close

తూర్పుగోదావరి జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

చారిత్రకంగా దక్షిణ భారతదేశంలో తూర్పుగోదావరి జిల్లా ఓ విశిష్ట స్థానాన్ని పొందింది. జిల్లాలో రాజమండ్రి నగరానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతకపరంగా ఎంతో పేరుంది. ఈ నగరం తూర్పు చాళుక్యుల కాలంలో వారి రాజధానిగా వెలుగొందింది. క్రీ.శ.919 నుంచి 934 మధ్యకాలంలో రాజమహేంద్రి నగరాన్ని నిర్మించారు. 1800ల్లో గోదావరి ఆనకట్ట నిర్మాణంతో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. క్రీ.శ.1852లో గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్టను నిర్మించడంతో తూర్పు గోదావరితోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం కూడా మారిపోయింది. ఉభయగోదావరి జిల్లాలకు కాటన్ ఆనకట్ట ప్రాణాధారంగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులుగా గోదావరి, తాండవ నదులు, బంగాళాఖాతం, తూర్పు కనుమలు ఉన్నాయి. గోదావరి నది జిల్లాను సారవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి గౌతమి, వశిష్ట నదులుగా చీలిపోయింది. ఈ మధ్య భూభాగంలో ఉన్న డెల్టా భూభాగాన్నే కోనసీమ అంటారు. గోదావరి జిల్లాలో మొత్తం ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తోంది. ప్రాచీనకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో జైన, బౌద్ధాలు ఉజ్వలంగా ఉండేవి. ఈనాటి పంచారామాలు, అన్నవరం కొండ ఒకటినాటి బౌద్ధ క్షేత్రాలే. గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులన్నిటిలోను పెద్దది. దీనిని ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో ఒకటిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల భూగర్భ సర్వే నమోదు చేసింది.

ఆనకట్టతో మారిన జిల్లా ముఖచిత్రం
1844లో కాటన్ విశాఖపట్నంలో పని చేస్తుండేవారు. ఆ సమయంలోనే ప్రభుత్వం అడగకపోయినా ఆయన గోదావరి డెల్టా అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను రూపొందించి పంపారు. డెల్టా ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ వస్త్ర కర్మాగారాలు మూసివేయడంతో ప్రజలు నష్టపోయారని, ప్రత్యామ్నాయంగా వరి, చెరుకు పంటలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కాటన్ సూచించాడు. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. గోదావరి డెల్టాకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి నివేదిక పంపాలని ప్రభుత్వం కోరింది. 20 లక్షల ఎకరాల భూభాగంలో సర్వే చేశారు. రోజుకి 10 నుంచి 15 మైళ్లు గుర్రంపై తిరిగి కాటన్ సర్వే నిర్వహించేవారు. గోదావరి డెల్టా సర్వే నివేదిక 1845 ఏప్రిల్ 17న ప్రభుత్వానికి సమర్పించారు. ఆనకట్ట నిర్మాణం రూ.4.75లక్షల నిర్మాణ వ్యయంతో 1847 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. 1852 నాటికి రూ.15 లక్షల వ్యయంతో గోదావరిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది.

సామాజిక అంశాలు
గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం జిల్లా జనాభా పెరుగుదలపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపింది. 1821-22లో 7,38,308 ఉన్న జనాభా 1840-41 నాటికి 5,33,836కి తగ్గిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత 1871 నాటికి అంటే ప్రాజెక్టు నిర్మించిన 20 సంవత్సరాల తర్వాత జిల్లా జనాభా రెండు రెట్లు పెరిగి 15,92,939కి చేరింది. విశాఖ, గంజాం తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా జిల్లాలో స్థిరపడ్డారు. అనంతర కాలంలో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాయి. జిల్లాలోని రాజమహేంద్రి నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాయి. 2001లో 48,72,622 ఉన్న జనాభా 2011 నాటికి 51,51,549కి చేరింది. ప్రస్తుతం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ, డెల్టా, మెట్టప్రాంతాలుగా విభజితమైంది. పాలనాపరంగా 5 రెవెన్యూ డివిజన్లు, 60 మండలాలు 1011 గ్రామపంచాయతీలుగా జిల్లా ఏర్పడింది. జిల్లాలో 19 అసెంబ్లీ, మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు
1. తుని
2. ప్రత్తిపాడు
3. పిఠాపురం
4. కాకినాడ గ్రామీణం
5. పెద్దాపురం
6. అనపర్తి
7. కాకినాడ నగరం
8. రామచంద్రపురం
9. ముమ్మిడివరం
10. అమలాపురం
11. రాజోలు
12. పి.గన్నవరం
13. కొత్తపేట
14. మండపేట
15. రాజానగరం
16. రాజమండ్రి నగరం
17. రాజమండ్రి గ్రామీణం
18. జగ్గంపేట
19. రంపచోడవరం

పార్లమెంటరీ నియోజకవర్గాలు
1. కాకినాడ
2. అమలాపురం
3. రాజమండ్రి
* జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
* పశ్చిమగోదావరి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలు (కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, పోలవరం) రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి .

భౌగోళిక అంశాలు.. నేలలు..
1925లో గోదావరి జిల్లా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విడిపోయింది. తూర్పుగోదావరి జిల్లా మొత్తం విస్తీర్ణం 10807 చదరపు కి.మీ. జిల్లా కేంద్రం కాకినాడ. జిల్లాకు ఉత్తరాన విశాఖపట్నం, ఒరిస్సా రాష్ట్రం ఉన్నాయి. వాయువ్య దిశలో ఖమ్మం, తూర్పు, దక్షిణ దిశల్లో బంగాళాఖాతం, పశ్చిమాన పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పాండిచ్చేరికి చెందిన యానాం భౌగోళికంగా జిల్లాలోనే ఉంది. జిల్లాలో రాజమండ్రి అతిపెద్ద నగరం.

