close

స్వాతంత్ర్యానంతరం భారత ఆర్థికాభివృద్ధి - ప్రణాళికల పాత్ర. భారతదేశ సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయరంగం, నీటిపారుదల, నీరు, సుస్థిరాభివృద్ధి, ద్రవ్యోల్బణం, చెల్లింపుల శేషం, నిలకడతో కూడిన వృద్ధి, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, వాణిజ్యం, సామాజిక రంగాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో నూతన సవాళ్లు - ప్రపంచ పోటీ, విత్త మార్కెట్ల అస్థిరత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలు తదితరాలు

పేదరికం రకాలు

భారత్‌లో నిర్మూలన చర్యలు
తెలంగాణలో ప్రత్యేక పథకాలు

అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం.. ప్రధాన ఆర్థిక, సాంఘిక సమస్యలు. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. 20వ శతాబ్దపు మధ్య కాలం నుంచి ఈ సమస్యలు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారాయి. అన్నింటిలోకెల్లా పేదరికం తీవ్రమైన సమస్య. గత కొన్ని దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ అనేక ప్రణాళికలు రూపొందిస్తూ చర్యలు చేపడుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అన్ని ఉద్యోగ నియామక పరీక్షల్లోనూ 'భారతదేశ, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి' అనే విభాగం కీలకమైంది. అభ్యర్థులకు పేదరికం మూలాలు.. దారిద్య్ర రేఖ.. పేదరిక అంచనాలు.. నిర్మూలన చర్యలు.. ప్రత్యేక పథకాలపై అవగాహన అవసరం.

సమాజంలోని ప్రజలు తమ మనుగడకు అవసరమైన కనీస అవసరాల (ఆహారం, వస్త్రాలు, గృహవసతి)ను పొందలేని స్థితిలో ఉంటే, ఆ స్థితిని పేదరికం అంటారు.

భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పేదరికమే ముఖ్యమైంది. అంతర్జాతీయంగా.. ఆర్థిక శాస్త్రంలో నిరపేక్ష, సాపేక్ష పేదరికాలనే రెండు భావనలున్నాయి. ఇందులో భారత్ లాంటి దేశాల్లో కనిపించేది నిరపేక్ష పేదరికం. ఈ రెండు రకాల భావనలను పరిశీలిస్తే..

నిరపేక్ష పేదరికం (అబ్జల్యూట్ పావర్టీ)
కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. కనీస అవసరాల పరిమాణాన్ని మార్కెట్ ధరల ఆధారంగా లెక్కించి కనీస జీవన వినియోగ వ్యయాన్ని నిర్ధారిస్తారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించే పేదరికం నిరపేక్ష పేదరికం. పేదరికపు సమస్యను పరిశీలించేటప్పుడు నిరపేక్ష పేదరికాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

సాపేక్ష పేదరికం (రిలేటివ్ పావర్టీ)
సాపేక్ష పేదరికం అనేది ఆర్థిక అసమానతలను సూచిస్తుంది. ఈ భావన ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ స్థాయి, జీవన ప్రమాణం తక్కువగా ఉన్న ప్రజలను ఆదాయస్థాయి, జీవన ప్రమాణం ఎక్కువగా ఉన్న ప్రజలతో పోల్చి తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను సాపేక్షంగా పేదవారుగా పరిగణిస్తారు. ఈ భావనను సంపన్న దేశాల్లో అధికంగా ఉపయోగిస్తారు.

దారిద్య్ర రేఖ (పావర్టీ లైన్)
కనీస వినియోగ స్థాయి లేదా తలసరి నెలసరి కనీస వినియోగ వ్యయాన్ని చేయగల ఆదాయస్థాయిని తెలిపే రేఖను దారిద్య్ర రేఖ లేదా పేదరికపు రేఖ అంటారు. ప్రణాళికా సంఘం ప్రకారం ఆహార వస్తు వినియోగాన్ని క్యాలరీల రూపంలో లెక్కిస్తారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున అవసరమయ్యే క్యాలరీలు 2400. పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు.
(పట్టిక-1 చూడండి)

పేదరికాన్ని కొలిచే పద్ధతులు
1. తలల లెక్కింపు పద్ధతి (హెచ్‌సీఆర్ - హెడ్ కౌంట్ రేషియో)
భారతదేశంలో పేదరికంలో ఉన్న జనాభాను లెక్కించడానికి సాధారణంగా తలల లెక్కింపు పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా మొత్తం జనాభాలో పేద ప్రజల శాతం ఎంత అనే విషయం తెలుస్తుంది. దీన్ని కింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు.
H = q/n 100
H = తలల లెక్కింపు
q = పేదరికంలో ఉన్న ప్రజలు
n = మొత్తం జనాభా

2. పేదరిక వ్యత్యాస సూచి
పేదరిక తీవ్రతను, పేదల్లో ఉండే అంతరాలను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు.
పేదరికం వ్యత్యాసం = పేదరికపు రేఖ - పేదవాడి సగటు వినియోగ వ్యయం / పేదరికపు రేఖ

3. సేన్స్ పేదరిక సూచి
సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్యకుమార్ సేన్ దీన్ని అభివృద్ధి చేశారు. పేదరిక రేఖకు దగ్గరగా ఉన్నవారిని పైకి తీసుకొచ్చేకంటే, పేదరిక రేఖకు దూరంగా ఉన్నవారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువగా పెరుగుతుందని సేన్ అభిప్రాయ పడ్డారు.

