close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

తొలి విజయానికి తెర తీద్దాం!

స్క్రీనింగ్‌ పరీక్షకు 90 రోజుల వ్యవధి కూడా లేకపోవటంతో గ్రూప్‌-2 అభ్యర్థుల్లో సన్నద్ధత వేడి మొదలైంది. ఓటీపీఆర్‌, దరఖాస్తు దశలు దాటి పరీక్షపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో దృష్టి నిలుపుతున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపకరించే దిశానిర్దేశం...!
స్క్రీనింగ్‌ పరీక్షలో కేవలం మూడు విభాగాలే ఉండడం వల్ల మెయిన్స్‌కు కావాల్సిన అర్హత మార్కు పెరిగే అవకాశం ఉంది. ఈ ఆలోచన అభ్యర్థులను ఒక రకమైన ఒత్తిడికి కూడా గురిచేస్తోంది.
సాధారణంగా గతంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కు వెళ్లడానికి 150కి కటాఫ్‌ 90కి అటు, ఇటుగా ఉండేది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ ఉండటంతో చాలా విభాగాలపై పట్టు సాధించే క్రమంలో శ్రమ, చదవాల్సిన అంశాల పరిధి ఎక్కువగా ఉండడంతో సహజంగానే కటాఫ్‌ తగ్గేది.
కానీ గ్రూప్‌-2 స్క్రీనింగ్‌లో చదవాల్సిన అంశాల పరిధి తక్కువ. పైగా స్కోరింగ్‌ విభాగాలు సిలబస్‌ అంశాలుగా ఉండటం, అభ్యర్థులు గత నాలుగు సంవత్సరాలుగా ఇదే సబ్జెక్టులపై అభ్యాసం ఎక్కువ చేయడం వల్ల కటాఫ్‌ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అందువల్ల ‘సగటు స్థాయి’లో ప్రశ్నలు వస్తే, 95-100 మార్కుల వరకు స్కోరు చేసే వ్యూహాన్ని అమలు చేస్తే తొలి విజయం సాధించినట్లే.
కరెంట్‌ అఫైర్స్‌
అవగాహన లేని చాలామంది అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌ అనగానే బిట్‌ బ్యాంకు చదివితే సరిపోతుందనే అభిప్రాయంతో ఉంటారు. మార్కెట్‌లో దొరికే ఏదో ఒక బిట్‌ బ్యాంకుని పరీక్షకు 30 రోజుల ముందు కుస్తీ పట్టడం సాధారణంగా కనిపించే విషయం. ఈ విధమైన సన్నద్ధత వల్ల నేరుగా వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవచ్చు. కానీ, పరిణామ, అన్వయ ప్రశ్నలు వస్తే ఇబ్బందికి గురవుతారు.
ఈ ఉదాహరణను గమనించండి. మొన్న జరిగిన ఏఈఈ పరీక్షలో ఈ ప్రశ్న కనిపించింది. ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌ 10లోని సంస్థలు ఎన్ని?
చట్టాన్ని ఆమోదించినపుడు ఈ షెడ్యూల్‌లో 107 సంస్థలు ఉన్నాయి. తర్వాత మరో 35 సంస్థలను చేర్చారు. దీంతో వాటి సంఖ్య 142కి చేరింది. ఇప్పుడు కూడా చట్టం షెడ్యూల్‌లో 107 మాత్రమే ఉన్నాయి. కానీ ‘పరిణామాన్ని’ అర్థం చేసుకోలేకపోతే సరైన ‘142’ సమాధానాన్ని గుర్తించడం కష్టం.
మరో ఉదాహరణ: సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వం తరపున నిలబడిన దేశం- రష్యా. తిరుగుబాటు వర్గాలకు పరోక్ష మద్దతు ఇస్తున్న దేశం- అమెరికా. బిట్‌ బ్యాంకులపై ఆధారపడిన అభ్యర్థి ఇలా నేరుగా ప్రశ్నలు వస్తే సునాయాసంగా సమాధానం గుర్తిస్తారు. కానీ, ‘సిరియా ప్రభుత్వానికి రష్యా ఎందుకు మద్దతు ఇస్తోంది’? అనే ప్రశ్న వస్తే.. సమాధానం ఇవ్వడం కష్టమే కదా!
గత నాలుగు సంవత్సరాలుగా యూపీఎస్‌సీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు అభ్యర్థి సత్తాని పరిశీలించడానికి ఇలాంటి ప్రశ్నలపై దృష్టి నిలిపాయి. అందువల్ల కరెంట్‌ అఫైర్స్‌ని తేలికగా తీసుకోకూడదు. పరిణామాత్మకంగా అన్వయం, విశ్లేషణ ప్రమాణాలుగా చదివి, 40 మార్కులకు అటు ఇటుగా స్కోరు సాధించాలి.
