close

విపత్తు నిర్వహణ - విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు; రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా

చ‌క్రవాతాలు

సైక్లోన్ల జల ప్రళయం
ఉప్పొంగే ప్రకృతి విపత్తు
ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు

మానవ జీవనానికి అమ్మఒడిలా ఉండే ప్రకృతి ఒక్కోసారి ప్రళయాన్ని సృష్టిస్తుంటుంది. ఇలాంటి ప్రళయాల్లో చక్రవాతాలు (సైక్లోన్లు) ఒకటి. సముద్ర జలాల్లో ఉద్భవించే ఈ తుపాన్ల ప్రభావంతో తీర ప్రాంతాలు అపార నష్టాన్ని చవిచూస్తుంటాయి. బలమైన గాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడే ఈ విపత్తులను ముందుగానే గుర్తించగల విజ్ఞానం పెరుగుతున్నా.. ఆపగలగడం అసాధ్యం. కోట్లాది మంది నివసిస్తున్న ఉత్తర, దక్షిణ హిందూ మహాసముద్ర తీరాల్లోనూ, పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోనూ, తూర్పు, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీరాల్లోనూ ప్రతి సంవత్సరమూ చక్రవాతాల తాకిడి తప్పడం లేదు. ఏడున్నర వేల కిలోమీటర్లకు పైగా తీరరేఖ ఉన్న భారతదేశం కూడా ఈ విపత్తులను నిత్యం ఎదుర్కొంటోంది. అసలు ఏమిటీ చక్రవాతాలు? ఎందుకు ఏర్పడతాయి? వీటి ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఉంటుంది? వంటి వివరాలను ఒకసారి చూద్దాం..

కుంభవృష్టి వర్షాన్ని కుమ్మరిస్తూ.. సముద్రాల్లో పెద్దఎత్తున తరంగాలను సృష్టిస్తూ.. ఉత్తరార్ధగోళంలో అపసవ్యదిశలోనూ, దక్షిణార్ధగోళంలో సవ్యదిశలోనూ శక్తిమంతమైన గాలులతో సుడులు తిరిగే వాతావరణ అలజడినే చక్రవాతం (సైక్లోన్) అని పిలుస్తారు. చక్రవాతాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇలా ప్రాంతీయంగా అనేక పేర్లతో పిలుస్తున్నా, వీటి రూపురేఖలు ఒకేవిధంగా ఉంటాయి. వీటి ప్రభావంతో అపారమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంటుంది. అంతటి బలమైనవీ చక్రవాతాలు.

ఇవే సైక్లోన్లు
చక్రవాతాలను ఆంగ్లంలో సైక్లోన్స్ అంటారు. 'సైక్లోస్' అనే గ్రీకు పదం నుంచి సైక్లోన్ పదం పుట్టింది. సైక్లోస్ అంటే పాము మెలిక చుట్ట (కాయిల్ ఆఫ్ స్నేక్) అని అర్థం. చక్రవాతం అనేది సమశీతోష్ణ, ఉష్ణమండల అక్షాంశాల వేడి, సముద్ర ప్రవాహాల వల్ల సంభవించిన అల్పవాతావరణ పీడన ప్రభావం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఉష్ణమండల తుపాన్లు సర్పిలాకారంగా తిరిగి అలజడిని సృష్టిస్తాయి. ఈ అలజడులను గమనించిన బ్రిటన్ వాతావరణ శాస్త్రవేత్తలు వీటికి సైక్లోన్ అని నామకరణం చేశారు.

సముద్రంలోని అధిక ఉష్ణోగ్రత, అధిక సాపేక్ష ఆర్ద్రత, వాతావరణ అస్థిరతల కలయిక వల్ల ఏర్పడే ఒక సంక్లిష్ట ప్రక్రియే చక్రవాతం. సముద్రంలో అధిక ఉష్ణోగ్రత వల్ల దానిపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి అన్ని వైపుల నుంచీ అధిక పీడన గాలులు చేరతాయి. ఫలితంగా వాయుగుండంగా మారి, చక్రవాత కేంద్రం (ఐ ఆఫ్ సైక్లోన్) ఆ మధ్యలో ఏర్పడుతుంది. చక్రవాత వ్యాసం కొన్ని వందల కిలో మీటర్లు ఉండగా, చక్రవాత కేంద్ర వ్యాసం 20-30 కి.మీ.ల వరకూ ఉంటుంది. చక్రవాత కేంద్ర పరిమాణం తగ్గుతున్న కొద్దీ చక్రవాత బలం అంతకంతకూ పెరుగుతుంది. చక్రవాత కేంద్రం పెరుగుతున్న కొద్దీ దాని బలం క్రమంగా తగ్గిపోతుంది.

మూడు దశల్లో..
1. రూపకల్పన దశ
బాష్పీభవనం ద్వారా గాలికి సమృద్ధిగా నీటి ఆవిరిని అందించడం కోసం 26°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సముద్రపు నీరు 60 మీటర్ల లోతు వరకూ సముద్రంలో ఉన్నప్పుడు చక్రవాత రూపకల్పన జరుగుతుంది. ఈ దశలో గాలి సంతృప్తం చెంది వాతావరణంలో 7000 మీటర్ల ఎత్తు వరకూ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి.

