close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

అనుసంధానిస్తే...అదెంతో మేలు!

గ్రూప్‌-2 పరీక్ష కోసం సిద్ధమయ్యేవారు సమగ్రంగా, వ్యూహాత్మకంగా చదివితేనే గరిష్ఠ ప్రయోజనం పొందగలుగుతారు. స్క్రీనింగ్‌ పరీక్షలో ఉన్న కొన్ని అంశాలు మెయిన్స్‌లో కూడా ఉన్నందున రెంటినీ ఉమ్మడిగా చదవడం బహుముఖ ప్రయోజనాలు కలగజేస్తుంది. విలువైన సమయాన్ని కూడా ఆదా చేస్తుంది!
ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 రెండంచెల విధానంలో మొదటిదైన స్క్రీనింగ్‌ పరీక్ష అతి ప్రధానమైనది. దీనిలో 1:50 నిష్పత్తిలో ఎంపికైనవారు మాత్రమే మెయిన్స్‌ రాయగలుగుతారు. అందుకే ప్రస్తుతం స్క్రీనింగ్‌కు అధిక ప్రాధాన్యమిస్తూనే మెయిన్స్‌లో విస్తృత సిలబస్‌ ఉన్న మొదటి పేపర్‌ జనరల్‌స్టడీస్‌ అంశాలను అనుసంధానంతో చదవాలి!
జనరల్‌ నాలెడ్జ్‌- వర్తమాన అంశాలు
అన్ని రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, యూపీఎస్‌సీ రూపొందించే ప్రశ్నలశైలిని అనుసరించడం ప్రస్తుత ధోరణిగా మారింది. అభ్యర్ధులందరూ జనరల్‌ నాలెడ్జ్‌ని వర్తమానాంశాలతో అనుసంధానించుకుంటూ స్క్రీనింగ్‌, మెయిన్స్‌ జనరల్‌ స్టడీస్‌కు ఒకేసారి ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
ప్రస్తుత కరెంట్‌ అఫైర్స్‌ విధానం అభ్యర్థుల్లోని లోతైన అవగాహనను పరీక్షించే విధంగా ఉంది. కాబట్టి పరీక్షకు ఒక సంవత్సరం ముందునుంచి పాక్షికంగా; కనీసం 6, 7 నెలలనుంచి జరిగిన సంఘటనలపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలి. జి.కె. సంబంధిత ప్రాచుర్యం కలిగిన భౌగోళిక, రాజకీయ అంశాలు, క్రీడారంగంలోని ముఖ్యాంశాలను క్రమం తప్పకుండా వార్తాపత్రికలు చదివి సొంత నోట్సు తయారుచేసుకోవాలి.
ఇటీవల ఏపీపీఎస్‌సీ నిర్వహించిన ఏఈఈ ప్రశ్నపత్రం పరిశీలించాలి. ఈ విభాగంలో ప్రస్తుతం అధిక ప్రాధాన్య విషయాలు:
1) ఆంధ్రప్రదేశ్‌ పునర్వవస్థీకరణ చట్టం-2014
2) కరెన్సీ నోట్ల రద్దు తర్వాత ఏర్వడిన మార్పులు
3) పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాల దృష్ట్యా చైనా పాకిస్తాన్‌ కారిడార్‌
4) రియోలో జరిగిన ఒలింపిక్స్‌/ పారాఒలింపిక్స్‌
5) అమెరికా అధ్యక్ష ఎన్నికలు
6) నోబెల్‌ బహుమతులు- 2016
7) క్రీడావిషయాలు, అవార్డులు, గ్రంథాలు
8) అంతర్జాతీయ ఒప్పందాలు
9) చర్చనీయ అంశంగా మారిన వస్తుసేవల పన్ను (GST)
10) బ్రెక్సిట్‌
వీటిపై సొంతనోట్సు తయారుచేసుకోవాలి.
ఇప్పటినుంచే అభ్యర్ధులు క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 3-4 గంటల సమయం చదివితే మంచి ఫలితం రాబట్టవచ్చు. వర్తమాన అంశాలను విడివిడి బిట్ల మాదిరిగా కాకుండా విషయావగాహనతో చదివితే తక్కువ శ్రమతో అధిక మార్కులు పొందవచ్చు.