మడ అడవులు
తూర్పు గోదావరి జిల్లాలో నది సంగమ ప్రాంతం, సాగరతీరంలో తాళ్లరేవు, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లో 332.60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పేరొందిన కోరంగి అభయారణ్యం (తాళ్లరేవు మండలం) దాదాపు 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లోనూ విస్తారంగా ఉన్నాయి. మడ అడవులను సంరక్షణ బాధ్యతను అటవీశాఖ పర్యవేక్షిస్తుంది. మడచెట్ల వేర్లు భూమిలోకి పూర్తిగా అల్లుకుపోయి సముద్రం నుంచి వచ్చే అటుపోట్లను, బలమైన ఈదురుగాలులను, సునామీలను అడ్డుకోవడంతో పాటు భూమి కోతకు గురికాకుండా కాపాడుతున్నాయి. నీటి ప్రవాహం వెంబడి వచ్చే సారవంతమైన ఒండ్రుమట్టిని అడ్డుకుని నేలను సారవంతం చేస్తుంది. చేపలు, రొయ్యలు, పీతలు మొదలైన మత్స్యసంపద సంతానోత్పత్తికి, వివిధ రకాల పక్షి జాతులు, ఔషద మొక్కలకు అవాసాలుగా మడఅడవులు నిలుస్తున్నాయి. మడ అడవుల్లో విహారం మనోహర దృశ్య కావ్యం. ఉప్పుటేరులు, పాయలు మధ్యలో పచ్చని పరుపు పరిచినట్లుగా విస్తరించి ఉండే మడ అడవులు పర్యాటక అందాలకు వేదికగా నిలుస్తున్నాయి. ఈ మడఅడవుల మధ్య ఉప్పుటేరులో పడవ ప్రయాణం ఓ మధురానుభూతి. వీటిని తిలకించేందుకు తాళ్లరేవు మండలం కోరంగి, కాట్రేనికోన మండలం బలుసుతిప్పలలో అటవీశాఖ బోట్లను ఏర్పాట్లు చేసింది.

జిల్లాకు చెందిన చారిత్రక ప్రముఖులు
నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం
రాజమండ్రి నగరకీర్తి కిరీటంలో కందుకూరి వీరేశలింగం ప్రముఖ స్థానం వహించారు. ఆయన రాజమండ్రి నగరంలో క్రీ.శ.1848 ఏప్రిల్ 16వ తేదీన జన్మించారు. 1861లో రాజ్యలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. వీరేశలింగం మొదటినుంచీ ఆదర్శభావాలు కలిగిన వ్యక్తి. ఆయన భార్య ఆయనకు అన్ని విషయాలలో చేదోడుగా ఉండేవారు. అయితే వీరేశలింగానికి సమాజంలో పాతుకుపోయిన దురాచారాలపై ఆగ్రహం కలిగేది. ముక్కుపచ్చలారని పసిపిల్లలను సైతం వైధవ్యం పేరుతో ఎవరికంటా పడకుండా బంధించటం ఆయనకు బాధ కలిగించేది. ఈ పరిస్థితిని మార్చాలని ఆయన ప్రయత్నించారు. ఈ విషయంలో ఆయన సమాజపరంగా చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. వితంతువులకు మళ్లీ పెళ్లిచేసి ఆచారాలను నాశనం చేశారని ఆయనను సమాజం దూషించటమే కాదు రాళ్లతో దాడి చేశారు. వేటిని లెక్కచేయక తన సొంత ఇంటిలోనే 1881లో ఆయన ఆధ్వర్యంలో తొలివితంతు పునర్వివాహం జరిపించారు. అంతే కాక 1875లో వివేకవర్ధిని పేరుతో సొంతంగా ముద్రణాలయం ప్రారంభించి పత్రికలను, గ్రంథాలను ముద్రించారు. అదేవిధంగా 1907లో హితకారిణి సమాజాన్ని స్ధాపించి మహిళాభ్యుదయానికి కృషిచేశారు. ముఖ్యంగా వెనుకాముందూ ఎవరూలేని మహిళలు, భర్త చనిపోయిన స్త్రీలను చేరదీసి వారికి ఉచిత నివాసం కల్పించేవారు. అదేవిధంగా తన యావదాస్తిని సమాజ హితంకోసమే వినియోగించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగంగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీ విద్యకు అమిత ప్రాధాన్యాన్నిచ్చి ముందుగా ఆయన భార్యను విధ్యావంతురాలిని చేసిన ఆదర్శప్రాయుడు కందుకూరి. తన ఇంటి ఆవరణలోనే ఆయన తన కార్యకలాపాలు చేసేవారు. మరొక ఇంటిలో ఆయన భార్య రాజ్యలక్ష్మి నివాసముంటూ సమాజసేవ చేసేవారు. రాజమండ్రి చరిత్రలో వీరేశలింగం ఓ కలికితురాయిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఆయన తన తుదిశ్వాస వరకు సమాజసేవలోనే జీవించారు. రాజమండ్రిలోని వీరేశలింగం పురమందిరం, ఆయన నివసించిన గృహం నేటికి పదిలంగా ఉన్నాయి. ఆనందగార్డెన్స్ పేరుతో ఆయన, రాజ్యలక్ష్మిలసమాధులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఆయన మే27, 1919లో తన 71సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన అడుగు జాడలు నేటికి పదిలంగా ఉన్నాయి.

బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం
బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఆయన గాంధీ అనుచరునిగా సుపరిచితుడు. సీతానగరంలోని కస్తూర్భాగాంధీ ఆశ్రమానికి చాలా సేవ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. సుబ్రహ్మణ్యం నిస్వార్థ సేవకు, అంకితభావానికి పేరు పొందిన వ్యక్తి. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీకి వెన్నుదన్నుగా నిలిచి ఈ ప్రాంత ప్రజలను పోరాటానికి సమాయత్తులను చేసిన నిస్వార్థజీవి. స్వాతంత్య్ర సమరయోధులకు సంబందించిన వారిలో జిల్లాలో అగ్రశ్రేణి నాయకునిగా పేర్కొనవచ్చు. అదేవిధంగా ఆనం కళాకేంద్రం వద్దనున్న మైదానం బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పేరుతోనే ప్రాముఖ్యత చెందింది.

దువ్వూరి సుబ్బమ్మ - స్వాతంత్య్రసమరయోధురాలు
దువ్వూరి సుబ్బమ్మ స్వాతంత్య్రసమర సమయంలో తొలిదశలో ముందుకు వచ్చిన మహిళ. 1880లో జన్మించారు. 1922, 30, 32, 40, 42 సంవత్సరాలలో ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న మహిళగా గుర్తింపు పొందారు. 1964లో ఆమె చనిపోయారు.

శివరాజు సుబ్బమ్మ- స్వాతంత్య్ర సమరయోధురాలు
శివరాజు సుబ్బమ్మ రాజమండ్రిలోని టి.నగర్‌లో ఉండేవారు. శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1932నుంచీ 6నెలలపాటు వెల్లూరు జైలులో ఉన్నారు. ఆమె జైలులో ఉన్న సమయంలో అక్కడివారికి స్వాతంత్య్ర పోరాటంపై ఉపన్యాసాలిచ్చేవారు. 1873లో పుట్టి 1948లో చనిపోయారు. బిటీష్‌వారిని ఘూటుగా విమర్శించిన వ్యక్తి.

