close

చిత్తూరు జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండేనాస్తికించన వెంకటేశ నమోదేవో నభూతో నభవిష్యతి'' వేలాదిసంవత్సరాలుగా కోట్లాదిమంది భక్తులు విశ్వసిస్తున్న అభయ ప్రదాత కొలిచినవారికి కొంగు బంగారమైన తిరువేంకటనగరి నాథుడు శ్రీనివాసుడు కొలువుదీరిన దివ్యారామం తిరుమల చిత్తూరు జిల్లాలోనే వుంది. కోట్లాదిమంది భక్తుల నీరాజనాలందుకుంటూ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న శ్రీనివాసుని తిరుమల క్షేత్రంతో పాటు లయ కారకుడైన పరమశివుడు వాయులింగేశ్వరునిగా అవతరించిన శ్రీకాళహస్తి శివక్షేత్రం, గణనాధుని మహిమలతో ప్రసిద్ధికెక్కిన కాణిపాక వినాయకక్షేత్రం, దేశంలోనే తొలి దేవాలయంగా భావిస్తున్న గుడిమల్లం పరమరామేశ్వర ఆలయం, శౌర్యానికి గీసిన గిరి చంద్రగిరి కోట ... తదితర చారిత్రాత్మకఘట్టాలతో చిత్తూరుజిల్లా చరిత్ర యావత్తు ఆధ్యాత్మిక సుగంధం. ఈ ప్రాంతాన్నితమిళవాజ్మయాల్లో తొండై మండలంగా కీర్తించారు. భక్తిభావంతో పాటు బ్రిటిషువారిపై క్రీ.శ. 1800లోనే తిరుగుబాటు చేసిన పాలెగాళ్ల పోరాట పటిమకు చిత్తూరు ప్రాంతం వేదికయింది. విజయనగర సామ్రాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి కోటలోనే పెరిగాడని కొందరు చరిత్రకారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం రేణిగుంట విమానాశ్రయమున్న చోట ఆదిమమానవులు సంచరించారని అక్కడ దొరికిన రాతియుగపు పనిముట్లు రుజువుచేస్తున్నాయి. తిరుమల పుణ్యక్షేత్ర ప్రస్తావన అనేక గ్రంథాల్లో కనిపిస్తుంది. బ్రహ్మపురాణం, విష్ణుపురాణం, పద్మపురాణం, భవిష్యత్‌పురాణాల్లో దేవదేవుని కీర్తించారు. పదో శతాబ్దంలో పల్లవరాణి సమవాయి స్వామివారి నిత్యకైంకర్యాల కోసం ఆస్తులను, ఆభరణాలను శ్రీవారికి సమకూర్చారు. అనంతరం పరమభక్తాగ్రేసరులు శ్రీనివాసుని సేవలో తరించారు. నాలాయిర ప్రబంధకర్త నాదముని పెరుమాళ్‌ను కీర్తించాడు. ఆయన మనవడు తిరుమల నంబి నిత్యం ఆకాశగంగనుంచి జలాన్ని తీసుకువచ్చి దేవదేవుడికి అభిషేకం చేసి భగవంతునిలో ఐక్యమయ్యాడు. క్రీ.శ.11వ శతాబ్దంలో రామానుజచార్యులు ఆలయంలో నిత్యపూజల నిమిత్తం నిర్ధిష్టనిబంధనలను ప్రవేశపెట్టారు. ఉదయాస్తమాన సేవలు, అన్నప్రసాదపూజాకైంకర్యాలను ఆరంభించారు. ప్రస్తుతం మహానగరంగా అవతరిస్తున్న తిరుపతి ఆ రోజుల్లో కుగ్రామం. గోవిందరాజపురంగా నివాసితప్రాంతాన్ని ఏర్పాటు చేసింది రామానుజచార్యులవారే. అనంతరం పాండ్యరాజులు ఆలయాభివృద్ధికి కృషిచేశారు. సాళువనరసింహరాయల కాలంలో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు దేవదేవునిపై 32వేల సంకీర్తనలు రచించారు. విజయనగర పాలకుడైన రెండో దేవరాయలు ఆలయంలో వేదపారాయణాన్ని ప్రవేశపెట్టగా సాళువనరసింహరాయలు వూంజల్‌సేవలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రభోజుడిగా తెలుగుచరిత్రలో శాశ్వతంగా నిలిచిన శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీనివాసుని భక్తాగ్రేణ్యుల్లో ఒకరు. క్రీ.శ. 1509నుంచి 1529 వరకు ఆయన పలుమార్లు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వెలకట్టలేని ఆభరణాలను, వజ్రవైఢూర్యాలను స్వామివారికి సమర్పించుకున్నారు. విజయనగర రాజవంశానికి చెందిన అచ్యుతరాయలకాలంలో పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, మాసోత్సవాలు, సహస్రకలశాభిషేకం సేవలను నిర్వహించేవారు. మద్రాసులో బ్రిటిషుఈస్టిండియా కంపెనీకి వ్యాపార నిమిత్తం స్థలం ఇవ్వడం కూడా చంద్రగిరి పాలకుల హయాంలోనే జరగడం విశేషం. ఉత్తర ఆర్కాట్, కడప జిల్లాల్లోని భూభాగాలను కలిపి చిత్తూరు జిల్లాగా 1911 ఏప్రిల్‌లో ఏర్పాటుచేశారు. చిత్తూరు, పలమనేరు, చంద్రగిరి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు సంబంధించినవి కాగా మదనపల్లి, వాయల్పాడు కడప జిల్లాకు సంబంధించినవి. జమీందారీ రూపంలో చేరినవి పుంగనూరు, కాళహస్తి, పుత్తూరు, పాత కార్వేటినగరం ఎస్టేట్. ఆ తరువాత 1928లో ఉత్తర ఆర్కాట్‌లోని కన్‌గుండి తాలూకాలో 22 గ్రామాలను మినహాయించి మిగతా భాగమంతా చిత్తూరు జిల్లాలోని పలమనేరు తాలూకాకు కలిపారు. ఆనాటి మైసూరుకు చెందిన మరో 8 గ్రామాలు కూడా చిత్తూరుకు కలిపారు. 1960లో పటాస్కర్ అవార్డుననుసరించి ఈ జిల్లాలోని తిరుత్తణి తాలూకాలో ఉన్న 282 గ్రామాలను తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాకు కలిపారు. తమిళనాడులోని తిరువళ్లూరు తాలూకాకు చెందిన 76 గ్రామాలు, పొన్నేరు తాలూకాకు చెందిన 19 గ్రామాలు, పుత్తూరు తాలూకాలోని 17 గ్రామాలు కలిపి తిరువళ్లూరు, పొన్నేరి తాలూకాలోని మరికొన్ని గ్రామాలు చేర్చి సత్యవేడు అనే కొత్త తాలూకాను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన కేంద్రం చిత్తూరు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 588 కిలోమీటర్ల దూరంలో ఉంది. మద్రాసుకు 154 కిలోమీటర్ల దూరంలోను బెంగుళూరుకు 183 కిలోమీటర్ల దూరంలోను ఉంది.మద్రాస్-ముంబయి ట్రంక్ రోడ్డు, మద్రాసు-బెంగుళూరు జాతీయ రహదారి ఇక్కడినుంచే వెళతాయి.

వలసపాలనపై పాలెగాళ్ల వీరోచితపోరాటం
చిత్తూరుప్రాంతంలో క్రీ.శ.1800లోనే తెల్లవాడిపాలనపై స్థానిక పాలకులు వీరోచితమైన తిరుగుబాటు చేశారు . ఈ తిరుగుబాటుకే చిత్తూరు పాలెగాళ్ల స్వాతంత్య్రపోరాటమని పేరు. 1757లో ప్లాసీయుద్దం తరువాత భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఈస్టిండియా కంపెనీ పావులు కదిపింది. ఈ క్రమంలోనే భాగంగా ఆర్కాట్ యుద్దాల అనంతరం చిత్తూరు ప్రాంత పాలెగాళ్ల ఏలుబడిలోని ప్రాంతాలపై దృష్టిసారించింది. క్రీ.శ.1843లో కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పరాయిపాలనకు తలొగ్గలేక తిరుగుబాటు చేశి అమరుడయ్యాడు. 1857లో తొలి భారతస్వాతంత్య్రసంగ్రామం జరిగింది. ఈ రెండు సంఘటనల కంటే ముందుగానే చిత్తూరుప్రాంతంలో పాలెగాళ్లు తొలిసమరశంఖం పూరించడం సీమ ప్రజల పోరాటానికి తార్కాణంగా నిలుస్తోంది.