సైన్స్‌ &టెక్నాలజీ
గ్రూప్‌-2 స్క్రీనింగ్‌, మెయిన్స్‌ జనరల్‌ స్టడీస్‌లో ఈ విభాగం ప్రాధాన్యం బాగా పెరిగింది. భారతదేశంలో పాటు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలు, తరచుగా ప్రయోగిస్తున్న ఉపగ్రహాల సమాచారం, మనదేశానికి తలమానికంగా మారిన ఇస్రో పుట్టుపూర్వోత్తరాల గురించి సమాచారం సేకరించాలి. మనదేశ ఉపగ్రహాలతో పాటు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం, భారత రక్షణరంగానికి సంబంధించిన త్రివిధ దశలు, ఈ మధ్య మన భారతసైన్యం నిర్వహించిన సర్జికల్‌ స్టైక్స్‌ సమాచారంతో పాటు భారత క్షిపణి వ్యవస్థపై పట్టు సాధించాలి.
మరో ముఖ్యమైన అంశం ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ. ఈ రంగంనుంచి అధికంగా అనుప్రయుక్తపరమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రధానంగా కేంద్రప్రభుత్వం బాగా ప్రచారం చేస్తున్న డిజిటల్‌ ఇండియా ప్రస్తుతం 4 జీ ఇంటర్‌నెట్‌లో వాడుతున్న టెక్నాలజీ వంటి వాటితో పాటు బయోటెక్నాలజీ రంగంలో జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ ట్రాన్స్‌జెనిక్స్‌ &మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, డీఎన్‌ఏ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానం ముఖ్యం. 2017లో తిరుపతిలో నిర్వహించే సైన్స్‌ కాంగ్రెస్‌పై దృష్టి సారించాలి.
దీనితో పాటు నానో టెక్నాలజీ, రోబోటిక్స్‌లకు సంబంధించిన అంశాలు కూడా ప్రధానమే. ఇటీవల ప్రభుత్వాలు శక్తివనరుల అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు, సంప్రదాయ, సంప్రదాయేతర వనరుల అంశాలపై సమాచారం సేకరించుకోవాలి.
భారత రాజ్యాంగం
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తర్వాత మెయిన్స్‌కు తక్కువ సమయం ఉన్నందున ఇప్పుడే మెయిన్స్‌లోని అంశాలను సమ్మిళితం చేసుకొంటూ చదవాలి. దీనికోసం ప్రస్తుతం ప్రణాళిక ప్రకారం తెలుగు అకాడమీ పుస్తకాల్లోని మౌలిక భావనలపై పట్టు సాధించాలి. విషయాన్ని చదివి ఏరోజుకు ఆరోజు తమ సామర్థ్యాలను అంచనా వేసుకోవడానికి డైలీటెస్ట్‌లు రాయడం అనివార్యం.
అధికశాతం మంది విద్యార్థులు పాలిటీని పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు మాత్రమే చదువుతారు. ఇలాకాక 10వ తరగతి వరకు పుస్తకాల్లో, ఇంటర్‌ పుస్తకాల్లోని ప్రాథమిక భావనలు గ్రహించడం ముఖ్యం. తెలుగు అకాడమీ ‘భారత రాజ్యాంగం- పోటీ పరీక్షల ప్రత్యేకం’ పుస్తకాన్ని క్లుప్తంగా అధ్యయనం చేసి ప్రస్తుతం జరిగే తాజా పరిణామాలను జతచేసుకోవడం ఎంతో మేలు. దీనివల్ల స్క్రీనింగ్‌తోపాటు మెయిన్స్‌ 1 & 2 పేపర్లు పూర్తిచేసిన వారవుతారు.
భారత ఆర్థిక వ్యవస్థ
ఈ విభాగం స్క్రీనింగ్‌తో పాటు మెయిన్స్‌ 1 &3 పేపర్లలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకని దీనికి ప్రతిరోజూ కచ్చితంగా నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. స్క్రీనింగ్‌, మెయిన్స్‌ను అనుసంధానిస్తూ చదవాలి. ఇందులో భారత స్వాతంత్ర సంవత్సరాన్ని మైలురాయిగా తీసుకొని స్వాతంత్ర పూర్వ మధ్యభారత ఆర్థిక వ్యవస్థలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. అధిక భాగం చరిత్రలో సంబంధం ఉన్న విభాగమిది. మధ్య భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు, వారు అనుసరించిన శిస్తు విధానాల, భూసంస్కరణల, వస్తుమార్పిడి, కరెన్సీ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చరిత్రను అనుసంధానిస్తూ చదవడం వల్ల మెయిన్స్‌కూ, జనరల్‌స్టడీస్‌కూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌లోని స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ స్క్రీనింగ్‌, మెయిన్స్‌ పేపర్‌-IIIలోని భారత ఆర్థిక వ్యవస్థను వేరుచేసి చదవవలసిన అవసరం లేదు. కానీ మొదటి ప్రయత్నంలో స్క్రీనింగ్‌కు హాజరయ్యేవారు వడపోత పరీక్షకు మాత్రమే సిద్ధమవడం మంచిది.