4. బహు పార్శ్వపు పేదరిక సూచి (ఎంపీఐ- మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్)
2010 మానవ అభివృద్ధి నివేదిక, మానవ పేదరిక సూచి(హెచ్‌పీఐ-1997) స్థానంలో ఎంపీఐను ప్రవేశపెట్టింది. ఈ సూచి మూడు అంశాలతో ఉంటుంది. అవి...
1. ఆయుర్దాయం
2. అక్షరాస్యత
3. జీవన ప్రమాణం

భారత్‌లో పేదరికం అంచనాలు
మన దేశంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్‌వో) ప్రతి 5 ఏళ్లకోసారి పేదరికాన్ని అంచనా వేస్తుంది. ఈ అంచనాలను ప్రణాళిక సంఘం (దీని స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది) అధికారికంగా ప్రకటిస్తుంది. భారత్‌లో స్వాతంత్య్రానికి పూర్వం పేదరికాన్ని అంచనా వేసింది దాదాభాయ్ నౌరోజీ.
(పట్టిక-2 చూడండి)

పట్టిక-3 ప్రకారం ప్రణాళిక సంఘం అంచనాలతో పోలిస్తే తెందూల్కర్ కమిటీ అంచనాల్లో పేదరిక పెరుగుదల కనిపిస్తోంది. కానీ ఈ పెరుగుదల కొత్త పద్ధతిలో అంచనా వేయడం వల్ల వచ్చిందే తప్ప పేదరికం మొత్తం మీద పెరిగిందని నిర్ధారణ చేయకూడదని తెందూల్కర్ కమిటీ ప్రత్యేకంగా సూచించింది. కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా మొత్తం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు 8 శాతం మేరకు తగ్గారని ఈ గణాంకాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

ఎన్ఎస్ఎస్‌వో పేదరికపు అంచనాలు
2011-12 ఏడాది పేదరిక అంచనాలను ఎన్ఎస్ఎస్‌వో (68వ రౌండ్) 2013, జులై 22న ప్రకటించింది. దీని ప్రకారం 2011-12లో మొత్తం జనాభాలో 21.9 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇందులో గ్రామీణ పేదల శాతం 25.7, పట్టణ పేదల శాతం 13.7.

పేదరిక నిర్మూలన చర్యలు
స్వల్పకాలిక చర్యలు: వివిధ పేదరిక నిర్మూలన పథకాల అమలు.
మధ్యకాలిక చర్యలు: స్వయం సహాయక బృందాల ద్వారా పేదరికాన్ని తగ్గించడం.
దీర్ఘకాలిక చర్యలు: జనాభా తగ్గించడం, వృద్ధి వేగవంతం చేయడం, ఆదాయ అసమానతలు తగ్గించడం, భూసంస్కరణల అమలు, గ్రామీణ పారిశ్రామికీకరణ.

ట్రికిల్ డౌన్ సిద్ధాంతం
ప్రపంచవ్యాప్తంగా 1970కు పూర్వం ఆర్థికవేత్తలు 'ట్రికిల్ డౌన్ సిద్ధాంతం'ను విశ్వసించారు. వృద్ధి జరిగితే తలసరి ఆదాయం పెరిగి అది కింది స్థాయికి ప్రవహించి పేదరికం దానంతట అదే తగ్గుతుందని తెలిపేదే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. 1970 నాటికి వృద్ధి జరిగింది కాని పేదరికం తగ్గలేదు. అంటే పేదరికాన్ని తగ్గించడంలో ఈ సిద్ధాంతం ఉపయోగపడలేదు. అందువల్ల పేదరికాన్ని తగ్గించేందుకు ప్రత్యక్షంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు భావించారు. ఫలితంగా 1970 దశకం నుంచి భారతదేశంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఇవన్నీ పేదరిక నిర్మూలనకు ఉద్దేశించినప్పటికీ వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు.

పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన పథకాలు
1. ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకాలు:
ఉదా: డీపీఏపీ, సీఏడీపీ, డీడీపీ.
2. ప్రత్యేక వర్గాలు లేదా లక్ష్య వర్గాల అభివృద్ధి పథకాలు:
ఉదా: ఎస్ఎఫ్‌డీఏ, ఎంఎఫ్ఏఎల్ఏ, కనీస అవసరాల పథకం, అంత్యోదయ అన్న యోజన
3. ప్రత్యేక పథకాలు / నిరుద్యోగ నిర్మూలన పథకాలు:
ఉదా: ఎన్ఆర్ఈపీ, ఆర్ఎల్ఈజీపీ, ట్రైసం (టీఆర్‌వైఎస్ఈఎం), ఎన్ఆర్‌వై, ఎస్‌జీఎస్‌వై, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వంటివి.