పాలెగాళ్లు:
విజయనగర సామ్రాజ్య పాలనలో అటవీమార్గాల్లో ప్రయాణించే బాటసారులను రక్షించేందుకు పాలకులు కావలిగాళ్లను నియమించారు. వీరి జీవనం కోసం కొన్ని భూములను వారికిచ్చారు. యుద్దసమయాల్లో వీరు రాజుకు సాయంగా తమ సైన్యాన్ని పంపేవారు. కాలక్రమేణా వీరిని పాలెగాళ్లు అని పిలిచేవారు. విజయనగరసామ్రాజ్యం పతనం అనంతరం పాలెగాళ్లు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. తమ ఆధీనంలోని ప్రాంతాలనుంచి భూమిశిస్తు వసూలు చేసేవారు. వీరు అప్పట్లో రాజులకు పేష్కాస్ (కప్పంలాంటిది) చెల్లించి తమ ప్రాంతాలను యధేచ్ఛగా పాలించేవారు. ఆర్కాట్‌యుద్దం అనంతరం వీరిపై బ్రిటిషువారి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. తమకు ఎక్కువ పన్నులు కట్టాలని తరచూ పాలెగాళ్లను ఆదేశించేవారు. పాలెగాళ్లకు ఇదో విచిత్రమైన అనుభవం . కొన్ని శతబ్దాల పాటు వారు తమ ప్రాంతాలను స్వేచ్ఛగా పాలించేవారు. తొలిసారిగా వారి ఆధిపత్యాన్ని సవాలు చేసేవారు ఎదురయ్యారు. రహదారి మార్గాలను పర్యవేక్షించే బాధ్యతలను సైతం ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. పాలెగాళ్లు తమకు సవాలుగా విసుర్తారో అని ముందస్తు జాగ్రత్తగా పాలెగాళ్ల కోటలని కూల్చేయని హుకుం జారీ చేశారు పాలెగాళ్ల పట్ల క్రూరమైన వైఖరి ప్రదర్శించసాగారు. పాలెగాళ్ల ప్రాంతాల్లో రైత్వారీ... తదితర భూమిపన్ను విధానాలను ప్రవేశపెట్టి నేరుగా తామే పన్నులను వసూలుచేయడంతో పాలెగాళ్లకు ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన పాలెగాళ్లు వలసపాలకులకు పన్నులు కట్టడం నిలిపివేశారు. బ్రిటిషువారిని తమ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే అడ్డుకోవడం ప్రారంభించారు. ఈ తిరుగుబాటులో చిత్తూరు ప్రాంతంలోని పదిమంది పాలెగాళ్లలో తొమ్మిదిమంది పాల్గొన్నారు. అప్పట్లో బంగారుపాళ్యానికి చంద్రశేఖరనాయుడు, మొగిరాలకు కుమారరఘనాథనాయుడు, పాకాలకు శేషమనాయుడు, కల్లూరుకు రంగపతిరాజు, పులిచెర్లకు తిమ్మనాయుడు, ఎదురుకొండకు ముద్దురామప్పనాయుడు,గుడిపాటికి తుంబకు మల్లప్పనాయుడు ...తదితరులు పాలకులుగా ఉండేవారు. ఈ క్రమంలో భాగంగా ఆంగ్లేయుల కోటలను పాలెగాళ్లు ముట్టడించసాగారు. ఆంగ్లేయులు సర్గంతి పాలకుడైన పాలెగాన్ని నిర్బంధించారు. అయితే సైన్యం లేకపోవడంతో విడిచిపెట్టారు. చిత్తూరులోకి ఈస్టిండియా ఖజానాలను పాలెగాళ్లసైన్యాలు కొల్లగొట్టాయి. చివరకు ఆంగ్లేయులు పాలెగాళ్ల ముప్పును గ్రహించి పెద్దసంఖ్యలో సైన్యాన్ని చిత్తూరులో దించింది. బ్రిటిషు లెఫ్టినెంట్ కల్నల్ డార్లీ నేతృత్వంలో తెల్లసైన్యం పాలెగాళ్లపై చర్యలకు ఉపక్రమించింది. మొదట్లో పాలెగాళ్లతో శాంతియుత ఒప్పందాలకు డార్లీ యత్నించినప్పటికీ అతని ప్రతిపాదనలకు పాలెగాళ్లు అంగీకరించలేదు. దీంతో మొదట మొగిరాలపై దండయాత్రకు దిగిన బ్రిటిషుసైన్యం ఆ రాజ్యాన్ని వశపరుచుకుంది. చివరివరకు ప్రతిఘటించిన మొగిరాల పాలకుడు బ్రిటిషువారికి లొంగిపోయాడు. అతన్ని చెంగల్పట్టు జైలులో బంధించారు. ఇదే సమయంలో పాలెగాళ్లకు ఇతరులనుంచి ఎటువంటి సాయం అందకుండా ఆంగ్లేయులు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి ఫ్రెంచి సైన్యంనుంచి పాలెగాళ్లకు ఎటువంటి సాయం అందకుండా వారు ప్రయత్నించారు. తరువాత ఆంగ్లసైన్యం కల్లూరు, పులిచెర్ల కోటలను ముట్టడించింది. తొలిసారి పాలెగాళ్లు తీవ్రప్రతిఘటన ఇవ్వడంతో కోటలు బ్రిటిషువారి వశం కాలేదు. చివరకు ఆంగ్లేయులు ఆయుధసంపత్తి ముందు పాలెగాళ్ల రక్షణ నిలవలేకపోవడంతో రెండు కోటలను బ్రిటిషువారు ఆక్రమించారు. దీంతో పాలెగాళ్లు గెరిల్లాపోరాటం ప్రారంభించారు. పాలెగాళ్లను ఎలాగైనా అణచివేయాలని ప్రభుత్వం పెద్దసైన్యాన్ని రంగంలోకి దింపింది. మొదట సర్గంతి పాలకుడు లొంగిపోయినా మిగిలిన పాలకులు యుద్దానికే మొగ్గు చూపారు. బ్రిటిషుసైన్యం అన్నీ వైపులనుంచి పాలెగాళ్లను ముట్టడించసాగింది. మొగిలిఘాట్ వద్ద ఇరువర్గాలకు భీకరయుద్దం జరిగింది. ఓటమిపాలైన బంగారుపాళెగాడు లొంగిపోగా ఎదురుకొండ పాళెగాడు పారిపోయి బ్రిటిషుసైన్యాలపై గెరిల్లా పద్దతిలో దాడి చేసేవాడు. సుదీర్ఘపోరాటంతో నష్టపోయిన కల్లూరు, పులిచెర్ల, తుంబ పాలెగాళ్లు అప్పటి కలెక్టర్ మన్రో ముందు లొంగిపోయారు. యుద్దం చాలాకాలంగా సాగుతుండటంతో పాలెగాళ్లు ఒక్కొక్కరుగా లొంగిపోవడం ప్రారంభించారు. ఒక్క ఎదురుకొండ పాలెగాడు ముద్దురామప్పనాయుడు మాత్రం చివరివరకు పోరాటం జరిపాడు. నాయుడ్ని ఎదుర్కొనేందుకు బ్రిటిషువారు మైసూరుసైన్యాన్ని రప్పించారు. కల్లూరు కొండల్లో జరిగిన పోరాటంలో నాయుడ్ని బంధించారు. అనంతరం విచారణ జరిపి ముద్దు రామప్పనాయుడికి ఉరిశిక్ష విధించారు. యుద్దంలో బందీలైన అనేకమందిని రకరకాల విచారణ జరిపి ఉరితీశారు. చిత్తూరు పాలెగాళ్లు చేసిన పోరాటం స్వేచ్ఛాపోరాటం. వాస్తవానికి పాలెగాళ్లు ఏలుబడిలో కొన్ని గ్రామాలు మాత్రమే వుండేవి. పాలెగాళ్లు ఎక్కువగా వ్యవసాయంపై దృష్టిపెట్టారు. తమను దొంగలుగా చిత్రీకరించి బ్రిటిషువారు విధించిన అధిక పన్నువిధానానికి నిరసనగానే వారు సాయుధపోరాటానికి దిగారు. దీన్ని ఒక రకంగా రైతు ఉద్యమమని చెప్పవచ్చు. పాలెగాళ్లతో పాటు రైతు వర్గాలు ఈ పోరాటంలో పాల్గొన్నాయి. సుశిక్షితులైన ఈస్టిండియా కంపెనీ సైన్యంతో చిన్న పాలకులైన పాలెగాళ్లు దాదాపు ఐదేళ్లపాటు పోరాటం జరపడం వారి పోరాట పటిమను తెలియచేస్తుంది. వీరికి ఆయుధసంపత్తి లేకపోవడం, సంప్రదాయ ఆయుధాలతోనే పోరాడటం, అప్పటికే బలంగా ఉన్న సంస్థానాధీశులు బ్రిటిషువారికి మద్దతు పలకడంతో పాలెగాళ్ల తిరుగుబాటు విఫలమయింది. అయితే స్వాతంత్య్రోదమానికి ప్రేరణగా నిలిచింది.