‘కాదేదీ ప్రశ్నకి అనర్హం’ అన్నట్లుగా కరెంట్‌ అఫైర్స్‌లో అనేక ఉప అంశాలను కూడా సిలబస్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల బహుముఖంగా అభ్యర్థులు తయారవ్వాలి.
1. రోదసి రంగంలో భారత్‌ రాణించడానికి సరైన కారణాన్ని గుర్తించండి.
2. భారత్‌లో మధుమేహం పెరగడానికి ప్రధాన కారణాలేంటి?
3. నోట్ల రద్దు సృష్టించిన ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడడానికి కేంద్రం తీసుకున్న మొదటి చర్య ఏంటి?
4. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేకపోవడానికి దారితీసిన ప్రధాన కారణమేంటి?
5. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రాష్ట్రమైనా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ప్రథమ స్థానం పొందటానికి దోహదపడిన అంశం ఏంటి?
6. ట్రంప్‌ గెలుపునకు ప్రధాన కారణమేంటి?
అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌ను కొంతవరకు నిజాధారిత ప్రశ్నలకు తయారవుతూనే, ‘కారణ- ఫలిత’ సంబంధ, ‘కార్య- కారణ’ సంబంధ అధ్యయనంతో సిద్ధపడితే కరెంట్‌ అఫైర్స్‌ని సునాయాసంగా ఎదుర్కోవచ్చు.
పాలిటీ
స్క్రీనింగ్‌ సిలబస్‌కూ, మెయిన్స్‌ పాలిటీ సిలబస్‌కూ కొన్ని తేడాలున్నాయి. కానీ, మెయిన్స్‌ సిలబస్‌ను అనుసరిస్తూ పాలిటీని అనుసంధానిస్తూ (ఇంటిగ్రేటెడ్‌) చదవడం సరైన నిర్ణయం. పాలిటీ నుంచే అడిగే సంపూర్ణ అవగాహన ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించాలంటే అన్ని అంశాలనూ అనుసంధానం చేసుకుని చదవాల్సిందే. మెయిన్స్‌ సిలబస్‌లో వివరాలతో కూడిన సిలబస్‌ ఇవ్వగా, స్క్రీనింగ్‌ సిలబస్‌లో టైటిల్స్‌గా సిలబస్‌ను ఇచ్చారు. అందువల్ల తక్కువ సిలబస్‌ అని భావించకుండా సంపూర్ణంగా చదవాలి.
ఇటీవల జరిగిన టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలో కూడా తాజా, వివాదాస్పద రాజ్యాంగ అంశాలపై పెద్ద సంఖ్యలో ప్రశ్నలను అడిగారు. మారిన ట్రెండ్‌లో ఏపీపీఎస్‌సీలో కూడా ఇదే ధోరణి పునరావృతమయ్యే అవకాశం ఉంది.
ఏఈఈ పరీక్షలో అడిగిన ప్రశ్నలు- నీతి ఆయోగ్‌ స్థాపించడం వెనుక ఉన్న మార్గదర్శక సూత్రం ఏంటి? (సహకార సమాఖ్య), 14వ ఆర్థిక సంఘం సిఫారసులను అనుసరించి కేంద్ర- రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీకి ప్రధాన మార్గం ఏది? (పన్నుల పంపిణీ), టీఎస్‌పీఎస్‌సీలో జీఎస్‌టీకి సంబంధించిన అంతిమ ఆర్టికల్‌ ఏది? శ్రియా సింఘాల్‌ కేసు సంబంధిత ప్రాథమిక హక్కు అంశమేంటి? లాంటి అనేక వర్తమాన ఆధారిత ప్రశ్నలను అడిగారు.
పాలిటీకి సంబంధించి ‘జనరల్‌ నాలెడ్జ్‌’ను బట్టీపట్టేసి బాగా చదివేశామని అనుకుంటే పొరపాటు పడినట్లే. అలాగే ఏదో ఒక కోచింగ్‌ సంస్థకి చెందిన నోట్సుపై ఆధారపడడం కూడా సరైన నిర్ణయం కాదు. దినపత్రికల్లో రోజువారీ రాజకీయ, రాజ్యాంగ అంశాలను జాతీయ/ ప్రాంతీయ స్థాయిలో పరిశీలించడం ద్వారా అందరికంటే అదనంగా మార్కులు సాధించవచ్చు.
