close

ఏపీపీఎస్సీ > ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

విభజించి చదివితే విజయమే!

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రధాన పరీక్ష దగ్గర పడుతోంది. దీనికి అదనంగా సమయం జత కలిస్తే బాగుంటుందని అభ్యర్థులు ఆశపడుతున్నప్పటికీ, ఇక పరీక్ష తేదీ దగ్గరపడుతున్నందువల్ల మానసికంగా సిద్ధమైపోవడం ఉత్తమం. ఇప్పుడున్న పరిమిత సమయంలో తగిన సన్నద్ధత వ్యూహాన్ని సిద్ధం చేసుకుని, ఆచరణలో పెట్టడం మేలు!
వడపోత పరీక్ష కాగానే ప్రధాన పరీక్షకు సిద్ధమవటం మొదలుపెట్టిన దూరదృష్టిపరులూ, ఫలితాలు చూశాక కదన రంగంలోకి దూకినవారూ.. వీరిలో ఎవరికైనా సరే, ఈ కొద్దిరోజులూ కీలకమే. ఈ పది- పన్నెండు రోజులనూ పదిలంగా సద్వినియోగం చేసుకోవాల్సిందే.
ముందునుంచే ప్రధాన పరీక్షకు చదివినవారు ఈ సమయాన్ని పునశ్చరణకు వినియోగించుకోవచ్చు. వడపోత పరీక్ష ఫలితాల తర్వాత సన్నద్ధత ప్రారంభించినవారు మిగిలిన ఈ కాలాన్ని కచ్చితంగా ప్రశ్నలు వస్తాయనుకునే అంశాల కోసం వల వేయాలి. సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ విధానాన్ని అనుసరించక తప్పదు. ఇందుకోసం గ్రూప్‌-2 సిలబస్‌ మొత్తాన్ని సునిశిత పరిశీలన చేయాలి. ఇప్పటికే చేసిన సన్నద్ధత నుంచి గ్రహించిన అంశాలను పదిలంగా ఉంచుకుంటూ సిలబస్‌ అంశాలను విహంగ వీక్షణం చేయాలి.
గ్రూప్‌-2 సిలబస్‌లోని 3 పేపర్లలో కలిపి మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. ఇందులో జనరల్‌ స్టడీస్‌లోని 12 విభాగాలు ఒక్కొక్కటి ఒక్కో సబ్జెక్టు. మిగతా 23 యూనిట్లు నాలుగు సబ్జెక్టుల్లో (పేపర్‌ 2, 3) విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాతిపదికన చూస్తే జనరల్‌ స్టడీస్‌లోని 12 సబ్జెక్టులతో కలుపుకుని మొత్తం 16 సబ్జెక్టులను ఈ స్వల్ప సమయంలో పునర్విమర్శ చేయాల్సి ఉంటుంది.
మొత్తం 35 యూనిట్లను స్పష్టత, అవగాహనల కోసం కింది విధంగా వర్గీకరణ చేసుకోవచ్చు.

స్థిర అంశాలు: సిలబస్‌లోని కొన్ని సబ్జెక్టులు లేదా యూనిట్లు నిశ్చలంగా ఉంటాయి. నిరంతర మార్పులు, కొత్తగా సబ్జెక్టు విషయాలు వచ్చి చేరే అవకాశం లేని విభాగాలుగా వీటిని గుర్తించవచ్చు. ప్రస్తుత సిలబస్‌లోని భారత భౌగోళిక పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులను కొంతవరకు ఇలా నిశ్చలమైన సబ్జెక్టులుగా పరిగణించవచ్చు.
ఈ సబ్జెక్టుల్లో 80 శాతం వరకు పెద్దగా మార్పులకు అవకాశం లేని అంశాలే ఉంటాయి. జనాభా, వ్యవసాయం, పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులు లాంటి అంశాల్లో తాజా విషయ పరిజ్ఞాన పరిశీలన అవసరం. కానీ ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, సరస్సులు, కాలువలు, మృత్తికలు (నేలలు) తదితర అంశాలు స్థిరంగా ఉంటాయి. అలాగే మెంటల్‌ ఎబిలిటీ విభాగం దత్తాంశ విశ్లేషణ, దత్తాంశం- పట్టికలు, దత్తాంశాలకు దృశ్యరూపం లాంటి అంశాలు స్థిరం. పేపర్‌-2లో ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర దాదాపుగా మొత్తం సబ్జెక్టు ఈ కోవకు చెందిందే.