బారు అలివేలమ్మ- స్వాతంత్య్రసమరయోధురాలు
కాకినాడలో 1897లోజన్మించారు. ఈమె భర్త రాజారావు స్వాతంత్య్రసమరయోధులు. అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసారు. అలివేలమ్మ రాజమండ్రిలో స్త్రీలలో స్వాతంత్య్ర పోరాటంపై ప్రచారం చేసి వారిని పోరాటానికి సమాయత్తం చేసారు. ఈమె 1973లో స్వర్గస్తులైనారు.

న్యాపతి సుబ్బారావు- స్వాతంత్య్రసమరయోధులు
ఈయన మితభాషి. 1856లో జన్మించారు. బ్రిటీష్ ప్రభుత్వ దురాగతాలను ఎండగడుతూ దిహిందూ అనే ఆంగ్లపత్రికను ప్రారంభించారు. రాజమండ్రి పురపాలక సంఘానికి, బార్ అసోసియేషన్ చైర్మన్‌గా పనిచేసారు. కందుకూరి వీరేశలింగం సంస్కరణలకు అండగా నిలిచారు. ఈయనను ఆంధ్ర భీష్మగా అభివర్ణించారు. అదేవిధంగా 1903లో రాజమండ్రిలో హిందూసమాజం స్ధాపించారు. 1941లో ఈయన చనిపోయారు.

నోరూరించే పిండివంటలు
ఖండాంతర ఖ్యాతితో.. తాపేశ్వరం కాజా
మండపేట మండలం తాపేశ్వరం కాజా ఖండాంతర ఖ్యాతి నార్జించింది. ఇక్కడి కాజా రాష్ట్ర, దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందింది. తాపేశ్వరం కాజాను మొట్టమొదటిగా కనిపెట్టి, తయారు చేసింది పోలిశెట్టి సత్తిరాజు. జిల్లాలోని కె.గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామానికి చెందిన సత్తిరాజు 80 ఏళ్లక్రితం ఉపాధి నిమిత్తం తన కుటుంబ సభ్యులతో తాపేశ్వరం వలస వచ్చి చిరుద్యోగం చేసి.. అనంతరం చిన్న హోటల్‌లో మిఠాయిలను తయారు చేసి అమ్మేవారు. అప్పట్లో ప్రత్యేక స్వీట్లు తయారుచేయాలన్న తలంపుతో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి, పంచదార పాకం పెట్టి అమ్మేవారు. ఆ కాజాకు తక్కువ కాలంలోనే ఎంతో పేరు వచ్చింది. దాంతో తాపేశ్వరం కాజా రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. రాష్ట్రంలో ఎక్కడైనా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీప్రముఖులు ఇంట ఏదైనా శుభకార్యాలు లేదా మరేదైన కార్యక్రమాలు నిర్వహిస్తే తాపేశ్వరం కాజా తప్పకుండా ఉంటుంది. కాజాను 50 గ్రాముల నుంచి 500 గ్రాములు బరువు ఉండే విధంగా రకరకాల సైజులలో తయారు చేస్తారు. రాష్ట్రంలో తాపేశ్వరం పేరుతో పలు పట్టణాల్లో 300 వరకు స్వీటుస్టాల్‌లు ఉన్నాయి. ఇదంతా సత్తిరాజు చలవేనని వారంతా చెప్పుకుంటూ ఉండడం విశేషం. సత్తిరాజు కుటుంబంలో వారంతా ఇదే వ్యాపారంలో స్థిరపడ్డారు. కాజా సృష్టికర్త సత్తిరాజు ఈ లోకాన్ని విడిచి రెండు దశాబ్ధాలు కావస్తున్నా ఆయన తయారు చేసిన వంటకం అందరి మదిలో తీపి గుర్తుగా చెరగని ముద్ర వేసింది. వెబ్‌సైట్ ప్రారంభం కాజాతో పాటు ఆంధ్రపిండివంటల వివరాలతో తాపేశ్వరంలో వెబ్‌సెట్‌ను ఇటీవల ప్రారంభించారు. www.suruchifoods.com పేరుతో ఏర్పాటు చేశారు. దీనిని ఓపెన్ చేస్తే కాజాతో పాటు ఆంధ్రపిండివంటల వివరాలు ఉంటాయి. ఈ వెబ్‌సెట్‌తో కాజాకు ఇటీవల కాలంలో విదేశాలలో సైతం మరింత ఆదరణ పెరిగింది. సురుచి పుడ్స్ అధినేత మల్లిబాబు గత ఏడాది ఖైరతాబాద్ వినాయకునికి 500 కేజీల భారీ లడ్డూను బహుకరించి అందరి మన్ననలు పొందారు. ఈఏడాది 1620 కేజీల లడ్డూను అందిస్తున్నారు.

పూతరేకుల రుచే వేరు.. ఆత్రేయపురం ప్రత్యేకం
పూతరేకులు పేరువినగానే వాటి పుట్టిలలయిన ఆత్రేయపురం ఎవరికైనా గుర్తురావడం ఖాయం. ఆత్రేయపురం పూతరేకులు పిల్లల నుంచి వృద్ధుల వరకు చవులూరించేలా చేస్తాయి. ఆత్రేయపురం ప్రాంత మహిళలు తయారు చేసే పూతరేకులకు ఓ ప్రత్యేకత ఉంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఇవి 300 ఏళ్లుగా ఇక్కడ కుటీర పరిశ్రమంగా విస్తరించింది. వివాహాది శుభకార్యాలకు, విందులకు, వినోదాలకు ఈ పూతరేకులు విశేషంగా వినియోగిస్తారు. ఈ పరిశ్రమపై ఇక్కడి సుమారు 800 కుటుంబాలు జీవిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా తదితర ప్రాంతాలతోపాటు దుబాయి, అమెరికా, సింగపూర్ వంటి ఇతర దేశాలకు తీసుకెళుతుంటారు. నోటిలో పెట్టగానే మధురానుభూతినిస్తూ కరిగిపోయే పూతరేకు తయారీలో ఇక్కడి నిపుణులది అందివేసిన చేయి. ఒక్క ఆత్రేయపురంలో ఏటా రూ. కోటి రూపాయలు పైబడి పూతరేకుల వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రాంత మహిళలు మగవారికి ధీటుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పూతరేకుల తయారీలో కష్టపడుతుంటారు. పూతరేకుల తయారీ రెండు దశలుగా ఉంటుంది. మొదటిగా రేకుల తయారీ. రెండోది తినడానికి వీలుగా పంచదార, నెయ్యి, యాలికులు, బాదం తదితర మిశ్రమాల పొడివేసి చుట్టలుగా తయారు చేయడం. ఇది చాలా నేర్పుతో జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ఒక్కో పూతరేకుచుట్ట రూ. 5 నుంచి 10 వరకు అమ్ముతారు.