మదనపల్లెలో జాతీయగీత అనువాదం
బీటీ కళాశాల వేదికగా విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ జనగణమనను ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి చరిత్రలో చెరగని స్థానం దక్కింది. మారుమూల ప్రాంత యువతకు విద్యను అందించాలన్న ధ్యేయంతో ఏర్పాటుచేసిన బీటీ కళాశాల స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఎందరెందరో దేశభక్తులను తయారుచేసింది.

జాతీయ గీతం ఆంగ్లంలోకి అనువాదం
దక్షిణ భారతదేశ పర్యటనకు బెంగళూరుకు వచ్చిన విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ విశ్రాంతికి 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు విచ్చేశారు. మార్చి రెండో తేదీ వరకు మదనపల్లెలోని బీటీ కళాశాలలో బస చేశారు. బెంగాలీ భాషలోని జనగణమణ గీతాన్ని ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. అప్పటి బీటీ కళాశాల ప్రిన్సిపల్ జేమ్స్ హెచ్.కజిన్స్ భార్య మార్గెరేట్ కజిన్స్ సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఠాగూర్ అనువదించిన జనగణమణ గీతానికి మార్గరేట్ కజిన్స్ బాణి సమకూర్చి విద్యార్థులతో కలసి ఈ గీతాన్ని ఆలపించారు. 1950 జనవరి 24వతేదీన జనగణమనను భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయగీతంగా ప్రకటించింది. ప్రస్తుతం జాతీయగీతానికి అధికారికంగా 62 ఏళ్లు పూర్తయ్యాయి. 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవాల్లో జాతీయగీతాన్ని అధికారికంగా మొట్టమొదటిసారి ఆలపించారు.

విద్య

జిల్లాలో 7 వర్సిటీలు
విద్య ప్రగతికి మూలం. వ్యక్తి నడవడిక, ప్రవర్తనలో మార్పు తీసుకురావడంలో ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. ఇలాంటి విద్య అందరికి అందినప్పుడే ఆ సమాజం శోభయమానంగా వర్థిల్లుతుంది. ఏ జిల్లాలో లేనివిధంగా చిత్తూరు జిల్లాలో 7 వర్సిటీలు ఉండటం ఉన్నత విద్యకు ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఇవి విద్య, పరిశోధన రంగంలో ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్ది దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాయి. ఇక్కడ ఉన్నత విద్య చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో రాణిస్తూ జిల్లాకు ఘనమైన కీర్తిని తెచ్చిపెడుతున్నారు గత కొన్ని ఏళ్లుగా. సమాజ అవసరాలను గుర్తించి వాటిని తీర్చడానికి అవసరమైన సూచనలు ఇస్తూ సేవలోనూ తమ భాగస్వామ్యాన్ని నిర్వహిస్తున్నాయి.

ఎస్వీయూ...
రాయలసీమ ప్రాంత వాసులకు ఉన్నత విద్య కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో 1954లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి టంగూటూరి ప్రకాశంపంతులు, నీలం సంజీవరెడ్డి వర్సిటీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన 1000 ఎకరాల భూమిని తితిదే కేటాయించింది. మొదట్లో 6 విభాగాలతో ఏర్పడిన వర్సిటీ నేడు 58 విభాగాలను కలిగి 7 కోర్సులను నిర్వహిస్తోంది. 400 మంది అధ్యాపకులు, 1500 మంది బోధనేతర సిబ్బంది, 5 వేల మంది విద్యార్థులతో అలరారుతోంది. 2003లో స్వర్ణోత్సవాలను చేసుకుంది. 2011లో జాతీయ యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించి దేశ వర్సిటీల దృష్టిని ఎస్వీయూ వైపు మరల్చింది.అంత ముందు నాక్ నుంచి 'ఏ' గ్రేడ్ గుర్తింపును అందుకుంది. ఇక్కడ చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్ వంటి కీలక పోస్టులతో పాటు గొప్ప రాజకీయవేత్తలు అయ్యారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడి విద్యార్థే. ఇలా కాలక్రమంలో అనేక మైలురాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఈ వర్సిటీకి మొదటి ఉపకులపతి ఆచార్య ఎస్.గోవిందరాజులు. ప్రస్తుత ఉపకులపతి ఎన్.ప్రభాకర్‌రావు. 1990లో సౌత్ ఈస్ట్ ఆసియాన్ అండ్ ఫసిఫిక్ స్టడీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

పద్మావతీ మహిళా వర్సిటీ
మగవారితో సమానంగా మహిళలకు ఉన్నత విద్య కల్పించాలనే సదుద్దేశంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు 1983 ఏప్రిల్ 14వ తేదీన శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాన్ని 138 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది దేశంలో రెండో మహిళా వర్సిటీ. ఇప్పటికి దక్షిణ దేశంలో ఇదొక్కటే మహిళా వర్సిటీ. ప్రారంభంలో 300 మంది విద్యార్థులు, 20 మంది అధ్యాపకులు ఉండేవారు. ప్రస్తుతం 250 సిబ్బంది, 2700 మంది విద్యార్థులతో వికసిస్తోంది. 59 పీజీ, యూజీ కోర్సులను అందిస్తోంది. ఉన్నత విద్య ద్వారా మహిళా సాధికారత సాధనకు విశేష కృషి అందిస్తోంది.

స్విమ్స్...
సీమ ప్రజలకు వైద్య విద్యతో పాటు ఆధునాతన వైద్యాన్ని అందించే మహోన్నత లక్ష్యంతో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)ను 1986లో ఏర్పాటు చేశారు. దీనికి ఏప్రిల్ 18, 1986లో నందమూరి తారక రామారావు ప్రారంభోత్సవ శిలఫలకాన్ని వేశారు. ఎయిమ్స్ నిబంధనల మేరకు పనిచేస్తూ ఎందరికో ప్రాణం పోస్తోంది. అనేక మంది యువ డాక్టర్లను అందిస్తూ సమాజ సేవ పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం తితిదే పర్యవేక్షణలో నడుస్తోంది.

ద్రవిడ వర్సిటీ
దక్షిణ దేశ భాషలకు జీవం పోసి వేల సంవత్సరాల సంస్కృతిని కాపాడాలనే లక్ష్యంతో ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 1997లో ఏర్పాటు చేశారు. 1093 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వర్సిటీ 2004 వరకు 5 విభాగాలతో మాత్రమే నడిచింది. ప్రస్తుతం 17 విభాగాలు, 6 కేంద్రాలతో ఉన్నత విద్య కేంద్రంగా భాసిల్లుతోంది. 24 కోర్సులను అందిస్తూ ద్రవిడ భాషల అభివృద్ధికి విశేష కృషిని అందిస్తోంది. ఈ వర్సిటీ అభివృద్ధిలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు భాగస్వామ్యం కలిగి ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. తద్వారా విశిష్ట ద్రావిడ భాషల, సంస్కృతి సంరక్షణలో తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నాయి.

రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం
దేశ మూల భాషయైన సంస్కృత భాషను పరిరక్షించే ఉద్దేశ్యంతో 1961లో కేంద్రీయ సంస్కృత సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేశారు. తర్వాత ఇది కేంద్రీయ సంస్కృత విద్యాపీఠంగా మార్పు చెందింది. దీనికి 1962 జనవరి 4వ తేదీన ప్రారంభ ఫలకాన్ని ఉపరాష్ట్రపతి డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ వేశారు. అప్పట్లో భవనాల నిర్మాణం కోసం రూ.10 లక్షలను తితిదే ఈవో అన్నారావు అందజేశారు. మొదట్లో వర్సిటీ అభివృద్ధికి మాజీ ప్రధాన న్యాయమూర్తి పతంజలిశాస్త్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఎంతో కృషి చేశారు. 1962-70 వరకు మొదటి డైరెక్టర్‌గా బీఆర్ శర్మ పనిచేశారు. తర్వాత రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌గా రూపుదిద్దుకుంది. 1987లో డీమ్డ్ వర్సిటీ హోదానుసంతరించుకుంది. ఇందుకు అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పీవీ నరసింహారావు ఎంతో కృషి చేశారు. 1989లో డీమ్డ్ వర్సిటీగా రాష్ట్రపతి వెంకటరామన్‌చే ప్రారంభించబడింది. 1991-92 నుంచి అకడమిక్ పరంగా వర్సిటీ విధులు నిర్వహించడం ప్రారంభించింది. ఇలా కాలక్రమంలో అనేక మార్పులకు నోచుకుని సుందర వర్సిటీగా గుర్తింపు పొందింది.

వేదిక్ వర్సిటీ
భారతీయ సంప్రదాయానికి మూలమైన వేద విద్యను అందించాలనే ఉన్నత ఆశయంతో తితిదే శ్రీ వేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయాన్ని 2006లో ఏర్పాటు చేసింది. గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపనకు ఎంతో కృషి చేశారు. 147.65 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వర్సిటీని జులై 22, 2006లో గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ప్రారంభించారు.

పశువైద్య వర్సిటీ...
మనిషి ఎంత ముఖ్యమో... జంతువులు అంతే అనే ఉద్దేశ్యంతో ప్రత్యేక వర్సిటీని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 30, 2005లో ప్రత్యేక చట్టం తెచ్చింది. దీని ఆధారంగా తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం జులై 15, 2005లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిచే ప్రారంభానికి నోచుకుంది. మొదటి వీసీగా ఐఏఎస్ మనోహ్మన్ పనిచేశారు. ఈ వర్సిటీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కళాశాలలు పనిచేస్తున్నాయి. పశువైద్యంలో విప్లవాత్మక మార్పులకు వర్సిటీ శ్రీకారం చుడుతోంది. ఉన్నత విద్యను అందిస్తోంది.

నదులు - ప్రాజెక్టులు

స్వర్ణముఖి...
ఎన్నో జీవనదులకు పుట్టినిల్లయిన భారతావనిలో పలు నదులు పురాణప్రాశస్త్యాన్ని పొందాయి. ఆ కోవకు చెందినదే శ్రీకాళస్తీశ్వరాలయాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న పవిత్ర స్వర్ణముఖి. చంద్రగిరికి ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఎత్త్తెన కొండలు స్వర్ణముఖి పుట్టినిల్లు. అక్కడ నుంచి చిన్నపాటి ఏరుగా ప్రవహిస్తూ చంద్రగిరి మీదుగా తొండవాడలోని అగస్తీశ్వర ఆలయాన్ని తాకుతూ తిరుచానూరు, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాలను తాకుతూ శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆనుకొని ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది.

పాలారు
పాలారు నది కర్ణాటక పరిధి చిక్కబళ్లాపూర్ సమీప నందికొండల్లో పుట్టి ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల మీదుగా కుప్పం నియోజకవర్గంలో విస్తరించింది. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో42 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. తమిళనాడులోని నాలుగు జిల్లాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది. ప్రతిఏటా వర్షాకాలంలో కర్ణాటక పరిధి చెరువులు, చెక్‌డ్యాంలు నిండి మొరవ నీరు పాలారులో కలుస్తుంది. నదీ జలాలను స్థానికంగా రైతు ప్రయోజనాలకు వినియోగించాలన్న లక్ష్యంతో దాదాపు 25 చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించారు.

పీలేరు నది
పీలేరు నది సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు సమీపంలోని అవులకొండల్లో పుట్టి అక్కడ నుంచి సుమారు వంద కిలో మీటర్లు ప్రవహించి జిల్లా సరిహద్దులో నిర్మించిన పింఛా ప్రాజెక్ట్‌లో కలుస్తోంది. సోమల మండలంలో నుంచి సదుం, పీలేరు మీదుగా కంభంవారిపల్లె మండల సరిహద్దులో ఉన్న పింఛా ప్రాజెక్టులో నీరు చేరుతోంది. సోమల మండలంలో పిల్ల కాలువలా ప్రారంభమై నది క్రమేణా ఉద్ధృతంగా మారుతోంది. నది సుమారు వంద కిలోమీటర్ల పొడవు ఉంది.

కాళంగి నది
కాళంగి నది పిచ్చాటూరు మండలం అరణియార్ రిజర్వాయర్‌కు పశ్చిమంగా ఉన్న నగరి కొండల్లో చిన్నకాలువగా ప్రవహించి పిచ్చాటూరు, కేవీబీపురం, తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల మీదుగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సముద్రంలో కలుస్తుంది. సుమారు 65 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. నది నీటిని రైతుల కోసం వినియోగించుకునేలా 1954 ఆగస్టు అప్పటి మంత్రి పిడతల రంగారెడ్డి కాళంగి రిజర్వాయర్‌ను ప్రారంభించారు.

అరుణానది
అరుణానది పుత్తూరు మండలం గూళూరుచెరువు, మూలకోనల వద్ద ఏర్పడి సత్యవేడు, నగిరి, పుత్తూరు నియోజకవర్గాల సరిహద్దుల్లో ప్రవహిస్తూ బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. నదిపై పిచ్చాటూరులో నిర్మించిన అరణియార్ డ్యాం ద్వారా 1800 ఎంసీఎఫ్‌టీల నీటిని, అరుణానది సమీపంలోని చెరువుల ద్వారా 2816.01 ఎంసీఎఫ్‌టీల నీటిని సాగుకు వినియోగిస్తున్నారు.

తెలుగుగంగ
తమిళనాడుకు తాగునీటి ఎద్దడి తీర్చేందుకు వీలుగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రారంభం 1983-84. ప్రతిపాదిత బడ్జెట్ రూ.635 కోట్లు. 2010 బడ్జెట్ కేటాయింపుల వరకు రూ.2,400 కోట్లు వ్యయం చేశారు. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం '0' కిలోమీటరు నుంచి తమిళనాడులోని పూండి కాల్వ '152' కిలోమీటరు వరకు తెలుగుంగ కాల్వ ద్వారా నీటి ప్రవాహం జరుగుతోంది. 66 కిలోమీటరు వద్ద జిల్లా సరిహద్దు గ్రామమైన రాంబట్లపల్లి వద్ద చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తోంది.

సోమశిల-స్వర్ణముఖి
నెల్లూరు జిల్లా సోమశిల నుంచి శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి నది వరకు కాల్వ ద్వారా నీటిని తీసుకువచ్చే దిశగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2007లో కాల్వ పనులు ప్రారంభించారు. 2013 నాటికి దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. ప్రతిపాదిత బడ్జెట్ రూ.345 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.100 కోట్లు మాత్రం కేటాయించారు.నిధులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

సదాశివకోన ప్రాజెక్టు
ఏర్పేడు మండల పరిధిలోని రైతులకు సాగు జలాలు అందించాలన్న సంకల్పంతో 1979లో రెండు కొండల మధ్య దీన్నినిర్మించారు. 150 ఎంసీఎఫ్‌టీల సామర్ధ్యం. ఈ నిల్వ నీటితో 2,600 ఎకరాలకు అధికారికంగా, 260 ఎకరాలకు అనధికారికంగా సాగుజలాలు అందిస్తున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లతో ఇటీవల టెండర్లు పలిచారు. నిధులు విడుదలలో జాప్యం కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

మల్లిమడుగు ప్రాజెక్టు
రేణిగుంట పరిధిలోని రైతులకు సాగు జలాలుఅందించేందుకు ప్రభుత్వం 50 సంవత్సరాల క్రితం మల్లిమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నీటి నిల్వ సామర్థ్యం 176 ఎంసీఎఫ్‌టీలు. ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలోని 3,950 ఎకరాలకు అధికారికంగా, మరో పదివేల ఎకరాలకు అనధికారికంగా సాగుజలాలు అందుతున్నాయి.గాలేరు-నగరి సుజల స్రవంతికి దీన్ని అనుసంధానం చేసి తద్వారా సామర్ధ్యాన్ని మరో 2.5 ఎంసీఎఫ్‌టీలకు పెంచాలన్న ప్రణాళిక ఉంది.