మార్కెట్‌లో దొరికే తెలుగు అకాడమీ పోటీపరీక్షల ప్రత్యేకం, అంబేడ్కర్‌ వర్సిటీ పీజీ విద్య కోసం ప్రస్తావించిన రాజ్యాంగ అంశాలను చదవడం ఎక్కువ ప్రయోజనకరం. అదేవిధంగా 7, 8, 9, 10 తరగతుల పౌరశాస్త్ర అంశాలను ఎంపిక చేసుకుని చదివితే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.
ఎకానమీ
స్క్రీనింగ్‌లో ఈ విభాగాన్ని కూడా మెయిన్స్‌ సిలబస్‌లో అనుసంధానించుకుని చదవాల్సి ఉంటుంది. మెయిన్స్‌ మూడో పేపర్‌లోని మొదటి 3 పాఠ్యాంశాలను సమగ్రంగా చదివితే స్క్రీనింగ్‌లో ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉండదు. ప్రణాళికలు, వాటి స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్‌ నిర్మాణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.
స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక, పారిశ్రామిక విధానాలను సిలబస్‌లో చేర్చారు. నిజానికి ఆర్థిక విధానాలు అనే పదాలు విశాలమైనవి. ద్రవ్య, విత్త, వాణిజ్య విధానాలు వంటివి ఆర్థిక విధానాల కిందకే వస్తాయి. అందువల్ల ఈ విధానాలను తులనాత్మకంగా పరిశీలించాలి. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చిన మార్పులను తాజా అంశాలతో అనుసంధానించి చదవాల్సి ఉంటుంది.
సరళీకరణ, ప్రపంచీకరణ, గ్లోబలీకరణ... ఈ మూడు పదాలు కూడా చాలా విస్తృతమైన పరిధి కలిగినవే. అందువల్ల ఒక విధంగా ఆబ్జెక్టివ్‌ పరీక్షకు ఈ సిలబస్‌తో తయారవడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఈ మూడు అంశాల్లో వస్తున్న మార్పులపై తులనాత్మక అవగాహన అవసరం. ఈ విభాగంపై నిజాధారిత ప్రశ్నలకంటే విశ్లేషణ, వివరణ, కారణ- ఫలిత సంబంధ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర, హరిత విప్లవం లాంటి అంశాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ పథకాలు ముఖ్యంగా 2016-17 బడ్జెట్‌లో అనుసంధానం చేసుకోవాలి. అందులోనూ కేంద్ర ప్రభుత్వం 2016-17ని గ్రామాభివృద్ధి బడ్జెట్‌గా నిర్దేశించుకుంది.
జనాభా సంబంధిత అంశాలు, ఆర్థిక అసమానతలు మెయిన్స్‌ సిలబస్‌లోనూ ఉన్నాయి. కాబట్టి, అనుసంధానించి చదువుకోవడం మేలు.
మధ్యయుగ కాలంలో ఆర్థికవ్యవస్థ, స్వతంత్ర పూర్వ ఆర్థికవ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శ్రామిక, కార్మిక విధానాలను కొత్తగా చేర్చారు. ప్రస్తుత కేంద్రప్రభుత్వం కార్మిక విధానాలకు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా చేపట్టిన పథకాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ అంశాలకు పాలిటీలోని ఆదేశిక సూత్రాలను అనుసంధానించుకుంటే ఉభయ తారక ప్రయోజనం.
స్క్రీనింగ్‌ పరీక్షలో ఏపీ ఆధారిత ఆర్థిక అంశాలు సిలబస్‌లో పేర్కొనకపోయినా ఈ సిలబస్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను అయినా అనుసంధానంగా అడిగే అవకాశం ఉంటుంది.
ఎకానమీ విభాగం తయారవడానికి తెలుగు అకాడమీ రచనతోపాటు యోజన, ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర బడ్జెట్‌, దిన పత్రికల విశ్లేషణలను ఉపయోగించుకోవాలి. వివిధ అంశాలను సాధారణ అవగాహనతో చదివితే విజయం సాధించడానికి అవరోధాలు తొలగినట్లే.
గమనిక: ఈ మూడు విభాగాలపై పట్టు సాధించిన అభ్యర్థులు ప్రతిరోజూ ఏపీ చరిత్ర, ఎకానమీల అధ్యయనం చేస్తే అది వారి పరిజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది. మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు మాత్రం స్క్రీనింగ్‌కి పరిమితం అవడం మంచిది.Posted on 28-11-2016