చారిత్రక ప్రాధాన్యం యానాం సొంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక కేంద్రపాలిత ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో గల యానాం. జిల్లా కేంద్రం కాకినాడకు 28 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ ప్రాంతం నైసర్గికంగా కేవలం 20 కి.మీ. విస్తీర్ణం, 55వేల జనాభాతో భారతదేశంలో గల అతి చిన్న జిల్లాల్లో ఒకటి. భారత దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన ఆంగ్లేయుల మాదిరిగా ఫ్రెంచివారు 1664లో మన దేశానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్టణంలో వ్యాపారకేంద్రం ప్రారంభించి తూర్పుగోదావరిలోకి వచ్చి వృద్ధగౌతమి గోదావరితీరాన గల యానాం లో ఓ వ్యాపార కేంద్రాన్ని 1723లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న యానాంను మూడు పర్యాయాలు బ్రిటీష్‌వారు ఆక్రమించినా ప్రాన్స్ ఇంగ్లాండు దేశాలస్థాయిలో జరిగే చర్చల పర్యవసానంగా తిరిగి ప్రెంచివారి ఆధీనంలో ఈ ప్రాంతం ఉండిపోయింది. భారతదేశంలో ఫెంచి వారు ఆక్రమించుకున్న ప్రాంతాలు యానాం మాత్రమే కాక పుదుచ్చేరి, కారెకాల్(తమిళనాడు), మాహే(కేరళ), చంద్రనాగూర్(పశ్చిమబెంగాల్) ఉన్నాయి. చంద్రనాగూర్‌మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడే బెంగాల్‌లో విలీనమైపోగా యానాం ఇతర ప్రాంతాలు 1954 లో విలీనమయ్యాయి. ఈ నాలుగు ప్రాంతాలలో విలీన ఉద్యమం 1954 ఏప్రిల్‌లో యానాంలో మొదలు కాగా అదే ఏడాది జూన్ 13న యానాం స్వాతంత్య్రం ప్రకటించుకుంది. 1954 నవంబరు 1న ప్రాన్సు ప్రభుత్వం ఈ నాలుగు ప్రాంతాలను భారత దేశానికి అప్పగించింది. దీనిని డీపాక్టో ట్రాన్స్‌ఫర్ అంటారు. 1962 ఆగస్టు 16న చట్టబద్ధంగా ఈ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారతదేశంలో విలీనమయ్యాయి. ఆనాటి నుంచి యానాం తన ప్రత్యేకతను కోల్పోకుండా ఒక సందర్శన ప్రాంతంగా శోభిల్లుతోంది. పన్నులలో గల వ్యత్యాసం కారణంగా యానాం ఇపుడులో ఇపుడు మద్యం, పెట్రోల్, డీజిల్ వంటివి తక్కువ ధరకు లభిస్తాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పధకాలు కారణంగా యానాం ఇపుడు సరిహద్దు ప్రజల వలసల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

పర్యాటకం
భరతమాత విగ్రహం, జీసస్ విగ్రహం, శివం స్నానఘట్టం వంటి వివిధ రకాలు కట్టడాలు గల ఈ ప్రాంతం ఇపుడు ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటి. రిలయన్స్ సహకారంతో 100 మీటర్ల ఎత్త్తెన యానాం ఒబిలిస్క్ టవర్ ఇక్కడ నిర్మాణంలో ఉంది.

బాలయోగి వారధి
కోనసీమ ప్రాంతం నుంచి జిల్లా రాజధాని కాకినాడ వెళ్లాలంటే ఎదుర్లంక- యానాం మధ్యనున్న గోదావరి నది దాటి వెళ్లవలసి వచ్చేది. దీంతో ప్రజలు బోట్లను ఆశ్రయించేవారు. దీంతో ఎన్నో వ్యయప్రయాసలకుగురయ్యేవారు. ప్రజల బాధలను గమనించిన అమలాపురం పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి ఈ రెండు ప్రాంతాలను కలిపేలా గోదావరిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సుమారు రూ.120 కోట్ల నిధులు కేటాయించాయి. విశాఖపట్నానికి చెందిన నవయుగ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్మాణ పనులను చేపట్టింది. 2002లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబునాయుడు ఈబ్రిడ్జిని ప్రారంభించారు. ఈ వంతెన ఏర్పాటు కోసం ఎంతగానో శ్రమించిన అమలాపురం ఎంపీ బాలయోగి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకముందే కృష్ణా జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన చేసిన సేవలకుగాను ఈ బ్రిడ్జికి 'బాలయోగి వారధి' గా నామకరణం చేశారు.

విద్య

జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 5181. ప్రాథమికోన్నత పాఠశాలలు 2102. ఉన్నత పాఠశాలలు 857 ఉన్నాయి. వీటిలో మొత్తం 6,91,654 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాకినాడలో జవహరలాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది. హైదరాబాద్ జేఎన్‌టీయు తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన సాంకేతిక విశ్వవిద్యాలయం ఇది. తెలంగాణ ప్రాంతంలోని సాంకేతిక కళాశాలలు మినహా రాష్ట్రంలోని మిగిలిన కళాశాలలన్నీ దీనికి అనుబంధంగా ఉంటాయి. రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని 2006లో ప్రారంభించారు. పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్, జియోఇన్‌ఫర్‌మేటిక్స్ కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. కాకినాడలో శ్రీరంగరాయ వైద్యకళాశాల, అమలాపురంలో కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఓ వైద్యకళాశాల, రాజమండ్రిలో స్వతంత్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఓ వైద్యకళాశాల మొత్తం మూడు వైద్య కళాశాలలు జిల్లాలో ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 36 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి.