గాలేరు-నగరి సుజల స్రవంతి
ఈ పథకానికి 1988లో రేణిగుంట మండలం కరకంబాడి వద్ద శంకుస్థాపన చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి ప్రధాన కాలువల ద్వారా జిల్లాకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. చిత్తూరు జిల్లాలో 84 కి.మీ మేర ప్రధాన, శాఖీయ కాలువలతో పాటు మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, శ్రీనివాససాగర్, పద్మసాగర్, వేణుగోపాల్‌సాగర్, వేపగుంట రిజర్వాయర్, అడవికొత్తూరు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేయాలన్నది లక్ష్యం. ప్రాజెక్టు కింద జిల్లాలో 1.35 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో 1.20 లక్షల జనాభాకు తాగునీటిని అందించనున్నారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు
రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో రూ.6.06 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు చేపట్టారు. జూన్ 6, 2006న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కర్నూలు జిల్లా మాల్యాల నుంచి నీటిని చిత్తూరు జిల్లాలోని నీవా నది కాలువ తవ్వి 40 టీఎంసీల కృష్ణా నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా తరలించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం రూ.2469 కోట్ల అంచనాతో రెండోదశ పనులు జరుగుతున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే రూ.750 కోట్ల పనులు జరుగుతున్నాయి.

నీటిపారుదల

స్వర్ణముఖి, కాళంగి, అరణియార్, కుశస్థలి, పాపాఘ్ని, చెయ్యేరు, బాహుదా... తదితర నదుల ద్వారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నీటివసతి అందుతోంది.ఎక్కువగా వర్షంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.బావులు, బోర్ల ద్వారా కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ రంగం మిగిలిన జిల్లాలకు భిన్నంగా ఉంటుంది. బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న తూర్పుప్రాంతం అంటే శ్రీకాళహస్తి,ఏర్పేడు,సత్యవేడు, బుచ్చినాయుడుకండ్రిక, తొట్టంబేడు, నాగలాపురం, వరదయ్యపాళె తదితర ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండగా... జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం. ముఖ్యంగా పడమటి ప్రాంతం మదనపల్లె డివిజన్‌లోని 36 మండలాల పరిధిలో అత్యల్ప వర్షపాతం నమోదవుతున్న కారణంగా ఈ ప్రాంతంలో నదులు, వంకలు ఒట్టిపోయాయి. స్వర్ణముఖి, కాళంగి, అరుణ, నీవా, పింఛా తదితర నదులు ఉన్నా వర్షాకాలంతో తప్ప నీటి నిల్వలు కన్పించని పరిస్థితి. జీవనదులు లేకపోవడంతో నదుల కింద ఆయకట్టు నామమాత్రంగా ఉంది. ఆయకట్టులో సింహభాగం వర్షాధారంగా సాగవుతోంది. మిగిలినది బోర్లు... చెరువుల కింద సాగవుతుంది. జిల్లాలోపడమటి ప్రాంతాల్లో వేరుశనగ, టమోటా, ఇతర వాణిజ్య, మెట్టపంటలు సాగువుతుండగా... తూర్పు ప్రాంతంలో వరి సాగవుతుంది.

ఇజ్రాయిల్ సాంకేతిక వ్యవసాయం
జిల్లాలోని కుప్పం నియోజకవర్గ రైతులు ఇజ్రాయిల్ తరహా ఆధునిక వ్యవసాయ విధానం స్ఫూర్తిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గతంలో సాగునీటి సమస్యను ఎదుర్కొన్న రైతన్నలు ప్రస్తుతం ఆధునిక వ్యవసాయ విధానం ద్వారా తక్కువ నీటి వినియోగంతో అధిక విస్తీర్ణంలో నాణ్యత కలిగిన అధిక దిగుబడులు సాధిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పభుత్వం రాయితీతో అందిస్తున్న ఏపీఎంఐపీ ప్రాజెక్టు బిందుసేద్యం పథకాన్ని వినియోగించుకుంటూ కూరగాయలు, పండ్లు, పూలతోటల సాగును విస్తారంగా చేపడుతున్నారు.

ప్రధాన పంటలు

జిల్లాలో ఎక్కువమంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం . జీవనదులు లేవు వర్షాకాలంలో ప్రవహించే నదులు, బోర్లు , బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.జిల్లాలోని పడమరప్రాంతాల్లో మెట్ట వ్యవసాయం ఎక్కువగా ఉంది. తూర్పుప్రాంతంలో వరిని ఎక్కువగా సాగుచేస్తున్నారు.మెట్రో నగరాలైన చెన్నై, బెంగుళూరుల మధ్యలో ఉండటం వలన ఎక్కువగా కూరగాయలను పండించి ఈ నగరాలకు ఎగుమతి చేస్తుంటారు.పాల డయిరీలు సహకారరంగంలోనూ ప్రైవేటు రంగంలోను మంచి పనితీరు కనబరుస్తున్నాయి. వరి, జొన్న, రాగులు,సజ్జలు, వేరుశెనగ, చెరకు పంటలను ప్రధానంగా సాగుచేస్తారు. ఉద్యానవనపంటలైన మామిడి, సపోటా, అరటి, కూరగాయల సాగు ఎక్కువగావుంది. మదనపల్లి, వాల్మీకీపురం మార్కెటుయార్డులు టమెటాలకు ప్రసిద్దిచెందాయి. పీలేరులో వేరుశెనగ నూనె కేంద్రం ఉంది. కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి.

వ్యవసాయం
చిత్తూరు జిల్లాలో 4.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయి. ఇందులో సరాసరి 3.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 2.50 లక్షల హెక్టార్లు, రబీలో లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి. జిల్లాలో ఆరు లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. 60 శాతం కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. జిల్లాలో ప్రధానంగా వేరుసెనగ 1.60 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో, వరి 60 వేల హెక్టార్లు, మామిడి 50 వేల హెక్టార్లు, చెరకు 25 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మరో 10 వేల హెక్టార్లలో చిరు ధాన్యాలైన జొన్న, సజ్జ లాంటి చిరుధాన్యాలు పండిస్తున్నారు.

మామిడి సాగు
ఉద్యానపంటల సాగులో జిల్లా ప్రగతి పథంలో నడుస్తోంది. జిల్లాలో మామిడి, టమోటా సాగు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. మామిడి 56 వేల హెక్టార్లు సాగవుతుండగా, ఏటా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. 60కి పైగా మామిడి గుజ్జు పరిశ్రలు ఉన్నాయి. జిల్లాలోని పడమటి మండలాలైన మదనపల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, కలికిరి, పుంగనూరు మండలాల్లో సుమారు 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో మన చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత ఉంది. అందుకే రుచిలో చిత్తూరు మామిళ్లకు ఏవీ సాటి రావనే నానుడి ఉంది.. ఈ పంట ద్వారా రూ. 300 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ప్రస్తుతం 57 మామిడి గుజ్జు పరిశ్రమలు ఇక్కడ నడుస్తున్నాయి.

పట్టుగూళ్ల ఉత్పత్తిల్లో చిత్తూరుజిల్లా మొదట్టిస్థానం
* మార్కెట్‌ల ద్వారా ఏటా రూ. 50 లక్షల ఆదాయం
* మదనపల్లె మార్కెట్ టాఫ్

పట్టుగూళ్ల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మొదటిస్థానం సంపాదించుకుంది. ఇటు ఆదాయంలోను, పట్టుఉత్పత్తిలోను జిల్లాకు ప్రత్యేకస్థానం ఉంది. రోజుకు జిల్లాల్లో 7 న్నుల పట్టుగూళ్లు లభ్యమౌతుంది. జిల్లా పట్టుపరిశ్రమశాఖకు ఏడాదికి రూ. 50 లక్షలనుంచి 60 లక్షలవరకు మార్కెట్ ఫీజుల రూపంలో ఆదాయం లభిస్తుంది.