2. సంపూర్ణ దశ
క్యుములోనింబస్ మేఘాలకు దిగువనే ఉన్న తీవ్ర అల్పపీడనానికి అన్ని వైపుల నుంచీ అధిక పీడన గాలి చేరుతుంది. ఇది గాలిని కల్లోలితం చేసి గాలివానతో కూడిన చక్రవాతంలా మారుతుంది.

3. బలహీన దశ
చక్రవాతం అధిక ఉన్నతిని చేరడం లేదా మరొక అల్పపీడనం వల్ల అది నేలను తాకినప్పుడు గాలి వెంటనే ఛేదనం చెందడం వల్ల చక్రవాతం బలహీనమైపోతుంది.

కాలచక్రం
చక్రవాతం 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ప్రారంభమై 3 వారాల వరకూ ఉండవచ్చు. సగటున ఒక చక్రవాతం మూడు దశలు పూర్తవడానికి 6 రోజులు పడుతుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన చక్రవాతాలు సాధారణంగా 5-6 రోజులు కొనసాగుతాయి. అరుదైన సందర్భాల్లో 3 వారాల కంటే ఎక్కువ రోజులు కూడా కొనసాగవచ్చు.

భారత్‌లో తుపాన్ల ప్రభావం
తుపాన్ల తాకిడి ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 10% తుపాన్లు ఇక్కడే సంభవిస్తున్నాయి. భారతదేశం మొత్తం తీరరేఖ(7,516 కి.మీ.లు) కూడా చక్రవాతాలకు అనుకూలంగా ఉంటుంది. దేశంలోని మొత్తం భూవైశాల్యంలో సుమారుగా 8% భూభాగం చక్రవాతాల విలయాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా 84 తీరప్రాంత జిల్లాలు చక్రవాతాలను ఎదుర్కొంటున్నాయి. మొత్తం చక్రవాతాల్లో మూడింట రెండొంతులు బంగాళాఖాతంలోనే ఏర్పడుతున్నాయి. దేశంలో ఎక్కువ చక్రవాతాలు అక్టోబరు, నవంబరుల్లో సంభవిస్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణంగా ఆగ్నేయ దిశలో ఏర్పడి చక్రవాతాలుగా మారి వాయవ్యం వైపు నడుస్తాయి. అప్పుడప్పుడూ తూర్పున ఏర్పడి పశ్చిమానికి కూడా నడిచి తీరం దాటుతుంటాయి.

ఒడిశా, ఏపీలకు తాకిడి
అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతంలో ఆవిర్భవించిన తుపాన్లే కాకుండా కొన్ని సమయాల్లో పసిఫిక్ మహాసముద్రంలో బలహీనపడిన వాయుగుండాలు కూడా బంగాళాఖాతంలోకి వచ్చి బలం పుంజుకుని తుపాన్లుగా మారతాయి. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్టుమెంట్ లెక్కల ప్రకారం 1891 నుంచి 2012 వరకూ 73 తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకాయి. దీనికి కారణం సముద్రపు లోతు తక్కువగా ఉండటమే.. అంతేకాకుండా ఖండతీరపు అంచు ఆకారం కూడా వాటికి అనుకూలంగా ఉంది.

1999, అక్టోబరు 29వ తేదీన ఒడిశా తీరాన్ని తాకిన 'సూపర్ సైక్లోన్' వల్ల 10 వేల మంది చనిపోగా, 15 లక్షల ఇళ్లు నాశనమయ్యాయి. ఇది గంటకు 250 కి.మీ.ల వేగంతో వీచింది. 1977లో ఆంధ్రప్రదేశ్ తీరంలో దివిసీమ విలయానికి 10 వేల మంది చనిపోయారు. 2013, అక్టోబరు 12న ఏర్పడిన 'పైలిన్' తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల మధ్య ప్రభావం చూపించి 25 మందిని బలిగొంది. 2013, అక్టోబరు 22న ఏర్పడిన 'హెలెన్' తుపాను కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను తాకింది. దీనివల్ల 11 మంది చనిపోయారు. 2014, అక్టోబరు 12న విశాఖపట్నం, విజయనగరాలను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను ఆరుగురిని బలితీసుకోగా, అపారమైన ఆస్తినష్టం వాటిల్లింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీటి రాకను ముందుగా గుర్తించడంతో ప్రాణ నష్టాలను చాలావరకు తగ్గించగలుగుతున్నాం.

