పాట్లు చేసింది. విజయనగర సామ్రాజ్య ఆరంభ దశలో విద్యారణ్యులు నారాయణభట్టు అనే పండితుణ్ని పినాకిని నది ప్రాంతంలో సంచరించమని అదేశించారు. అప్పటికే భాస్కరక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ప్రాతంలో తాళఫలవృక్షాలు ప్రాంతంలో అధికంగా ఉండటంతో తాటిపల్లెగా నారాయణభట్టులు నామకరణం చేశారని చరిత్ర చెబుతోంది. అది తాడిపత్రిగా రూపాంతరం చెందింది. రాయల కాలానికి ముందు జైన సామంత రాజు ఉదయాదిత్యుడు క్రీ..శ.. 1199లో ఇక్కడ పాలన చేసినట్లు దేవాలయ శిలాశాసనంలో ఉంది.

పుట్టపర్తి
ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రం. సత్యసాయి బాబా సమాధిని దర్శించుకోవడానికి విదేశాల నుంచీ భక్తులు వస్తుంటారు. అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా 64 కి.మీ. దూరంలో పుట్టపర్తి ఉంది.

వలస పక్షుల కేంద్రం వీరాపురం
జిల్లాలోని వీరాపురం వలస పక్షులకు ఆవాసంగా అలరారుతోంది. ముఖ్యంగా సైబీరియా నుంచే వచ్చే పక్షులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వచ్చే పక్షులను ఈ వూరి ప్రజలు తమ అతిథులుగా చూసుకుంటారు. ఇక్కడకు వచ్చే పక్షిజాతుల్లో పెయింటెడ్ స్టార్క్ ముఖ్యమైంది. వీరాపురం వాసులు ముద్దుగా ఎర్ర కొంగ అంటారు. అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్ స్టార్క్‌లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతమైన విషయం.

పెయింటెండ్ స్టార్క్
పెయింటెడ్ స్టార్క్ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. సికొనిడే జాతికి చెంది పెయింటెడ్ స్టార్క్ శాస్త్రీయ పేరు 'మిక్టీరియాలూకోసిఫల'. ఎత్తు 3-3.5అడుగులు, ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు సుమారు 3.5-4కిలోల వరకు ఉంటుంది.

లేపాక్షి ఆలయం
రావణుడు సీతాదేవిని అపహరించి లంకా నగరానికి తీసుకెళ్తుండగా, జఠాయువు పక్షి అడ్డగించింది. కోపోద్రుక్తుడైన రావణుడు దాని రెక్కలు నరికివేస్తాడు. సీతాన్వేషియై తిరుగుతున్న రాముడు ఈ ప్రాంతానికి రాగా రెక్కలు తెగి ఉన్న జఠావును చూసి లే.. పక్షి అన్నాడని దాంతో ఈ ప్రాంతం లేపాక్షిగా మారిందని ఇతిహాస గాథ.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన నంది
ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది మరెక్కడా లేదు. 15అడుగుల ఎత్తు, 27అడుగుల పొడవుతో జీవకళ ఉట్టిపడుతూ పైకి లేచివస్తున్నట్లు కనబడే ఈ నంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

పచ్చని అందాలు... విజయనగర రాజుల కట్టడాలు
కోట కలిగిన కొండ... కొండ కలిగిన కోట.. కోట కొండలలో మేటి పెనుకొండగా పేరుగాంచిది పెనుకొండ. విజయనగర రాజులకాలం నాటికట్టడాలు దీనిపై అనేకం ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు 15 శతాబ్దంలో హంపి తరువాత పెనుగొండను రెండో రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. వేసవివిడిదిగా ఇక్కడి వస్తుండేవారు. ఇక్కడ ఒక్క చోటే 365 దేవాలయాలు ఉండటం విశేషం. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా కొన్ని ఆలయాల్లో మాత్రమే ధూప, దీప, నైవేద్యాలు జరుగుతున్నాయి. కొండపై ఉన్న పలుదేవాలయాలు, తటాకాలు, గోపురాలు, బురుజులు, కోనేరులు విజయనగరరాజుల చరిత్రకు అద్దం పడుతున్నాయి.

పరిశ్రమలు

జిల్లాలో 80 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల పాడి పరిశ్రమ, ఇతర వస్తు ఉత్పాదక పరిశ్రమలపై ఆధారపడుతున్నారు. కరవు కాటకాల నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలు దోహదపడుతున్నాయి. పట్టణ కూలీలకు ఉపాధిని చూపుతున్నాయి. అసంఘటిత కార్మికులకు చిన్న పరిశ్రమలు వూరటనిస్తున్నాయి. ప్రధానంగా రెండు భారీపరిశ్రమలున్నాయి. సిమెంటు, మైనింగ్ పరిశ్రమల్లో అటు కూలీలు, రవాణా సంస్థల వారు ఉపాధి పొందుతున్నారు. తాడిపత్రి ప్రాంతంలోని కూలీలకు పెన్న, అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలు ఆసరాగా నిలిచాయి. ఎజేకే స్టీల్, కార్పొరేషన్ స్టీల్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి.

పారిశ్రామిక వాడలు
అనంతపురం, హిందూపురం, గుంతకల్లులలో పారిశ్రామికవాడలు ఏర్పాటు చేశారు. ప్రముఖ నగరం బెంగళూరుకు సమీపంలో హిందూపురం ఉండటంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. హిందూపురంలో సూపర్ స్పిన్నింగ్ మిల్, హిందూపురం వ్యాపార లిమిటెడ్, బొమ్మనహాళ్‌లో శాతవాహన ఇన్స్‌పార్ ఇనుప వస్తువుల తయారీ కంపెనీ, రామగిరిలో ఐఎల్ఎఫ్ కంపెనీ, అనంతపురం సమీపంలోని హంపాపురంలో పీవీసీ పైప్స్ కంపెనీలు చెప్పుకోదగినవి. తాడిపత్రిలో గ్రానెట్ పరిశ్రమలు, ధర్మవరంలో పట్టు, సిల్క్ పరిశ్రమలు, రాయదుర్గంలో గార్మెంట్ పరిశ్రమలు జిల్లాలో ముఖ్యమైనవి.
* భారీ, మధ్యతరహా పరిశ్రమలు 69 ఉన్నాయి. వీటి ద్వారా 20,423 మంది ఉపాధి పొందుతున్నారు.
* చిన్న తరహా పరిశ్రమలు 330 వీటి ద్వారా 2417 మంది ఉపాధి పొందుతున్నారు.
* మైక్రో పరిశ్రమలు 5854 ఉన్నాయి. వీటి ద్వారా 29,374 మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో రూ.10 కోట్లపైగా పెట్టుబడి పెట్టి స్థాపించిన భారీ, మధ్య తరహా పరిశ్రమలు 26 ఉన్నాయి. సిమెంట్, హ్యాండ్‌లూమ్స్, ఇనుపవస్తువుల తయారీ పరిశ్రమలు ఎక్కువ. హిందూ పురం, తాడిపత్రి ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. పరిశ్రమల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో గార్మెంట్, గ్రానైట్ తదితర పరిశ్రమలున్నాయి. జిల్లాలో భారీ మధ్య తరహా పరిశ్రమలు 55 ఉన్నాయి. మరో 35 కొత్త పరిశ్రమలు రానున్నాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 5,983 దాకా ఉన్నాయి.