టమోటా
టమోటా పంట దిగుబడిలో చిత్తూరుజిల్లా ప్రథమస్థానం ఉంది. వ్యవసాయ మార్కెట్ శాఖ పరిధిలోని టమోటా మార్కెట్ యార్డు నుంచి ఏటా రూ. 2 కోట్లవరకు ఆదాయం వస్తుంది. అందులో టమోటాలు ఎగుమతిలో మదనపల్లె మార్కెట్‌యార్డు రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో మదనపల్లె, వాల్మీకిపురం, మొలకలచెరువు, పలమనేరులల్లో టమోటా మార్కెట్‌లు ఉన్నాయి. వీకోటలో సబ్ మార్కెట్ ఉంది. వీటిలో మదనపల్లె టమోటా మార్కెట్‌కు రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. దీంతో ఏటా సగటున రూ. 40 నుంచి 50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఏడాది పోడవున సాగే ఈ పంటసాగు ఏప్రీల్‌నెల నుంచి ఆగస్టు చివరి వరకు టమోటామార్కెట్ సీజన్ ఉంటుంది. సుమారు 950 టన్నుల నుంచి 1500 టన్నుల వరకు మార్కెట్‌లకు రైతులు టమోటాను తీసుకొస్తుంటారు.
* టమోటాల్లో రకాలు
జిల్లాలో ఎక్కువ మంది రైతులు 618 రకం, 5005, 9005, 9018, అభినవ్, అమృత, మధుర, శుభం, 908, శివం, తదితర హైబ్రీడ్ జాతీ రకాల టమోటా పంటలను సాగుచేస్తున్నారు. దీంతో తక్కవ సమయంలో పంటచేతికందుతుందని దిగుబడిపెరుగుతుందని రైతులు చెబుతున్నారు.

పర్యాటకం

తిరుమల
* దేవదేవుని సన్నిధానం
కలియుగ తిరువేంకటనగరి నాధునిగా కలియుగంలో భక్తులకు కొంగుబంగారమైన దివ్యారామం తిరుమలలో నిత్యం కల్యాణంగా గోవిందుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సప్తాచల నిలయంలోని ఏడో కొండైన వెంకటాచలంలో దివ్యారామంవుంది. పురాణాలు, శాస్త్రాలు, స్థలమహత్యాలు, ఆళ్వార్‌ల ప్రబంధాల్లో తిరుమల గురించి సవివరంగా వివరించారు. తిరునగరి దర్శన భాగ్యం గురించి రుగ్వేదంలోను అష్టాదశపురాణాల్లోను ప్రస్తావనవుంది. తిరుమల దేవుడు స్వయంభూ అని అనేక ధార్మికగ్రంథాలు చెబుతున్నాయి. దేవాలయ నిర్మాణాన్ని దశలవారీగా కొనసాగించారు. మొదట పల్లవరాణి సమవాయి నేతృత్వంలో ఆలయ నిర్మాణం జరిగింది.అనంతరం చోళులు, బాణులు, కార్వేటినగర రాజులు, పాండ్యులు, విజయనగరం రాజుల కాలంలో దేవాలయాన్ని అభివృద్ధిచేశారు. రామానుజచార్యుల వారు వైఖానస ఆగమం ప్రకారం పూజలు చేసే పద్ధతికి అంకురార్పణ చేశారు. దేవదేవుడు తిరుమలేశునికి తెలుగువల్లభుడు శ్రీకృష్ణదేవరాయలు అచంచలమైన భక్తిని ప్రదర్శించాడు. తిరుమల ఆలయాన్ని ఆయన ఏడు సార్లు దర్శించినట్టు తెలుస్తోంది. తిరుమలకు వచ్చినప్పుడల్లా అత్యంత విలువైన కానుకలను శ్రీవారికి సమర్పించేవారు. మరాఠీపాలకుడు రఘోజీభాంస్లే ఆలయాన్ని దర్శించి ఆలయకార్యకలాపాల కోసం ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటుచేశారు. క్రీ.శ.1843లో ఆలయనిర్వహణ ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. ఆంగ్లేయ అధికారులు ఆలయనిర్వహణను హథీరాంజీమఠానికి అప్పగించారు. 1933 వరకు ఆలయనిర్వహణ మహంతుల పర్యవేక్షణలోనే కొనసాగింది. 1933లొ అప్పటి మద్రాస్ శాసనసభ ఒక చట్టం ద్వారా ఆలయనిర్వహణను నూతనంగా ఏర్పాటుచేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డుకు అప్పగించింది. 1951లో ప్రభుత్వం దేవస్థానం బోర్డులో ట్రస్టీలను, కార్యనిర్వహణాధికారినినియమించింది.

కల్యాణ వెంకన్న వైభోగం చూతము రారండి
తిరుమల దివ్యక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష వైకుంఠ దైవంగా అవతరించి నిత్యనీరాజనాలందుకుంటున్న శ్రీవారి ప్రతిరూపమే శ్రీనివాస మంగాపురంలో కొలువున్న కల్యాణ వేంకటేశ్వరస్వామి. చరిత్ర ప్రసిద్ది చెందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం సమీపాన ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తిరుమల పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్లే భక్తులు శ్రీనివాస మంగాపురం క్షేత్రం సమీపం నుంచి సుందరమైన సోపాన మార్గాన్ని (శ్రీవారిమెట్టు) ఎంచుకునేవారు. ఈ నాటికీ వాడుకలో ఉన్న శ్రీవారిమెట్టుకు అత్యంత ప్రాముఖ్యత, ప్రాచుర్యం ఉంది. దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామి నారాయణవణంలో ఆకాశరాజు కుమార్తె శ్రీపద్మావతిదేవిని పరిణయమాడిన తర్వాత తిరుమల క్షేత్రానికి పయనిస్తూ అగస్త్యమహాముని ఆశ్వీరాదానికి వెళ్లారు. నిండుమనస్సుతో దీవించిన మహాముని ఆదేశానుసారం నవదంపతులైన వేంకటేశ్వరుడు, పద్మావతిదేవిలు ఆరుమాసాలపాటు పర్వతశ్రేణుల కిందటే నివాసమున్నారు. పెళ్త్లెన కొత్తలో సతీమణి అలిమేలుమంగ సమేతంగా శ్రీనివాసుడు ఇక్కడ కాపురం చేయడంవలన కల్యాణవేంకటేశ్వరాలయంగా పిలుస్తారని స్థలపురాణం.

నాటి సిద్ధకూటమే నేటి శ్రీనివాసమంగాపురం
దేవదేవుడు నివశించిన ఈ క్షేత్రాన్ని సిద్దకూటమిగా వ్యవహరించేవారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజా కైంకర్యాలు నివేదించి పారాయణం చేసే వేద పారాయణదారులకు15వ శతాబ్ధంలో(1433 రెండో దేవరాయల కాలంలో) ఇక్కడి ప్రాంతం శోత్రియంగా ఉండేది. శ్రీనివాసుడు, అలిమేలుమంగల పేర్లతో శ్రీనివాసపురమనీ, మంగాపురమని వేర్వేరుగా పిలిచేవారు. కాలక్రమేణ శ్రీనివాసమంగాపురంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1540లో తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమై అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. వెంకన్న వైభవాన్ని సంకీర్తనలతో పరిమళింపజేసిన అన్నమాచార్యుల మనుమడు చినతిరుమలయ్య శిథిలమైన ఆలయాన్ని పునరుద్ధరింపజేశారు. పకృతి వైపరీత్యాలకు, యవనుల దండయాత్రలకులోనై శిథిలస్థితికి చేరుకున్న గుడి, గోపురాలను పునఃనిర్మించారు. శ్రీనివాసమంగాపురంలో శ్రీవేంకటేశ్వరస్వామికి నిత్యపూజా కైంకర్యాలు నైవేద్య నివేదనతో ఉత్సవ నిర్వహణ, ఊరేగింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు 22-03-1540నాటి శాసనంపేర్కొంటోంది.

