close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-3 ఫలితాలు

గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శి) ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

* జిల్లాల వారీగా కటాఫ్‌ మార్కుల వెల్లడి
* 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపిక
* 1:50 నిష్పత్తిలో జరగాలని అభ్యర్థుల వినతి

ఈనాడు, అమరావతి: గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శి) ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. ఆయా జిల్లాల్లో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల కటాఫ్‌ మార్కులను ప్రకటించింది. దీనిని అనుసరించి ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపిక జరగనుంది. ఇప్పటికే ప్రకటించిన ప్రకారం 1:12 లేదా 1:15 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జిల్లాల వారీగా ఈ నియామకాలు జరగనున్నాయి. అందువల్ల జిల్లాల వారీగా అభ్యర్థుల కటాఫ్‌ మార్కుల వివరాలు కమిషన్‌ అధికారికంగా తెలిపింది. మొత్తం 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించింది.

ఇదే క్రమంలో బీసీ-ఏ, బీ, సీ, డీ, ఈ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరి అభ్యర్థులకు మార్కుల కటాఫ్‌ను జిల్లాల వారీగా వెల్లడించింది. ఈ కటాఫ్‌లను అనుసరించి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. ఈ కటాఫ్‌లో 1:12 లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులు లేకుంటే దీనిని తగ్గించే అవకాశం ఉందని జులై 20న‌ వివరించింది.
అనర్హులైన 2049 మంది అభ్యర్థులు
పరీక్ష రాసే సమయంలో రకరకాల తప్పులు చేసినందున 2049 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయలేదని ఏపీపీఎస్సీ వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా వైట్‌నర్‌ ఉపయోగించడం, బుక్‌ సీరిస్‌ కోడ్‌ నంబరు నమోదులో తప్పు చేయడం, ట్యాంపరింగ్‌ చేసేందుకు ప్రయత్నించడం వంటి కారణాల వల్ల వీరి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయలేదని వివరించింది.
అభ్యర్థుల ఆందోళన
ప్రిలిమ్స్‌ నుంచి ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 1:12 లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తే తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చర్చించారు. నోటిఫికేషన్ల జారీ, పరీక్షలు జరిపిన అనంతరం ప్రధాన పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే తలెత్తే పరిణామాల గురించి చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో జారీచేసిన జీఓ 5 అనుసరించి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జారీచేసిన నోటిఫికేషన్ల వరకు జీఓ 5ను యథాతధంగా వర్తింపజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినందున ఫలితాలు వెల్లడించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తే తదనుగుణంగా భవిష్యత్తులో జారీ చేయబోయే నోటిఫికేషన్లకు వర్తింపజేస్తామని వెల్లడించారు.
9 నోటిఫికేషన్ల రాక ఎప్పుడు?
ఏపీపీఎస్సీ నుంచి ఇంకా తొమ్మిది ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. ఈడబ్ల్యూఎస్‌ అమలుపై అధికారిక ఉత్తర్వులు రానందున ఈ నోటిఫికేషన్ల రాకపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దృష్టికి తీసుకువెళ్లినట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఈ నోటిఫికేషన్ల రాక కోసం అభ్యర్థులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.

ఫ‌లితాలు

Posted on 20-07-2019