నదులు - ప్రాజెక్టులు

నదులు
గోదావరి( 127.80 టీఎంసీలు): గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్దది. జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నిర్మాణం చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు గోదావరి ఆనకట్ట ద్వారా నీటిని మళ్లిస్తారు. గోదావరి జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా ప్రవహిస్తోంది. రాజమండ్రి వద్ద గౌతమి, వశిష్టగా విడిపోతుంది
ఏలేరు (29.28 టీఎంసీ): ఏలేరు నదిపై ఏలేశ్వరం వద్ద ఏలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఏలేరు నదిలో ఏడాదికి సుమారు 24 టీఎంసీల నీరు చేరుతుంది. ఈ నది ఆధారంగా సుమారు 54 వేల ఎకరాలు సాగు జరుగుతోంది.
తాండవ (3.91 టీఎంసీ): తాండవ నదిపై విశాఖపట్నం జిల్లా జీకే గూడెం వద్ద తాండవ జలాశయాన్ని నిర్మించారు. తాండవ నది జిల్లాలోని కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాలకు సాగునీరు అందిస్తుంది. 17 వేల ఎకరాల సాగు జరుగుతోంది.
పంపా (3.42 టీఎంసీ): అన్నవరం వద్ద పంపా నదిపై పంపా జలాశయాన్ని నిర్మించారు. 12 వేల ఎకరాలకు దీని ద్వారా సాగు నీరు అందిస్తున్నారు. ఇవికాక బురదకాల్వ (9.04 టీఎంసీ), సీతపల్లివాగు (4.65 టీఎంసీ),సుద్దగెడ్డవాగు (2.10 టీఎంసీ), పాములేరు (5.50 టీఎంసీ) మొత్తం 185.70 టీఎంసీల నీరు జిల్లాకు పైనదులు, కాల్వల ద్వారా లభిస్తోంది.

ప్రాజెక్టులు
1. గోదావరి డెల్టా వ్యవస్థ (సర్ఆర్ధర్ కాటన్ బ్యారేజ్): తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాల్లో తూర్పు, మధ్య డెల్టాలుగా పేరొందిన 30కి పైగా మండలాలకు పుష్కలంగా సాగు, తాగునీటిని అందిస్తోంది. 4,83,199 ఎకరాలల్లో వరి పంటకు ఆధారం.
2. ఏలేరు ప్రాజెక్టు: మెట్ట ప్రాంతంలోని 66 వేలకు పైగా ఎకరాల భూమికి సాగు నీరందిస్తోంది. శివారు భూముల్లోని అనధికార ఆయకట్టును కూడా కలుపుకుంటే లక్ష ఎకరాల పైమాటే. ఏలేశ్వరం మండలంలో తూర్పు కనుమల నడుమ ఏర్పడ్డ సహజ జలాశయంపై ఈ ప్రాజెక్టును నిర్మించారు.
3. పంపా రిజర్వాయర్: అన్నవరంలోని సత్యదేవుని పాదాల వద్ద ఈ జలాశయం ఉంది. దీని ద్వారా శంఖవరం, తుని, తొండంగి మండలాల్లోని 15వేలకు పైగా ఎకరాలకు నీరందుతోంది.
4. చాగల్నాడు ఎత్తిపోతల పథకం: రాజానగరం, రంగంపేట, కోరుకొండ, బిక్కవోలు, అనపర్తి, మండపేట మండలాల్లోని 35 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్తు, ఇతర సమస్యలతో పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదు.
5. పుష్కర ఎత్తిపోతల పథకం: గోదావరి నుంచి జలాలను ఎత్తిపోసి మెట్ట ప్రాంతంలోని 1.86 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు దీన్ని నిర్మించారు. ప్రస్తుతం తొలిదశ మాత్రమే పూర్తయింది. 86 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది.
6. సూరంపాలెంరిజర్వాయర్: ఏజెన్సీ గంగవరం మండలంలోని సూరంపాలెంలో ఈ జలాశయాన్ని నిర్మించారు. వర్షాకాలంలో కోరుకొండ, గోకవరం మండలాలను ముంచెత్తే బురదకాలువ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు దీన్ని నిర్మించారు. 23వేల ఎకరాలకు సాగునీరందుతోంది.
7. సుబ్బారెడ్డి సాగర్: ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం గ్రామంలోని కుంతీదేవి వాగుపై నిర్మించారు. ప్రత్తిపాడు మండలంలోని 9 వేల ఎకరాలకు ప్రయోజనం.
8. భూపతిపాలెం ప్రాజెక్టు: రంపచోడవరం మండలం భూపతిపాలెం గ్రామం సీతపల్లి వాగుపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రంపచోడవరం, గోకవరం మండలాలకు సాగు, తాగునీటిని అందించాల్సి ఉంది.
9. ముసురుమిల్లి ప్రాజెక్టు: రంపచోడవరం మండలం ముసురుమిల్లి వద్ద సీతపల్లి వాగుపై నిర్మిస్తున్నారు. రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, గోకవరం, కోరుకొండ మండలాలకు ప్రయోజనం. 22 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతోపాటు అయిదు మండలాల ప్రజలకు తాగునీటిని కూడా అందిస్తుంది.
10. పోలవరం ప్రాజెక్టు: ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా పేరొందిన పోలవరం ప్రాజెక్టును పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 10.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. 123 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే పామర్ధ్యంతో పోలవరం రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. పోలవరం ఎడమకాల్వ తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల మీదుగా వెళుతుంది.

ఇతర నీటి వనరులు
1. ఎం.ఐ. చెరువులు: 249. వీటి ద్వారా 57,295 ఎకరాలకు ఆయకట్ట.
2. ధారాకాల్వ రిజర్వాయర్: ఇది మొత్తం 4,938 ఎకరాల ఆయకట్టకు నీరు అందిస్తుంది.
3. వెంకటనగరం పంపింగ్ స్కీం: దీని ద్వారా మొత్తం 4,250 ఎకరాల ఆయకట్టకు నీరు అందుతోంది. ఇవికాక మద్దిగడ్డ రిజర్వాయర్ (2,700 ఎకరాలు), సుబ్బారెడ్డి సాగర్ ( 9,364 ఎకరాలు), తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ (13,758 ఎకరాలు), తారక రామవరపు ఆవ (9,785 ఎకరాలు) కూడా జిల్లాలో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