తిరుచానూరు
తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖీనది ఉత్తర తీరాన తిరుచానూరు ఉంది. శుక మహర్షిఈ నది ఒడ్డున ఒకప్పుడు తపస్సు చేశారని స్థల పురాణం. ఈ వూళ్లోనే అలమేలు మంగ లేక పద్మావతి దేవాలయం ఉంది. తిరుపతికి వచ్చే వారంతా ఇక్కడికి కూడా వస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరులో పద్మావతీ అమ్మవారు కొలువుదీరి నిత్యం భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అంతటి ప్రాధాన్యతను ఈ ఆలయం సంతరించుకుంది. నిత్యం పద్మావతీదేవిని దాదాపు 30 వేల మందికి పైగా యాత్రికులు దర్శించుకుంటారు. తితిదే ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో ప్రారంభమయ్యే పూజలు రాత్రి జరిగే ఏకాంత సేవతో ముగుస్తాయి. అమ్మవారి ఆలయంలో పద్మావతీదేవితో పాటు బలరామకృష్ణస్వామి ఆలయం, శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. అమ్మవారి పుష్కరిణికి అభిముఖంగా శ్రీ సూర్యనారాయణుడు ఆలయం కొలువుదీరి ఉన్నారు.

శ్రీకాళహస్తి క్షేత్రం
* ఏకైక పంచభూత లింగక్షేత్రం..!
పంచభూత లింగాల్లో పృథ్వి, జలం, తేజస్సు, ఆకాశానికి సంబంధించి నాలుగు ఆలయాలు తమిళనాడులో వెలిశాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక పంచభూత లింగ క్షేత్రంగా శ్రీకాళహస్తి అద్వితీయ చరిత్ర సంతరించుకుంది. ఇక్కడి వాయులింగేశ్వరునిగా కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు భక్తుల పాలిట బోళాశంకరునిగా పూజలందుకుంటున్నాడు. కాశీలో మరణం.. శ్రీశైల సందర్శనతో పుణ్యం లభిస్తుంది. శ్రీకాళహస్తిలో కాలుమోపితే ముక్తితథ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీ (సాలీడ), కాళము (పాము), హస్తి (ఏనుగు) ఇక్కడి సర్వేశ్వరుని పూజించి ముక్తిపొందడంతో ఈ క్షేత్రం శ్రీకాళహస్తిగా ఖ్యాతి గడించింది. భక్తకన్నప్ప తన రెండు కళ్లను శివునికి అర్పించింది ఈ క్షేత్రంలోనే. ఇక్కడ కొలువైన జ్ఞానాంబిక విజ్ఞానస్వరూపిణి. జ్ఞానామృతాన్ని పంచుతూ భక్తుల పాలిట కొంగుబంగారమైపూజలందుకుంటోంది. పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా శ్రీకాళహస్తి పురాణ ప్రశస్తి పొందింది. ఇక్కడున్న క్షేత్రం పల్లవులు, చోళులు, శాతవాహనులు, విజయనగర రాజుల కాలంలో ఎంతో పురోభివృద్ధి చెందింది. ఇక్కడి శిల్పకళా సౌందర్యం అత్యంత రమణీయం. స్వయంభు లింగంపై శ్రీ(సాలెపురుగు), కాళ(పాము), హస్తి(ఏనుగు) చిహ్నాలు ఉండటంతో ఇక్కడి స్వామివారు శ్రీకాళహస్తీశ్వరునిగా ఖ్యాతి గడించారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేతుడైన శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం విదేశీయులు తరలి వస్తుండటం వల్ల ఈక్షేత్రం మరింత ప్రాశస్త్యం సంతరించుకుంది. ఇక్కడ జరిగే రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందుతోంది.

సత్యప్రమాణాల దేవుడు కాణిపాకం వినాయకుడు
పూర్యం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయుణులైన ముగ్గురు వికలాంగ సోదరులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పూర్యజన్మ కర్మఫలంగా వారు గుడ్డి, మూగ, చెవిటి వారిగా జన్మించారు. వారి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న భూమిని సాగు చేసుకొంటూ జీవనం సాగించేవారు. ఈనేపథ్యంలో ఆగ్రామం కరవుకాటకాలతో అల్లాడి పోయింది. గ్రామస్థులకు కనీసం తాగడానికి నీరు సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరవును జయించడానికి ముగ్గురు సోదరులు తమ పొలంలోని బావిని లోతు చేయడానికి పూనుకొన్నారు. వీరు బావిని తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డు వచ్చింది. దీనిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో చేతిలోని పలుగు(గడ్డపార), పారల సహాయంతో రాయిని తొలగిస్తుండగా చేతిలోని పార రాయికి తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మింది. ఈ రక్తం అంగవైకల్య సోదరులను తాకింది. దీంతో వీరికి ఉన్న అంగవైకల్యం తొలగిపోయాయి. గ్రామాన్ని పాలిస్తున్న రాజుకు, ఆ ముగ్గురు వికలాంగ సోదరులు వివరించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న గ్రామస్థులు బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. ఆ బావిలో 'గణనాథుని' రూపం కనిపించింది. గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి కొబ్బరి కాయలను సమర్పించారు. కొబ్బరి కాయల సమర్పణతో 'కాణి' భూమి(కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) పారింది. దీంతో విహారపురి గ్రామానికి 'కాణిపారకరమ్' అన్న పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాస్తా 'కాణిపాకం'గామారింది.

పేదల వూటీ తలకోన
ఎత్తయిన కొండలు.. ఆకాశాన్నంటే వృక్షాలు.. పక్షుల కిలకిలారావాలు.... శ్రవణానంద సరాగాలు వంటి ప్రకృతి శోభతో తలకోన అలరారుతోంది. అక్కడి వాతావరణం హృదయాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. తలకోన పర్యటన ఒక తియ్యటి అనుభూతి కలిగిస్తుంది. భక్తిప్రపత్తులతో అక్కడకు వచ్చేవారు కొందరైతే, మానసికోల్లాసం కోసం వచ్చేవారు మరికొందరు. ప్రకృతి కమనీయ దృశ్యాలను తలకోన తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. పరమ మహిమాన్వితుడైన శ్రీ సిద్దేశ్వరుడు ఇక్కడ కొలువయ్యాడు. తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో పాలకొండల పాదాల చెంత దేవుడిచ్చినప్రకృతి సంపదతో అలరారుతోంది.

కమనీయ దృశ్యం
ప్రకృతి సుందర దృశ్యాలతో కన్నులకు ఇంపుగా గిరిశిఖరాల నుంచి జాలువారే జలపాతాలతో ఉల్లాసాన్ని కలిగించే ఎతైన కొండల మధ్య వెలసియున్న శ్రీ కైలాసనాథకోన ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజల్లుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన శ్రీ కైలాసకోన పుత్తూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి- ఊత్తుకోట రహదారి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కాకముక కొండల నడుమ 120 అడుగుల ఎత్తు నుంచి జారువారే ఈ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం కొండపై ఉన్న ఏడు బావుల గుండా ప్రవహిస్తూ ఏడాది పొడవునా దుముకుతుండటం ప్రత్యేకత. ఈ జలపాతంలో స్నానం ఆచరించి జలాన్ని తాగితే ఉదరకోశ, చర్మవ్యాధులు నయమవుతాయని నమ్మకం ఉంది.

లక్ష్మీమహల్
కార్వేటినగరం సంస్థానాధీశులు నిర్మించిన లక్ష్మీమహల్ చంద్రగిరి కోటను పోలీ ఉంటుంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరింది. క్రీ.శ. 1857-1885 లో వెంకటపెరుమాళ్ దేవమహారాజులు దీన్ని నిర్మించారు. చంద్రగిరి కోటను పోలి ఉన్న ఈ భవనం అలనాటి వాస్తు శిల్పకళలకు దర్పణం పడుతుంది. భవన నిర్మాణ పైకప్పునకు బర్మాటేకు దుంగలు వాడారు. కోట్ల విలువ చేసే చందనం, బర్మాటేకులు ఇప్పటికీ ఉన్నాయి.