చలన అంశాలు: సిలబస్‌లోని వర్తమానాంశాలు ఇందుకు మంచి ఉదాహరణ. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ (రాష్ట్రం) వర్తమానాంశాలు ఎప్పటికప్పుడు చలనశీలంగా ఉంటాయనీ, పరీక్ష తేదీకి ముందు కనీసం 6 నెలల విషయాలు చదువుకోవాలనీ పరీక్షార్థులకు తెలిసిన విషయమే. ఇంకా జనరల్‌ స్టడీస్‌లోని భారత రాజ్యాంగ అవలోకనం, ప్రభుత్వ విధానాలు, ఈ-గవర్నెన్స్‌, భారత ఆర్థికస్థితి (ఎకానమీ) వంటి సబ్జెక్టులు దాదాపు అన్నీ అత్యంత వేగంగా మార్పులకు గురయ్యే అంశాలని చెప్పలేం. కానీ వీటిలో 70 నుంచి 80 శాతం తాజా అంశాలు వచ్చి చేరేవే.
ఈ రెండు వర్గాలకూ చెందకుండా మరో తరహా సబ్జెక్టులనీ వర్గీకరించవచ్చు. వీటిలో కొంతభాగం స్థిరంగా, మరికొంత చలనశీలంగా ఉంటుంది. సామాన్యశాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తాజా పరిణామాలు, విపత్తు నిర్వహణ ఈ కోవకు వస్తాయి. సామాన్యశాస్త్రం (జనరల్‌ సైన్స్‌)లో అంశాలు స్థిరంగా ఉండగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తాజా అంశాలు నిరంతరం మారుతుంటాయి. మొత్తం మీద ఈ పరిమిత సమయంలో వీలైనన్ని ఎక్కువ మార్కుల సాధనకు వ్యూహరచనలో భాగంగా ఈ స్పష్టత తెచ్చుకున్నాక తరువాతి సన్నద్ధతను ప్రారంభించాలి.

స్థిర సబ్జెక్టుల్లో మౌలిక భావనలు
స్థిర సబ్జెక్టులు లేదా యూనిట్ల సన్నద్ధత, పునశ్చరణల్లో భాగంగా మౌలిక విషయాల (బేసిక్స్‌)పై దృష్టిపెట్టాలి. స్థిర సబ్జెక్టుల్లో ఎక్కువగా ప్రాథమిక విషయాలపై ఏపీపీఎస్‌సీ దృష్టి పెడుతున్నట్లు గత ప్రశ్నపత్రాల ద్వారా గుర్తించవచ్చు.

భౌగోళిక శాస్త్రం
చైనా సరిహద్దుగా లేని రాష్ట్రం?
1) నాగాలాండ్‌ 2) ఉత్తరాఖండ్‌ 3) హిమాచల్‌ ప్రదేశ్‌ 4) సిక్కిం అబ్జర్వర్స్‌ (ఇంజినీరింగ్‌-2013)
జవాబు: 1
భౌగోళిక శాస్త్రంలోని మౌలిక సమాచారంపై ముఖ్యంగా భారతదేశ సరిహద్దులు, రుతుపవనాలు, సముద్ర తీరరేఖ, భౌగోళికంగా ఎత్తయినవి, చిన్నవి, పెద్దవి, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక ప్రత్యేకతలు, వర్షపాతం, అడవులు మొదలైన అంశాలపై ప్రశ్నలుంటున్నాయి. ఇవన్నీ ప్రాథమిక సమాచారం ఆధారంగా ఉండే ప్రశ్నలే. కాబట్టి, మ్యాప్‌ దగ్గర పెట్టుకుని వేగంగా చూసుకుంటూ వెళితే గుర్తుండిపోతాయి.