నీటిపారుదల

నదులు, కాలువలు - నీటి సామర్ధ్యం
గోదావరి( 127.80 టీఎంసీలు): గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్దది. జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నిర్మాణం చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాలకు గోదావరి ఆనకట్ట ద్వారా నీటిని మళ్లిస్తారు. గోదావరి జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా ప్రవహిస్తోంది. రాజమండ్రి వద్ద గౌతమి, వశిష్టగా విడిపోతుంది.
ఏలేరు (29.28 టీఎంసీ): ఏలేరు నదిపై ఏలేశ్వరం వద్ద ఏలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఏలేరు నదిలో ఏడాదికి సుమారు 24 టీఎంసీల నీరు చేరుతుంది. ఈ నది ఆధారంగా సుమారు 54 వేల ఎకరాలు సాగు జరుగుతోంది.
తాండవ (3.91 టీఎంసీ): తాండవ నదిపై విశాఖపట్నం జిల్లా జీకే గూడెం వద్ద తాండవ జలాశయాన్ని నిర్మించారు. తాండవ నది జిల్లాలోని కోటనందూరు, తుని, రౌతులపూడి మండలాలకు సాగునీరు అందిస్తుంది. 17 వేల ఎకరాల సాగు జరుగుతోంది.
పంపా (3.42 టీఎంసీ): అన్నవరం వద్ద పంపా నదిపై పంపా జలాశయాన్ని నిర్మించారు. 12 వేల ఎకరాలకు దీని ద్వారా సాగు నీరు అందిస్తున్నారు. ఇవికాక బురదకాల్వ (9.04 టీఎంసీ), సీతపల్లివాగు (4.65 టీఎంసీ),సుద్దగెడ్డవాగు (2.10 టీఎంసీ), పాములేరు (5.50 టీఎంసీ) మొత్తం 185.70 టీఎంసీల నీరు జిల్లాకు పైనదులు, కాల్వల ద్వారా లభిస్తోంది.

మేజర్ ఇరిగేషన్
1. 4,83,199 ఎకరాలకు (గోదావరి తూర్పు, మధ్య డెల్టా (ప్రాంతాలకు) సరిపడే నీరు సర్ఆర్ధర్ కాటన్ బ్యారేజ్
2. యేలేరు ఇరిగేషన్ సిస్టమ్: యేలేరు రిజర్వాయర్ వల్ల 53,017 ఎకరాలకు సాగునీరు అందుతోంది.

మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు:
1. పంపా రిజర్వాయర్ (అన్నవరం) - దీని ద్వారా 12,005 ఎకరాలకు నీరు అందుతోంది.
2. మద్దిగడ్డ రిజర్వాయర్:దీని ద్వారా 2,700 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
3. సుబ్బారెడ్డి సాగర్ - దీని ద్వారా 9,364 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
4. తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ - దీని ద్వారా 13,758 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
5. తారక రామవరపు ఆవ ఎల్ఐ స్కీం - దీని ద్వారా 9,785 ఎకరాల ఆయకట్టకు నీరు అందుతోంది.

చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు:
1. ఎం.ఐ. చెరువులు 249. వీటి ద్వారా 57,295 ఎకరాలకు ఆయకట్ట
2. ధారాకాల్వ రిజర్వాయర్: ఇది మొత్తం 4,938 ఎకరాల ఆయకట్టకు నీరు అందిస్తుంది.
3. వెంకటనగరం పంపింగ్ స్కీం: దీని ద్వారా మొత్తం 4,250 ఎకరాల ఆయకట్టకు నీరు అందుతోంది.

ప్రధాన పంటలు

వరి: దక్షిణభారత ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో వరి పంట ప్రధానమైనది. ఇక్కడ 4.50 లక్షల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది. గోదావరి డెల్టాలో ఇది సుమారు 40 శాతం. ఇక్కడ ఖరీఫ్, రబీల్లో వరిని ప్రధాన పంటగా సాగుచేస్తారు. ప్రతీ పంటకూ కోట్ల విలువైన పంట దిగుబడి వస్తోంది. కోనసీమలో ప్రధాన సాగుచేస్తున్న వరి పంటకు గోదావరి నీరే. ధవళేశ్వరం వద్ద గోదావరి పాయలుగా వీడి కోనసీమలో గోదావరి డెల్టాలోని తూర్పు డెల్టా, మధ్య డెల్టాలలో ఈ పంటను సాగుచేస్తున్నారు.

కొబ్బరి: జిల్లాలో సుమారు 1.25లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తోంది. ముఖ్యంగా ఈ పంట కోనసీమలో కేంద్రీకృతమై ఉంది. సుమారు 70లక్షల కొబ్బరి చెట్లు ఇక్కడ ఉన్నాయి. తోటలతో పాటు చేలగట్ల మీద కూడా కొబ్బరిచెట్లను ఎక్కువగానే పెంచుతున్నారు. కొబ్బరి పంటపై పరిశోధన చేసేందుకు గాను ఇక్కడ కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడ పండిన కొబ్బరి దేశంలోని నలుమూలలకూ ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.

అరటి: గోదావరి పాయలుగా విడిపోయిన చోట నుంచి నదీ పాయల్లోనూ, లంకల్లోనూ, నది ఏటిగట్ల కింద అరటి పంట విరివిగా సాగవుంతోంది. అరటి పంటకు కూడా కోనసీమ ప్రాంతమే ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని మిగతా ప్రాంతాలకు వచ్చేసరికి మెట్టలో ముఖ్యంగా కోటనందూరు మండలంలో అరటి పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. మొత్తమీద జిల్లాలో 15వేల ఎకరాల వరకూ సాగుచేస్తున్నారు. ఏటా రూ.500ల కోట్ల విలువైన అరటి పంట పండుతోది. జిల్లాలోని రావులపాలెంలో ఉన్న అరటి మార్కెట్ ద్వారా ఈ పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ ఆసియాలోనే పెద్దదిగా పేరుగాంచింది. కోనసీమలో పండిన అరటి పంటను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

చెరకు: జిల్లాలోని దాదాపు 35 వేల ఎకరాల్లో చెరకు సాగువుతోంది. వీటి ద్వారా వచ్చే దిగుబడితో నాలుగు చక్కెర పరిశ్రమల్లో చక్కెర తయారవుతోంది. అయితే ఈ దిగుబడిలో పది శాతంతో మ్రాతం రైతులే స్వయంగా బెల్లం తయారు చేస్తుంటారు. కిర్లంపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ఈ ప్రక్రియ అధికంగా సాగుతోంది. ప్రస్తుతం టన్నుకి సుమారు రెండు వేల వరకు ధర పలుకుతోంది. అయితే నిర్వహణా వ్యయం అధికంగా ఉండడంతోపాటు దీర్ఘకాలిక పంట కావడంతో దీని సాగుపై గతంలోకన్నా మక్కువ తగ్గింది.

ఆయిల్‌ఫామ్: ఆయిల్‌ఫామ్ సాగు క్రమక్రమంగా జిల్లాలో పెరుగుతోంది. ఇది కూడా సుమారు 30వేల ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ తోటలు ఉండగా టన్ను ఆయిల్‌ఫామ్ ధర సుమారు రూ. 6500 చేరింది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వ్యవసాయ కూలీల అవసరం అంతగా అవసరం లేకపోవడంతో రైతులు దీనిసాగుపైనే మక్కువ చూపుతున్నారు. ఆయిల్‌ఫామ్ విస్తీర్ణం మరింత విస్తరించనుంది.