హార్సిలీహిల్స్ అందాలు హాయ్.. హాయ్!
రాష్ట్రంలో అత్యంత ఎత్త్తెన పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్నఈ ప్రదేశం బి.కొత్తకోట మండలంలో ఉంది. పురాతన కాలం నుంచి ఏనుగు మల్లమ్మకొండగా పిలువబడే ఈ కొండకు 1848లో మొదటిసారిగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో కడప కలెక్టర్‌గా పనిచేసిన సర్ హార్సిలీ గుర్రంపై చేరుకున్నారు. ఇక్కడి చల్లటి వాతావరణానికి ముగ్ధుడైన ఆయన వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈకొండ హార్సిలీహిల్స్‌గా పేరెన్నికగన్నది.

శేషాచలంలో జలపాతాల అందాలు
శేషాచలం అడవులు అరుదైన జంతు, వృక్షజాతులకు నిలయమే కాదు, అందమైన ప్రకృతి సౌందర్యానికి, పరవశింపజేసే జలపాతాలకు నిలయం. కనుతిప్పుకోలేని అందాలతో అలరారుతూ భక్తిభావం పెంపొందిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఎత్త్తెన పర్వతాల నుంచి దూకే జలపాతాలు ఇందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇందులో గుంజన, తుంబుర, రామకృష్ణ, కలివిలేటికోన, స్వామికోన, మూడేళ్లకురవ, విష్ణుగుండం, తలకోన, ఎర్రారెడ్డి గుండం, గోల్లదేవుని గుండం, సీతమ్మసెల వంటి జలపాతాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే దేవతలు, గంధర్వులు ఈ జలపాతాల్లోనే ముందుగా స్నానమాచరించి వచ్చేవారని, ముక్తికోసం, దైవ సాక్షాత్కారం కోసం మునులు, రుషులు తపస్సు చేసే పవిత్ర జలపాతాలుగా పురాణ ప్రాశస్థ్యాన్ని కలిగివున్నాయి.

మనసుకు ఉల్లాసం...మామండూరు
* ప్రకృతి ప్రియుల కేంద్రం
నిత్యం నగర జీవనంలో యంత్రాల మాదిరి పరిగెత్తి... మనశ్శాంతి లేని జీవనం సాగిస్తు వారంతపు చివర్లో కుటుంబంతో సహా ఎక్కడైన వెళ్లాలని అనుకునే వారికి మామండూరు ఒక వరం. రేణిగుంట-కోడూరు మార్గంలో జిల్లా సరిహద్దు ప్రాంతం ఈ గ్రామం. ప్రకృతి ప్రియులైన ఆంగ్లేయులు 1920లో ఇక్కడ ఈ ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటి బ్రిటిష్ ఉద్యోగి కెనత్ ఆండర్సన్ రైల్వే స్టేషన్‌కు సమారు 0.5 కిలోమీటర్ దూరంలో ఒక అందమైన గుట్టను చూశారు. దీనిపై ఆయన ఈ అందమైనభవంతిని నిర్మించారు. అప్పట్నించి అది అంగ్లేయులు అందమైన విహార కేంద్రంగా పేరుగాంచింది.

పరిశ్రమలు

ప్రముఖ చాక్లెట్ కంపెనీ న్యూట్రిన్ ఇక్కడే ఉంది. ఇక మామిడి, వేరుశనగ, చెరకు... చిత్తూరు పేరు చెప్పగానే గుర్తొచ్చే పంటలు. మ్యాంగో పల్ప్ తయారీ పరిశ్రమ, ఆయిల్, రైస్ మిల్లులకూ కొదవ లేదు. గ్రానైట్ పరిశ్రమ సైతం జిల్లాలో వేళ్లూనుకుంది.
* ఎస్.వి. కోఆపరేటివ్ సుగర్స్, అశ్విని బయోఫార్మసీ, రాక్ అప్ కో., పయొనీర్ ఎలాయ్ కాస్టింగ్, సెమి గవర్నమెంట్ మింట్ ఫ్యాక్టరీ... ఇవన్నీ రేణిగుంటలోని గాజులమాండ్యం ప్రాంతంలో ఉన్నాయి.
* న్యూట్రిన్ కన్‌ఫెక్షనరీస్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు కో ఆపరేటివ్ సుగర్స్, విజయ మిల్క్ డైరీ, గోపిక మిల్క్ డైరీ, శ్రీనివాసా డిస్టిలరీస్...ఇవి చిత్తూరులో ఉన్నాయి. అమారాన్ బ్యాటరీస్ తిరుపతిలో ఉండగా, హెరిటేజ్ ఫుడ్స్ కాసిపెంట్లలోనూ, వాణీ సుగర్స్ పుంగనూరులోనూ ఉన్నాయి. విష్ణు కెమికల్స్, ల్యాంకో కాస్టింగ్, శ్రీ బాలాజీ బాట్లింగ్, కెసిపి మయూర సుగర్స్ లాంటివి శ్రీకాళహస్తిలో ఉన్నాయి.
* జిల్లాలో 1978లో పరిశ్రమలశాఖ పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా కావడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి. చెన్నైలో నౌకాశ్రయంఅందుబాటులో ఉండటంతో ఇక్కడి నుంచి వస్తువుల ఎగుమతులకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఇటీవల సత్యవేడు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) కూడా ఏర్పాటు చేశారు. బంగారుపాళ్యం ప్రాంతంలో అమర్‌రాజా సంస్థల ఆధ్వర్యంలో డిజిటల్ సిటీ ఏర్పాటుకు ప్రాథమిక సన్నాహాలు పూర్తిఅయ్యాయి. జిల్లాలో విసృత్తంగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. జిల్లాలో కుటీర, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు 21148 ఉన్నాయి.
* జిల్లాలో 101పరిశ్రమలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి అమర్‌రాజా బ్యాటరీస్, లాంకో ఇండస్ట్రీస్, జైన్ఇరిగేషన్, వెంకటేశ్వర, కార్‌ప్లస్, హేరిటేజ్, తిరుమలడైరీ, దొడ్లడైరీ, క్రిమీలైన్ డైరీ, క్లీన్‌పూట్స్, రేటిఫైడ్ స్పీరిట్, స్పాంజ్ఐరన్, రెండు ప్రైవేటు చక్కెర పరిశ్రమలు నాలుగు కో-ఆపరేటివ్ పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాకుండా త్వరలో మన్నవరం పరిశ్రమ జిల్లాలో అతిపెద్ద పరిశ్రమగా నిలిచే అవకాశం ఉంది. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో శ్రీని ఫుడ్ పార్క్‌ను నిర్మించారు. ఈ ఫుడ్‌పార్క్‌లో ఆహారశుద్ది పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి ఫుడ్‌పార్క్‌లో పండ్లు,కూరగాయలు. పౌల్ట్రీ, డెయిరీ. ఇతర వ్యవసాయ ఉత్పత్తులను శుద్దీకరించే సదుపాయాలున్నాయి. రైతులు నేరుగా తమ ఉత్పత్తులను గిట్టుబాటు వచ్చేవరకు ఇక్కడి నిల్వచేసుకోవచ్చు. దేశంలో ఆహారశుద్ధి పరిశ్రమను అభివృద్ది చేసుకునేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన మెగాఫుడ్‌పార్కుల ఏర్పాటులో భాగంగా ఈ ఫుడ్‌పార్క్‌నుఏర్పాటు చేశారు.

క్యారేజీ రిపేరు షాపు
1981లో రేణిగుంటలో భారతీయరైల్వే ఆధ్వర్యంలో క్యారేజీ రిపేరు షాపును నెలకొల్పింది. ప్రతి ఏడాది 80 నుంచి 85 కోచ్‌ల వరకు ఈ షాపులో మరమ్మత్తులు చేస్తారు. ప్రతి ఏటా వివిధ రంగాల్లో సీఆర్ఎస్ అవార్డులు సాధిస్తోంది. ఈ రిపేరు షాపు ఏర్పాటుతో దేశంలో చిత్తూరు జిల్లాకు పారిశ్రామిక రంగంలో గుర్తింపు వచ్చింది.

మన్నవరం
చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన శ్రీకాళహస్తి మండలంలో ఎన్టీపీసీ-భెల్ సంయుక్త భాగస్వామ్యంతో విద్యుత్ ఉపకరణాల కర్మాగారం ఏర్పాటవుతోంది. రూ.6 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కర్మాగార పనులు చురుగ్గా సాగుతున్నాయి. తొలి విడత పనులను 2012 డిసెంబరు కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో యాజమాన్యం ముందుకు సాగుతోంది.