నామకరణం కూడా..
తొలిసారిగా 20వ శతాబ్దంలో ఆస్ట్రేలియా వాతావరణ పరిశీలకుడొకరు తుపాన్లకు తనకు నచ్చిన రాజకీయ నాయకుల పేర్లు పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతీయ బోర్డులు ఆయా ప్రాంతాలకు చెందిన దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పేర్లను నిర్ణయిస్తాయి. 2000 సంవత్సరంలో ఓమన్‌లోని మస్కట్‌లో జరిగిన ప్యానల్ ఆన్ ట్రోపికల్ సైక్లోన్స్ 27వ సమావేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు ఖరారు చేశారు. ఉత్తర హిందూ మహాసముద్రం తీరంలోని తుపాను ప్రభావిత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, ఓమన్‌లు ఇచ్చిన పేర్లను వరుస క్రమంలో రాబోయే తుపానుకు ముందుగానే నిర్ణయిస్తారు. పైలిన్, హెలెన్, హుద్‌హుద్.. ఇవన్నీ అలా పెట్టిన పేర్లే.

ముందస్తు హెచ్చరికలు
భారత ప్రభుత్వ భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖలో వాతావరణ శాఖ ఒక విభాగం. ఇండియన్ మెటిరియోలాజికల్ డిపార్టుమెంట్(ఐఎమ్‌డీ)ను 1875లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. వాతావరణ పరిశీలనలు, పరిస్థితులను ముందస్తుగా వెల్లడించడం; భూకంపాల గురించిన సమాచారాన్ని అందించడం దీని ప్రధాన విధి. ఐఎమ్‌డీకి దేశ వ్యాప్తంగా 6 ప్రాంతీయ కేంద్రాలున్నాయి. తుపాను రాక హెచ్చరికలు కోల్‌కతా, చెన్నై, ముంబయిలోని ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్ల నుంచి; విశాఖపట్నం, భువనేశ్వర్, అహ్మదాబాద్‌లలో ఉన్న వార్నింగ్ సెంటర్ల నుంచి ఐఎమ్‌డీకి చేరతాయి. సైక్లోన్ హెచ్చరికలను ఇన్‌శాట్ ఉపగ్రహం ద్వారా స్థానిక భాషల్లో ప్రచారం చేసేందుకు ఒక ప్రత్యేక విపత్తు వ్యవస్థ ఉంది. ఈ హెచ్చరికలను రేడియో, టెలివిజన్, టెలీఫోన్ లాంటి సాధనాల ద్వారా ప్రచారం చేస్తారు.

ముఖ్యాంశాలు
* ఇంతవరకూ చరిత్రలో అతి సుదీర్ఘ చక్రవాతం 'టైఫూన్ జాన్'. ఇది 1994 పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి 31 రోజులపాటు కొనసాగింది.
* 1971లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'హరికేన్ జింజర్' 28 రోజులు కొనసాగి రెండో స్థానంలో నిలిచింది.
* 1970లో బంగ్లాదేశ్‌లో గంటకు 205 కిలో మీటర్ల వేగంతో సంభవించిన బోలా చక్రవాతం వల్ల 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
* గంటకు 222 కిలో మీటర్ల పైబడిన వేగంతో ఏర్పడే తుపాన్లను సూపర్ సైక్లోన్లు అంటారు.

మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగమైనవి ఏవి?
ఎ) గాలివాన బి) వాయుగుండం సి) అల్పపీడనం డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)
2. సైక్లోన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
జ: గ్రీకు
3. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ ఎక్కడ ఉంది?
జ: దిల్లీ
4. ప్రపంచంలో అత్యధిక ఆస్తినష్టం కలిగించిన తుపాను ఏది?
జ: కత్రినా తుపాను - 2005
5. చైనా, జపాన్ దగ్గర ఏర్పడిన చక్రవాతాలను ఏమంటారు?
జ: టైఫూన్‌లు
6. తుపాన్ల ప్రభావాన్ని తగ్గించడానికి సహజసిద్ధ వాయు నిరోధకాలు?
జ: తీరప్రాంత చెట్లు
7. కిందివాటిలో చక్రవాతాలకు సంబంధం లేనిది?
ఎ) బలమైన గాలులు బి) అసాధారణ వర్షం సి) ఉప్పెన డి) ఓడరేవులు
జ: డి(ఓడరేవులు)
8. చక్రవాత కేంద్రం ఎలా ఉంటుంది?
జ: ప్రశాంతంగా
9. టోర్నడోలు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయి?
జ: అమెరికా
10. చక్రవాతం సరాసరి కాలం ఎంత?
జ: 6 రోజులు
11. భారతదేశంలో ఎంత తీరంలో చక్రవాతాల ప్రభావం ఉంది?(సుమారుగా)
జ: 7500 కి.మీ.
12. తుపాన్లను అంచనా వేసే నోడల్ వ్యవస్థ ఏది?
జ: భారత వాతావరణ శాఖ
13. భారతదేశంలో చక్రవాతాలు ఎక్కువగా ఏ కాలంలో సంభవిస్తాయి?
జ: అక్టోబరు - నవంబరు
14. చక్రవాతం ఎలాంటి విపత్తు?
జ: వాతావరణ జల సంబంధ
15. బంగాళా ఖాతం, అరేబియా సముద్రాల్లో సంభవించే చక్రవాత విపత్తుల నిష్పత్తి?
జ: 4 : 1


జల్లు సద్గుణరావు