జనరల్‌ సైన్స్‌
సామాన్యశాస్త్రాన్ని అనుదిన అనువర్తన దృష్ట్యా చదవాలని సిలబస్‌లో పేర్కొన్నందువల్ల ఈ సబ్జెక్టులో ప్రాథమిక విషయాలను దైనందిన జీవన అనువర్తన రీత్యా చూడాల్సి ఉంటుంది.
ఉదరం లోపలి భాగాన్ని పరీక్షించడానికి వైద్యులు ఎండోస్కోప్‌ అనే పరికరాన్ని వాడతారు. అది ఏ సూత్రంపై పనిచేస్తుంది?
1) కాంతి పరివర్తన 2) కాంతి విస్తరణ 3) కాంతి వక్రీభవనం 4) పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తనం
జవాబు: 4
జనరల్‌ సైన్స్‌లోని భౌతిక రాశులు-ప్రమాణాలు, పదార్థం, చలం-చలనం, ఉష్ణం, కాంతి, ధ్వని, తరంగ చలనం, అయస్కాంతత్వం, విద్యుత్‌, ఎలక్ట్రానిక్స్‌ మొదలైన అంశాలను ప్రాథమిక అంశాలు- అనువర్తన దృష్ట్యా పరిశీలిస్తే మౌలిక భావనలపై ప్రశ్నలు వీటి నుంచే వస్తున్నాయి. జనరల్‌ స్టడీస్‌లోలా ఇలా నిశ్చలంగా ఉండే సబ్జెక్టు పేపర్‌-2లోని ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర. పేపర్‌లో దాదాపుగా 90% సబ్జెక్టును ఈ కోణం నుంచే గత ప్రశ్నపత్రాల దృష్ట్యా త్వరితగతిన పునఃపరిశీలన చేయవచ్చు.

ఏపీ హిస్టరీ
నరేంద్రేశ్వరాలయాల పేరుతో 108 దేవాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజులు? (గ్రూప్‌-2, 2002)
1) మొదటి విజయాదిత్యుడు 2) నాలుగో విష్ణువర్థనుడు 3) గుణగ విజయాదిత్యుడు 4) రెండో విజయాదిత్యుడు
జవాబు: 4
ఈవిధంగా గత ప్రశ్నపత్రాల అనుసంధానంతో స్థిర సబ్జెక్టులోని అంశాలను చదవడం వల్ల ఏవి ముఖ్యాంశాలో అర్థం అవుతుంది.మౌలిక భావనలపై దృష్టి పెట్టినప్పుడు, అభ్యర్థి కనీస పరిజ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నప్పుడు, గతంలో వచ్చిన అంశాలపైనే మళ్లీ ప్రశ్నలు వస్తుంటాయి. అందుబాటులో ఉన్న గత ప్రశ్నపత్రాలను సబ్జెక్టు, అంశాలవారీగా అధ్యయనం చేయడం వల్ల ఈ అదనపు ప్రయోజనం సమకూరుతుంది.

చలన అంశాల్లో సత్తా చూపడమెలా?
స్థిర అంశాల్లో అధ్యయనం ఒకింత సులభం కాగా అసలైన సవాలు చలనపూరిత అంశాలేనని అభ్యర్థులు భావిస్తుంటారు. ఇందుకు కారణం నదిలోని పాతనీటికి కొత్తనీరు వచ్చి కలుస్తున్నట్టుగా ఎప్పటికప్పుడు చేరే సబ్జెక్టుల నూతన అంశాలు (కరెంట్‌ అఫైర్స్‌) పెద్ద సవాలు కాబట్టి.
కరెంట్‌ అఫైర్స్‌తోపాటు పాలిటీ (జీఎస్‌లో భాగం), భారత రాజ్యాంగ అవలోకనం (పేపర్‌-2), ఇండియన్‌ ఎకానమీ, ఏపీ ఎకానమీ పేపర్లు, ఆంధ్రప్రదేశ్‌ విభజన-సవాళ్లు (కొంత భాగం), విపత్తు నిర్వహణ (కొంత భాగం) ఈ కోవకు చెందుతాయి. కొత్త పరిణామాలతో పగ్గాలు లేకుండా పరుగెత్తే ఈ విభాగాలకు కళ్లెంవేసి కొంతవరకైనా అదుపులోకి తెచ్చుకోవాలంటే ఇటీవలి ఏపీపీఎస్‌సీ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే సరిపోతుంది.
ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఏపీపీఎస్‌సీ నిర్వహించిన దాదాపు 20 వరకు వివిధ కేటగిరీల పోస్టుల ఎంపిక ప్రశ్నపత్రాలను నిశిత పరిశీలన చేస్తే ఏం తెలుస్తుంది? తాజా వర్తమానాంశాలు అన్ని సబ్జెక్టుల్లోనూ విస్తారంగా పరుచుకున్నట్లు ద్యోతకమవుతుంది. అంటే కేవలం కరెంట్‌ అఫైర్స్‌ శీర్షికన అడిగే ప్రశ్నలే కాకుండా వివిధ సబ్జెక్టుల్లో వస్తున్న ప్రశ్నల్లో 40 శాతం వరకు తాజా పరిణామాలపైనే ఉంటున్నాయి. శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఎకానమీ (ఏపీ, ఇండియా), పాలిటీ, విపత్తు నిర్వహణ, ఆంధ్రప్రదేశ్‌ విభజన, పర్యావరణ అంశాల్లో తాజా విషయాల స్పర్శ ఎక్కువ.

