close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

మార్పులు చూసి ముందడుగు!

స్క్రీనింగ్‌, మెయిన్స్‌ అనే రెండు అంచెల్లో గ్రూప్‌-2 పరీక్షను నిర్వహించేందుకు ఏపీపీఎస్‌సీ సమాయత్తం అయింది. అలాగే కొన్ని మార్పులతో అంతిమంగా మెయిన్స్‌ సిలబస్‌ను విడుదల చేసింది. 2012 నుంచి మెజారిటీ అభ్యర్థులు సిద్ధమవుతూనే ఉన్నందున సిలబస్‌లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేసేదెలా? ఇవిగో నిపుణుల సూచనలు!
గత కొన్ని సంవత్సరాలుగా సిలబస్‌ మారిందని వార్తలు వచ్చినప్పుడు తమ సన్నద్ధతను మార్చుకుంటూ వెళ్ళిన అభ్యర్థుల శాతం చాలా తక్కువేనని చెప్పాలి. 2012 నాటి సిలబస్‌ మాత్రం ప్రిపేరయినవారు చాలా మార్పులు చేసుకోవల్సిన తరుణం ఇదే. అంతిమంగా వెలువడిన సిలబస్‌ ప్రకారం మార్పులు గమనిద్దాం.
మెయిన్స్‌ పేపర్‌ 1
* ‘గవర్నెన్స్‌’, ‘ఈ గవర్నెన్స్‌’ పాఠ్యాంశాలను కొత్తగా చేర్చారు. ఇదమిత్థంగా ప్రామాణిక రచనల కొరత ఉంది. అందువలన అభ్యర్థులు జాగ్రత్తగా ‘పరిధి’ని నిర్ణయించుకొని అధ్యయనం చేయాలి.
* విపత్తు నిర్వహణ మెలకువలు, వ్యూహాలు గతంలో మాదిరిగానే 10-15 ప్రశ్నల వెయిటేజి పొందవచ్చు. అయితే తాజాగా విపత్తుల స్వభావంలో వచ్చిన తేడాల్ని, ఎదుర్కొంటున్న ప్రక్రియలపై స్పష్టమైన అవగాహనని పెంచుకోవాలి. శాస్త్ర సాంకేతికత, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ ప్రయోజనాలు విపత్తు నిర్వహణ కోసం ఉపయోగపడే విధానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
* పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి భావనలు లోతుగా ప్రపంచ గమన కోణంలో పరిశీలించాలి. తాజా సదస్సులు, సంఘటనలు వంటి వాటిని అనుసంధానించి అధ్యయనం చేయాలి. సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్ని ప్రాథమిక సమాచారం కోసం చదివినా కొత్త సమాచారంపై దృష్టి పెట్టాలి. * జనరల్‌ స్టడీస్‌లో ‘అంధ్రప్రదేశ్‌- విభజనానంతర సమస్యలు’ అనే కొత్త విభాగం చేర్చారు. వర్తమాన ప్రాధాన్యం దృష్ట్యా 15-20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉండవచ్చు. ఈ విభాగానికి కూడా ఇప్పుడిపుడే సమాచారం సిద్ధపడింది. ముఖ్యంగా సిలబస్‌లో అంశాల వారీగా, సమస్యగా ఎందుకు మారింది? కారణాలు ఏమిటి? రెండు రాష్ట్రాలు, కేంద్రం పాత్ర ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌ వాదన ఏమిటి? పరిష్కార మార్గాలు అనే కోణంలో చదవాలి.
సరిగా పరిశీలిస్తే అనేక విషయాలు పేపర్‌-3లోకి ఏపీ ఎకానమీతో అనుసంధానం చేసుకుని అధ్యయనం చేసే సౌలభ్యం ఉంది. ఉభయతారకంగా ఉపయోగపడతాయని గమనించాలి. ఏపీ విభజన చట్టం- 2014ని సిలబస్‌ అంశంగా పేర్కొన్నారు. తెలుగులో వ్యావహారిక భాషల చట్టంలో సెక్షన్లు, షెడ్యూళ్ళపై పట్టు సాధించటం అవసరం.
పాలిటీ
ప్రస్తుత పరీక్షా విధానంలో ‘పాలిటీ’ విభాగానికి గతం కంటే ప్రాధాన్యం పెరిగింది. స్క్రీనింగ్‌ పరీక్షలో 50 మార్కులు, జనరల్‌ స్టడీస్‌లో 10-15 మార్కులు, పేపర్‌-2లో 75 మార్కులు ఈ విభాగానికి కేటాయించారు. సుమారుగా 140 మార్కుల ప్రాధాన్యం కాబట్టి, రాజ్యాంగ పరిపాలనా అంశాల్ని మరింత విశ్లేషణతో చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగ పరిణామం అనే అంశం 1773 రెగ్యులేటింగ్‌ చట్టం నుంచి చదవాలా?, ‘1925 బెర్కన్‌ హెడ్‌ సవాల్‌’ నుంచి చదవాలా? అనే మీమాంస అభ్యర్థుల్లో వుంది. గతంలో ఇదే సిలబస్‌ కింద బ్రిటిష్‌ చట్టాలపై ప్రశ్నలు అడిగిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు కూడా 1925 తదనంతర పరిణామాల్నే రాజ్యాంగ వృద్ధి అనే అంశం కింద చదివితే సరిపోతుంది.