వీటిని పాటించండి!
* స్క్రీనింగ్‌, మెయిన్స్‌ల జనరల్‌ స్టడీస్‌లోని ఒకే తరహా సబ్జెక్టుల ఉమ్మడి వ్యూహానికి అధిక ప్రాధాన్యమివ్వాలి.
* స్క్రీనింగ్‌ పరీక్షే కదా, తేలికగా నెగ్గవచ్చు కదా అనే అపోహతో సన్నద్ధతను తేలికగా తీసుకోకూడదు. ఒక్కోసారి ఒక మార్కు తేడాతో మెయిన్స్‌కు అర్హత పొందలేకపోవచ్చు.
* అందరిలాగా రోజు యాంత్రికంగా చదువులో మునిగిపోవడం వల్ల ఉపయోగం ఉండదు. విజేతగా నిలవాలంటే సన్నద్ధతతో పాటు రోజువారీ పరీక్షలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* స్క్రీనింగ్‌ టెస్ట్‌లో వర్తమానాంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అభ్యర్థులు ఎకానమీ, పాలిటీలతో సమానంగా వీటికి సమయాన్ని కేటాయించాలి.
* పరీక్ష రోజుకు ముందు 6 నెలల కరెంట్‌ అఫైర్స్‌ను మాత్రమే పట్టించుకుంటారు. కానీ 2016 జనవరి నుంచి జూన్‌ వరకు స్థూలంగానూ, ఆ తర్వాత విస్తృతంగానూ చదవాలి.
* ఇప్పటివరకు బిట్ల రూపంలో చదువుతూఉంటే సమగ్ర అవగాహన కోసం పాఠానలన్నింటినీ ఒకసారి చదవండి. లేదా ఇప్పటివరకు పాఠాలను మాత్రం చదువుతూ ఉండే వెంటనే మాదిరి ప్రశ్నలను (డైలీటెస్ట్‌) సాధన చేయడం ముఖ్యం.
* జరగబోయే స్క్రీనింగ్‌ టెస్ట్‌లోని 150 ప్రశ్నలలో 60-65 ప్రశ్నలు సాపేక్షికంగా తేలికగా, 45-50 ప్రశ్నలు ఒక మాదిరి క్లిష్టతతో, 30-35 ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకని సన్నద్ధతలోనే సాధన ఉండాలి.
* కరెంట్‌ అఫైర్స్‌లో కళలు, సంస్కృతి వంటి అంశాల ప్రస్తావన ఉంది. కాబట్టి స్థూలంగా చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అవగాహన ఉండడం మంచిది.
* అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలను స్థూలంగా అవగాహన చేసుకోవాలి. ప్రధానమంత్రి సందర్శించిన దేశాలు, ఇతర దేశాలతో కుదుర్చుకొన్న ఒప్పందాలు, మనదేశాన్ని సందర్శించిన విదేశీ ముఖ్యులు వంటి అంశాలు స్క్రీనింగ్‌, మెయిన్స్‌లకు ముఖ్యమే. ఈ అంశాలను అవగాహనతో చదవాలి.
* పాలిటీనీ, ఎకానమీనీ విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే స్క్రీనింగ్‌ తర్వాత సమయం తక్కువ కాబట్టి ఆ సమయం పునశ్చరణకు మాత్రమే కేటాయించాలి.
* కఠిన ప్రశ్నలు ఎన్ని పెరిగితే కటాఫ్‌ అంత తగ్గుతుంది. ఇది గుర్తించాలి. ఒత్తిడికి గురికాకూడదు.
* ఎకానమీ, పాలిటీల్లో అధిక మార్కులు పొందాలంటే ఈ అంశాలలోని సాంకేతిక పదజాలాల భావనలను బాగా చదివి వాటిపై పట్టు సాధించాలి.Posted on 05-12-2016