ప్రశ్నలు వచ్చే కొన్ని అంశాలను ఎలా గుర్తించవచ్చో గమనిస్తే...

పాలిటీ
రాజ్యాంగ ప్రవేశికలో ఎటు చూసినా 15 బిట్లు ఉంటాయి. ప్రవేశిక (పీఠిక) అన్న భావనను రాజ్యాంగకర్తలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? (అమెరికా) వంటి ప్రశ్నలు. ప్రవేశిక నుంచి 2 ప్రశ్నలు వస్తున్నాయి.
* ప్రాథమిక హక్కులు అన్న అంశం నుంచి పాలిటీలోగానీ, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి గానీ కనీసం పది ప్రశ్నలు ఉంటున్నాయి. దీనిలో ముఖ్యమైన కేసులు, రిట్లపైనే అయిదు, ఆరు ప్రశ్నలు అడగవచ్చు.
* రాజ్యాంగ పరిణామాలపై కచ్చితంగా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటివరకు 101 సవరణలు జరిపినప్పటికీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే 40 వరకు కీలక సవరణలపై దృష్టిపెడితే కొంతవరకు మేలు. 101, 100, 99, 96 వంటి సవరణలను గుర్తుంచుకోవాలి. వీటిపై 3- 4 ప్రశ్నలు వస్తున్నాయి.
* భారత రాజ్యాంగ నిర్మాణం, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్‌-లోక్‌సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్‌, ఆర్టికల్స్‌, షెడ్యూల్స్‌ వంటి అంశాల్లోని ప్రాథమిక విషయాలపై దృష్టిపెడితే కొన్ని మార్కులు చేజిక్కించుకున్నట్టే.

కరెంట్‌ అఫైర్స్‌
వర్తమాన అంశాల్లో దేనిపై ప్రశ్న వస్తుందో వూహించడం కష్టమే. కానీ తాజా పరిణామాలు, జన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న విషయాలను పరీక్షల్లో విస్మరించే అవకాశం లేదన్న తార్కికతతో చూడాలి. అప్పుడు ప్రతి పరీక్షకు ముందు కొన్ని అంశాల నుంచి ప్రశ్నలు రాగల అవకాశాన్ని గుర్తించవచ్చు. ప్రస్తుత తరుణంలో..
* జులై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్‌టీ-గత ఏడాది పరిణామాలు
* 12వ పంచవర్ష ప్రణాళిక మార్చి 31తో ముగిసి, నీతి ఆయోగ్‌ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నీతి ఆయోగ్‌-గత రెండేళ్ల పరిణామాలు
* కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే 2016-17, ఏపీ ఆర్థిక సర్వే 2016-17
* కేంద్ర బడ్జెట్‌ 2017-18, ఏపీ బడ్జెట్‌ 2017-18 ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ వార్షిక కాలాన్ని జనవరి- డిసెంబర్‌ మధ్య మార్చే ప్రతిపాదనపై కమిటీ, ఇప్పటికే దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన బీజేపీ పాలిత రాష్ట్రాలు
* విదేశీ వాణిజ్య విధానం 2015-20, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, 2011 జనాభా లెక్కలు, ముఖ్యాంశాలు, నరేంద్రమోదీ హయాంలో జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు, కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలు
* శాస్త్ర, సాంకేతిక పరిణామాల్లో ఇస్రో తాజా ఉపగ్రహాల ప్రయోగం, వాటిలో మైలురాళ్లు, క్షిపణులు, సమాచార సాంకేతిక విధానం (ఐటీ).
ఇలా ఇతర సబ్జెక్టులను కూడా స్థిర, చలనశీల విషయాలుగా వర్గీకరించుకుని, అందుబాటులో ఉన్న గత ప్రశ్నపత్రాల అనుసంధానంతో పరీక్షల ముందు పునశ్చరణ దశలో పరిశీలన చేయాలి. ఇదే మార్కుల సాధన రీత్యా సోపానంగా నిలుస్తుంది. ముందు నుంచీ సన్నద్ధమైనవారు లేదా సమయభావం వల్ల సతమతమవుతున్నవారు ఈ వ్యూహాన్ని అనుసరిస్తే అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.Posted on 08-05-2017