మాదిరి ప్రశ్నలు
1. ఒక దేశం ఆదాయ సమానత్వాన్ని సాధించినప్పుడు అదృశ్యమయ్యే పేదరికం ఏది?
ఎ) నిరపేక్ష పేదరికం బి) సాపేక్ష పేదరికం సి) పాక్షిక పేదరికం డి) నిరపేక్ష - సాపేక్ష పేదరికం
జ: (బి)
2. 'పావర్టీ ఇన్ ఇండియా' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ బి) మిన్హాస్ సి) దండేకర్, రథ్ డి) బర్దన్
జ: (సి)
3. మన దేశంలో పేదరికపు అంచనాలను అధికారికంగా ప్రకటించే సంస్థ ఏది?
ఎ) ప్రణాళిక సంఘం బి) నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ సి) ప్రణాళిక మంత్రిత్వ శాఖ డి) కేంద్ర గణాంక సంస్థ
జ: (ఎ)
4. మొత్తం జనాభాలో పేద ప్రజల శాతం తెలిపే పేదరిక లెక్కింపు కొలమానం?
ఎ) పేదరిక వ్యత్యాస సూచి బి) సేన్ పేదరిక సూచి సి) బహుపార్శ్వ పేదరిక సూచి డి) తలల లెక్కింపు పద్ధతి
జ: (డి)
5. పేదరికాన్ని అంచనా వేసే పద్ధతిని సమీక్షించడానికి 2005 డిసెంబరులో వేసిన కమిటీ ఏది?
ఎ) లక్డావాలా బి) తెందూల్కర్ సి) రంగరాజన్ డి) అహ్లూవాలియా
జ: (బి)
6. ఎన్ఎస్ఎస్‌వో (68వ రౌండ్) ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో పేదరికంలో ఉన్న జనాభా శాతం ఎంత?
ఎ) 26.1 బి) 22.9 సి) 21.9 డి) 20.9
జ: (సి)
7. 'ట్రికిల్ డౌన్ సిద్ధాంతం' ప్రకారం ఒక దేశంలో వృధ్ధి జరుగుతున్నపుడు పేదరికం ఏ విధంగా ఉంటుంది?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది సి) స్థిరంగా ఉంటుంది డి) సంబంధం లేదు
జ: (బి)
8. 'గరీబీ హటావో' అనే నినాదం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ప్రధాని ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ బి) లాల్‌బహదూర్ శాస్త్రి సి) చరణ్ సింగ్ డి) ఇందిరాగాంధీ
జ: (డి)
9. పేదరిక నిర్మూలకు 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశ పెట్టారు?
ఎ) 3వ ప్రణాళిక బి) 4వ ప్రణాళిక సి) 5వ ప్రణాళిక డి) 6వ ప్రణాళిక
జ: (సి)
10. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 10వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం ఏది?
ఎ) జాతీయ పనికి ఆహార పథకం బి) సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన సి) ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డి) భారత్ నిర్మాణ్ యోజన
జ: (డి)
11. కిందివాటిలో పేదరికానికి కారణం కానిది ఏది?
ఎ) జనాభా పెరుగుదల బి) మూలధన కొరత సి) ఆర్థిక శక్తి వికేంద్రీకరణ డి) ద్రవ్యోల్భణ పెరుగుదల
జ: (సి)
12. ఇటీవల ప్రవేశపెట్టిన 'జన్‌ధన్ యోజన' ఉద్దేశం ఏమిటి?
ఎ) గ్రామీణ పేదల ఉత్పాదకతను పెంచడం బి) జనాభాను శీఘ్రంగా నియంత్రించడం సి) గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచడం డి) ఆర్థికంగా సమ్మిళితం
జ: (డి)
13. తెందూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం పేదలున్న రాష్ట్రం ఏది?
ఎ) ఒడిశా బి) బిహార్ సి) రాజస్థాన్ డి) ఉత్తర్‌ప్రదేశ్
జ: (ఎ)
14. భారతదేశంపై ప్రత్యేక దృష్టితో పేదరికం గురించి అధ్యయనాలను చేసినందుకు ఈ ఏటి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఆంగస్ డీటన్ ఏ దేశానికి చెందినవారు?
ఎ) అమెరికా బి) జపాన్ సి) ఫ్రాన్స్ డి) స్కాట్లాండ్
జ: (డి)
15. తెలంగాణ ప్రభుత్వం 'ఆసరా' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 2014, అక్టోబరు బి) 2014, ఆగస్టు 15 సి) 2014, జూన్ 2 డి) 2014, నవంబరు 8
జ: (డి)
16. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కల్యాణ లక్ష్మి' పథకం ఎవరికి ఉద్దేశించింది?
ఎ) పేద ఎస్సీ బాలికలకు బి) పేద ఎస్టీ బాలికలకు సి) పేద ఎస్సీ, ఎస్టీ బాలికలకు డి) పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు
జ: (సి)


సీహెచ్. వెంకట్ రెడ్డి