ప్రస్తుత సిలబస్‌ చాప్టర్‌ 2లో ‘న్యాయసమీక్ష’, ‘న్యాయవ్యవస్థ క్రియాశీలత’ని ప్రత్యేకంగా ఇచ్చారు. న్యాయసమీక్షకు చెందిన అనేక కేసుల్ని వివిధ పాఠాలలో అనుసంధానం చేసుకొని చదువుతారు. అయితే మార్కెట్లో లభిస్తున్న పుస్తకాల్లో చిన్న చిన్న కేసులను కూడా ఉదాహరించారు. ఇటువంటి ప్రయత్నం వల్ల అనవసర భారం అభ్యర్థిపై పెరగడమే తప్ప, పరీక్షల్లో ప్రశ్నరూపంలో అడిగిన దాఖలాలు లేవు. అందువలన ప్రధానమైన కేసులు, తాజా కేసులకు పరిమితమైతే సరిపోతుంది. న్యాయ వ్యవస్థ క్రియాశీలక కారణాలు, లాభాలు, నష్టాలు అనే కోణంలో విశ్లేషణాత్మక ప్రశ్నలకు సిద్ధపడితే సరిపోతుంది.
4వ చాప్టర్‌లో ‘కేంద్ర-రాష్ట్ర సంబంధాలు’ పాఠ్యాంశాల్ని గతంలో మాదిరిగానే కొనసాగించారు. అయితే 2వ పరిపాలనా సంస్కరణాల సంఘం సిఫార్సులు, 2వ కేంద్ర-రాష్ట్ర సంబంధాల కమిటీ (పూంచి)లను తాజా సిలబస్‌లో పేర్కొన్నారు. అందువల్ల సర్కారియా సిఫార్సులను బహుముఖ కోణాల్లో అధ్యయనం చేసినట్లే, పూంచి సిఫార్సుల్ని కూడా వివిధ రాజ్యాంగ అంశాల కోణంలో అధ్యయనం చేయాల్సి రావటం తాజా మార్పు.
వ్యూహం ఎలా?
స్క్రీనింగ్‌, మెయిన్స్‌ రెండంచెల పద్ధతిని అనుసరిస్తున్నారు కదా అని స్క్రీనింగ్‌లో గట్టెక్కిన తర్వాతే మెయిన్స్‌పై దృష్టి సారించాలనుకోవటం సరైన నిర్ణయం కాదు. స్క్రీనింగ్‌కీ, మెయిన్స్‌కీ మధ్య కాలవ్యవధికి పెద్దగా అవకాశం వుండదు. పైగా మెయిన్స్‌ సిలబస్‌ని దృష్టిలో పెట్టుకొని చదవటం ద్వారా స్క్రీనింగ్‌లో 90%సిలబస్‌ తయారయినట్లే
రోజులో కనీసం సగం సమయాన్ని పాలిటీ, ఎకానమీలకు కేటాయించాలి. తద్వారా స్క్రీనింగ్‌ ప్రిపరేషన్‌ని పూర్తిచేయవచ్చు. అదనంగా వర్తమాన అంశాలు చదవాలి. ఎకానమీలో ప్రధానంగా వున్న టాపిక్స్‌ని స్క్రీనింగ్‌ కోణంలో చదివితే సరిపోతుంది.
ఒకరోజు ప్రిపరేషన్లోని మిగతా సగం సమయాన్ని జనరల్‌ స్టడీస్‌, ఏపీ చరిత్ర, ఏపీ ఎకనామీలకు వెచ్చించాలి. ఆ విధంగా మెయిన్స్‌ ప్రిపరేషన్‌ని కూడా పూర్తిచేయవచ్చు ఈ విధంగా స్క్రీనింగ్‌, మెయిన్స్‌లకు ఇంటిగ్రేటెడ్‌గా స్క్రీనింగ్‌ 45 రోజుల ముందువరకు చదవాలి. పరీక్షకు 45 రోజుల నుంచి కేవలం స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలి. స్క్రీనింగ్‌ పరీక్ష అనంతరం ఫలితాల కోసం ఎదురుచూడకుండా మిగిలిన మెయిన్స్‌ సిలబస్‌ అంశాలపై సమయాన్ని వెచ్చించాలి.Posted on 07-11-2016