పత్తి సాగు: జిల్లాలో పత్తిసాగు కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 30వేల ఎకరాల్లో పత్తిసాగవుతున్నట్టు అంచనా. రంగంపేట, గండేపల్లి, జగ్గంపేట, గోకవరం, తుని, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. గతేడాది క్వింటా పత్తి ధర రూ.6వేలపైనే ఉండడంతో గత ఏడాదికన్నా రెట్టింపు విస్తీర్ణంలో దీనిని సాగుచేశారు.

మెట్టలో అపరాల సాగు: మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతి ఖరీఫ్‌లో 14వేల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి.

పర్యాటకం

ప్రధాన దేవాలయాలు
అన్నవరం సత్యదేవుడు
కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి. 'అన్న' వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణ స్వామికి కుడి పక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తారు. ఇలా ఒకే పీఠంపై ఉండే దేవాలయం మరెక్కడా లేదు. ఇక్కడ ప్రతిరోజూ సుప్రభాతసేవ మొదలుకొని ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రధానంగా ఈ దేవాలయం వివాహాది శుభకార్యాలకు ఎంతో ప్రసిద్ధి గాంచింది. వివాహం చేసుకున్న నూతన వధూవరులు తప్పనిసరిగా సత్యదేవుని వ్రతమాచరిస్తారు. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో వివరించారు. ప్రతిరోజూ వ్రతాలు, నిత్యకల్యాణం కొండపై నిర్వహిస్తారు.

ద్రాక్షారామం
ద్రాక్షారామం శివాలయం, విష్ణ్వాలయం రెండింటితోపాటు శక్తిపీఠం కూడా ఉన్న దివ్యక్షేత్రం. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. పురాణకథ ఆధారంగా ఇది దక్షప్రజాపతి యజ్ఞం చేసిన చోటు. తారకుడి సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిన తరవాత ఈ విషయాన్ని తెలుసుకున్న సప్తర్షులు... సప్తగోదావరి తీర్థంలో భీమేశ్వరుడికిసుప్రభాత అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్యరుషి యజ్ఞం చేస్తున్నాడు. రుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయనుకున్నాడు. రుషులనూ, గోదావరులనూ వారించాడు. ఉభయపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో తెల్లవారిపోయింది. శివలింగానికి సూర్యభగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. తరవాత వ్యాసమహర్షి వచ్చారు. రుషులను ఓదార్చి... తాను అంతర్వాహినిగా సప్తగోదావరులనూ ఒక పుష్కరిణిలో చేర్చాననీ అది 'సప్తగోదావరి'గా పిలవబడుతుందనీ, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందనీ చెప్పారు.

కుమారారామం
కుమారారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ బాలాత్రిపుర సుందరీదేవి సహిత సోమేశ్వరుడు ఉన్నాడు. ఈ స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. శ్రీదేవీ భూదేవీ సమేత జనార్దనుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. క్రీ.శ.892 నుంచి 922 వరకూ పాలించిన తూర్పుచాళుక్యులు సామర్లకోటలో కుమారారామ భీమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఇందులో సుద్దరాయితో తయారైన లింగం కింది అంతస్తు నుంచి రెండో అంతస్తు వరకూ ఉంటుంది. ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమాసమేత మృత్యుంజయ లింగం, నవగ్రహాల గుడి ఉన్నాయి. సామర్లకోట రాజమండ్రి నుంచి సుమారు 60 కి.మీ దూరంలో ఉంది.

పాదగయక్షేత్రం
పాదగయక్షేత్రం ఇటీవల కాలంలో కొత్తరూపు సంతరించుకుంది. రెండేళ్ల కాలంలో దాతల విరాళాలు, ఆలయ ఆదాయం పెరగడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ముఖ్యంగా రూ.30 లక్షలతో పాదగయ పుష్కరిణిని అభివృద్ధి చేశారు. వృద్ధులు, పిల్లలు పుణ్యస్నానాలు ఆచరించేలా పుష్కరిణిని అభివృద్ధి చేశారు. పడమటి వైపు ఉన్న ప్రవేశద్వారం అభివృద్ధి చెయ్యడమే కాకుండా బైపాస్‌రోడ్డులో ప్రయాణించే భక్తుల కోసం పురుహూతికాదేవి నమూన ఆలయాన్ని నిర్మించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవైన పీఠికాపుర క్షేత్రంలోని పాదగయ క్షేత్రం రానున్న రోజుల్లో కొత్త కళను సంతరించుకోబోతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా శైవ, విష్ణు, దేవి, దత్త క్షేత్రాలు ఒకేచోట వున్న క్షేత్రంగా పిఠాపురం విరాజిల్లుతుంది. ఈక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల విశ్వాసాన్ని విశేషంగా చూరగొంటోంది.

అయినవిల్లి సిద్ధివినాయకుడు
సప్తనదీ సంగమప్రాంతం... గోదావరీతీరం.. పచ్చని కొబ్బరిచెట్లు, వరిపొలాలు సోయగాల మధ్య అలరారే కోనసీమలో వెలిసిన అయినవిల్లి శ్రీసిద్ధివినాయక ఆలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ప్రతీ శుభకార్యానికి ముందు అయినవిల్లి సిద్ధివినాయకుణ్ని పూజిస్తే ఆకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అయినవిల్లి వినాయకుడు విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రసిద్ధికెక్కాడు.

అంతర్వేది
గోదావరి, కడలి సంగమ స్థలి. శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా.

పర్యాటక ప్రదేశాలు
పచ్చని ప్రకృతి ఒడి... మారేడుమిల్లి
రాజమండ్రికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది మారేడుమిల్లి. జిల్లాలో ఉన్న తూర్పు కనుమల్లోని అత్యంత ఎత్త్తెన ప్రాంతం. ఎకో టూరిజంలో భాగంగా వనసంరక్షణ సమితి, అటవీశాఖలు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు చేపడుతున్నాయి. అందులో భాగంగా 'వాల్మీకి వ్యాలి వన విహారస్థలి' పేరుతో మారేడుమిల్లి మన్యంలో చేపట్టిన ప్రాజెక్టు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తోంది. ఇందుకోసం మారేడుమిల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పర్యాటకస్థలాలుగా తీర్చిదిద్దింది. ఇక్కడకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో జలతరంగిణి జలపాతం ఉంది. ఎత్త్తెన కొండలమీద జాలువారే జలపాతం ఈ ప్రాంతానికో ప్రత్యేక ఆకర్షణ. ఇది కిందకు జారి సెలయేరులా ప్రవహించే దృశ్యం అపురూపంగా అనిపిస్తుంది.

కోరంగి అభయారణ్యం
జిల్లాలోని సముద్ర తీర జీవావరణ వ్యవస్థలో ఈ అభయారణ్యం ఓ ముఖ్యమైన భాగం. తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, యానాం ప్రాంతాల్లో ఉన్న ఈ అభయారణ్యంలో విస్తృతంగా మడ అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నారు.

పాపికొండలు
అఖండ గోదావరి తూర్పు కనుమలను ఛేదించే ప్రాంతమే పాపికొండలు. దీని పేరు వినని పర్యాటకులుండరు. దట్టమైన అడవులు, గిరిజన సంస్కృతి, గోదావరి అందాలకు నెలవీప్రాంతం. పర్యాటకులకు రాజమండ్రి నుంచి విస్తృత ఏర్పాట్లు ఉన్నాయి.

కడియం
అక్షరాలా ఆరు వేల ఎకరాల వనం. నర్సరీల అందాలతో అలరారుతోంది. ఎన్నో రకాల మొక్కలు, పూలను ఇక్కడే సృష్టిస్తున్నారు. రాజమండ్రికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దిండి రిసార్ట్స్
గోదావరి సముద్రంలో సంగమించే సమీపంలో అందాల కోనసీమలో ఈ రిసార్ట్స్‌ను ఏర్పాటు చేశారు. కేరళకు ఏ మాత్రం తీసిపోని అందాలు ఇక్కడ ఉన్నాయి. రాజోలు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. హౌస్‌బోట్లు అదనపు ఆకర్షణ.

రాజమండ్రి, కాకినాడ నగరాలు
ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నెలవు. అటు గోదావరి, ఇటు సముద్ర తీర అందాలు, నగర జీవితం, పలు పర్యాటక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి.

ధవళేశ్వరం బ్యారేజీ
చూసి తీరాల్సిన కట్టడం. లక్షల ఎకరాలకు జీవధార నందించే ఈ బ్యారేజీ ఓ చారిత్రక ఆణిముత్యం. రాజమండ్రికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

పరిశ్రమలు

రాజమండ్రి ఎ.పి. పేపరుమిల్లు, నాగార్జున ఫెర్టిలైజర్స్ (కాకినాడ), ప్లేవుడ్ యూనిట్ (రంపచోడవరం), సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ, పాడి పరిశ్రమ, డెయిరీలు, పౌల్ట్రీలు, ఫిషరీష్, క్వాయర్ పరిశ్రమ, స్పిన్నింగ్, సా మిల్లులు, నూనె కర్మాగారాలు, క్రూసిబుల్స్, క్వారీ, వస్త్ర పరిశ్రమ, ప్లాస్టిక్ పరిశ్రమలు, చేతి వృత్తులు, పిఠాపురం సంగీత వాయిద్య పరికరాల తయారీ పరిశ్రమ, హెచరీస్ మొదలైనది. చమురు, సహజవాయు పరిశ్రమలు (ఓఎన్జీసీ, రిలయన్స్), బియ్యం మిల్లులు, రాజమండ్రి ఎ.పి. పేపరుమిల్లు, నాగార్జున ఫెర్టిలైజర్స్ (కాకినాడ), ప్త్లెవుడ్ యూనిట్ (రంపచోడవరం), సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ, పాడి పరిశ్రమ, డెయిరీలు, పౌల్ట్రీలు, ఫిషరీష్, క్వాయర్ పరిశ్రమ, స్పిన్నింగ్, రంపపు మిల్లులు, నూనె కర్మాగారాలు, క్రూసిబుల్స్, క్వారీ, వస్త్ర పరిశ్రమ, ప్లాస్టిక్ పరిశ్రమలు, చేతి వృత్తులు, పిఠాపురం సంగీత వాయిద్య పరికరాల తయారీ పరిశ్రమ, హెచరీస్ మొదలైనవి ఉన్నాయి .

కాకినాడలో ఉన్న పరిశ్రమల ఫోన్ నంబర్లు
అగర్వాల్ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీస్-0884-2372178.
అగర్వాల్ ఇండస్ట్రీస్-0884-5562241.
ఆనంద్ ఇండస్ట్రీస్-0884-2386669.
అన్నవరం షిప్ ఇండస్ట్రీస్-0884-2379457.
అశోక్ ఇండస్ట్రీస్-0884-2362914.
ఆటోమేటివ్ ఇండస్ట్రీస్-0884-2361743.
బాదం ఇండస్ట్రీస్-0884-2367771.
బోసుకోండా ఇండస్ట్రీస్--2378223.
చోడే అప్పారావు ఇండస్ట్రీస్-0884-2375302.
సర్కార్ డీ హైడ్రేట్స్ లిమిటడ్-0884-2373730.
సర్కార్ రీరోలింగ్ మిల్స్-0884-2379182.
డక్కన్ స్టీల్స్-0884-2350511.
అవినాష్ ఆర్గానిక్స్-0884-2385514.
బిందు ఆగ్రో ప్రోడక్ట్స్-0884-2375513.
కోరమాండల్ ఆగ్రోప్రోడక్ట్స్-0884-2364311.
గోల్డెన్ ఆగ్రో ప్రోడక్ట్స్-0884-2371107.
లక్ష్మీ ఐశ్వర్యా ఆగ్రో ప్రోడక్ట్స్-0884-2374092.
రాకీ ఇండస్ట్రీస్-0884-2343265.
శ్రీధర్ ఆగ్రో ఇండస్ట్రీస్-0884-2374757.

మండపేట
ఎలిగెంట్ పేపర్ బోర్డు 08855 232106
గోదావరి ఎడిబుల్ ఆయిల్ 08855 232357
సూర్యచంద్ర పేపర్ మిల్లు 08855 232649
మాధవి ఎడిబుల్ ఆయిల్ 08855 230771
బలగంరెడ్డి పేపర్ ప్రొడక్టు 08855 226156
నెక్కంటి సీఫుడ్స్,ఈతకోట 98481 99737
అవంతి ఫీడ్స్, గోపాలపురం 96486 18459
నాగార్జున ఫెర్టిలైజర్స్, ఈతకోట 255901
పద్మశ్రీ స్టీల్స్, దేవరపల్లి 93472 22222